ఆఫ్రికాలో భక్తి జ్వాలలను రగిలించిన - శ్రీవాస్ దాస్ వనచారి
ఆఫ్రికా మట్టిలో భగవద్భక్తి విత్తనాలు నాటడం అనేది పెద్ద సాహసానికి మించిన యజ్ఞం. క్రైస్తవ మిషనరీలు శతాబ్దాలుగా ఆఫ్రికమ్ మనసుల్లో వేసిన ముద్ర అంత సులభంగా చెరిగే విషయం కాదు. అలాంటి నేలపై “హరే కృష్ణ హరే కృష్ణ” మహామంత్రాన్ని ప్రజల గుండెల్లో ప్రతిధ్వనింప చేసిన వ్యక్తి శ్రీవాస్ దాస్ వనచారి. చిన్నవయసు నుండి చర్చిలో పెరిగిన బాలుడు, ఒక్క భగవద్గీత శ్లోకంతో అంతర్గతంగా మారిపోయి, పూర్తిగా భిన్నమైన దారిలో నడుస్తూ, చివరికి ఘానా దేశంలో తొలి హిందూ ఆలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత అతనికే దక్కింది. ఆయన కథ వినగానే మనసులో భక్తి అలలు ఎగిసిపడటం సహజం.జోసెఫ్ ఒసుగా (Joseph OSU) 1970ల చివరలో అక్రా నగరంలో జన్మించిన అతను, చిన్నతనం నుంచి చర్చి పాటలు పాడుతూ, బైబిల్ కథలు వింటూ పెరిగే సాధారణ ఆఫ్రికన్ యువకుడు. కానీ అతని మనసులో అన్వేషణ చాలా చిన్న వయసు నుంచే మొదలైంది. బైబిల్ బోధనల్లో ఎంతో మంచితనం కనిపించినా, “సృష్టి, ఆత్మ, శాశ్వతత్వం” వంటి ప్రశ్నలకు లోతైన సమాధానం దొరకకపోవడం వలన హృదయం అతన్ని వెతుకులాటలోకి నెట్టింది. కుటుంబ సభ్యులు కూడా అతను ఎప్పుడూ నిశ్శబ్దంగా ఆలోచిస్తూ ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపడ్డారని ఆయన తరువాత అనేక ఇంటర్వ్యూల్లో చెప్పాడు.
అతని జీవితంలో నిజమైన మలుపు 1990ల ప్రారంభంలో వచ్చింది. ఒక రోజు అక్రా వీధుల్లో ఇస్కాన్ భక్తులు మృదంగం, కర తాళాలతో కీర్తనలు చేస్తూ నడుస్తుండగా, “హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే” అనే మహామంత్రం అతని చెవుల్లో పడింది. ఆ శబ్దం అతని హృదయానికి తాకిన తీరు అతను చెప్పిన మాటల్లో “అది పాట కాదు... అది నన్ను పిలిచిన శబ్దం.” వెంటనే ఆసక్తిగా నిలబడి వారిని గమనించాడు. అదే సాయంత్రం ఒక భక్తుడు అతనికి “భగవద్గీత యథాతదం” పుస్తకాన్ని ఇచ్చాడు. మొదటి అధ్యాయం చదవగానే అతను కన్నీళ్లలో తడిసి మునిగిపోయాడు. “నువ్వు శరీరం కాదు, ఆత్మవు” అనే గీతా వాక్యం అతని అంతర్ముఖాన్ని తట్టిలేపింది.
గీత చదివిన తరువాత అతని మనసులో అసాధారణమైన ఆత్మబోధ వికసించింది. పాఠశాల, కుటుంబం, క్రైస్తవ వాతావరణం అన్నీ అతనిలో ఉన్న కొత్త ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయాయి. ఆయన రాత్రిళ్లు నిద్రలేకుండా గడిపాడు. తన స్నేహితులకు “నేను ఇంతవరకు వెతికింది ఇదే సత్యం” అని చెప్పడంతో కొందరు ఆశ్చర్యపడ్డారు, మరికొందరు వ్యతిరేకించారు. కానీ లోపలి పిలుపు అతనిని ఆపలేదు. చివరికి 1990ల చివరిలో అక్రా ఇస్కాన్ కేంద్రానికి వెళ్లి భక్తులతో మాట్లాడాడు. వారి నిర్వ్యాజ ప్రేమ, సేవా భావం, సమానత్వ దృష్టి అతన్ని పూర్తిగా మార్చేసింది, అతనికి వారి పిలుపుల్లో ప్రేమమాప్యాయతలు కనిపించాయి, అందరికీ దగ్గరయాడు.
కొన్ని నెలల ధ్యానసాధన, తత్త్వబోధలోతులు, శాస్త్రాధ్యయనం తరువాత అతను బ్రహ్మచారి దీక్ష తీసుకున్నాడు. అదే సమయంలో గురువులు అతనికి ‘శ్రీవాస్ దాస్ వనచారి’ అనే ఆధ్యాత్మిక పేరు ఇవ్వడం జరిగింది. ఈ పేరు అతని భవిష్యత్తులో చేయబోయే మహోన్నత సేవలకు ఒక సంకేతం లాంటిది. ‘వనచారి’ అరణ్యంలో తిరిగి జీవులకు జ్ఞానాన్ని అందించే వానప్రస్థ మునిలా, ఆఫ్రికా ఖండంలోని హృదయాలలో కృష్ణప్రేమను వెలిగించే పాత్ర అతని చేతిలో పడింది.
