10 సంవత్సరాల క్రితం (2015లో), ఇన్ఫోసిస్ ఓపెన్‌ఏఐలో మొదటి పెట్టుబడిదారులలో ఒకటిగా $1 మిలియన్ (సుమారు ₹8 కోట్లు) పెట్టుబడి పెట్టింది, ఎలన్ మస్క్, పీటర్ థీల్(ఈ వ్యక్తి గురించి రాయాలంటే పుస్తకం సరిపోదు, ఒక జ్ఞాన భాండాగారం. పే పాల్, స్పేస్ x , ఫేస్బుక్ , airbnb లో ఇన్వెస్ట్ చేసారు. ఇలా కంపెనీల లిస్టు రాస్తే ఒక పేజీ అవుతుంది) మరియు AWS(amazon cloud) ఇతరులు ఇందులో భాగస్వామ్యులుగా ఉన్నారు. ఇంతపెద్ద సంస్థలతో కలిసి పనిచేయాలి అనే నిర్ణయం తీసుకోవడం అలాగే వారిని ఒప్పించడం అంటే మాటలా? అసలు ఇన్ఫోసిస్ స్థాయి ఎంత? ఆఫ్టర్ ఆల్ ఒక సర్వీసు బేస్డ్ కంపెనీ. వాస్తవానికి, ఓపెన్‌ఏఐ అప్పట్లో నాన్-ప్రాఫిట్ సంస్థగా ఉండటంతో ఈ పెట్టుబడి డొనేషన్ రూపంలో ఉంది, ఈక్విటీ కాదు, కాబట్టి ఇప్పుడు ఓపెన్‌ఏఐ విలువ $500 బిలియన్‌కు చేరినా ఇన్ఫోసిస్‌కు ఎలాంటి లాభం లేదు. CEO విశాల్ సిక్కా AI విప్లవాన్ని ముందుగా గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు, కానీ ఇన్ఫోసిస్ కంపెనీ ఫౌండర్లతో(ముఖ్యంగా నారాయణ మూర్తి) విభేదాలు కారణంగా 2017లో తొలగించబడ్డారు. ఈ ఘటన ఇన్ఫోసిస్ AI అవకాశాలను ఎలా కోల్పోయిందో తెలియజేస్తుంది, మరియు “ఒక లీడర్షిప్ ఉన్న నాయకుణ్ణి కోల్పోతే వచ్చే పర్యవసానాలు ఎలా ఉంటాయి?” అనే అంశాన్ని స్పృశిస్తుంది. విశాల్ సిక్కా సాధారణ IT CEO కాదు, AI సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ ను మరియు కోడింగ్ చేసేవాళ్లను కూడా “తినివేస్తుంది(ఇబ్బందులకు గురిచేస్తుంది)” అని ముందుగా చూసి, ఇన్ఫోసిస్‌ను ఆ దిశగా నడిపించారు, మరియు ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి వంటి వారు ఈ విజన్‌ను అర్థం చేసుకోలేకపోయారు.
విశాల్ సిక్కా ఎవరు: ఇన్ఫోసిస్ ముందు కెరీర్
విశాల్ సిక్కా భారతీయ-అమెరికన్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్, 1967 మే 1న మధ్యప్రదేశ్‌లో జన్మించారు. ఇన్ఫోసిస్ ముందు, అతను SAP AGలో 2002 నుండి 2014 వరకు 12 సంవత్సరాలు పనిచేశారు, ఇక్కడ అతను ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ మరియు గ్లోబల్ మేనేజింగ్ బోర్డ్ మెంబర్‌గా ఉండి, ప్రొడక్ట్స్ మరియు టెక్నాలజీలను లీడ్ చేశారు. అతను SAP యొక్క ఇన్-మెమరీ డేటాబేస్ HANAను(ఈ టెక్నాలజీ SAP అనే కంపెనీకి బిలియన్ డాలర్లు కురిపించింది, నా కళ్ళతో ఈ టెక్నాలజీ ఎన్ని అద్భుతాలు చేసిందో బెంగళూరులో ఉండే రోజుల్లో చూసాను) సృష్టించడంలో కీలక పాత్ర పోషించారు, మరియు SAPను క్లౌడ్ మరియు AI రంగాలలో ముందుకు నడిపించింది. SAPలో అతను కంపెనీ యొక్క మొదటి CTOగా పనిచేశారు.
