Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఉత్తరప్రదేశ్‌లో ‘ఒక మహిళను లైంగిక బీభత్సానికి గురిచేసిన’ శాసనసభ్యుడు వికృత ప్రతీక-ChangeEducation

ఉత్తరప్రదేశ్‌లో ‘ఒక మహిళను లైంగిక బీభత్సానికి గురిచేసిన’ శాసనసభ్యుడు వికృత ప్రతీక మాత్రమే! విదేశీయులు మననెత్తికెత్తిపోయిన విద్యావిధానం విబ...

Image result for change education
ఉత్తరప్రదేశ్‌లో ‘ఒక మహిళను లైంగిక బీభత్సానికి గురిచేసిన’ శాసనసభ్యుడు వికృత ప్రతీక మాత్రమే! విదేశీయులు మననెత్తికెత్తిపోయిన విద్యావిధానం విబుధ దైత్యులను తయారుచేసింది, చేస్తోంది. ఈ విబుధ దైత్యులు భౌతిక బీభత్సకారులు, బౌద్ధిక బీభత్సకారులు, లైంగిక బీభత్సకారులు, అసాంఘిక కలాపాలకు పాల్పడుతున్నవారు. అన్ని రంగాల్లోనూ ఈ విబుధ దౌత్యులు చొరబడి ఉండడం నడుస్తున్న చరిత్ర. అవినీతిపరులను, నేరస్థులను శిక్షించవలసిన న్యాయవ్యవస్థలో సైతం ఇలాంటి సంఘవిద్రోహులు చొరబడి ఉన్నారు, ఉన్నత న్యాయమూర్తులు సైతం అవినీతి ఆరోపణగ్రస్తులయ్యారు, పదవులను కోల్పోయారు. దేశంలో రోజూ అనేకచోట్ల మహిళలు, బాలికలు లైంగిక బీభత్సకాండకు బలైపోతుండడం విబుధ దైత్య ప్రవృత్తికి పరాకాష్ఠ. కొందరు పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, రాజకీయవేత్తలు మహిళలను అత్యాచారాలకు గురిచేస్తుండడానికి కారణం బుద్ధిని మాత్రమే పెంచుతున్న విద్యలు! బుద్ధి, తెలివి, చదువు పెరిగినవారు సౌశీల్యం లేని పిశాచ స్వభావులుగా మారిపోతుండడం స్వతంత్ర భారతదేశపు ‘ప్రగతి’కి ఒక గీటురాయి. మన విద్యాసంస్థల్లో అక్షరాలను నేర్పుతున్నారు, మానవీయ సంస్కారాలను మప్పడం లేదు. విజ్ఞాన శిఖరాలను అధిరోహిస్తున్న నరుడు వికృతమైన ఊహలను చేస్తున్నాడు, విషాన్ని వెలజల్లుతున్నాడు. ‘కన్నుదోయికి అన్యకాంతలడ్డంబయిన మాతృభావము చేసి’న ప్రహ్లాదుని చరిత్ర మన విద్యావంతులలో అత్యధికులకు తెలియదు. ‘వదినమ్మ’ను తల్లిలాగ సంభావించి ప్రతి ఉదయం ఆమె పాదాలకు నమస్కరించిన లక్ష్మణుని సౌశీల్యం ఆధునిక విద్యావంతులలో అధికులకు తెలియడం లేదు. శిష్యురాలైన ఉత్తరను కుమార్తెగా భావించి కోడలుగా చేసుకున్న పాండవ మధ్యముని కథ విద్యార్థులకు తెలియదు. అసలు పాండవులు ఎందరన్నది, ఎవరన్నది తెలియని ఉన్నత, స్నాతకోత్తర విద్యార్థులు దేశంలో అసంఖ్యాకులు. అందువల్లనే సైంధవులు, కీచకులు బయలుదేరారు. దుశ్శాసనులు, రావణాసురులు