Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ప్రపంచ పుస్తక, కాపీరైట్‌ దినోత్సవం - World Book and Copyright Day in Telugu

ప్రపంచం గతిని మార్చింది -పుస్తకం. మానవాళికి ఆలోచించడం నేర్పింది – అక్షరం.  పుస్తకాలు ప్రపంచానికి చేసిన సేవను అంచనా వేయడం ఆకాశాన్ని కొల...


ప్రపంచం గతిని మార్చింది -పుస్తకం. మానవాళికి ఆలోచించడం నేర్పింది – అక్షరం. పుస్తకాలు ప్రపంచానికి చేసిన సేవను అంచనా వేయడం ఆకాశాన్ని కొలవడం వంటిదే. పుస్తకాలు లేని ప్రపంచాన్ని ఊహించాలంటేనే పరమ చేదుగా ఉంటుంది. అందుకే పుస్తకాన్ని ప్రపంచ ప్రజలంతా ఒకే క్షణంలో ఆరాధించే ఒక కార్యక్రమాన్ని యునెస్కో రూపొందించింది. అదే ప్రపంచ పుస్తక, కాపీరైట్‌ దినోత్సవం.
ఏప్రిల్‌ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం. ఈ తేదీని ప్రపంచ సాహిత్యానికి అంకితం చేయవల సిందే. కాబట్టి ప్రపంచ సాహితీప్రియులు, పుస్తక ప్రియులు పండుగలా చేసుకోవడానికి ఆ తేదీని మించిన తేదీ ఇంకొకటి ఉండదు. అది ఎందుకో చూడాలంటే 1616 సంవత్సరం, ఏప్రిల్‌ 23 తేదీ దగ్గరకు ఒక్కసారి వెళ్లి రావాలి. సెర్వాంటిస్‌, విలియం షేక్‌స్పియర్‌, ఇన్కా గార్సిలాసో డి లా వెగా అదే రోజు కన్నుమూశారు. ఇంకా పలువురు సాహితీమూర్తులు మారిస్‌ డ్రాన్‌, హెడర్‌ కె లాక్స్‌నెస్‌, వ్లాదిమర్‌ నబకోవ్‌, జోసెఫ్‌ ప్లా, మాన్యుయెల్‌ మెజియా వాల్లెజో వంటి వారి జయంతి లేదా వర్ధంతి అదే రోజు కావడం విశేషం. దీనితో పుస్తకాన్ని విశ్వమంతా కలసి ఆరాధించేలా ఒక రోజును ఎంపిక చేయాలని భావించినప్పుడు యునెస్కోకు ఇదే తేదీ కనిపించింది. పారిస్‌లో 1995లో జరిగిన యునెస్కో సాధారణ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ పుస్తక, కాపీరైట్‌ దినోత్సవంగా ఏప్రిల్‌ 23ను నిర్వహిస్తారు.
ఈ తేదీని ఎంపిక చేయడం వెనుక స్పెయిన్‌ వారి చారిత్రక అనుభవం కూడా ఉంది. ఏప్రిల్‌ 23వ తేదీ స్పెయిన్‌కు కూడా ముఖ్యమే. ఆ దేశ సంప్రదాయం కూడా ఆ తేదీని ప్రపంచ పుస్తక దినోత్సవ తేదీని నిర్ధారించడానికి పరోక్షంగా ఉపకరించింది. ఆ దేశం ఏప్రిల్‌ 23 తేదీని ఏటా గులాబీల దినోత్సవంగా నిర్వహిస్తారు. తమ ప్రేమ, మద్దతులను వ్యక్తం చేయడానికి పౌరులందరూ ఆ రోజు ఒకరికి ఒకరు గులాబీలు అందించుకుంటారు. కానీ 1926లో అదే రోజున మిగ్యుల్‌ డి సెర్వెంటెస్‌ అనే ఆ దేశ మహా రచయిత కన్నుమూశారు. దీనితో ఆ సంవత్సరం గులాబీలకు బదులు పుస్తకాలు