జమ్మూ హిందువుల పైనా పాక్‌ గురి - jammu kashmir news in telugu

megaminds
0

కశ్మీర్‌ లోయ నుంచి హిందూ పండిట్లను తరిమేశారు. విడిచి వెళ్లకపోతే చంపేశారు. ఇప్పుడు జమ్మూలో నివసిస్తున్న హిందువులకు కూడా అలాంటి గతే పట్టబోతున్నదా? ముస్లింలు అధికంగా ఉండే కశ్మీర్‌ లోయ నుంచి, ఇప్పుడు హిందూ జనాభా అధికంగా ఉండే జమ్మూ మీద కూడా ఉగ్రవాదం తన పంజాను విసరబోతున్నదా? ఇటీవల జరిగిన చంద్రకాంత శర్మ అనే రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) నాయకుడి హత్య ఈ విషయాన్నే ధ్రువపరుస్తున్నది. జమ్మూ నుంచి కూడా హిందువులను తరిమికొట్టి, అది కూడా ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతమేనని ప్రపంచాన్ని నమ్మించాలన్న మరో పెద్ద కుట్రకు పాకిస్తాన్‌ తెర లేపినట్టే భావించాలి. అందుకే ఇప్పుడు చీనాబ్‌ పరీవాహక ప్రాంతాన్నీ, అక్కడ నివసిస్తున్న హిందువులనీ పాక్‌ ఉగ్రవాద మూకలు లక్ష్యంగా చేసుకున్నాయి.
జమ్మూకశ్మీర్‌లో ప్రముఖ ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు చంద్రకాంత్‌ శర్మను ఉగ్రవాదులు ఏప్రిల్‌ 9న దారుణంగా కాల్చి చంపారు. ఆయన అంగ రక్షకుడు రాజేంద్రకుమార్‌ను కూడా ఉగ్రవాదులు చంపారు. కుమార్‌ వద్ద నుంచి లాక్కున్న తుపాకీతోనే శర్మను కాల్చి చంపి, తరువాత కుమార్‌ను కూడా చంపి, ఆ ఆయుధంతోనే ఉగ్రవాదులు పారి పోయారు. పోలీసులు, మీడియా యథా ప్రకారం చంద్రకాంత్‌ శర్మను ‘ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు’ కాల్చి చంపారు. జిల్లా వైద్య ఆరోగ్య కేంద్రంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారు. శర్మ కిస్త్వార్‌ జిల్లా వైద్య కేంద్రంలో సహాయకునిగా ఉద్యోగం చేస్తున్నారు. ఇది పట్టపగలు పన్నెండున్నర ప్రాంతంలో జరిగిన హత్య. ఇదెంత కళ్లకు కట్టినట్టు కనిపించిందో, ఈ హత్య వెనుక కుట్ర కూడా అంతే స్పష్టంగా ఉంది. ఈ విషయం ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులో, బీజేపీ నాయకులో చెప్పడం లేదు. స్థానికంగా పనిచేసే, పరిస్థితులను కొంత కాలంగా గమనిస్తున్న పత్రికా రచయితలు చెప్పడం విశేషం. లోక్‌సభ ఎన్నికల వేళ, జమ్మూ ప్రాంతంలోని కిస్త్వార్‌ పట్టణంలో జరిగిన ఈ హత్య హిందువులలో భయాందోళనలు రేకెత్తించింది. ఎన్నికల పేరు చెప్పి ఉగ్రమూకలు రెచ్చి పోతాయన్న భయం నలుదిశలా వ్యాపించింది. శర్మ హత్య దరిమిలా నాలుగు రోజుల పాటు కర్ఫ్యూ అమలులో ఉంది. ఇంటర్నెట్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సైన్యాన్ని దింపవలసి వచ్చింది. మొత్తంగా చూస్తే కిస్త్వార్‌ హత్య భారత జాతికి కొత్త సవాలును విసిరింది.
