Guru Purnima 2025 Telugu: వ్యాస పౌర్ణమి తేది, ప్రాముఖ్యత మరియు పూజా విధానం

megaminds
0
వ్యాస పౌర్ణమి తేది, ప్రాముఖ్యత

Guru Purnima 2025 Telugu: వ్యాస పౌర్ణమి తేది, ప్రాముఖ్యత మరియు పూజా విధానం.

గురు పౌర్ణమి 2025 తేది ఎప్పుడు?

According to the Vedic Panchang, Guru Purnima in 2025 falls on Ashadha Purnima, i.e.,
Date: 10 July 2025 (Thursday)
Purnima Tithi Begins: 10 July at 1:36 AM
Tithi Ends: 11 July at 2:06 AM
As per Udaya Tithi, Guru Purnima will be observed on July 10, 2025.


ఇహపరాలలో జ్ఞానమే శాశ్వతమని నిరూపించేవాడు గురువు. మట్టి అనే అజ్ఞానం నుంచి జ్ఞానవంతులనే మాణిక్యాలను వెలికితీసే జ్ఞాన మేరువు. శిష్యుడి ఎదుగుదలను తనివితీరా ఆస్వాదించే నిస్వార్థ జీవి. ‘శిష్యాదిచ్ఛేత్‌’ ‌పరాజయం అన్నట్లు శిష్యుడు తనను మించి పోవడాన్ని గర్వంగా భావిస్తాడు. అదే నిజమైన గురు లక్షణంగా చెబుతారు. ‘మిమ్ము తరచూ దర్శించుకునే భాగ్యం లేదా?’ అని వేదనిధి అనే యువకుడు వ్యాస భగవానుడిని ప్రశ్నించినప్పుడు, ‘నిరంతర జ్ఞానాన్వేషణే నా సమగ్ర స్వరూపం. నన్ను దర్శించాలనే సంకల్పం కలిగినప్పుడు జ్ఞానం కోసం వెదుకు’ అని సూచించారట. అలా లభ్యమయ్యే జ్ఞాన ప్రతినిధే గురువు. ఆ గురు పరంపరలో ప్రథమ గురువుగా వ్యాసుని మనసారా పూజించుకోవడమే ఆయన జన్మతిథి వ్యాసపూర్ణిమ ముఖ్య ఉద్దేశం.

ఆర్ష సంప్రదాయంలో గురు (ఆచార్యుని) స్థానం శిఖరాయమానం. సమాజానికి సన్మార్గాన్ని చూపి జాతిని ఉద్ధరించే ప్రాతఃస్మరణీయుడు గురువు. ‘గురోః ప్రసాదాత్‌ అన్యత్ర నాస్తి సుఖం మహీతలే’ (గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకంలో సుఖం పొందడం దుర్లభం) అంటారు. ‘గుకారశ్చంధకారస్తు రుకారస్తన్నిరోధకాత్‌’… ‌చీకటిని (అజ్ఞానాంధకారం) అడ్డుకునేవాడు గురువని అర్థం. అజ్ఞానమనే చీకటితో అంధులైన వారికి జ్ఞానమనే అంజనంతో జ్ఞానదృష్టిని ప్రసాదించేవాడు గురువు.

గురువంటే దార్శినికుడు. పథ నిర్దేశకుడు. లౌకిక జ్ఞానాన్ని భగవశ్శక్తితో అనుసంధానించ కలిగిన భాగవతోత్తముడు. అలాంటి గురువు లభిస్తే, ఆయనను సేవించగలిగితే అనంత జ్ఞానంతో అమిత శక్తిమంతులు అవుతారన్నది అనుభవజ్ఞుల మాట. గురువంటే కేవలం విద్యాబుద్ధులు నేర్పిన వారే కాదు. ఎన్నో శ్రమలకోర్చి వివిధ రీతులలో జ్ఞానాన్ని ప్రసాదించిన మహాపురుషులు, రుషులు, ధర్మోద్ధరణకు పాటుపడిన, పడుతున్న మహనీయులు, ఉపనయనంలో భాగంగా బ్రహ్మోపదేశం చేసిన తండ్రి, ఉగ్గుపాలతో విజ్ఞాన ఊపిరిలూదిన తల్లి, కులపెద్ద, పితామహుడు, మాతామహుడు, పినతండ్రి, అన్న, మేనమామ, మామ, రాజు… వీరంతా గురువులేనని శాస్త్రం చెబుతోంది.

