హైదరాబాద్ సంస్థాన విమోచనం - Indian Army entering Hyderabad during Operation Polo in 1948
భారతదేశ చరిత్రలో హైదరాబాద్ సంస్థాన విమోచన ఒక మరిచిపోలేని అపూర్వ ఘట్టం. దేశమంతా ఆగష్టు 15 స్వాతంత్య్రం వచ్చిందని ఆనందంగా సంబరాలు జరుపు కుంటుంటే హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటూ భయంతో గడిపారు.
బ్రిటీష్ వారు స్వాతంత్య్రం ఇచ్చి దేశంలోని వివిధ సంస్థానాలను భారత్ లేదా పాకిస్తాన్లో కలవవచ్చు లేదా స్వతంత్రంగా ఉండవచ్చు అని చెప్పారు. అన్ని సంస్థానాలు విలీనమయ్యాయి. కశ్మీర్, జునాగడ్, హైదరాబాద్ మాత్రం మిగిలాయి.
హైదరాబాద్లో ఖాసీంరజ్వీ రజాకార్ సేనను ఏర్పరచి మొత్తం సంస్థానాన్ని తన చేతుల్లోకి తీసుకొని రాక్షస పాలన ప్రారంభించాడు. హైదరాబాద్ రాజైన నిజాం ఇచ్చిన మద్దతుతో రజాకారులు హిందువులను హింసించారు.
హిందూ పండుగలు జరుపుకోవడానికి వీలులేదు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో తెలుగు ఉండదు. ఎవరైనా ఉర్దూ చదవాల్సిందే. పైజామా, రూమీ టోపి పెట్టుకొని 'ఆదాబ్' అనాల్సిందే. ఉస్మానియా కూడా ఉర్దూమయమే. ప్రభుత్వ ఆధ్వర్యంలో విచ్చలవిడిగా మతమార్పిడులు జరిగాయి. సంస్థానం లోని వివిధ జిల్లాల్లో రజాకార్ల రాక్షసకాండ కొనసాగింది.
వరంగల్ జిల్లా బైరాన్ పల్లి గ్రామంలో రజాకార్లు గ్రామాన్ని లూటిచేసి ధాన్యాన్ని దోచుకొని మహిళలచే నగ్నంగా బతుకమ్మ ఆడించారు. అవమానాన్ని తట్టుకోలేని అ మహిళలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
రజాకార్ వ్యతిరేక వార్తలు రాసిన 'ఉమ్రోజ్' పత్రికా సంపాదకుడు షోయబుల్లాఖాన్ ను కాచిగూడాలో కాల్చిచంపారు. నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లిలో పశువుల కాపర్లు మొగలయ్య, పోచయ్యను ఆకారణంగా చంపేశారు.
1938లో నిజామాబాద్లో రాధాకృష్ణ అనే ఆర్యసమాజ్ కార్యకర్తను పట్టపగలే నరికివేసారు. అప్పటి నుండి ఆ ప్రాంతాన్ని రాధాకృష్ణ చౌక్ అంటున్నారు.
ఆర్యసమాజ్ ప్రజల నొక్కటి చేసింది. పండిత నరేంద్రదేవ్ నాయకత్వంలో వేలాది హిందువులు తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చారు.
ఆర్యసమాజ్ స్ఫూర్తితో సంస్థానంలోని పలుచోట్ల యువకులను ఒకటి చేయడానికి వ్యాయామశాలలు, విద్యాసంస్థలు(వివేకవర్ధిని, కేశవ స్మారక విద్యా మందిరాలు) ప్రారంభం అయ్యాయి. ప్రజలంతా ఆదాబ్ బదులు వందేమాతరం, జై భారత్ అన్నారు.
పునరాగమనం, శుద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. రాక్షసకాండకు వ్యతిరేకంగా లక్షల మంది తో వినాయకరావు విద్యాలంకార్ నాయకత్వంలో సత్యాగ్రహాలు జరిగాయి.
పండిత నరేంద్రదేవ్ ప్రేరణతో నారాయణరావు పవార్, ప్రేంరాజ్యదవ్, సుఖదేవ్ ఆర్య నిజాంను చంపడానికి కింగ్ కోఠి వద్ద బాంబు దాడి జరిపారు. దాడి విఫలమై జైలుకెళ్ళారు.
సత్యాగ్రహంలో పోలీసులు కొడుతుంటే వందేమాతరంతో ఎదుర్కొన్నందుకు రామచంద్ర రావు అనే వ్యక్తి పేరు వందేమాతరం రామచంద్రరావు అయింది. ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో ఉద్యమం కెరటంలా లేచింది. ఈ ఉద్యమానికి కవులు, గాయకులు తోడయ్యారు.
ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెందును
తీగెలను తెంపి అగ్నిలో దింపినారు.
నా తెలంగాణా కోటి రతనాల వీణ!" అని దాశరథి రాశాడు.
పరిస్థితులు గమనించిన భారత ప్రభుత్వం నిజాంను విలీనం కమ్మని, లొంగిపొమ్మని హెచ్చరించింది. ఉక్కుమనిషి సర్దార్ రాజకీయ సంకల్పంతో "ఆపరేషన్ పోలో" అని భారత సైన్యం ప్రత్యక్ష చర్యకు దిగింది. నాలుగు దిక్కుల నుండి వచ్చిన సైన్యం దాటికి నిజాం సైన్యం రజాకార్ రాక్షస మూకలు గంటల్లోనే తోకముడిచాయి.
నిజాం దక్కన్ రేడియోలో లొంగిపోతున్నట్టు ప్రకటించి, విమానాశ్రయంలో పటేలు వంగి సలాం చేసి సంస్థానాన్ని విలీనం చేస్తున్నట్టు ప్రకటించాడు. సంస్థానంలో స్వాతంత్య్ర గాలులు వీచాయి. 1948 సెప్టెంబర్ 17న ప్రజలు దీపావళి జరుపుకున్నారు.
కొసమెరుపు: ఈ సమయంలో సాయుధ పోరాటాన్ని జరిపిన కమ్యూనిష్టులు రష్యా వెళ్ళి స్టాలిన్ ను కలిసి రష్యా సైన్యంతో హైదరాబాద్ను ఆక్రమించి కమ్యూనిష్టు రాజ్యంగా ఏర్పరచమని కోరడం వారి దేశద్రోహానికి ఒక ఉదాహరణ.