పరస్పరం అందించుకున్నారు స్పెయిన్‌ ప్రజలు. తరువాత అదే పద్ధతి కొనసాగింది. ఆపై ఇంకొక అడుగు ముందుకు వేసి స్పెయిన్‌లోనే ఏప్రిల్‌ 23, 24 తేదీలలో మారథాన్‌ చదువుల పోటీ పెట్టి, అందులో విజయం సాధించినవారికి మిగ్యుల్‌ డి సెర్వెంటిస్‌ పేరిట పురస్కారం ఇస్తారు. పైగా దీనిని మొదట్లో స్పెయిన్‌ రాజు అందించేవారు. స్వీడన్‌లో ఇదే రోజున అన్ని పాఠశాలల్లోను ప్రతిష్టాత్మకంగా వ్యాస రచన పోటీ నిర్వహిస్తారు. పుస్తక దినోత్సవానికి ఇంతకంటే గొప్ప ప్రేరణ ఏం ఉంటుంది? ఏప్రిల్‌ 23, 1995లోనే తొలిసారి యునెస్కో ప్రపంచ పుస్తక దినోత్సవం నిర్వహించింది.
పుస్తకాలు చదివే లక్షణాన్ని ప్రోత్సహించడం, అదే విధంగా వేగవంతం చేయడం, ఇంకా పుస్తకాలను కొని చదివే సంస్కృతిని పెంపొందించడం అనే లక్ష్యాలను సాధించడానికి యునెస్కో పుస్తక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. పుస్తకాలు ప్రపంచానికి చేసిన సేవను గుర్తు చేసుకోవడం కూడా దీని ఆశయం. కొత్త తరాలను పుస్తక పఠనానికి దగ్గరగా తీసుకురావడాన్ని ఈ వేడుక ఒక సవాలుగా తీసుకుంటోంది. అలాగే రచయితలు, ప్రచురణ కర్తలు, విక్రేతలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించడం, పరిష్కరించడం కూడా దీని వెనుక ఉంది. కాపీరైట్‌ అనేది ఈనాడు ప్రపంచ ప్రచురణ రంగంలోనే అతి పెద్ద సమస్యగా పరిణమించింది. అందుకే ఈ అంశాన్ని పుస్తక దినోత్సవం కీలకంగా భావిస్తున్నది. ఈ సందర్భంగా ప్రతి ఏటా ఏప్రిల్‌ 24 నుంచి మొదలు పెట్టి సంవత్సరం పాటు ప్రపంచ పుస్తక రాజధాని అంటూ ఒక నగరానికి గౌరవం ఇస్తారు. ఈ నగరాన్ని ఎంపిక చేయడానికి గ్రంథాలయాలు, ప్రచురణకర్తలు, అమ్మకం దారుల ప్రతినిధులతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తారు. 2019 సంవత్సరానికి గాను ఈ గౌరవం షార్జాకు దక్కింది. ఈ గౌరవాన్ని తెచ్చుకోవడంలో షార్జా ఉద్దేశం- సాహిత్యానికి తాజాగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడమే.
1998 నుంచి యునెస్కో ప్రతి పుస్తక దినోత్సవానికి ఒక నినాదం కూడా ఇచ్చింది. ఎంతో లోతైన ఆశయంతో ఉన్న నినాదాలే ఇవన్నీ. ‘చదువుతో స్థిర చిత్తం (1998), ఒక పుస్తకం ఇవ్వండి (1999), చదువుతో పునరుత్తేజం (2000) ఆనందయమ సమయం (2001), ప్రతిక్షణం ఆనందం (2002) జీవితానికి మిత్రులు (2003) వంటి నినాదాలతో మొదలుపెట్టి 2018లో చదువు నా హక్కు అన్న నినాదం ఇచ్చింది యునెస్కో.

No comments