అమెరికా సుంకాల యుద్ధంలో భారత సార్వభౌమాధికారానికి నూతన పరీక్ష
మన దేశం ఒకప్పుడు వలస పాలన కింద మ్రగ్గింది, ఇతరులకు లోబడింది. కానీ నేటి భారత్ చరిత్రను పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతుంది, జాగృతమయ్యింది. నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తి, వేగంగా ఎదిగిన మహా ఆర్థిక వ్యవస్థ. కోట్లాది మంది ప్రజల శ్రమ, ప్రతిభ, కృషితో ముందుకు సాగుతున్న అజేయ శక్తి భారత్.
భారత్ పై రష్యా చమురు కొనుగోలు విషయంలో అమెరికా ఆంక్షలు, ట్రంప్ బెదిరింపులు మనకందరికీ తెలుసు. అలాగే భారత ప్రధాని మోడీ గారికి ట్రంప్ కాల్ చేసిన పట్టించుకోవట్లేదు, జర్మన్ పత్రిక కూడా ఇటీవల వ్యాసం కూడా ప్రచురించింది. దీనిని బట్టి భారత పౌరులుగా మనం ఒకటి స్పష్టంగా అర్ధం చేసుకోవాలి. నేడు మన దేశం ఎవరికీ భయపడడు అనేది అర్ధమవుతుంది. అమెరికా లాంటి మహా శక్తికి కూడా..
రష్యా ఇంధనం కొనుగోలుపై అమెరికా కుటిలత్వం:
భారత్ రష్యాతో ఇంధన భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం. సఖాలిన్-1, ఆర్కిటిక్ LNG-2 వంటి ప్రాజెక్టులు కేవలం వాణిజ్యం కాదు, ఒక వ్యూహాత్మక జాతీయ భద్రతా అవసరం. రష్యాతో మన పెట్టుబడులు, ఉత్తర సముద్ర మార్గంలో మన భాగస్వామ్యం ఇవన్నీ మనకు వినియోగదారు స్థాయి నుండి భాగస్వామి స్థాయికి తీసుకెళ్లాయి.
కానీ అమెరికా సుంకాలు విధించి భయపెట్టాలని చూసింది, రష్యాతో భారత్ వాణిజ్యం చేయకూడదని సుంకాల రూపంలో ఒత్తిడి తెచ్చింది. మరోవైపు తన స్వంత కంపెనీలు రష్యాలో తిరిగి ప్రవేశించేందుకు రహస్య చర్చలు జరుపుతుంది. ఇది అమెరికా ద్వంద్వ ప్రమాణాలని తెలియజేస్తుంది. 2025 ఆగస్టు 27న భారతీయ వస్తువులపై 50% సుంకం వాణిజ్య అసమతుల్యత కోసం కాదు. ఇది భారతదేశం రష్యాతో నిలబడితే శిక్షిస్తాం అనే బహిరంగ హెచ్చరిక. భారతదేశం ఎప్పుడూ ఒత్తిడికి తలొగ్గదు. సార్వభౌమాధికారం చర్చలకే కాదు, అలాగని రాజీపడటానికి కూడా కాదు. ఇది మాటల్లోనే కాదు, చర్యల్లోనూ నిరూపితమైంది.
అమెరికా తన గేమ్ ని సుంకాలతో మొదలుపెట్టి ఇప్పటికే అనేక పావులు కదిపింది, కానీ మనం (భారత్) ఇంకా ఆట మొదలుపెట్టనే లేదు. మనకు అనేక పావులున్నాయి. మచ్చుక్కి ఓ మూడు వ్యూహాలు మన ముందున్నవి..
వ్యూహం -1: అమెరికా సుంకాల దాడికి భారతదేశం ఇచ్చిన ప్రతిస్పందన చారిత్రాత్మకమైంది. అమెరికాకు సరైన సమాధానం మిషన్ 40, ఈ ప్రణాళిక వెనుక ఉన్న మూల సూత్రం ఒక తలుపు మూస్తే నలభై కొత్త తలుపులు తెరుస్తాం. అమెరికాపై మన ఎగుమతుల ఆధారాన్ని తగ్గించడం. 40 కీలక దేశాలలో భారత ఎగుమతులను విస్తరించడం. వస్త్రాలు, ఫార్మా, ఐటీ, ఎలక్ట్రానిక్స్… ప్రతి రంగంలో కొత్త అవకాశాలను వెతకడం.