2018 నవంబర్‌లో ‘ఉగ్రవాదులుగా అనుమాని స్తున్న’ వారే బీజేపీ కార్యకర్తలను కూడా చంపారు. రాష్ట్ర బీజేపీ కార్యదర్శి అనిల్‌ పరిహార్‌ను, ఆయన అన్నగారు అజిత్‌ పరిహార్‌ను కిస్త్వార్‌ పట్టణంలోనే ఉగ్ర వాదులు కాల్చి చంపారు. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో రక్తపాతం సృష్టించ డానికి, ప్రాణాలు తీయడానికి వేరొకరికి అవకాశం ఇవ్వడానికి పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు సిద్ధంగా లేరు. అక్కడ హత్య లన్నీ ఉగ్రవాద మతఛాందసులు చేస్తున్నవే. అయినా ‘ఉగ్రవాదులుగా అనుమాని స్తున్న’ అంటూ మీడియా చట్టబద్ధతను పాటించడమే విడ్డూరం.పరిహార్‌ సోదరులను చంపినప్పుడు కూడా కిస్త్వార్‌ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇప్పుడు బలైన చంద్రకాంత్‌ శర్మ పరిహార్‌ సోదరులకు సన్నిహతుడే. కిస్త్వార్‌ పట్టణంలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో ఉగ్రవాదులు ప్రవేశించి ఈ దురాగతానికి పాల్పడ్డారు. అంగ రక్షకుడు రాజేంద్ర కుమార్‌ అక్కడి కక్కడే మృతి చెందారు. శర్మ జమ్మూ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఈ హత్యను పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఒమర్‌ అబ్దుల్లా కూడా ఖండించారు. అయినంత మాత్రాన పాక్‌కు అనుకూలించే విధంగా ఉంటున్న వారి ప్రకటనల పాపం నుంచి వారు తప్పించుకోలేరు. ఆర్టికల్‌ 35ఎను రద్దు చేస్తే తాము జమ్మూకశ్మీర్‌ ప్రధాని పదవిని పునఃప్రతిష్టిస్తామని ఒమర్‌ అప్పటికే ప్రకటించారు. 35ఏను రద్దు చేయనున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే బీజేపీ ఎన్నికల ప్రణాళికలో కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. నిజానికి ప్రధాని నరేంద్ర మోదీ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్‌, బీఎస్‌పి నాయకురాలు మాయావతి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కమ్యూనిస్టులు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, చాలామంది తమకి తాము మేధావులని బిరుదులు ఇచ్చుకున్నవారు విచ్చలవిడిగా చేసిన ప్రకటనలు పాక్‌కు అనుకూలంగానే ఉన్నాయన్న విమర్శ సర్వత్రా వినిపించింది. వారి మాటలు భద్రతా దళాల స్థయిర్యాన్ని దిగజార్చాయన్న తీవ్ర విమర్శ కూడా వినిపించింది. ఈ నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగాయి. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఫారూఖ్‌ అబ్దుల్లా వ్యాఖ్యలు మరీ బాధ్యతా రాహిత్యంగా ఉంటున్నాయి. ఇటీవల ప్రపంచాన్ని కుదిపిన పుల్వామా దాడి వెనుక మోదీ కుట్ర ఉందంటూ ఫారూఖ్‌ దుర్మార్గంగా మాట్లాడారు. కశ్మీర్‌కూ, ముస్లింలకూ మోదీ వ్యతిరేకమని కూడా ఆయన తేల్చేశారు. ఆ విధంగా ఆయన తనలోని కొన్ని విద్వేషాలను పరోక్షంగా బయట పెట్టుకున్నారు.