గురుస్థానం భాషకు అందని మహోన్నతమైనది. సమస్త జ్ఞానాన్ని సముపార్జించి, ఆచరించి చూపేవాడు ఆచార్యుడు. జ్ఞానజ్యోతిని వెలిగించే గురువే లేకపోతే జీవిత పథం అంధకార బంధురవుతుంది. గురువుకు అంత విలువ ఉంది కనుకనే అవతార పురుషులు, అసామాన్యులు కూడా సామాన్యుల మాదిరిగా వారివద్ద విద్యా బుద్ధులు నేర్చారు. శ్రీ రామచంద్రుడు గురువు వశిష్ఠుని పాద తీర్థం సేవించి శిరస్సున చల్లుకొని భక్తితో దివ్యబోధనను (యోగావాసిష్ఠం) ఆలకించాడు. శ్రీకృష్ణుడు సాందీప మహామునికి శుశ్రూష చేసి విద్యను అభ్యసించి జగద్గురువయ్యాడు.

ఈశ్వరాంశంగా, జగద్గురువుగా పూజలందు కుంటున్న ఆదిశంకరాచార్యులు ఓంకారేశ్వర్‌లో గౌడపాదుల శిష్యుడు గోవిందాచార్యుల శిష్యరికంలో సకల శాస్త్రాలు అభ్యసించారు. ‘ఈర్ష్యాద్వేషాలు లేశమైనా లేనివాడు, నిస్వార్థపరుడు, యోగసాధకుడు, నిరాడంబరుడు మాత్రమే గురువు కాగలడు. జ్ఞానసాగరంలో పయనించే శిష్యులకు గురువు నావ లాంటి వాడు. శిష్యులకు శ్రుతులు, స్మృతులు నేర్పడమే కాదు… నియమానియమాలను పాటించడంలో నిష్ణాతులుగా తయారు చేయాలి. రాగ ద్వేషాలు అదుపు చేసుకోగల ఇంద్రియ నిగ్రహాన్ని అలవరచాలి. వారిని అరిషడ్వర్గాలకు దూరంగా, సన్మార్గంలో నడిపించాలి. అది గురువు బాధ్యత’ అని శంకర భగవత్పాదులు గురువు విశిష్టతను (ఉపదేశి సాహస్త్రి) విశదీకరించారు. శాస్త్ర బోధనలో తనను విస్మరిస్తూ , కీడు తలపెట్టిన గురువు పట్ల అదే వినయ విధేయతలను ప్రదర్శించి, తన శిష్యులను ఉన్నతులుగా తీర్చిదిద్దారు విశిష్టాద్వైతాచార్యులు భగవద్రామానుజాచార్యులు. వివేకానంద, రమణమహర్షి లాంటి వారెందరో గురు కృపకు పాత్రులయ్యారు. ‘గురువు గోవిందుడు ఏక కాలంలో ఎదుట నిలిచినప్పుడు గురువుకే ప్రణామాలు చేస్తాను’ అన్నారు కబీరు. గురువు దేవతల లక్షణాలు కలవాడని (ఆచార్య దేవో భవ) తైత్తిరీయోపనిషత్‌ ‌వాక్యం. ‘గురులేక ఎటువంటి గుణికి తెలియగబోదు’ అన్నారు త్యాగరాజు. గురువు సమక్షంలో నేర్చిన విద్యకు అంతం ఉండదనే భావనలో ‘గురువు శిక్షలేక గుఱుతెట్లు గల్గునో/ అజునికైన వాని యబ్బకైన/ దాళపుజెవి లేక తలుపెట్టులూడురా…’ అన్నాడు ప్రజాకవి వేమన.

సాక్షాత్‌ శ్రీ‌మన్నారాయణుడే వేదవ్యాసుడై అవతరించి తమ కావ్యాల ద్వారా విష్ణుభక్తిని లోకానికి చాటారని రుషులు, జ్ఞానులు, మునులు కీర్తించారు. వ్యాసమహర్షిని త్రిమూర్త్యావతారంగా భావిస్తారు.

