పూర్వం మనదేశంలో అన్ని పల్లెల్లో పుట్టిన ప్రతి బిడ్డకు పురిట్లోనే వస కొమ్మును చనుబాలతో అరగదీసి పట్టేవారు. ఇప్పటికీ చాలా పల్లె ప్రాంతాలలో కొనసాగుతునేయున్నది. వసకొమ్ములు మీ దగ్గరలో ఉన్న పచారీకొట్లో అయినా లేదా ఆయుర్వేదిక్ సెంటర్ లో లభిస్తుంది. దీన్ని మెత్తగా నూరి ఎండబెడితే పౌడర్ మారుతుంది. దీన్ని ఒక సీసాలో భద్రపరచుకోండి..
పిల్లల్లో మంచి జ్ఞాపకశక్తి, చక్కని కంఠస్వరంకోసం:- వసకొమ్ములను పాలలోవేసి మరిగించి కనీసం ఒక నెలపాటు తీసుకుంటే మంచి జ్ఞాపకశక్తి, కోకిల లాంటి కంఠస్వరం, మంచి శరీర కాంతి సిద్ధిస్తాయి. సూక్ష్మజీవులు దాడి చేయకుండా ఉంటాయి. వస కొమ్ములను ఆవునెయ్యికి కలిపి ఘృతపాక విధానంలో నెయ్యిని తయారుచేసి కూడా వాడుకోవచ్చు.
ఎసిడిటీ (ఆమ్లపిత్తం) :-
వస చూర్ణాన్ని తేనె, బెల్లంతో కలిపి తీసుకుంటే ఆమ్లపిత్తంలో హితకరంగా ఉంటుంది.ఎసిడిటి తగ్గుతుంది.
చర్మవ్యాధులు :-
వసకొమ్ములు, చెంగల్వకోష్టు వేరు, విడంగాలను మెత్తగా నూరి, నీళ్లు కలిపి ముద్దచేసి బాహ్యంగా ప్రయోగిస్తే చర్మవ్యాధుల్లో హితకరంగా ఉంటుంది.
శరీరపు వాపు :-
వసకొమ్ముల పొడిని ఆవనూనెతో కలిపి బాహ్యంగా ప్రయోగిస్తే శరీరపు వాపు తగ్గుతుంది.
జుట్టు ఊడటం :-
వసకొమ్ము, దేవదారు వేరు పట్ట లేదా గురవింద గింజలను ముద్దగా నూరి జుట్టు ఊడినచోట లేపనం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. దీనికి ముందు సిరావ్యధనం ద్వారా రక్తమోక్షణం చేయాల్సి ఉంటుంది.
తలనొప్పి (అర్ధశిరోవేదన):-
పచ్చి వస కొమ్మును దంచి, రసం పిండి పిప్పళ్లు పొడిని గాని ఇప్ప పువ్వుల రసాన్ని గాని కలిపి తేనె కూడా చేర్చి ముక్కులో నస్యం రూపంలో బిందువులుగా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ముఖ్యంగా సూర్యావర్తం, అర్ధావభేదం వంటి తలనొప్పుల్లో ఇది అమితమైన ఫలితాన్ని చూపిస్తుంది.
గాయాలు :-
వస కొమ్ము వేసి కాచిన నీళ్లతో వ్రణాన్ని కడిగి శుభ్రంచేస్తే త్వరితగతిన మానుతుంది.
పసిపిల్లల్లో కళ్లు అతుక్కుపోవటం :-
వసకొమ్ము పొడిని తేనెతో కలిపి గాని లేదా మదనఫలాన్ని ఇప్ప పువ్వులతో కలిపి ముద్దగా నూరి గాని పిల్లలకు నాకించి వాంతిని కలిగిస్తే కళ్లు పుసులుకట్టి అతుక్కుపోవటం తగ్గుతుంది.
వసకొమ్ములను వేసి ఘృతపాక విధానంలో నెయ్యిని తయారుచేసి, వందసార్లు ఆవర్తం చేసి దీర్ఘకాలంపాటు వాడితే శరీరం వజ్ర సమానంగా తయారవుతుంది. వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.
కడుపునొప్పి :-
వస కొమ్ములు, సౌవర్చల లవణం, ఇంగువ, చెంగల్వకోష్టు వేరు, అతి విష వేరు, కరక్కాయలు, కొడిశపాల గింజలు వీటిని కలిపి తీసుకుంటే కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది.
అర్శమొలలు :-
వసకొమ్ములను, సోంపు గింజలను కలిపి నూరి ముద్దగాచేసి అర్శమొలల మీద ప్రయోగించాలి. దీనికి ముందు నువ్వుల నూనెను వేడిచేసి బాహ్యంగా ప్రయోగిస్తే ఉపశమనంగా ఉంటుంది.