కిస్త్వార్‌ ఒకప్పుడు ఉగ్రవాద పీడిత ప్రాంతమే. అయితే కొన్నేళ్ల క్రితం ఉగ్రవాద పీడ వదిలిన పట్టణంగా ప్రకటించారు. కానీ ఇటీవల మెహబూబా ముఫ్తీ నాయకత్వంలో (ఇందులో బీజేపీ భాగస్వామి) ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం హయాంలో తిరుగుబాటు దారులు మళ్లీ తిష్ట వేయడం ఆరంభమైంది. బీజేపీ మాటను పెడచెవిన పెట్టి మెహబూబా ఉగ్రవాదులకు అనుకూలంగా అనేక చర్యలు తీసుకున్నారు. ఎవరి మాటా వినకుండా జైళ్లలో ఉన్న రాళ్లు రువ్వుడు కిరాయి మూకలను బయట ప్రపంచంలోకి పంపించారు. ఉగ్రవాదం పాము వంటిదే. ఏప్రిల్‌ 15న ఆమె కారు మీద, కాన్వాయ్‌ మీదనే ఆ మూకలు రాళ్లు రువ్వాయి. కారణం- బీజేపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయడమేనట.
కిస్త్వార్‌ ఉదంపూర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధి లోనిది. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా బీజేపీ ఆయనకే టిక్కెట్టు ఇచ్చింది. కానీ పోటీ తీవ్రంగా ఉంది. కారణం ఉగ్రవాదులను ప్రోత్సహించడం వల్ల, హిందువులలో భయాందోళనలను పెంచడం వల్ల మారిన సమీకరణలే ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఉదంపూర్‌ స్థానం నిజానికి బీజేపీకి చిరకాలంగా కంచుకోట. దీని మీదే ఉగ్రవాదులు పంజా విసరబోతున్నారు.
చంద్రకాంత్‌ శర్మ మరణం తీరని లోటు అని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలిచి పోరాడుతున్న సమాజానికి శర్మ ఒక ఆశాజ్యోతి అని ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ కార్యదర్శి మన్‌మోహన్‌ వైద్య ప్రకటించారు. ఇదే అసలు వాస్తవం. శర్మ మరణం వెనుక ఉన్నది ఇందుకు సంబంధించిన కారణమే. కిస్త్వార్‌ నుంచి హిందువులను తరిమివేసే కుట్రలో భాగంగానే శర్మ హత్య జరిగిందని స్థానిక పత్రికా రచయితలు గట్టిగా అభిప్రాయపడుతూ విశ్లేషణలు చేశారు. జమ్మూలో హిందువులు ఎక్కువ. ఇక్కడే చీనాబ్‌ పరీవాహక ప్రాంతంలో ఒక పథకం ప్రకారం పాకిస్తాన్‌ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నది. హిందువులనే హత్య చేయిస్తున్నది. ఈ విధంగా ఇక్కడ నివసించే హిందూ జనాభాలో భయాందోళనలు సృష్టించి, వారిని కూడా తరిమివేసి, కిస్త్వార్‌ పట్టణం ముస్లింలు అధికంగా ఉండే పట్టణమని చెప్పడమే పాకిస్తాన్‌ లక్ష్యం. యథా ప్రకారం ఈ దేశ మేధావులు, హక్కుల కార్యకర్తలు ఈ విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. కశ్మీర్‌లో పండిట్లను తరిమివేసిన ఉదంతం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అయినప్పటికీ కిస్త్వార్‌ పరిణామాలను గురించి మీడియా కళ్లు మూసు కుంది. లౌకికవాదులు, టీవీ పేనలిస్టులు మౌనం దాల్చారు. ఉగ్రవాదుల చేత భాతర భూభాగాన్ని కబ్బా చేయించే కుట్రకు వ్యతిరేకంగా భద్రతా బలగాలు ఎలాంటి చర్యలు తీసుకున్నా, ఇది హక్కుల ఉల్లంఘన అంటూ విరుచుపడిపోవడానికి కావలసినంత బలగం ఇక్కడే ఉంది. ఇదే పాకిస్తాన్‌కు పెద్దబలం. మెహబూబా, ఒమర్‌, మమతా బెనర్జీ, మీడియా వెంటనే సైన్యం మీద దుమ్మెత్తి పోయడానికి సిద్దంగా ఉంటారు.