వస్త్ర రంగం ఉదాహరణగా తీసుకుంటే 40 దేశాలు $600 బిలియన్ల విలువైన వస్త్రాలను దిగుమతి చేసుకుంటాయి. కానీ భారతదేశం వాటా కేవలం 5–6% మాత్రమే. ఇది మనకు అద్భుతమైన అవకాశం. సూరత్, తిరుప్పూర్, పానిపట్ లాంటి క్లస్టర్‌లలో తయారైన వస్త్రాలు ప్రపంచానికి చేరడానికి ఇదే సమయం.
అమెరికా ఇప్పటివరకు వేసిన ప్రతి అడుగు విఫలమైంది. మిగిలింది ఒకటే పావు అదే ఆర్థిక ఆంక్షలు. కానీ అది కూడా అమెరికాకు చేదు మాత్రే అవుతుంది.
వ్యూహం -2: భారతీయ ఐటీ సేవలకు ప్రత్యామ్నాయం లేదు. భారతీయ జనరిక్ మందులు లేకపోతే అమెరికా మధ్యతరగతి ఆరోగ్యం క్షీణిస్తుంది. భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ లేకుంటే గ్లోబల్ సప్లై చైన్ కుప్పకూలుతుంది. అంటే అమెరికా బెదిరింపులు మళ్ళీ ఖాళీ గ్లాసే. భారత్ చేతిలో ఇంకా ఎన్నో వ్యూహాలు ఉన్నవి. భారత్ ఇప్పటివరకు తన బలాన్ని పూర్తిగా ఉపయోగించలేదు. డిజిటల్ పన్నులు, డేటా స్థానికీకరణ చట్టాలతో అమెరికన్ టెక్ కంపెనీలపై ఒత్తిడి తెచ్చే శక్తి మనకు ఉంది. రక్షణ, ఇంధన రంగాల్లో భాగస్వామ్యాలను మరింత వైవిధ్యీకరించే వీలు ఉంది.
వ్యూహం -3: రష్యా, చైనాతో వ్యూహాత్మక పొత్తులు బలోపేతం చేస్తే అమెరికా ఒంటరిగా మిగిలిపోతుంది. అంతర్జాతీయ ప్రతిస్పందన, ప్రపంచం భారత్ వైపు. మన దేశం వెనక్కి తగ్గకపోవడాన్ని ప్రపంచం గమనిస్తోంది. జపాన్ ఇప్పటికే $70 బిలియన్ పెట్టుబడి ప్రకటించింది. ఆస్ట్రేలియా, UAE, యూరప్ దేశాలు భారత్‌ను విశ్వసనీయ భాగస్వామిగా గుర్తిస్తున్నాయి. QUADలో కూడా, భారత్‌పై అతిగా ఒత్తిడి చేయవద్దని మిత్రదేశాలు అమెరికాకు హెచ్చరిస్తున్నాయి. మోడీ పర్యటనలు ఒకవైపు చైనా, రష్యాతో గ్లోబల్ సౌత్ కి సంఘీభావం, మరోవైపు జపాన్, యూరప్‌తో ప్రజాస్వామ్య పెట్టుబడి భాగస్వామ్యం ఇవన్నీ ప్రపంచానికి స్పష్టమైన సంకేతం ఇస్తున్నాయి. భారతదేశం ఎవరినీ అనుకరించదు, వెంబడించదు. ప్రపంచమే భారత్‌కు దగ్గరగా ఉండాలని కోరుకుంటుంది.
ఈ ట్రారిఫ్ ల (సుంకాల) యుద్ధం కేవలం వాణిజ్యం గురించి కాదు. ఇది మన దేశ గౌరవం, సార్వభౌమాధికారం, భవిష్యత్ గురించి. భారతదేశాన్ని ఎవ్వరూ బెదిరించలేరు. ఇది ఆత్మనిర్భర్ భారత్, స్వావలంబీ భారత్, స్వయం సమృద్ధ భారత్. -రాజశేఖర్ నన్నపనేని, MegaMinds


