భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. FY26 తొలి త్రైమాసికంలో 7.8% GDP వృద్ధి సాధిస్తూ, భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక శక్తిగా అవతరించింది. GDP కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు ఇది భారత ఆర్థిక శక్తికి ప్రతీక.
తయారీ రంగం పునరుజ్జీవనం: తయారీ రంగం PMI 17.5 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. ఉక్కు ఉత్పత్తి 8.5% పెరిగింది. ఇది "మేక్ ఇన్ ఇండియా", "ఆత్మనిర్భర్ భారత్" విధానాలు విజయవంతం కావడానికి ముఖ్య కారణం. ఉత్పత్తి పెరిగితే ఎగుమతులు పెరుగుతాయి. అప్పుడు విదేశీ ధనం వచ్చి మూలధనం లో చేరుతుంది.
యువతకు ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలు: దేశంలో కొత్తగా 22 లక్షల ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి. అందులో 60% ఉద్యోగాలు 18–25 ఏళ్ల యువతకు దక్కాయి. భారత యువత ఆర్థిక భవిష్యత్తు పటిష్టమవుతోందని సూచిస్తోంది. కొత్త ఉద్యోగాలు వినియోగం, ఖర్చు, పెట్టుబడులను కూడా పెంచుతున్నాయి.
సేవల రంగంలో ముందడుగు: భారత సేవల రంగం ఎప్పటిలాగే ముందంజలో ఉంది. PMI 11 నెలల గరిష్టానికి చేరింది. విమాన కార్గో రవాణా 13.9% పెరుగుదల నమోదు చేసింది. IT, ఫైనాన్స్, ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రంగాల విస్తృత ప్రగతికి సంకేతం. సేవల రంగం వృద్ధి నేరుగా డాలర్ ఆదాయాన్ని పెంచుతోంది.
విస్తృతంగా పెట్టుబడుల ప్రవాహం: భారత్ ఇప్పుడు పెట్టుబడిదారుల "హాట్ డెస్టినేషన్" మారింది. 81 బిలియన్ డాలర్ల FDI ల ప్రవాహం వెల్లువెత్తాయి, ఇది గత సంవత్సరం కంటే 13.7% ఎక్కువ. ప్రైవేట్ పెట్టుబడులు కూడా 66.3% వృద్ధి సాధించాయి. ఏప్రిల్ నుంచి జులై 2025 వరకు వ్యాపార విశ్వాసం చరిత్రలోనే అత్యున్నత స్థాయికి చేరింది.
మౌలిక వసతుల విప్లవం: భారతదేశం "ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బూమ్" ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. సిమెంట్ ఉత్పత్తి 8.9% పెరిగింది. ఉక్కు వినియోగం 7.5% పెరిగింది. జాతీయ రహదారులు, రైల్వేలు, మెట్రో ప్రాజెక్టులు, పోర్టులు, విమానాశ్రయాలు దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి దేశీయ వాణిజ్యాన్ని మాత్రమే కాకుండా, అంతర్జాతీయ రవాణా మార్గాల ద్వారా అనుసందానాన్ని కూడా పెంచుతున్నాయి.
గ్రామీణ-నగరాల సమతుల్యం: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కేవలం నగరాలకే పరిమితం కాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, నీటి ప్రాజెక్టులు, విద్యుత్ లైన్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతూ, నగరాలతో సమతుల్యం సాధిస్తోంది. ఈ సమగ్ర వృద్ధి భవిష్యత్తులో గ్రామీణ–నగర విభజనను తగ్గిస్తుంది.
ప్రగతిశీలంగా ఎగుమతులు: తయారీ, సేవలు, మౌలిక వసతులు. ఈ మూడు రంగాల వృద్ధి ఎగుమతులను కూడా పెంచుతోంది. ఉక్కు, ఆటోమొబైల్, ఫార్మా, IT సేవల ఎగుమతులు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. దీని వలన భారత విదేశీ మారక నిల్వలు మరింత పెరిగి పటిష్టమవుతున్నాయి.
వినియోగం మరియు మధ్యతరగతి శక్తి: ఉపాధి పెరిగితే ఖర్చు పెరుగుతుంది. మధ్యతరగతి వినియోగం పెరుగుతుండటంతో రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, FMCG, ఈ-కామర్స్ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.ఈ "డొమెస్టిక్ డిమాండ్" భారత్ వృద్ధికి అతి పెద్ద విజయం.


