Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మన సమర పాటవానికి, రక్షణ పటిమకు మరో సాక్ష్యం-defense expo

తమిళనాడులోని మహాబలిపురం సముద్రతీర ప్రాంగణంలో గురువారం ప్రారంభమైన ‘రక్షణ ప్రదర్శిని’- డిఫెన్స్ ఎక్స్‌పో- మన భద్రతా పటిమకు అద్దం. ప్రధాని న...

Image result for defence expo

తమిళనాడులోని మహాబలిపురం సముద్రతీర ప్రాంగణంలో గురువారం ప్రారంభమైన ‘రక్షణ ప్రదర్శిని’- డిఫెన్స్ ఎక్స్‌పో- మన భద్రతా పటిమకు అద్దం. ప్రధాని నరేంద్ర మోదీ శుభారంభం కావించిన ఈ నాలుగు రోజుల ప్రదర్శనం పెరుగుతున్న మన సమర పాటవానికి, రక్షణ పటిమకు మరో సాక్ష్యం. నాలుగేళ్లలో మన రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు రెట్టింపు కావడం ఈ ప్రదర్శినికి సముచితమైన పూర్వరంగం. భారీగా ఆయుధ సామగ్రిని, యుద్ధ వాహనాలను, ఇతర ఉపకరణాలను దిగుమతి చేసుకుంటున్న మన దేశంలో రక్షణ ఉత్పత్తులు, వాటి ఎగుమతులు కూడ పెరుగుతుండడం స్వయం సమృద్ధ పథంలో ప్రస్ఫుటిస్తున్న ప్రగతికి తార్కాణం. మన రక్షణ అవసరాల దిగుమతులతో పోల్చినపుడు ఈ ఎగుమతులు మరుగుజ్జులు అయినప్పటికీ శతాబ్దుల తరబడి విదేశీయ దురాక్రమణ కారులతో సంఘర్షణ జరుపవలసి వచ్చిన మన దేశం మళ్లీ యథాపూర్వ సమర పటిమను సముపార్జించుకునే దిశగా అడుగులు వేస్తుండడం హర్షణీయం. శతాబ్దుల సంఘర్షణ సమయంలోను, విదేశీయుల దురాక్రమణ వ్యవస్థీకృతమైన సమయంలోను మన రక్షణ పాటవం గ్రహణగ్రస్తం కావడం చరిత్ర. బ్రిటన్ దురాక్రమణ నుండి దేశానికి విముక్తి జరిగి ఏడు దశాబ్దులు గడిచినా, మన రక్షణ వ్యవస్థ సంపూర్ణంగా ‘గ్రహణ ముక్తం’ కాలేదు. అయినప్పటికీ ఈ ‘విముక్తి’ దిశగా కృషి జరుగుతుండడం ఆనందకరం. ‘రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ’- డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్- డిఆర్‌డీవో- వారు, త్రివిధ రక్షణ విభాగాల వారు, రక్షణోత్పత్తుల విభాగాల వారు, రక్షణ మంత్రిత్వ శాఖ వారు, కేంద్ర ప్రభుత్వం వారు పటిమను పెంచడానికి చేస్తున్న కృషి అభినందనీయం. ‘యోజనానాం సహస్రేషు శనైః గచ్ఛేత్ పిపీలికా’- మెల్లమెల్లగా పయనించినప్పటికీ చిట్టిచీమ వేల యోజనాల దూరాన్ని అతిగమిస్తోంది- అన్నది నిరంతర ప్రగతికి సాక్ష్యం. ప్రస్తుతం మన రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల విలువ సగటున సాలీనా దాదాపు తొమ్మిదివేల కోట్ల రూపాయలు అయినప్పటికీ దేశంలో ఉత్పత్తులు, ఎగుమతులు క్రమంగా పుంజుకుంటున్నాయి. విదేశీయ బీభత్స పాలన ఫలితంగా ‘వామనాకృతి’ని పొందిన మన రక్షణ పరిజ్ఞానం, పటిమ తిరిగి ‘త్రివిక్రమ’ స్ఫూర్తిని సంతరించుకుంటోంది. గురువారం ప్రారంభమైన ‘రక్షణ ప్రదర్శిని’ ఇందుకు సాక్ష్యం.
దేశంలోనే దేశం కోసం రక్షణ ఉపకరణాల ఉత్పత్తి జరగడం, దేశం నుండి రక్షణ పరికరాలు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు వినిమయం కావడం ప్రధాని వివరించిన లక్ష్యాలు. ‘్భరత్‌లో నిర్మించండి’ అనే నినాదం ఆచరణ రూపం ధరించడం ఈ ‘ప్రదర్శిని’ ప్రాంగణంలో ఆవిష్కృతమైన దృశ్యం. మన దేశానికి చెందిన, నలబయి ఏడు విదేశాల నుండి వచ్చిన దాదాపు ఆరువందల డెబ్బయి సంస్థల ప్రతినిధులు ఈ ప్రదర్శిని ప్రాంగణంలో కొలువుతీరారు. ఈ ఉత్పాదక సంస్థల్లో యాబయి శాతానికి పైగా స్వదేశీయ సంస్థలు కావడం స్వావలంబన సూత్రానికి సాకారం. ఈ దేశీయ సంస్థల్లో అధిక శాతం చిన్న, మధ్యతరహా సంస్థలు కావడం రక్షణ ఉత్పత్తుల పరిశ్రమల వ్యవస్థ వికేంద్రీకృతం అవుతోందనడానికి నిదర్శనం. ఒకప్పుడు మన దేశంలో వికేంద్రీకృత పద్ధతిలో గ్రామీణ పరిశ్రమల్లో రక్షణ ఉపకరణాలు తయారయ్యేవి. ఈ ‘పల్లెబట్టీల’లో తయారైన ఉక్కు, ఉక్కుతో చేసేన కత్తులు, కవచాలు, యుద్ధ శకట ఉపకరణాలు, ఇతర సమర సామగ్రి ప్రపంచ ప్రసిద్ధిని గాంచడం చరిత్ర. భారతదేశ ఉక్కు, ఉక్కు ఉపకరణాలు సిరియాలోని డమాస్కస్ నగరానికి, అక్కడ నుండి వివిధ దేశాలకు ఎగుమతి అయ్యేవి. అందువల్ల ‘డమాస్కస్ ఉక్కు’గా భారతీయ సామగ్రి చరిత్రకెక్కింది. విదేశీయ బీభత్సకారులు మన దేశాన్ని గ్రసించిన శతాబ్దుల కాలంలో ఈ చరిత్ర మరుగున పడింది. యుద్ధనౌకలను ఎగుమతి చేసిన మన దేశం తుక్కు తుపాకులను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే దుస్థితికి దిగజారం విదేశీయ బీభత్స పాలన ఫలితం.
మన దేశం విశ్వశాంతికి నిబద్ధమై ఉండడం, సరిహద్దుల సమగ్రతా పరిరక్షణకు ప్రజల భద్రతను పెంపొందించడానికి కట్టుబడి ఉండడం సమాన ప్రాధాన్యం గల లక్ష్యాలని మోదీ రక్షణ ప్రదర్శన వేదికపై స్పష్టం చేయడం ఈ చరిత్రకు అనురూపం. భారత్ అత్యంత శక్తిమంతంగా ఉన్న సమయంలో ఏ విదేశంపైనా దాడి చేయలేదు, ఆయా దేశాలలో చొరబడి ధ్వంసం చేయలేదు. కలియుగం ఇరవై ఎనిమిదవ శతాబ్ది- క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్ది-లో అలెగ్జాండర్ నాయకత్వంలో మన దేశంలోకి చొరబడిన గ్రీసు బీభత్సకారులకు అంతకు ముందు జరిగిన ఒక ఘటన గురించి తెలుసు. తక్షశిల మహావిద్యాలయం ప్రాంగణంలోకి చొరబడిన విదేశీయ భీభత్స మూకలకు జరిగిన పరాభవం ఆ చారిత్రక ఘటన. వేల విద్యార్థులకు, వందల ఆచార్యులకు ఆలవాలమైన తక్షశిల మహావిద్యాలయ ప్రాంగణంలోకి బీభత్స మూకలు చొరబడే వరకు వారి గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. విదేశీయ మూకలు విధ్వంసకాండను ప్రారంభించాయి. వెంటనే ఆ మూకలపై అగ్నివర్షం కురిసింది, పిడుగుల జడి కురిసింది. బీభత్సకారుల్లో వందల మంది ఆ ‘ఆగ్నేయాస్త్రం’ ధాటికి మాడి మసైపోయారు. మిగిలిన వేలమంది హంతకులు పారిపోయారు. అదీ భారతీయ గురుకులంలోని ఆచార్యుల, విద్యార్థుల అస్త్ర పటిమ. సైనికుల పటిమ, ప్రభుత్వాల రక్షణ పటిమ మరెంత శక్తిమంతమో ఊహించవచ్చు. ఈ వాస్తవ ఘటన పునరావృత్తం అవుతుందన్న భయంతోనే తాము తక్షశిల విద్యాలయంలోకి చొరబడలేదని అలెగ్జాండర్ వెంట వచ్చినవారు ఆ తర్వాత వ్రాసుకున్నారు. పారిపోతున్న విదేశీయులపై తక్షశిల గురుకుల వాసులు అగ్నిదాడులు చేయలేదు. ఇదీ భారతీయుల యుగయుగాల స్వభావం. మనశక్తి ఆత్మరక్షణకు మాత్రమే, సరిహద్దుల సంరక్షణకు మాత్రమే. ఇతర దేశాలపై దాడి చేయడానికి కాదు. మోదీ పునరుద్ఘాటించిన విశ్వశాంతి నిబద్ధతకు ఇదంతా చారిత్రక నేపథ్యం..
‘ఏమరి రక్షసాలని మృగేంద్రుని నక్కయు కోలుపుచ్చు సంగ్రామములోన’ అన్నది మహాభారతంలోని నీతి. ‘నిర్లక్ష్యంతో నిద్రపోయే సింహాన్ని నక్కకూడ ఓడించగలదు.’ భారత్ అనే సింహాన్ని గుంటనక్కల వంటి విదేశీయులు ఓడించిన చరిత్రకు ఈ ఏమరిపాటు ప్రాతిపదిక.. మన సమర పటిమ క్రమంగా పెరుగుతుండడం ఈ చారిత్రక వైపరీత్యాలు పునరావృత్తం కాకుండా నిరోధించడానికి మాధ్యమం. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సర్వ సమగ్రం అయినప్పుడే ఇది సాధ్యం..

No comments