షాంగై సహకార సంస్థ (SCO) 2025 సమావేశం మళ్లీ ఆసియా రాజకీయాల కేంద్రంగా మారింది. ప్రధానంగా భారత్-చైనా సంబంధాలు, పరస్పర ఘర్షణలతో కూడిన గతాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ఈ సమావేశంలో జై శంకర్ దౌత్య నైపుణ్యం మరోసారి అద్భుతంగా వెలుగులోకి వచ్చింది.
భారత్ వైఖరి స్పష్టం చేసిన జై శంకర్: భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ప్రత్యేకంగా భేటీ అయ్యి భారత్ వైఖరి గురించి చాలా స్పష్టంగా ఆయనకి తెలియజెసారు. సరిహద్దు సమస్యలు లడ్డాఖ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ దృఢంగా తన అభిప్రాయాన్ని చైనా ముందు ఉంచారు. సరిహద్దుల్లో శాంతి లేకుండా, పరస్పర విశ్వాసం ఎలా ఉంటుంది?” అంటూ చైనాకు చురకలంటించారు.
ఒక్కసారిగా మారిన చైనా గళం, పహల్గాం అటాక్ ఖండన: ఒక్కసారిగా చైనా స్వరంలో మార్పు వచ్చింది. వెను వెంటనే పహల్గాంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించింది. దశాబ్దాలుగా పాకిస్తాన్ కి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న చైనా ఒక్కసారిగా ఇలా పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ప్రకటన ఇవ్వడంతో అందరూ విస్మయానికి గురైయ్యారు. ఇది జై శంకర్ దౌత్యం ప్రభావమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
భారత్-చైనా-రష్యా మైత్రి ప్రపంచానికి శాంతి సంకేతమా?: భారత్, రష్యా, చైనా కలిసి పనిచేయడమే ప్రపంచ శాంతి, వాణిజ్యాభివృద్ధికి దోహదం చేస్తుందని. మూడు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనాల్సిన అవసరం ఉందని చైనా బలంగా పేర్కొన్నది. ఈ వ్యాఖ్యలు యాదృచ్ఛికంగా కనిపించినా... దీని వెనుక వ్యూహాత్మక రాజకీయ లెక్కలు చాలా ఉన్నాయి.
వాస్తవానికి ఈ మూడు దేశాలు కలిసి పనిచేస్తే: ప్రపంచ రాజకీయాలను తిరగరాసే శక్తిగా మారగలవు. అంతర్జాతీయంగా అమెరికా మేజర్ ప్లేయర్‌గా ఉన్నా, దాని వైఖరి ఎక్కువగా అవకాశవాదమే. కొన్ని నాటో దేశాలు కూడా స్వార్థంతో నడుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత్, చైనా, రష్యా మధ్య ఒక సామూహిక శక్తి కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని విశ్లేషకుల మాట.
చైనాతో సత్సంబంధాలు - భారత్‌కు ప్రయోజనాలా?: 1940 చైనా జపాన్ యుద్ధంలో చైనాకి వైద్యుల కొరత ఏర్పడితే క్షతగాత్రుల సేవలకై అనేక మంది భారత వైద్యులు చైనా వెళ్లి సేవలు అందించారు. వారిలో ఒకరు ద్వారక నాథ్ కొట్నిస్, వారికి సేవలు అందిస్తూ అక్కడే మరణిస్తే. కొట్నిస్ జ్ఞాపకార్ధం చైనా వాళ్ళు ఆయన విగ్రహం అక్కడ నెలకొల్పారు. 1960 కి ముందు చైనాతో విభేదాలు లేవు. కమ్యూనిజం మావోయిజం రాక ముందు భారత్ తో చైనా పూర్తి సత్సంబంధాలు కలిగి ఉండేది.
ఆ తరువాత చైనాతో అనేక విభేదాలు ఉన్నా, వాణిజ్య, సైనిక, భూరాజకీయ ప్రయోజనాల దృష్ట్యా సంబంధాలను మెరుగుపరచడం భారత ప్రయోజనాలకు విరుద్ధం కాదు, ఎందుకంటే..? చైనా టెక్నాలజీ, మానుఫాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఉన్న సామర్థ్యం భారత అభివృద్ధి లక్ష్యాలకు తోడ్పడుతుంది. ఒకవేళ పరస్పర విశ్వాసం ఏర్పడితే, చైనా మద్దతుతో దక్షిణాసియా స్థిరత్వం సాధ్యం అవుతుంది. భారత్ బయట శత్రువుల ఉచ్చులో పడకుండా, సమతుల వైఖరితో ముందుకెళ్లవచ్చు. అలాగే అంతర్గత భద్రత పై గందరగోళాలు తగ్గించవచ్చు. ఆర్థిక అభివృద్ధి పథంలో నిర్భయంగా అడుగులు వేయవచ్చు.
భారత వ్యూహాత్మక ధోరణిలో మార్పు అవసరమా?: భారతదేశం ఇప్పటికే మల్టీ అల్లైమెంట్ పాలసీ అమలు చేస్తోంది. అంటే, ఏ ఒక్క దేశంతో కాకుండా, అన్ని ప్రధాన దేశాలతో సంబంధాలు మెరుగుపరచడం. అటువంటి దిశగా చైనాతో 'సంవాదం' పెంచడం అత్యవసరం. శాంతియుత సంబంధాలే ప్రగతికి మెట్టు. భారత్ ఇప్పుడిప్పుడే ఆర్థిక శక్తిగా కాక, దౌత్య పరంగానూ ప్రధాన పాత్రధారిగా ఎదుగుతోంది. జై శంకర్ జాతీయ ప్రయోజనాల్ని గట్టిగా సమర్థించడమే కాదు, ఇతర దేశాల వైఖరిని కూడా మెల్లగా మారుస్తూ ఉన్నారు.
ఒకప్పుడు ఇలాంటి అంతర్జాతీయ వేదిక సమావేశాలు ఉట్టి మాటల వేదికలుగా మిగిలిపోయేవి. కానీ జై శంకర్ వంటి నేత ఉన్నప్పుడు మాత్రం, వాటి ద్వారా దేశం గౌరవాన్ని నిలబెట్టుకుంటుంది. ఈసారి SCO వేదికపై జై శంకర్ మేటి దౌత్యం భారత్‌కు పెరిగిన గౌరవానికి నిదర్శనంగా నిలిచింది. -కరుణాకర్ బుదూరు, సామాజిక, రాజకీయ విశ్లేషకులు.