చంద్రకాంత్‌ శర్మ హత్య ఆరుమాసాలలో జరిగిన రెండో రాజకీయ హత్య. పైన చెప్పినట్టు ఇంతకు ముందు పరిహార్‌ సోదరులను ఉగ్రవాదులు చంపేశారు. దీనితో కిస్త్వార్‌లో 1990 నాటి పరిస్థితులు పునరావృత్తమవుతాయన్న భయాందోళ నలకు హిందువులు గురౌతున్నారు. కిస్త్వార్‌ జమ్మూ నగరానికి 250 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. పరిహార్‌ సోదరుల హత్య తరువాత చంద్రకాంత్‌ శర్మనే ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటారని, కాబట్టి ఆయనను జిల్లా ఆసుపత్రి నుంచి బదలీ చేయ వలసిందనీ గవర్నర్‌కూ, భద్రతాబలగాలకు విన్నపాలు వెళ్లాయి. అయినా ఫలితం లేకపోయింది. జాతీయవాద శక్తులను ఏరివేయడమే లక్ష్యంగా ఇదంతా జరుగుతోందని అక్కడి న్యాయవాది రాజేశ్‌ శర్మ అంటున్నారు. కానీ పరిహార్‌ సోదరుల హత్య తరువాత కిస్త్వార్‌ ప్రాంతంలో మాత్రం భద్రతను పెంచారు. అదనంగా బంకర్లు తవ్వారు. ఇందుకు పీడీపీ నాయకుడు, మాజీ ఎంఎల్‌సీ పిరదౌసి తాక్‌ అడ్డు చెప్పారు కూడా. కానీ ఆయన అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకోలేదు. పీడీపీ ఎంఎల్‌ఏ అంత గగ్గోలు పెట్టినా నిజానికి కొత్తగా తీసుకున్న భద్రతా చర్యలు కూడా చెప్పుకోదగినవి కావన్న విమర్శ ఉంది. భద్రతా సిబ్బందినీ, భద్రతా వలయాన్ని పెంచడానికి చేస్తున్న యత్నాలను ఎల్లప్పుడూ వ్యతిరేకించడమే జమ్మూ కశ్మీర్‌లోని పాక్‌ అనుకూలుర వ్యూహమని ఆ రాష్ట్ర మాజీ పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ కె. రాజేంద్ర కూడా అంగీకరించారు. దీనికి ప్రభుత్వం లొంగి పోకూడదని ఆయన అభిప్రాయపడుతున్నారు.
కిస్త్వార్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకోవడం 1992లోనే ఆరంభమైంది. ఆగస్టు 17, 2001న సంతోష్‌ భండారీఅనే బీజేపీ కార్యకర్తను ఉగ్రవాదులు హత్య చేశారు. అక్కడ బీజేపీ నుంచి ఉగ్రవాదానికి బలైన తొలి కార్యకర్త ఆయనే. కిస్త్వార్‌ జిల్లాలోనే పద్దార్‌ అనే చోట పదిహేడు మంది హిందువులను కాల్చి చంపారు. 2013 పెద్ద ఎత్తున హిందూ ముస్లిం ఘర్షణలు జరిగాయి. అప్పుడు ముగ్గురు చనిపోయారు. ఇప్పుడు చంద్రకాంత్‌ హత్యతో హిందువులకు, ముస్లింలకు మధ్య దూరం మరింత పెరిగిపోనున్నది. ఇప్పటికే ఆర్టికల్‌ 370 రద్దు, 35ఎ రద్దు అంశం మీద ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణమే నెలకొని ఉంది. జమ్మూకశ్మీర్‌లో యథాతథ స్థితి కొనసాగాలన్నదే చాలామంది ఆకాంక్ష. అది పాకిస్తాన్‌కు అనుకూలిస్తున్నదన్న వాస్తవం గడచిన యాభయ్‌ ఏళ్ల నుంచి రుజువు అవుతోంది. అయినా ఆ జమ్మూ కశ్మీర్‌ సమస్య పరిష్కారం గురించి ఆలోచించడానికి విపక్షాలు సిద్ధం కావడం లేదు. ఆ సమస్య జోలికి వెళ్ల కూడదన్నదే భారత విపక్షాల కోరిక. పాక్‌కు కావలసింది సరిగ్గా ఇలాంటి ధోరణే.
