కన్వర్ యాత్ర అంటే ఏమిటి - కన్వర్ యాత్ర విశిష్టత - కన్వర్ యాత్ర నియమాలు - Kanwar Yatra 2025: Sacred Ganga Water Pilgrimage & Latest Updates

megaminds
0
కన్వర్ యాత్ర అంటే ఏమిటి


కన్వర్ యాత్ర అంటే ఏమిటి (kanwar yatra 2025) - కన్వర్ యాత్ర విశిష్టత - కన్వర్ యాత్ర నియమాలు

హిందూ సంప్రదాయంలో తీర్థయాత్రలకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా దైవదర్శనం కోసం ఎన్నో కష్టనష్టాలు భరించి క్షణకాలం దైవ దర్శనంతో ముక్తి పొందే అద్భుత సంప్రదాయం మన సొంతం. అలాంటి యాత్ర ఒకటి ఉత్తర భారతంలో పరమ శివుని భక్తులు శ్రావణ మాసంలో చేస్తారు. 'శివో అభిషేకః ప్రియః' అంటారు, చెంబుడు గంగా జలంతో శివుడిని అభిషేకిస్తే సంతోషిస్తాడని అంటారు. శివయ్య అనుగ్రహం కోసం వందల మైళ్ళు కాలినడకన నడిచి కావిళ్లతో గంగాజలాన్ని మోసుకెళ్లి శివుడిని అభిషేకించి మొక్కులు తీర్చుకుంటారు, ఇలా కుండలలో నీళ్లు తీసుకెళ్లడాన్ని కన్వర్ యాత్ర అంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున శివాలయాల్లో శివలింగానికి ఈ జలాభిషేకం చేస్తారు. శివ పురాణం లో, లింగ పురాణం లో కూడా కన్వర్ యాత్ర ప్రస్తావన ఉంది. ఈ యాత్ర సముద్ర మంథనం సమయంలో శివుడు ప్రపంచాన్ని రక్షించడానికి విషం సేవించిన తర్వాత తన బాధను తగ్గించడానికి దేవతలు పవిత్ర గంగా జలాన్ని కురిపించారు.

హిందూ సంప్రదాయం లో శ్రావణ మాసానికి విశిష్టత ఉంది. ఈ మాసంలో దక్షిణాదిన వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం వంటి వ్రతాలను జరుపుకుంటే ఉత్తరాదిన మాత్రం శ్రావణమాసంలో శివుని విశేషంగా ఆరాధిస్తారు. చాంద్రమానం ప్రకారం మాసాలను లెక్కించే ఉత్తరభారతంలో ప్రతి నెల పౌర్ణమి నుంచి కొత్త మాసం మొదలవుతుంది. శివుని ఆరాధనకు విశేషమైన శ్రావణ మాసంలో ప్రతి సోమవారం శివునికి ప్రత్యేకమైనది!. గంగానది నుంచి కావిళ్ళతో నీటిని తీసుకొచ్చి తమ ప్రాంతాలలో ఉన్న శివలింగానికి జలాభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు.

కన్వర్ యాత్ర జరిగే నెల రోజుల పాటు గంగా తీరంలో ఉన్న ఊర్లన్నీ కోలాహలంగా ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచి భక్తులు కాలి నడకన కాశీ, హరిద్వార్, రిషికేష్ వచ్చి కావిళ్ళతో గంగాజలాన్ని తీసుకెళ్లి తమ ప్రాంతాల్లోని శివాలయాల్లో శివున్ని అభిషేకిస్తారు.

ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం ఈ కన్వర్ యాత్రను పరశురాముడు మొదట ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. పరశురాముడు ఉత్తరాఖండ్​లోని ముక్తేశ్వర్ ధామ్ నుంచి కాలి నడకన కావిళ్ళతో గంగాజలాన్ని తీసుకువచ్చి ఉత్తరప్రదేశ్​లోని బాగ్‌పత్ సమీపంలో ఉన్న 'పుర మహాదేవుడి' ని అభిషేకించాడని నమ్మకం. ఈ కన్వర్ యాత్ర చేసే వారిని కన్వారీలు అంటారు.

శివుని ఆరాధనకు ప్రశస్తమైన శ్రావణ మాసంలో పరమ పవిత్రమైన హరిద్వార్ కన్వర్ యాత్రికులతో సందడిగా ఉంటుంది. ఎటు చూసినా కాషాయ రంగు వస్త్రాలు ధరించి భుజంపై గంగా జలాన్ని కావిళ్ళతో మోస్తూ శివ నామ స్మరణతో మారుమ్రోగే గంగా తీరం కన్నులారా చూడాల్సిందే కానీ మాటల్తో వర్ణించడానికి సాధ్యం కాదు.

