హలాసనము
వెల్లకిలా పడుకుని చేసే ఆసనం. హలం అంటే నాగలి. ఈ ఆసనం చివరి భంగిమలో శరీరం నాగలివలె ఉంటుంది. శవాసనం నుంచి స్థితికి రావాలి. అనగా చేతులు తలకి ఇరువైపులా నేరుగా వెనక్కి వుండాలి. ఎనిమిది విభాగాలలో ఆసనం వేయాలి.
1. ఊపిరి పీలుస్తూ, రెండు కాళ్ళను నేలకు 45 డిగ్రీల కోణంలో పైకి ఎత్తాలి.
2. ఇలా పైకి 90 డిగ్రీల కోణంలోకి కాళ్ళను లేపాలి. చేతులను శరీరం పక్కగా తీసుకురావాలి.
3. శ్వాసను వదులుతూ, పిరుదులకి అరచేతులు ఆనించి, మోచేతుల బలంతో నడుమును ఇంకొంచెంపైకి లేపాలి. గడ్డమును కంఠ కూపములో స్థితమగునట్లుగా ఉంచుతూ, కాళ్ళు నేలకు సమాంతరముగా ఉండేలా ఉంచాలి.
4 శ్వాసను వదులుతూ, ఇంకా వెనక్కి వంగుతూ, కాలివేళ్ళతో తల వెనుకవైపున నేలను తాకాలి. పాదాలను బాగా చాచి వుంచాలి. సాధారణ శ్వాసతో నిముషం వరకు ఆసన స్థితిలో వుండాలి.
5. శ్వాస తీసుకుంటూ, 3వ భంగిమలోకి రావాలి.
6. 2వ భంగిమలోకి రావాలి.
7. ఒకటవ భంగిమలోకి రావాలి.
8. కాళ్ళను నేలమీదికి తీసుకువచ్చి, శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.
గమనికలు : చివరి ఆసన స్థితిలో మోకాళ్ళు చక్కగా నిటారుగా వుండాలి.
లాభాలు : నడుము, వీపు కండరాలు, తుంటి సాగి, బలమవుతాయి. ఉదరభాగపు కండరాలు బలపడుతాయి. మెడకి, ఛాతికి రక్తప్రసరణ జరిగి, థైరాయిడ్ గ్రంథి చక్కబడుతుంది. అజీర్ణం, మలబద్ధకం నివారిస్తుంది.
సూచనలు : వెన్నెముక, గుండెకి సంబంధించిన సమస్యలు కలవారు, హైపర్ టెన్షన్ కలవారు ఈ ఆసనం వేయరాదు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.