అతని ఆధ్యాత్మిక శక్తిని పెంచడంలో ప్రభుపాద బోధలు కీలకం. అలాగే ఆఫ్రికా ఖండంలో గొప్ప సేవ చేసిన భక్తి తీర్థ స్వామి ఇచ్చిన మార్గదర్శకం అతనిలో ఉన్న నాయకత్వ లక్షణాలను వెలికితీసింది. శ్రీవాస్ దాస్ వనచారి స్థానిక భాషల్లో కృష్ణ తత్త్వాన్ని చెప్పగలిగే అరుదైన సామర్థ్యం కలిగి ఉన్నాడు. స్థానికులు ఎట్టి సందేహం అడిగినా, వారి భావోద్వేగాలకు దగ్గరగా ఉండే ఉదాహరణలతో కృష్ణభక్తిని వివరించేవాడు. అందుకే అతను ప్రజల మధ్య చాలా త్వరగా ఆదరణ పొందాడు.
వచ్చిన కొన్ని సంవత్సరాల్లోనే అతను ఘానాలో మొదటి హిందూ ఆలయాన్ని స్థాపించాడు. అది ఆఫ్రికా ఖండానికి భక్తి దీపంగా వెలిగింది. ఆ తరువాత 57కి పైగా ఆలయాలు నిర్మించడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. అతి పేద గ్రామాల్లోనూ, పెద్ద పట్టణాల్లోనూ కృష్ణభక్తి కేంద్రాలు ఏర్పడడంతో ఆఫ్రికా ఖండంలో హిందూ ధర్మం ఒక ప్రకాశించే ఉద్యమంగా మారిపోయింది. ఆలయాలు అక్కడి ప్రజలకు కేవలం పూజా స్థలాలు కాదు వాటి ద్వారా విద్య, భోజనం, సంస్కృతి, సేవ అన్నీ కృష్ణ ప్రేమ ద్వారా ఒకేచోట లభించాయి.
శ్రీవాస్ దాస్ వనచారి ప్రారంభించిన Food For Life సేవ ఘానాలో మహత్తర కార్యక్రమంగా నిలిచింది. పేద పిల్లలకు పచ్చడి అన్నం, ఖిచ్డీ, రొట్టెలు, కూరలు రోజూ వేలాదిమందికి అందేవి. అనేక కుటుంబాలు “హరే కృష్ణ మందిరం వల్ల మా పిల్లలు బతుకుతున్నారు” అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. డ్రగ్స్‌కు బానిసైన యువతను ఆశ్రమాల్లోకి తీసుకుని, కీర్తనలతో, సేవాస్ఫూర్తితో కొత్త జీవితం ఇచ్చాడు. వేలాది యువకులు ఆయన పాదసేవలో ఆధ్యాత్మిక మార్గం అందుకుని తమ జీవితాలను మార్చుకున్నారు.
అక్రా రథయాత్ర ఇప్పుడు ఆఫ్రికాలో అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగగా ప్రసిద్ధి పొందింది. వేలాది మంది నల్లజాతీయులు, కొందరు క్రైస్తవులు, ముస్లింలు కూడా ఈ రథాన్ని లాగేందుకు ముందుకు వస్తున్నారు. పోలీసులు కూడా భక్తులతో పాటపాడుతూ నడిస్తారు. ఈ దృశ్యం చూసినవారు కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేరు. “భక్తి అనేది మతం కాదు… అది హృదయం నుంచి వచ్చే ప్రేమ” అని శ్రీవాస్ దాస్ వనచారి ఎప్పుడూ చెప్తారు. రథయాత్ర అతని మాటలకు జీవం ఇచ్చిన సంఘటనగా నిలబడింది.
మొత్తానికి, శ్రీవాస్ దాస్ వనచారి కథ ఒక శాశ్వత సందేశం అయ్యింది. భక్తి ఎవరిదైనా కావచ్చు, ఎక్కడైనా వికసించవచ్చు. జాతి, వర్ణం, మతం, చర్మరంగు ఎవ్వరినీ కృష్ణుడు అడ్డుకోడు. చర్చిలో పెరిగిన జోసెఫ్ ఒసు ఈరోజు ఆఫ్రికాలో హిందూమతాన్ని వ్యాప్తి చేసిన మహా ప్రచారకుడు. అతని కీర్తనలు ఇప్పటికీ ఆఫ్రికాలోని గ్రామాల గుండెల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. శ్రీవాస్ దాస్ వనచారి జీవితం—“హరే కృష్ణ” మహామంత్రంలోని దివ్యశక్తికి నిలువు దర్పణం. జయ్ హిందురాష్ట్ర. రాజశేఖర్ నన్నపనేని. MegaMinds

