దేశ వ్యాప్తంగా అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటిలో కొని ఆలయాలు రహస్యాలకు నెలవు. కొన్ని దేవాలయాలు విభిన్న సంప్రదాయాలకు ప్రసిద్ధి. అయితే కొన్ని ఆలయాల్లోని రహస్యాలను సైన్స్ కూడా ఛేదించలేకపోయింది. ఇలాంటి రహస్య ఆలయం ఒకటి ఉత్తరాఖండ్ లో చమోలి జిల్లాలోని దేవల్ బ్లాక్‌లోని వానాలో ఉంది అదే లాటూ (లాతూ) మందిర్. ఈ ఆలయంలో భక్తులకు నేరుగా ప్రవేశం ఉండదు. ఈ విశిష్ట సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ లాటు ఆలయంలో దేవుని ప్రత్యక్ష దర్శనానికి అనుమతి లేదు. ఆలయంలోకి ప్రవేశించే ముందు ఆలయ పూజారి భక్తుల కళ్లకు, నోటికి గంతలు కట్టుకుని వెళతాడు.
లాటు దేవుడిని ఉత్తరాఖండ్‌లోని నందా దేవి సోదరుడిగా భావిస్తారు. అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. లాటు ఆలయంలో కొలువైన నాగరాజు తన నాగమణిపై కూర్చున్నాడని విశ్వాసం. ఈ రత్నం నుంచి వెలువడే ప్రకాశవంతమైన కాంతి సోకిన భక్తుడిని అంధుడిని చేస్తుందని నమ్మకం. అందుకే ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులకు పూజారులు భక్తుల కళ్లకు, నోటికి గంతలు కడతారు.
ఏడాదిలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే లాటు ఆలయ ప్రవేశం ఉంటుంది. ఈ ఆలయ ప్రవేశం వైశాఖ మాసం పౌర్ణమి రోజున తెరుచుకుంటుంది. భక్తులందరూ దూరం నుండి దైవాన్ని చూస్తారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అందరికీ కళ్లకు గంతలు కట్టి పూజలు చేస్తారు. లాటు దేవాలయంలో విష్ణు సహస్రనామం, భగవతీ చండిక ఎక్కువగా పఠిస్తారు. పూజారి గర్భగుడి లో పూజ నిర్వహించి బయటకు రాగానే తలుపులు మళ్లీ మూసివేయబడతాయి. తరువాత ఒక సంవత్సరం పొడవునా భక్తులు నిశ్శబ్దంగా ఎదురుచూస్తారు. ఆలయం ఒక ఆధ్యాత్మిక శక్తి నిల్వగా మారుతుంది.
లాతు దేవతా ఆలయానికి చేరుకోవాలంటే హిమాలయాల గుండా ప్రయాణం చేయాలి. ఈ ఆలయానికి చేరుకోవడం చాలా కష్టం. కానీ అనుభూతి చాలా బాగుంటుంది. రిషికేష్ వెళ్లి అక్కడి నుంచి అలకనంద, మందాకిని నదుల సంగమ స్థలంలో ఉన్న కర్ణప్రయాగ్‌కు షేర్డ్ టాక్సీలో లేదా బస్సులో వెళ్లాలి. ఈ ప్రయాణానికి దాదాపు 4-5 గంటలు పడుతుంది. కర్ణప్రయాగ్ నుంచి లాతు దేవతా ఆలయం ఉన్న వాన్ గ్రామం వరకు దాదాపు 18 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ పూర్తి చేయడానికి సుమారు 6-8 గంటలు పడుతుంది. ఈ గ్రామంలో చాలా తక్కువగా వసతి సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి ముందుగానే అన్ని బుక్ చేసుకోవడం మంచిది. అలాగే ఈ ఆలయానికి వెళ్లాలంటే హైకింగ్ బూట్లు, వెచ్చని దుస్తులు తీసుకెళ్లాలి. -MegaMindsIndia