ఒకప్పుడు భారత్ తన ఆదేశాలకు వశమైపోతుందని ధీమాగా భావించిన అమెరికా, ఇప్పుడు పూర్తిగా భిన్న దృశ్యాన్ని చూస్తోంది. అమెరికా ఒత్తిళ్లను పక్కనబెట్టి, భారతదేశం తన స్వతంత్ర మార్గాన్ని ఎంచుకుంది. అమెరికా అహంకారానికి ఇది గట్టి దెబ్బ. ఫలితంగా, అక్కడి నాయకులు, దౌత్యవేత్తలు, వాణిజ్య సలహాదారులు ఒక్కొక్కరు సమయం దొరికినప్పుడల్లా ఆగ్రహపూరిత వ్యాఖ్యలు చేస్తూ తమ అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. ముఖ్యంగా సెనేటర్ లిండ్సే గ్రాహం అదుపుతప్పిన మాటలు దీనికి ఉదాహరణ. రష్యా చమురు కొనుగోలు వల్ల భారత్ ఇప్పటికే "మూల్యం చెల్లిస్తోంది" అని ఆయన చేసిన మాటల దాడి ఒకరకంగా వాస్తవం కంటే నిరాశను తెలుపుతున్నాయి.
భారత్ నిజంగా ఎంత మూల్యం చెల్లిస్తోంది? అమెరికా 50% టారిఫ్ ను విధించినప్పటికీ, మన ఆర్థిక వ్యవస్థకు పెద్దగా దెబ్బ తగల్లేదు. ప్రతిగా, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎగుమతి ప్రోత్సాహక పథకాలు తీసుకొచ్చింది. వాణిజ్యంలో వైవిధ్యం తీసుకొచ్చి, అమెరికాపై ఆధారాన్ని తగ్గించింది. ఫలితంగా, భారత్ మరింత బలంగా ఎదిగే అవకాశాలు వెతుకుతుంది.
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వరుసగా రష్యా అధికారులతో సమావేశమయ్యారు. మోడీ పుతిన్ నేరుగా సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. సెప్టెంబర్‌లో రష్యా చమురు దిగుమతులను మరో 10–20% పెంచాలని భారత్ యోచిస్తున్నట్టు వెల్లడయ్యింది. ఇలాంటి పరిస్థితిలో భారత్‌ను “మూల్యం చెల్లిస్తున్న దేశం”గా చూపించడం వాస్తవానికి విరుద్ధం.
అయినా అమెరికా ఇంకా తన సహజ స్వభావాన్ని విడిచిపెట్టలేదు. లిండ్సే గ్రాహం భారత్ ఉక్రెయిన్ రుల మరణాలకు కారణమంటూ దుష్ప్రచారం చేశారు. ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ యూరోపియన్ యూనియన్‌ను ఒత్తిడి చేసి, భారత్‌పై మరొకసారి ఆంక్షలు విధించాలని కోరారు. వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో అత్యంత హీనంగా మాట్లాడుతూ, ప్రధాని మోడీని “అహంకారి” అని, ఉక్రెయిన్ యుద్ధాన్ని “మోడీ యుద్ధం”గా అభివర్ణించారు. ఇవన్నీ తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేవిగా తేటతెల్లమవుతున్నాయి. ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ అన్నట్లుగా " అమెరికా ప్రపంచంలో అగ్రదేశంగా ఉండాలనుకొని చివరకు తన కన్ను తానే పొడుచుకుంటుంది ".
ఇక భారత్ తన పనిని నిశ్శబ్దంగా, ధైర్యంగా, దృఢమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతుంది. భారత్ స్పష్టంగా చెప్పింది 50% టారిఫ్ ల సమస్య పరిష్కారం కాకుండా అమెరికాతో ఎటువంటి వాణిజ్య ఒప్పందం జరగదు. అమెరికా ఎంత గట్టిగా అరిచి గీపెట్టినా, మాట్లాడినా దానిని భారత్ గడ్డి పరకలానే భావిస్తుంది. పైగా, ఈ ఒత్తిళ్లు భారత్, రష్యా, చైనాల బంధాన్ని మరింత బలపరుస్తున్నాయి. అంతేకాదు, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రహస్య లేఖ రాసి, బీజింగ్ న్యూఢిల్లీ సంబంధాలను పునరుద్ధరించాలన్న ఆసక్తి చూపడం అమెరికాకు మరింత ఆందోళన కలిగిస్తోంది.
అమెరికా టారిఫ్ యుద్ధం మరో దిశలోనూ ప్రభావం చూపింది. ట్రంప్ మొదట సుంకాలను పెంచినప్పుడు, రష్యా భారత్ చైనాలు దగ్గరయ్యాయి. ఇప్పుడు ఆశ్చర్యకరంగా, మరో కొత్త త్రయం ముందుకు వస్తోంది. భారత్ జపాన్ ఆస్ట్రేలియా. ఇండో పసిఫిక్‌లో చైనాకు ధీటుగా అమెరికా ఆధ్వర్యంలో ఏర్పడిన క్వాడ్‌లో ఇవే మూడు ఇప్పుడు అమెరికా పై ఆధారాన్ని తగ్గించుకుంటూ, పరస్పర సహకారం పెంచుకుంటున్నాయి.
ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్ ఫారెల్ ఇటీవల ట్రంప్ సుంక విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. భారత ఆర్థిక వ్యవస్థ “చనిపోయింది” అన్న ట్రంప్ వ్యాఖ్యలను తోసిపుచ్చి, భారత్ లో పెట్టుబడులు పెంచుతామని స్పష్టం చేశారు. అరుదైన ఖనిజ సరఫరా విషయంలో భారత్‌తో సహకరించాలన్న ఉద్దేశం ప్రకటించారు. ఇదే సమయంలో జపాన్ కూడా స్పష్టమైన సందేశం ఇచ్చింది. ప్రధాని మోడీ టోక్యో పర్యటనలో ద్వైపాక్షిక పెట్టుబడులు, సహకారం, ఇండో పసిఫిక్ స్థిరత్వం చర్చలో ప్రాధాన్యం పొందాయి.
జపాన్ తన పెట్టుబడి లక్ష్యాన్ని $68 బిలియన్లకు రెట్టింపు చేస్తూ, అమెరికా పర్యటనను రద్దు చేయడం ఒక కీలక పరిణామం. దీనితో పాటు, అమెరికా పోస్టల్ సేవలను భారత్ నిలిపివేసిన సందర్భంలో జపాన్, ఆస్ట్రేలియా భారత్‌కు మద్దతు ఇచ్చాయి. ఈ పరిణామాలు మూడు దేశాల మధ్య పెరుగుతున్న ఐక్యతను సూచిస్తున్నాయి.
ఇలాంటి చర్యలతో క్వాడ్ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. చైనాను ఎదుర్కోవడానికి 2017లో ప్రారంభమైన ఈ వేదిక ఒకప్పుడు బలమైన అమెరికా మద్దతు పొందింది. కానీ ట్రంప్ ఊగిసలాట విధానాలు, మిత్రదేశాలపై సుంకాలు, లావాదేవీ దౌత్యం ఇవన్నీ నమ్మకాన్ని దెబ్బతీశాయి. మోడీ జపాన్ పర్యటనలో అనేక వాణిజ్య అంశాలపై, ప్రజాస్వామ్య విలువలపై చర్చలు జరిగాయి. కానీ క్వాడ్ గురించి ఒక్క మాట రాకపోవడం, ఆ వేదిక వీగిపోయిందనడానికి సంకేతం. "సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్" క్వాడ్ ఒక ప్రతీకాత్మక వేదికగా మిగిలిపోవచ్చు అంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. వాస్తవికంగా చూస్తే అమెరికా నిర్బంధ విధానాలు తమ మిత్ర దేశాలను దూరం చేసుకుంటుంది అలాగే కొత్త శత్రువుతో పాత మిత్రులు కలిసి ప్రయాణం చేస్తున్నారు.
భారత్ ఒత్తిడికి లొంగే దేశం కాదు. తన స్వతంత్రతను కాపాడుకుంటూ, ఆర్థిక వ్యూహాత్మక భాగస్వామ్యాలను విస్తరించుకుంటోంది. రష్యాతో చమురు ఒప్పందాలు, జపాన్ ఆస్ట్రేలియాలతో పెట్టుబడి సహకారం, చైనాతో సంబంధాల పునరుద్ధరణ ఇవన్నీ భారత్ స్థానం ఎంత మెరుగుపడుతుందో తెలియజేస్తున్నాయి.
29-08-2025 శుక్రవారం నాడు 2025-2026 మొదటి త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు 7.8%గా నిర్ధారించబడింది, దీంతో ట్రంప్ డెడ్ ఎకానమీ అంటూ చేసిన వ్యాఖ్యల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా నవ్వుల పాలయ్యాడు అలాగే మొత్తానికి సెనేటర్ లిండ్సే గ్రాహం చెప్పినట్టుగా భారత్ “మూల్యం చెల్లించడం” లేదు. అమెరికా ఆధిపత్యం, అహంకారాన్ని, తొక్కిపెట్టి అజేయ శక్తిగా ఎదిగే దిశలో భారత్ అడుగులు వేస్తోంది.
రష్యా అధ్యక్షుడు, భారత్ చిరకాల మిత్రుడు పుతిన్ భారత్ కు డిసెంబర్ లో వపర్యటన ఖరారైంది. అలాగే ట్రంప్ భారత్ డెడ్ ఎకానమీ అన్నదాన్ని సోషల్ మీడియా లో నెగటివ్ గా "ట్రంప్ డెడ్" అంటూ ట్రెండింగ్ అవుతుంది. అది పాకిస్తాన్ నుండి జరుగుతున్న కుట్ర, కాబట్టి గతం లో బాయికాట్ చైనా, బాయికాట్ మాల్దీవ్స్ లాగా ఇప్పుడు బాయికాట్ అమెరికా అనాల్సిన పనిలేదు. స్వదేశీ వస్తువులు వాడితే సరిపోతుంది. దేశభక్తులు ఒకటి గమనించాలి, ఈ యుద్ధాల కాలం లో ఎంతో మెలుకువ తో సోషల్ మీడియాలో స్పందించాలి. -రాజశేఖర్ నన్నపనేని, MegaMinds.