ప్రపంచం వేగంగా మారుతోంది. అమెరికా, రష్యా, చైనా, యూరప్ శక్తివంతమైన దేశాలుగా మారే సమీకరణాల్లో ప్రతి దేశం తన స్థానాన్ని బలపరచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో భారత్ చైనా SCO సదస్సు ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఇద్దరు నేతలు “భారత్ చైనా శత్రువులు కాదు, అభివృద్ధి భాగస్వాములు” అని చెప్పడం, ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి వాతావరణాన్ని కల్పించే ప్రయత్నంగా చూడవచ్చు. గాల్వాన్ ఘటన తర్వాత మోడీ- జిన్ పింగ్ కరచాలనం చేసారని విమర్శలు చేస్తున్న వాళ్ళు ఒకసారి గమనించాలి, అక్సాయ్ చిన్‌ని 1962లో చైనాకు, పీవోజెకేను 1947-48లో పాకిస్తాన్‌కు ఎవరు అప్పగించారో ఓ సారి గుర్తు చేసుకోండి.
ముఖ్యంగా అమెరికాతో మన వాణిజ్య సంబంధాలు ఇటీవల తారుమారైన నేపథ్యంలో, చైనాతో సహకారం అనివార్యమైంది. కానీ చాలా మంది భారతీయుల మదిలో ఒక్క సందేహం కలగకమానదు “చైనాను నమ్మగలమా?” ఈ ప్రశ్న సహజమే. అయితే, ఈ స్నేహం నమ్మదగినదా కాదా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మోదీ గారి మాటల్లో చెప్పాలంటే, “భారత్ చైనా సంబంధాలను మూడో దేశం కళ్లతో చూడకూడదు.” ఇది స్వతంత్ర దౌత్యానికి సంకేతం. మన ప్రయోజనమే మనకు ముఖ్యం అది అమెరికా గానీ, చైనా గానీ నిర్ణయించేది కాదు.
సరిహద్దు శాంతి అనేది ఇరుదేశాల సంబంధాలకు పునాది. గతంలో గాల్వాన్ ఘటనలు, ఉద్రిక్తతలు మనకు చేదు అనుభవంని ఇచ్చాయి. కానీ ఇప్పుడు సైనిక ఉపసంహరణలు విజయవంతమవ్వడం ఒక సానుకూల సూచన. అయినప్పటికీ, మనకు చరిత్ర నుండి అనేక అనుభవాలు ఉన్నవి. 1962 మాదిరి మళ్లీ జరగకుండా తగు చర్యలు తీసుకోవాలి. అలాగే మన సైన్యం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండడం మనకు ఒక వరం.
మరియు చైనా పర్యాటకులకు శుభవార్త 2020 నుండి నిలిచిపోయిన భారత్ చైనా విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా కైలాస మానసరోవర్ యాత్ర కొనసాగడం కోట్లాది భారతీయులకు ఒక ఆధ్యాత్మిక ఆనందం కలిగిస్తుంది. ఇది కేవలం ఒక యాత్ర మాత్రమే కాదు, మన సంస్కృతికి, మన ఆధ్యాత్మికతకు విడదీయరాని బంధం.
ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి, చైనాతో వ్యూహాత్మక సహకారం ఉందని మనం వారి వస్తువులు, యాప్స్ వాడాల్సిన అవసరం లేదు. మన ఎంపిక స్వదేశీ వస్తువులు కావాలి. చైనా వస్తువులు చవకగా ఉండొచ్చు, ఆకర్షణీయంగా ఉండొచ్చు. కానీ అవి మన స్థానిక పరిశ్రమలను బలహీనపరుస్తాయి. మన అస్తిత్వం మన పరిశ్రమల్లోనే ఉంది.
అమెరికా ప్రస్తుత ఆంక్షలు మన వల్ల రాలేదు. ఒకసారి సంబంధాలు దెబ్బతిన్నాక, నిశ్శబ్దంగా కూర్చుని నష్టాన్ని భరించడం మన చేతగాని తనమవుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనకు ప్రత్యామ్నాయాలు కావాలి. అలాంటి పరిస్థితిలో చైనాతో సంబంధాలను బలోపేతం చేయడం ఒక వ్యూహాత్మక అవసరమే. కాబట్టి జాగ్రత్తగా, లెక్కచేసుకుని వారితో ప్రయొజనాలు పొందాలి.
భౌగోళిక రాజకీయం అనేది భావోద్వేగాలతో కాదు, వాస్తవికతతో నడుస్తుంది. శత్రువు కూడా ఎప్పుడో ఒక రోజు భాగస్వామిగా మారవచ్చు, భాగస్వామి కూడా శత్రువుగా మారవచ్చు. కాబట్టి స్నేహం శాశ్వతం కాదు, శాశ్వతం అనేది దేశ ప్రయోజనమే. చైనాతో ప్రస్తుత సహకారం మన ప్రయోజనానికి పనికొస్తే స్వీకరించాలి, లేకపోతే లేదు. అలాగే మన జాగ్రత్తలను మనం పాటిస్తూ ముందుకెళ్లాలి.
మన ఆర్థిక ప్రయోజనాలు మనకు మరో కీలక అంశం. వాణిజ్యం పెరగాలి, పెట్టుబడులు రావాలి. కానీ అవి మన స్వదేశీ పరిశ్రమలకు ఆటంకం కలిగించకూడదు. చైనా పెట్టుబడులు మనకు ఉపయుక్తమైతేనే స్వీకరించాలి, మన స్వతంత్రతను దెబ్బతీస్తే వాటిని వాడటం మానేయాలి. ఇదే వోకల్ ఫర్ లోకల్ నినాదానికి నిజమైన అర్థం.
భారత్–చైనా సహకారం BRICS వంటి వేదికల్లో మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. 2026 BRICS సదస్సుకు జిన్‌పింగ్‌ను మోదీ గారు ఆహ్వానించడం దౌత్యపరమైన చాతుర్యం. ఇది చైనాపై నమ్మకానికి సంకేతం కాదు. అలాగే అసలు చైనా మనల్ని నమ్ముతుందా? అనేది కూడా అనుమానమే ఎందుకంటే భారత్‌కి అమెరికాతో ఉన్న సుదీర్ఘ స్నేహం, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో ఉన్న వ్యూహాత్మక కూటములు చైనాని ఆలోచింపజేస్తాయి. ఇది కేవలం భారతదేశం తన స్థానాన్ని బలపరుచుకునేందుకు ఒక వ్యూహాత్మక ఎత్తుగడ, మన ప్రయోజనం కోసం తీసుకున్న నిర్ణయం.
మొత్తంగా భారత్ చైనా సంబంధాలు ఇరు దేశ ప్రయోజనాల కోసమే. దీనిని మనం ఉపయోగించుకోవాలి. అంతే కానీ చైనా చెత్తతో దేశాన్ని నింపేయాల్సిన పనిలేదు. చైనాతో సహకారం తాత్కాలిక లాభం ఇస్తుంది, కానీ శాశ్వత శక్తినిచ్చేది మాత్రం మన స్వదేశీ శక్తే. స్వదేశీ వస్తువులు వాడుతూ, ఆత్మనిర్భర భారత్ కలలను ముందుకు తీసుకెళ్లడమే మనకు నిజమైన భవిష్యత్తు. మన గౌరవానికి మన అస్తిత్వానికి బంగం కలగనంతవరకే ఈ స్నేహం. -రాజశేఖర్ నన్నపనేని. Mega Minds


