ధర్మ రక్షణలో మనకు ఆదర్శం వేద వ్యాసుడు - about guru purnima in telugu

megaminds
0
వ్యాస పూర్ణిమ

గురు పౌర్ణమి పేరు ఎలా వచ్చిందో తెలుసా

భారతీయ విజ్ఞానం, సంస్కృతి, ఆధ్యాత్మిక జ్ఞానం వంటి విషయాల వికాసంలో వేదాలకు అగ్రస్థాన మున్నది. ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణ, భారతములకు విశేష ప్రాధాన్యం ఉన్నది. ఈ దేశంలో అనేకమంది ఋషులు జన్మించారు. అందులో శ్రేష్ఠుడు వశిష్ట మహర్షి. ఆ మహర్షి మనుమడు పరాశరుడు. కార్తవీర్యుని చేతిలో ధ్వంసమైన గురుకులాలను, వేదవిద్యను తిరిగి పునరుద్ధరించటానికి పరాశరుడు పూనుకొన్నాడు. నిరంతరం పర్యటిస్తూ ప్రజలకు, ఆచార్యులకు ఉత్సాహం, ధైర్యం ఇస్తూండేవాడు. ఆయనదొక సంచార గురుకులం. ఆస్తవ్యస్థమైన సామాజిక జనజీవనాన్ని తిరిగి ప్రతిష్టించటానికి ఒక స్మృతినే ప్రసాదించాడాయన. దానినే పరాశర స్మృతి అంటారు. అటువంటి పరాశరుడికి దాశరాజు కన్య మత్స్యగంధికి పుట్టినవాడే వ్యాసుడు.

వ్యాసుని కాలంనాటికి వేదాలను మూడు భాగాలుగా వర్గీకరించారు. ఋక్‌, యజు, స్సామాలు. దానికి అధర్వాన్ని కూడా కలిపి వేదాలను నాలుగు భాగాలుగా చేయాలనే ఆలోచన ఆ రోజుల్లోనే పరాశరుడికి ఉండేది. ధర్మప్రతిష్టకు రాజకర్మకు క్షాత్ర ధర్మ ప్రతిష్టకు వేదము యొక్క ప్రమాణం లభించా లంటే అధర్వణాన్ని కూడా వేదంలో భాగం చేయాలనే పరాశరుడి సంకల్పాన్ని వ్యాసుడు పూర్తి చేశాడు. సనాతన ధర్మాన్ని ఆశ్రయించే సమాజంలోని అన్ని వ్యవస్థలు నడవాలని సమాజ ధర్మంలో రాజధర్మాన్ని సమన్వయ పరచి ధర్మరాజ్య ప్రతిష్టకు పూనుకోవాలని సంకల్పించాడు. దానికోసం అహర్నిశలు కృషిచేసాడు.

వేదవ్యాసుడు చేసిన మరొక విశేషమైన పని ఏమిటంటే ఈ సృష్టికి సంబంధించిన చరిత్రను పురాణ గ్రంథాల ద్వారా సమాజానికి అందించటం. అన్ని యుగాలలో ధర్మరక్షణకు జరిగిన అవతారాల చరిత్రను గ్రంథస్తం చేసాడు. వేదాలను, ఉపనిషత్‌లను సవివరంగా ఈ యుగానికి అందించాడు. అష్టాదశ పురాణాలు రచించినా ఆయనకు తృప్తికలగలేదు. అందుకే భక్తి ప్రాధాన్యం కలిగిన భాగవత గ్రంథాన్ని కూడా రచించాడు. మహాభారత సంగ్రామంలో భగవాన్‌ శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన సారాంశాన్ని విస్తృతంగా భగవద్గీత రూపంలో మనకు అందించాడు. ఇవన్నీ ద్వాపరయుగ అంతంలో కలియుగం ప్రారంభంలో చేసాడు.

వ్యాసుడు జన్మించిన ఆషాఢ పౌర్ణమిని వ్యాసపూర్ణిమగా పిలుస్తున్నాం. దానినే గురుపూర్ణిమ అని కూడా అంటున్నాం. కలియుగానికి అవసరమైన అనంత విజ్ఞానాన్ని అందించిన వ్యాసుడ్ని మనం గురువుగా స్వీకరించాము. కలియుగంలో వ్యాసుడు రచించిన గ్రంథాలకు భాష్యం వ్యాఖ్యానం చెప్పు కొంటున్నాం. ఈ యుగంలో శాస్త్రజ్ఞానం, విజ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం అంతటికి మూలం వ్యాసుడే.