చంద్రకాంత్‌ను చంపినవారు స్థాని ఉగ్రవాదులు మాత్రం కాదని ప్రాథమిక దర్యాప్తులో కూడా వెల్లడైంది. ఇక్కడే ఒక ప్రశ్న. పొరుగు దేశం ప్రోత్సాహంతో రక్తకాండకు పాల్పడుతున్న ఉగ్రవాదమూకలు ఆయననే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాయి? ఇందులో తల బద్దలు కొట్టుకో వలసినంత గహనమైన విషయం ఏమీలేదు. కిస్త్వార్‌ దాని పరిసర ప్రాంతాలలో బీజేపీని పటిష్టం చేయడానికి శర్మ విశేషంగా కృషి చేశారు. అందులో విజయం కూడా సాధించారు. 2015 ఎన్నికలలో కిస్త్వార్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి గెలుపొందారు కూడా. ఏప్రిల్‌ 18న ఉదంపూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్‌ జరుగుతుంది. ఇటీవల ప్రచారానికి వచ్చిన కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికే చేశారు. ఇక్కడ ఎవరు తుపాకులు ఎత్తినా వారికి తగిన సమాధానం చెప్పి తీరతామని ఆయన హెచ్చరించి వెళ్లారు. చీనాబ్‌ పరీవాహక ప్రాంతంలో కూడా ముస్లింలే అధిక సంఖ్యాకులని చెప్పడానికి రక్తక్రీడను ఆరంభించిన పాకిస్తాన్‌కు దోడా రెవెన్యూ ప్రాంతం లోని దోడా, కిస్త్వార్‌, రాంబాణ్‌ చాలా కీలకమైనవి. చీనాబ్‌ నది మీద పాకిస్తాన్‌ ఆధిపత్యం సంపాదించా లని భావిస్తోంది కూడా. కానీ సింధు నదీ జలాల ఒప్పందం మేరకు చీనాబ్‌ మీద భారత్‌ తన హక్కు గురించి ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌ మీద ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలోనే గడచిన కొన్ని మాసాలుగా కిస్త్వార్‌ ప్రాంతంలో ఉగ్రవాదానికి ఊపిరి పోసే పన్నాగం ఆరంభమైంది. కరుడగట్టిన ఏడుగురు ఉగ్రవాదులు కిస్త్వార్‌ పట్టణంలో తిష్ట వేశారు, తస్మాత్‌ జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఈ మార్చి 27న స్థానిక పోలీసు యంత్రాంగం పెద్ద సంఖ్యలో పోస్టర్లు అతికించింది. మార్చి నెలలోనే ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. కిస్త్వార్‌ ఉన్నత పోలీసు అధికారి ఒకరిని తుపాకీతో బెదిరించి ఆయన వద్ద ఉన్న ఏకే 47 రైఫిల్‌, 90 రౌండ్లు అపహరించుకు పోయారు. ఇక్కడే ఉగ్రవాద దాడి కోసం ఐఎస్‌ఐతో కలసి కుట్ర పన్నుతున్న షెరాన్‌ షేక్‌ అనే ఒక యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
కశ్మీర్‌ లోయను కకావికలు చేసిన ఉగ్రమూకలు ఇప్పుడు జమ్మూను లక్ష్యంగా చేసుకుని కదిలాయి. ఇది భారతదేశానికి పాక్‌ నుంచి వచ్చిన కొత్త సవాలుగానే పరిగణించాలి. ఈ విషయాలను దేశ ప్రజలంతా తెలుసుకోవాలి. సరిహద్దులు సమస్యలు, నదీ జలాల సమస్యలు వంటివేవీ భారత్‌తో చర్చల ద్వారా పరిష్కరించుకోవడం పాకిస్తాన్‌ ఉద్దేశం కాదు. ఉగ్రవాదమనే ఒకే ఒక్క వ్యూహంతో భారత్‌ను దారికి తెచ్చుకోవాలన్నదే పొరుగు దేశం ఆశయంగా కనిపిస్తున్నది. ఇది ఎంతో కాలం సాగదు. ఇప్పటికే పుల్వామా దాడితో పీకల్లోతు కష్టాల్లో మునిగి ఉన్న పాకిస్తాన్‌ ఇప్పటికీ తన కుక్క తోక వంకర విధానాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేనట్టే భావించాలి. కానీ అందుకు తగిన మూల్యం తప్పక పోవచ్చు.