స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్‌లో PhD చేసిన సిక్కా, AI మరియు మెషిన్ లెర్నింగ్ రంగాలలో నిపుణుడు. SAP ముందు, అతను స్టార్టప్‌లు బోధి మరియు iBrainలో అనే కంపెనీస్ స్థాపించారు, మరియు ఇన్నోవేషన్ ప్రాజెక్టులలో పాల్గొన్నారు. సిక్కా 2014లో ఇన్ఫోసిస్ CEOగా చేరారు, ఇక్కడ అతను ఇన్ఫోసిస్ కంపెనీని AI ఇన్నోవేషన్ వైపు ఆలోచించేలా ప్రయత్నించారు.
2015 పెట్టుబడి: ఓపెన్‌ఏఐలో ఇన్ఫోసిస్ బెట్
2015 డిసెంబర్ 1న, విశాల్ సిక్కా ఇన్ఫోసిస్‌ను ఓపెన్‌ఏఐలో మొదటి పెట్టుబడిదారులలో ఒకటిగా చేశారు, అప్పటికి చాలా కంపెనీ టెక్ ఎగ్జిక్యూటివ్‌లు “మెషిన్ లెర్నింగ్” గురించి గూగుల్ చేస్తుండగా, సిక్కా AI విప్లవాన్ని ముందుగా గుర్తించారు. ఇన్ఫోసిస్ $1 మిలియన్ డొనేషన్ రూపంలో సపోర్ట్ చేసింది. సిక్కా ఇన్ఫోసిస్ AI నుండి గ్రేట్ బెనిఫిట్ పొందుతుందని చెప్పారు, కానీ ఓపెన్‌ఏఐ అప్పట్లో నాన్-ప్రాఫిట్ కావడంతో ఈక్విటీ లేదు. ఇది ఇన్ఫోసిస్ యొక్క AI ఫోకస్‌ను, మరియు అతని దూరదృష్టిని చూపిస్తుంది. ఈ పెట్టుబడి సిక్కా విజన్ ఫలితం, ఇన్ఫోసిస్‌ను AI-ఫార్వర్డ్ కంపెనీగా మార్చడానికి మొదటి అడుగు పడింది , అలాగే విశాల్ సిక్కా ఇన్ఫోసిస్‌లో AI-డ్రైవన్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్టులు ప్రారంభించడానికి దోహదం చేసింది, ఇందులోనుండి వచ్చిన బ్రెయిన్ చైల్డ్ వలన ఇన్ఫోసిస్ లో డిజైన్ థింకింగ్ మరియు ఆటోమేషన్ మొదలయ్యాయి.
విభేదాలు మరియు తొలగింపు: ఇన్ఫోసిస్ ఫౌండర్లతో క్లాష్
విశాల్ సిక్కా మరియు ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి మధ్య విభేదాలు 2017లో తీవ్రమయ్యాయి, మూర్తి సిక్కా జీతం పెంపు (సుమారు ₹48 కోట్లు), పనాయా అక్విజిషన్ ($200 మిలియన్, అవకతవకలు ఆరోపణలు), కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు అని నిందించారు. నారాయణ మూర్తి బోర్డ్‌కు ఓపెన్ లెటర్ రాసి, సిక్కా నిర్ణయాలు కంపెనీ విలువలకు విరుద్ధమని చెప్పారు, మరియు మాజీ CFO రాజీవ్ బన్సాల్ సెవరెన్స్ ప్యాకేజి (24 నెలలు, సుమారు ₹17 కోట్లు) పై ప్రశ్నించారు. సిక్కాపై “మూర్తి నిరంతర దాడులు మరియు అసత్య ఆరోపణలు” కారణంగా రాజీనామా చేశారు. బోర్డ్ నారాయణ మూర్తిని నిందించి, సిక్కా తొలగింపును అంగీకరించింది. ఈ వివాదం ఇన్ఫోసిస్ షేర్లు 9.6% పడిపోవడానికి కారణమైంది, మరియు నారాయణ మూర్తి “ఇన్ఫోసిస్ ఫౌండర్స్ ఆలోచనలకు, కంపెనీ ఇంటరెస్ట్‌లకు” ముందు అతని ఎగోను ముందు పెట్టారని విమర్శలు వచ్చాయి. ఈ ఘటన సిక్కా AI విజన్‌ను ఆపేసింది, మరియు మూర్తి ఇన్ఫోసిస్‌ను సాంప్రదాయిక విలువలకు మరల్చారు. ఇది ఇన్ఫోసిస్ కు తగిలిన అతిపెద్ద దెబ్బ.