మహాభారతంలో అన్నింటిని మించినవి రాయబారాలు. 1) ద్రుపద పురోహితుడి రాయ బారం. వాస్తవాన్ని తీక్షణంగా, పౌరుషంతో చెబితే ఎట్లా ఉంటుందో ద్రుపద పురోహితుడి రాయబారం తెలియచేస్తుంది. 2) సంజయ రాయబారం కర్రవిరుగ కుండా పాము చావకుండా అనే రీతిలో సాగుతుంది. 3) భాగవాన్‌ శ్రీకృష్ణుని రాయ బారం రాజనీతిని రంగరించి చెపుతుంది. 4) ఉలూకుడు విపరీత వ్యవహారంగా ఉండే రాయబారం వీటన్నింటిని మించినది. సమాజం, మానవ స్వభావాల విశేషాలు వివరించేది భీష్మ-యుధిష్టర సంవాదము. మానవ జీవితానికి అవసరమైన అన్ని విషయాలు మహాభారతం ద్వారా మనకు అందజేసారు వేదవ్యాసులు.

గ్రంథ రచనతో పాటు ధర్మసంరక్షణకు కూడా కృషి చేశాడు వ్యాసుడు. పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిన తొలిరోజుల్లో వారిని అరణ్యంలోనే సంహరించాలని ఆలోచించింది దుష్టచతుష్టయం. కర్ణుడు దుర్యుధనుడితో ‘రారాజా! మీ శ్రేయస్సు కోసం మేము ఏదయినా చెయ్యగలం. మనం ఇప్పుడే వెళ్ళి పాండవులను అడవులలోనే సంహరిద్దాం. వారు ప్రస్తుతం క్లేశాలతో, దు:ఖభారంతో వున్నారు. ఈ సమయంలో వారిని కడతేర్చడం మనకు సులభం అన్నాడు ‘దుష్టచతుష్టయం’ ఆయుధాగారంవైపు వెళ్తూ ఉంటే వేదవ్యాసుడు అక్కడ ప్రత్యక్షమై దుర్యోధనుడి ప్రయత్నాన్ని విరమింపజేసి ధృతరాష్ట్రునితో, ‘నాయనా, కుటుంబ సభ్యులతో కలహం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. నువ్వు నీ బిడ్డలను అదుపులో ఉంచుకో. ఈ దుర్యోధనుడు కొంతకాలంపాటు పాండవులతో అడవులలో తిరిగితే వారి సహవాస బలంవల్లనయినా, వీడి బుద్ధి మారవచ్చు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు అంతతొందరగా మారవు. కాని మానవ ప్రయత్నం మంచిదికదా!’ అని హితబోధ చేశాడు.

అరణ్యంలో ఒకరోజు ధర్మరాజుతో భీముడు, ద్రౌపది తమ క్లేశాలకు కారణమైన కౌరవులపై దాడి చేయాలని తీవ్రంగా చెబుతారు. ఆ సమయంలో వ్యాసుడు అరణ్యంలో ఉన్న పాండవుల దగ్గరకు వెళ్ళాడు. వేదవ్యాసుడు అక్కడకు రాగా పాండవులు ఎదురువెళ్ళి స్వాగతమిచ్చి అతిథిపూజ నిర్వర్తించారు. స్వాగత సత్కారాలు స్వీకరించి వ్యాసుడు – ”ధర్మరాజా! నీ మనస్సులోని అభిప్రాయం గ్రహించి నేను ఇలా వచ్చాను. భీష్మ, ద్రోణ, దుర్యోధనాదుల విషయమై నువ్వు భయపడుతున్నావు. కాని వారిని నాశనం చేసే ఉపాయం ఒకటి ఉంది. అది నేను చెబుతాను. ఇలా రా!” అని ఏకాంతంలోకి తీసుకువెళ్ళి.. ”నీకు శుభక్షణాలు రానున్నాయి. అస్త్రవిద్య పారంగతుడైన అర్జునుడు శత్రువులను నిర్జించి తీరుతాడు. నువ్వు శరణాగతుడవై నన్ను అర్ధిస్తే ‘ప్రతిస్మృతి’ ఉపదేశిస్తాను. దానిని నీవు అర్జునుడికి ఉపదేశించు. అర్జునుడు ఆ మంత్రాన్ని ఉపాసించి తపస్సు చేసి రుద్రవరుణయమ కుబేర ఇంద్రుల అనుగ్రహం పొంది దివ్యాస్త్రాలు సాధిస్తాడు; నారాయణ సఖుడైన నరుడే ఈ అర్జునుడు” అని హితబోధ చేసి అంతర్థానమైపోయాడు.