ఆ సాయంత్రమే మరొక హత్య
ఏప్రిల్‌ తొమ్మిదో తేదీ సాయంత్రం నాలుగున్నర దాటిన తరువాత బీజేపీ ఎంఎల్‌ఏ భీమా మాండవిని ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు పొట్టన పెట్టుకున్నారు. ఆయన దంతేవాడ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భీమా ప్రయాణిస్తున్న బులెట్‌ ప్రూఫ్‌ వాహనమే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పెట్టి పేల్చారు. మావోయిస్టు పీడిత బస్తర్‌ ప్రాంతం నుంచి బీజేపీ తరఫున మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందిన ఏకైక నాయకుడు భీమా. బస్తర్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఆయన మృత్యువాత పడ్డారు. ఈ దాడిలో నలుగురు భద్రతా సిబ్బంది కూడా చనిపోయారు. నిజానికి ఈ దాడి 2013లో జీరామ్‌ ఘాట్‌ వద్ద జరిగిన ప్రమాదాన్ని తలపించింది.
ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల దాడులకు ప్రత్యేక లక్షణం ఉందంటారు. తాము ‘రాజ్యం’ మీద ఆరంభించిన ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని చెప్పడం అందులో ఒకటి. రెండు- ఛత్తీస్‌ఘడ్‌ మీద తమ ఆధిపత్యం ఎంతగా వెల్లివిరుస్తున్నదో కూడా చెప్పడం. ఇక ఎన్నికలు వచ్చాయంటే చాలు, చెలరేగిపోవడం మావోయిస్టులకు మామూలే. ఈసారి కూడా ఎన్నికలను బహిష్కరించాలని గిరిజనులకు వారు హుకుం జారీ చేశారు. గతంలో మావోయిస్టుల ఆజ్ఞనుధిక్కరించి ఓటు వేసినందుకు చేతులు నరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా భీమా హత్య వెనుక కుట్ర ఉందని దర్యాప్తు జరపాలన్న డిమాండ్‌ ఉంది. పోలీసులు, స్థానిక బీజేపీ శ్రేణులు చెబుతున్న దాని ప్రకారం భీమా ఆ రోజు ఉదయం దంతేవాడ పట్టణం నుంచి ప్రచారానికి బయలుదేరారు. అదే ప్రచారానికి ఆఖరిరోజు. మొదట కిరండూల్‌ వెళ్లారు. తరువాత బచేలీ, నకుల్నార్‌లలో ఎన్నికల ప్రచార కార్యక్ర మంలో పాల్గన్నారు. అప్పుడే ఆయనకు ఎవరో ఫోన్‌ చేశారు. శ్యామగిరి గ్రామంలో జరిగే సంతకు వచ్చి ప్రచారం చేయవలసిందిగా ఫోనులో కోరడం జరిగింది. ఈ ఫోన్‌ కాల్‌ ఎవరు చేసినదో ఇంతవరకు తెలియలేదు. ఆయన అక్కడికి వచ్చారు. 