కన్వర్ యాత్ర సమయంలో అనుసరించే ఆచారాలు: కన్వర్ యాత్ర సమయంలో, భక్తులు పవిత్ర నదులలో స్నానం చేయడం, ప్రార్థనలు చేయడం మరియు కన్వర్లలో పవిత్ర జలాన్ని తీసుకెళ్లడం వంటి కఠినమైన ఆచారాలను పాటిస్తారు. వారు చెప్పులు లేకుండా ప్రయాణిస్తారు, శ్లోకాలు జపిస్తారు మరియు హారతి చేస్తారు, శివుని దైవిక శక్తులు మరియు ఆశీర్వాదాల పట్ల వారి భక్తి మరియు భక్తిని ప్రదర్శిస్తారు.

కన్వర్ యాత్ర గురించి మీరు తప్పక తెలుసుకోవలసిన యాత్ర నియమాలు: శివపార్వతుల ఆరాధనకు విశేషమైన శ్రావణమాసంలో కన్వర్ యాత్ర చేసే వారు కొన్ని కఠినమైన నియమాలు పాటించాలి. యాత్ర సమయంలో వారు పూర్తిగా కాలినడకనే ప్రయాణించాలి. కాషాయరంగు వస్త్రాలనే ధరించాలి. కన్వర్ యాత్ర చేసే భక్తులు తప్పనిసరిగా సాత్విక ఆహారం తీసుకోవాలి. మద్య మాంసాలు తీసుకోరాదు. యాత్రికులు విశ్రాంతి తీసుకునే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కావిడిని నేలపై ఉంచకూడదు. ఇలా చేస్తే కన్వర్ యాత్ర అసంపూర్ణం అని భావిస్తారు. కావిడిని చెట్టు కొమ్మకు వేలాడిదీసి ఉంచాలి. ఒకవేళ పొరపాటున కావిడిని నేలపై ఉంచితే తిరిగి మళ్ళీ పాదచారులై హరిద్వార్​కి వెళ్లి గంగాజలాన్ని కావిళ్ళతో తీసుకు రావాల్సి ఉంటుంది. ప్రతిసారి కావిడిని స్నానం చేసిన తర్వాత మాత్రమే తాకాలి. భుజంపై గంగాజలాన్ని కావిళ్ళలో మోస్తున్నంత సేపు ఓం నమః శివాయ అంటూ పంచాక్షరీ మంత్రాన్ని నిరంతరం జపిస్తూనే ఉండాలి. అలాగే దీక్ష చేపట్టిన వ్యక్తులు తప్ప ఎవరు పడితే వారు కావిళ్ళను మోయకూడదని గుర్తుంచుకోవాలి.

ఇలా మోసుకెళ్లిన గంగా జలంని భక్తులు తమ స్వస్థలమైన ప్రసిద్ధ శివాలయంలో లేదా వారణాసిలోని కాశీ విశ్వనాథ్, ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ మరియు గుజరాత్‌లోని సోమనాథ్ వంటి ప్రసిద్ధ దేవాలయాలలో శివుడికి కన్వర్ జలాన్ని అందిస్తారు. ఈ పవిత్ర స్థలాలు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి, దైవిక ఆశీర్వాదం కోసం ఏటా లక్షలాది మంది యాత్రికులు పాల్గొంటారు. కన్వర్లు ప్రార్థనలు చేయడానికి ఇష్టపడే అత్యంత పవిత్రమైన శివాలయాలు క్రింద ఇవ్వబడినవి.
  • బాబా బైద్యనాథ్ ధామ్ - డియోఘర్, జార్ఖండ్.
  • కాశీ విశ్వనాథ్ ఆలయం - వారణాసి, ఉత్తర ప్రదేశ్.
  • నీలకాంత్ మహాదేవ్ ఆలయం - రిషికేశ్, ఉత్తరాఖండ్.
  • కేదార్‌నాథ్ ఆలయం - ఉత్తరాఖండ్.
  • శ్రీ మహాకాళేశ్వర ఆలయం - ఉజ్జయిని, మధ్యప్రదేశ్.
వీలైతే కన్వర్ యాత్రలో మనం కూడా పాల్గొందాం, ఒకసారి ఒక కావడి నీళ్లతో శివుడిని అభిషేకిద్దాం ఆధ్యాత్మిక అనుభూతులను మనమూ పొందుదాం.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.


kanvar yatra, kanwar yatra 2025, shravan yatra, kanwariya updates, kanwar yatra delhi, kanvar yatra news, hindu pilgrimage, delhi cm kanwar yatra, ganga jal yatra


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top