చెలరేగుతున్నారు! బృహస్పతి కుమారుడు కచుడు శుక్రుని వద్ద చదివాడు, సహాధ్యాయిని- గురుపుత్రిక దేవయానిని చెల్లెలుగా భావించాడు. ఒకే తరగతిలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు సోదరీ సోదరులు. ఈ ‘సోదరీ సోదరులు’ పరస్పరం లైంగిక శృంగారం వెలయించడం మన సినిమాల్లోని ప్రధాన ఇతివృత్తం! బడులలో శీలం, సంస్కారం, దేశభక్తి, జాతీయత, సమాజ హితం వంటి వాటి ప్రసక్తిలేని మహా ఆధునిక విజ్ఞాన శాస్త్రాలను మాత్రమే బోధిస్తున్నారు. ఫలితంగా దేశద్రోహులు, అవినీతిపరులు, తాగుబోతులు, లైంగిక బీభత్సకారులు విద్యావంతులుగా చెలామణి అవుతున్నారు. రాజకీయాలలో, పరిశ్రమలలో, విద్యాలయాలలో, న్యాయాలలో, సర్వసామాజిక రంగాలలో చేరిపోతున్నారు. ఒక శాసనసభ్యుడు, ఒక అధికారి, ఒక వ్యాపారి, ఒక పారిశ్రామికవేత్త మహిళల సౌశీల్యాన్ని బలిగొంటున్న తీరుకు ఈ ‘విదేశీయ ప్రధాన విద్యావిధానం’ వౌలిక కారణం కాదా?
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఒక యువతిని గత జూన్ పదిహేడవ తేదీన భారతీయ జనతాపార్టీకి చెందిన శాసనసభ్యుడు కులదీప్‌సింగ్ సెంగార్, అతని సహచరులు సామూహిక లైంగిక అత్యాచారానికి గురిచేసినట్టు ప్రచారవౌతోంది. బాధిత మహిళ గత ఎనిమిదవ తేదీన పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఈ శాసనసభ్యుడిని శుక్రవారం నాడు ‘కేంద్ర నేర పరిశోధక మండలి’- సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్- సిబిఐ-వారు నిర్బంధించారు. ఈలోగా బాధితురాలు తండ్రిని ఉన్నావో పోలీసులు నిర్బంధించడం, నిర్బంధంలోనే ఆయన అకాల మరణం పాలుకావడం ఈ బీభత్సకాండలో మరో విషాద ఘట్టం. బాధితురాలి తండ్రిని నిర్బంధ గృహంలో కొట్టడం వల్లనే ఆయన మరణించాడన్న సందేహం కలగడం సహజం. లైంగిక బీభత్సకాండకు ఒడిగట్టిన శాసనసభ్యుని సోదరుడు బాధితురాలి తండ్రిపై బహిరంగంగా దాడిచేసిన తరువాతనే పోలీసులు ఆతడిని నిర్బంధించారట. అందువల్ల ఈ శాసనసభ్యుడి సోదరుడైన అతుల్‌సింగ్ సెంగార్‌ను ఏడవ తేదీన పోలీసులు నిర్బంధించారు! నిందిత శాసనసభ్యుడు కూడా కటకటాల వెనక్కివెళ్లడంతో ఈ అభియోగం గురించి విపుల ప్రచారం జరుగుతోంది. జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లాలో మరో పసిపాపను దుండగులు సామూహికంగా అత్యాచారానికి గురిచేయడమేకాక, ఆ తరువాత ఆమెను బండతో తలపైకొట్టి చంపడం పైశాచిక ప్రవృత్తికి పరాకాష్ఠ!