కురుక్షేత్రంలో కౌరవులు-పాండవులు తమ సైన్యాలను మోహరించి యుద్ధానికి సన్నద్ధులువు తున్నారు. చివరి క్షణంలోనైనా ధృతరాష్ట్రుని మనస్సు మార్చాలని, చివరి క్షణంలో కూడా ప్రయత్నం చేసాడు వ్యాసమహర్షి. హస్తినాపురంలో ధృతరాష్ట్రుని చేరి, ”నాయనా! ఏది జరగకూడదనుకున్నామో అదే సన్నద్ధమయింది. అంతటా నాశన సూచనలే కనిపిస్తున్నాయి.

తెల్లవారితే కురుక్షేత్రంలో మారణహోమం ప్రారంభకానున్నది. నువ్వు గట్టిగా పూనుకుంటే ఈ ప్రమాదం తప్పుతుంది. ధర్మమార్గాన నీ కొడుకులు నడిచేటట్టు చూడు. పాప పంకిలంలోకి నీతోపాటు వీరందరినీ లాక్కుపోకు. పాండవులు కోరినట్లు వారి రాజ్యభాగం వారికిచ్చి సుఖంగా ఉండు” అన్నాడు.

అప్పుడు ధృతరాష్ట్రుడు, ”మహర్షీ! నువ్వు వాస్తవమే చెప్పావు. నాయందు ప్రసన్నభావంతో ఉండు. నా కొడుకులు నా మాట వినేదశ దాటి పోయింది. నా బుద్ధి ధర్మాన్నే ఆశ్రయించి ఉంది” అని చెప్పాడు. అది విని వ్యాసుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. యుద్ధరంగంలో ఒంటరిగా చిక్కిన అభిమన్యుడిని ద్రోణుడు, కర్ణుడు, మొదలైన యోధులందరూ కలిసి చంపేశారు. దుఃఖసాగరంలో ఉన్న పాండవులను ఓదార్చటానికి వ్యాసుడు యుద్ధరంగానికి వచ్చి పాండవులకు ధైర్యం చెప్పాడు. ‘మరణించిన వారికోసం విచారించడం వివేకుల పనికాదని, చెపుతూ అకంపన మహారాజు వృత్తాంతమూ, మృత్యువు పుట్టుక వివరించి షోడశ మహారాజుల చరిత్రలూ స్థూలంగా వ్యాసుడు వివరించాడు.

”నాయనా! అటువంటి మహామహులే మృత్యువుకు వశం కాక తప్పలేదు. ఇక మనమెంత! మరొక రహస్యం ఉంది. మనం జీవించి ఉన్న వారికోసం శోకించాలే తప్ప మనతో అన్ని బంధాలు తెంచుకు పోయిన వారికోసం ఏడవడం దేనికి! జ్ఞాని శోకాన్ని దరిజేరనివ్వకూడదు. ‘జాతస్య మరణం ధృవమ్‌’ అని ఎరగవా, నాయనా!” అని పరిపరి విధాల ఓదార్చి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

ఈ విధంగా వ్యాసుడు అడుగడుగునా పాండవులకు ధైర్యం చెబుతూ ధర్మరక్షణకు తన ప్రయత్నం తాను చేసాడు. ధర్మప్రచారం కూడా చేసాడు. సమాజం జీవనంలో శాంతిని స్థాపించ టానికి ఒక ప్రక్క కృష్ణుడు, మరోప్రక్క వ్యాసుడు ఆ కాలంలో నిలబడ్డారు. శాంతిని స్థాపించారు. ధర్మాన్ని కాపాడారు. ఈ విధంగా వ్యాసుడు ద్వాపరయుగ అంతంలో ధర్మసంరక్షణకు అడుగడుగునా ప్రయత్నిం చాడు. ధర్మ సంరక్షణలో వ్యాసుని కృషి మనకందరికి ఆదర్శం. – ఆర్‌.మల్లికార్జునరావు.

Guru Purnima (గురుపౌర్ణమి) (గురు పౌర్ణమి)

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

megaminds

Guru Purnima Significance in Telugu, గురు పౌర్ణమి విశిష్టత, గురు పౌర్ణమి శుభాకాంక్షలు, Guru Purnima Telugu, Guru Purnima 2025 quotes Telugu, megaminds, గురు పౌర్ణమి 2025, Vyasa Purnima 2025, Ashada Purnima 2025


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top