20 నిమిషాలు ఉన్నారు. తిరిగి ఇంటికి వెళుతుండగా మందుపాతరకు బలయ్యారు. నిజానికి భీమా కార్యక్రమంలో శ్యామగిరి ప్రచారం లేదు. దీని వల్ల దారి కూడా మార్చవలసి వచ్చింది. ఇది మావో యిస్టులకు ఎంతో పరిచితమైన ప్రదేశం. గతంలో కాంగ్రెస్‌ నేతలు రమేశ్‌ రాథోడ్‌, త్రినాథ్‌ ఠాకూర్‌, బీజేపీ నేత సూర్యప్రకాశ్‌లను మావోయిస్టులు చంపింది కూడ ఇక్కడే. భీమా తన మార్గాన్ని మార్చు కుంటే భద్రతా సిబ్బంది ఆయన వెంట ఎందుకు వెళ్లలేదని మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌, ఇతర బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. పైగా ఆయనకు కేంద్రం జడ్‌ కేటగిరీ భద్రత కేటాయించింది.
ముస్లిం మతఛాందస ఉగ్రవాదులకు, పాక్‌ ప్రేరేపిత ఉగ్రమూలకు, మావోయిస్టులకు జాతీయ వాదులే లక్ష్యం. ఇలాంటి పోకడ కొన్ని దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. విశ్వవిద్యాలయాలలో ఏబీవీపీ కార్యకర్తలను మట్టుపెట్టేందుకు చూస్తారు. రాజకీయా లలో బీజేపీని అప్రతిష్ట పాలు చేయాలని నిరంతరం యత్నిస్తుంటారు. ఇక సంఘ పరివార్‌ పేరుతో వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల మీద చిమ్మే బురద అంతా ఇంతా కాదు. ఇది పరోక్షంగా, ప్రత్యక్షంగా పొరుగు దేశానికి నైతిక స్థయిర్యం కల్పిస్తున్న సంగతిని ఈ దేశ మేధావులు విస్మరిస్తున్నారు.
జమ్మూలో చంద్రకాంత్‌ శర్మ హత్యను ఛత్తీస్‌ఘడ్‌లో జరిగిన భీమా మాండవి హత్యను మేధావులు ఎందుకు ఖండించడం లేదు? టీవీ చానళ్లు ఎందుకు గంటల తరబడి చర్చలు నిర్వహిం చడం లేదు? ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ లోక్‌సభ నియోజక వర్గం నుంచి పోటీలో ఉన్న సినీనటి జయప్రద మీద ఆమె ప్రత్యర్థి, ఎస్‌పి అభ్యర్థి ఆజాం ఖాన్‌ చేస్తున్న విమర్శలు ఎంత జుగుప్సా కరంగా ఉన్నాయో షబానా ఆజ్మీలకీ, అరుంధతీ రాయ్‌లకి ఎందుకు వినపడడవం లేదు. ఆమె వేసుకున్న డ్రాయిర్‌ ఖాకీ అని ఆజాంఖాన్‌ విమర్శిస్తే ఒక్క మహిళా హక్కుల నాయకురాలు నోరెత్తలేదేమి? అతడు ముస్లిం కాబట్టే. కావచ్చు. కానీ ఒక మహిళగా జయప్రదను అవమానించిన తీరు మహిళాలోకానికి ఎందుకు పట్టటడం లేదు. అంటే హిందూ మహిళలను, హిందువుల తరఫున మాట్లాడే సంస్థ నుంచి పోటీ పడే వారిని అవమానిస్తే ఫర్వాలేదా? బీజేపీకి చెందిన నాయకులను చంపేస్తే మౌనం దాల్చవచ్చా? ఇదేం న్యాయం?

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top