ఈ భయంకర ఘటనలు ఇలాంటి మరిన్ని పైశాచిక ఘటనలు దేశమంతటా జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని డొంకేశ్వర్‌లో నలబయి ఐదేళ్ల శాయన్న అనే వ్యక్తిని చెట్టుకు కట్టి రాళ్లతో కొట్టి చంపేసినట్టు ఈనెల ఎనిమిదవ తేదీన వెల్లడైంది. మృతుడు ఒక బాలికపై లైంగిక అత్యాచారం చేశాడని, దీంతో స్థానికులు ఆయనను ఇలా శిక్షించారని ప్రచారమైంది! ప్రచారం లేని అత్యాచారాలు మరెన్నో జరిగిపోయాయి. అస్సాంలోని నవ్‌గావ్ జిల్లాలో జక్కీర్ హుస్సేన్ అనే లైంగిక బీభత్సకారుడు పనె్నండేళ్ల పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం జరిపి హత్య చేశాడన్నది భారతీయ జనతాపార్టీ ప్రతినిధి మీనాక్షీ లేఖీ శుక్రవారం వెల్లడించిన మరో పైశాచికం.. ఇలాంటి నికృష్ట నీచ కృత్యాలను దేశ ప్రజలు నిరసిస్తున్నారు. కానీ ఈ ఘటనలను తమ ప్రత్యర్థులపై పగ సాధించుకొనడానికి దాదాపు అన్ని రాజకీయ పక్షాలు యత్నిస్తుండడం వికృత మనస్తత్వానికి అద్దం. ‘కథువా’ అత్యాచారానికి సంబంధించి ఏడుగురిని ఇంతవరకు అరెస్టుచేశారట! అయితే దోషులకు కొంతమంది న్యాయవాదులు, రాజకీయపక్షాలవారు అండగా నిలబడడంతో సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఆగ్రహం వ్యక్తంచేసింది. అత్యాచారం జరిగిన సందర్భాలలో బాధితుల పేరును, వివరాలను ప్రచారం చేయరాదన్నది మానవత్వం. కానీ కథువాలో అత్యాచారానికి హత్యకు గురైన బాలిక పేరును, బొమ్మలను మాధ్యమాలలో ప్రచారం చేశారు. ఈ విషయమై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది కూడ..
పసిపాపలను, పద్దెనిమిది ఏళ్ల లోపు బాలికలను అత్యాచారాలకు గురిచేసేవారికి మరణ దండన విధించేలా చట్టాలను రూపొందించాలన్న ఆకాంక్ష దేశమంతటా వ్యక్తవౌతోంది. కానీ మానవ స్వభావంలో మార్పు రానంతవరకు చట్టాల వల్ల ప్రయోజనమేమిటి? ‘నిర్భయ’ చట్టం రూపొందిన తరువాత లైంగిక అత్యాచారాలు తగ్గలేదు. దేశంలో ఎక్కడో అక్కడ రోజూ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్ది నుంచి మన దేశంలోకి చొరబడిన విదేశీయ ‘జిహాదీ’లు స్వదేశీయ మహిళల మాన మర్యాదల మంటగలిపారు. శతాబ్దుల తరబడి భారతీయ మహిళలు ఈ ‘జిహాదీ’ల అకృత్యాలకు బలైపోయారు! పాకిస్తాన్ నుంచి చొరబడుతున్న ‘జిహాదీ’లు జమ్మూ కాశ్మీర్‌లో ఈ కిరాతకాలను కొనసాగిస్తున్నారు. కథువాలో పసిపాపను బలికొన్న పిశాచాలు మారువేషాలలోని పాకిస్తాన్ జిహాదీలన్న సందేహాలు ప్రచారవౌతున్నాయి. దేశమంతటా పెరుగుతున్న లైంగిక అత్యాచార ప్రవృత్తిని దీర్ఘకాల ప్రాతిపదికపై నిరోధించడానికి మన విద్యాబోధన పద్ధతులలో సమూలమైన మార్పులు జరగాలి. శాస్త్ర విజ్ఞానంతోపాటు నైతిక నిష్ఠను పెంచేలా విద్యలు వికసించాలి. భారతీయ భాషలను, భావదాస్యగ్రస్తం కాని భారతీయ సాహిత్యాన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విస్తృతంగా బోధించడం నైతిక నిష్ఠకు, విద్యావంతులను రూపొందించడానికి మార్గం!

No comments