ఏమి జరిగింది: పెట్టుబడి నష్టం మరియు పర్యవసానాలు
సిక్కా తొలగింపు తర్వాత, ఇన్ఫోసిస్ ఓపెన్‌ఏఐ పెట్టుబడిని డబుల్ డౌన్(రిటర్న్ వచ్చేవిధంగా) చేయకుండా వదిలేసింది. ఓపెన్‌ఏఐ అప్పట్లో నాన్-ప్రాఫిట్ కావడంతో ఇన్ఫోసిస్ డొనేషన్ ఈక్విటీగా మారలేదు, కాబట్టి ఇప్పుడు ఓపెన్‌ఏఐ విలువ $500 బిలియన్‌కు చేరినా ఇన్ఫోసిస్ స్టేక్ శూన్యం. ఇన్వెస్టర్లు “సిక్కాను తొలగించకపోతే, $1 మిలియన్(ఇవాళ కరెన్సీలో సుమారు 9 కోట్లు) పెట్టుబడి సుమారు 45 బిలియన్ డాలర్ల(సుమారు 40 లక్షల కోట్లు)విలువైనది అయ్యేది” అని చర్చిస్తున్నారు. ఈ ఘటన ఇన్ఫోసిస్ AI అవకాశాలను కోల్పోవడం మాత్రమే కాదు, భారత్ ఎదుగుదలకు అడ్డంకి అయింది, మరియు సిక్కా విజన్ ను కంపెనీ అంగీకరించకపోవడంతో కంపెనీ సాంప్రదాయిక సర్వీసెస్‌కు మరలింది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ పడిపోవడం, స్టాక్ వాల్యూ తగ్గడం వంటి పర్యవసానాలు ఎదుర్కొంది, మరియు కంపెనీ AIలో వెనుకబడిపోయింది. ఇతర ఇండియన్ IT ఫర్మ్స్ లాగా ఇప్పుడు AIని అందుకునే ప్రయత్నం చేస్తోంది.
ప్రస్తుత స్థితి: విశాల్ సిక్కా ఇప్పుడు ఏమి చేస్తున్నారు మరియు పాఠాలు
విశాల్ సిక్కా ఇప్పుడు Vianai Systems అనే AI కంపెనీ ఫౌండర్ మరియు CEOగా 2019 నుండి పనిచేస్తున్నారు, ఇది హ్యూమన్-సెంటర్డ్ AI ప్లాట్‌ఫాం మరియు ప్రొడక్ట్స్‌పై ఫోకస్ చేస్తుంది, మరియు $50 మిలియన్ ఫండింగ్ సేకరించింది. 2025లో TCSతో పార్టనర్‌షిప్‌లో కన్వర్సేషనల్ AI డెవలప్ చేస్తున్నారు, మరియు AI హాలుసినేషన్స్ గురించి మాట్లాడుతూ, ఇది క్రియేటివిటీకి శక్తివంతమైన టూల్ అని చెబుతున్నారు. విశాల్ సిక్కా భారతదేశం AI రేస్‌లో యాక్టివ్‌గా పాల్గొనాలని కలలు కంటున్నారు, మరియు ఇన్ఫోసిస్ ఘటన IT ఇండస్ట్రీకి ఒక పాఠం—ఎర్లీ AI ఇన్వెస్ట్‌మెంట్ అవసరాన్ని తెలియజేస్తోంది, మనం విజనరీ లీడర్లను సపోర్ట్ చేయకపోతే ఎదుర్కొనే సమస్యలు, పర్యావసనాలు తెలియజేస్తోంది. సిక్కా ఇప్పుడు AI ఎథిక్స్ మరియు ఎంటర్‌ప్రైజ్ AIపై ఫోకస్ చేసి, కాన్ఫరెన్స్‌లలో స్పీకర్‌గా, బోర్డ్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. ఇలాంటి విజనరీ లీడర్స్ భారత్ నుండి h1b లేదా ఇతర వీసాల ద్వారా భారత్ నుండి అమెరికాకు తరలిపోయి ఉంటారు? అవకాశాలు ఉన్నా, కార్పొరేట్ అంతర్గత రాజకీయాలకు(ఇంటర్నల్ politics) సంబంధించి ఇది పెద్ద గుణపాఠం. ఇలాంటి విషయాల్లో నిర్ణయాత్మక వైఖరి లేకపోతే, మన దేశం అద్భుతమైన వ్యక్తుల్ని కోల్పోతుంది. దానితోపాటు, అభివృద్ధిలో దశాబ్దం వెనక్కు వెళ్తుంది. h1b పైన భారత్ నుండి ఇలాంటి వాళ్ళు ఎంతమంది వెళ్ళారో ఊహించండి? ఎలాన్ మస్క్ ఎందుకు h1b పై ఎందుకు అంత సీరియస్ గా ఉన్నారో అర్థం అవుతోందా? ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవటమంటే ఇదే... -పతంజలి వడ్లమూడి, Mega Minds