‘అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః
అఫాలలోచనః శంభుః భగవాన్‌ ‌బాదారాయణః।’ ఆయనను నాలుగు తలలు లేని బ్రహ్మగా, రెండు చేతులు కలిగిన హరిగా, ఫాలనేత్రం లేని శివుడిగా భగవత్‌ ‌స్వరూపంగా భావించి, అర్చిస్తున్నారు.

యయున నదీ ద్వీపంలో పుట్టడంవల్ల ద్వైపాయ నుడుగా, వేదాలను విభజించి వేదవ్యాసుడిగా, బదరీవనంలో తపస్సు చేయడం వల్ల బాదరాయుణుడిగా ప్రసిద్ధులయ్యారు. ‘అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరామ్‌’ అని సర్వుల మన్ననలు అందుకుంటున్న సద్గురు పరంపరకు ప్రతినిధి.

వేదాలను వింగడించిన, మహాభారత, భాగవత, అష్టాదశ పురాణాలకు ప్రాణం పోసిన మహారుషి వ్యాస భగవానుడు. ‘యది హాస్తి తతన్యత్ర యన్నే హాస్తి న తత్క్వచిత్‌’… ‌భారతంలో లేనిది ఈ భూమిపై లేదు. భూమిపై ఉన్నదంతా భారతంలో ఉంది’ అంటూ విఘ్నదేవుడు గంటం పట్టగా దాదాపు లక్షకు పైగా శ్లోకాలను ఆశువుగా చెప్పి పంచమ వేదం ‘శ్రీ మహాభారతం’ను ఆవిష్కరించారు. వేద విభజన, ఆధ్యాత్మ రామాయణ రచన ద్వారా సకల ధర్మాలను వివరించి, మనిషి ఎలా జీవించాలి? ఎలా జీవించకూడదు? అనే అంశాలను కథల రూపంలో ఆవిష్కరించిన ఆ మహనీయుడు అంతటితో సంతృప్తి చెందలేదు. చిత్తశాంతి లోపించి వ్యాకుల పడుతున్న ఆయన, నారద మహర్షి హితవుతో విష్ణుకథలతో కూడిన శ్రీమద్భాగత రచన చేశారు. భగవద్గీతను మహాభారతంలో నిక్షేపిస్తూ శ్రీకృష్ణ భగవానుడిని జగద్గురువుగా ప్రకటించారు.

లోకంలోని ధర్మ గ్రంథాలలోని అత్యధిక అంశాలు వ్యాస విరచిత ధర్మగ్రంథాల నుంచి స్వీకరించినవేనని చెబుతారు. అందుకే ‘వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం’ అని వ్యవహారంలోకి వచ్చింది.

శంకరం శంకరాచార్య గోవిందం బాదరాయణం!
సూత్ర భాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః’!!..
వ్యాసభగవానుడు శంకరాచార్యులు ఒకరు సూత్ర నిర్మాణానికి, మరొకరు భాష్య రచనకు మళ్లీమళ్లీ పుడుతూనే ఉంటారని భావిస్తుంటారు.

పునీతం తెలుగు నేల

వారణాసి అంటే అపార అభిమానం గల వ్యాసుడు అనుకోని రీతిలో దానిని వీడినా తెలుగు నేలపై దాక్షారామ, బాసర తదితర క్షేత్రాలు ఆయన పాదస్పర్శతో పునీత మయ్యాయని పురాణగాథ.ఆధ్యాత్మికవేత్తల భావన. బాసర వద్ద తపస్సు సమయంలో నిత్యం గోదావరిలో స్నాన మాచరించిన తరువాత తెచ్చిన పిడికెడు ఇసుకతో సరస్వతీ అమ్మవారి విగ్రహాన్ని రూపొందించారని, నేటికీ పూజలందుకున్న అమ్మవారి విగ్రహం వ్యాసుని సృష్టేనని స్థలపురాణం. ఆయన తపస్సు కారణంగా ఆ ప్రాంతానికి ‘వ్యాసపురి’గా ప్రసిద్ధమై, కాలక్రమంలో వాసరగా, బాసరగా మారిందని, ఆంధప్రదేశ్‌లోని దక్షారామంలో భీమేశ్వరునిపై ‘భీమేశ్వరపురాణం’ చెప్పాడని అంటారు. కాళేశ్వరం, సర్పవరం క్షేత్రాలతో ఆయనకు అనుబంధం ఉంది.

ఈ యుగంలోనూ వేదవ్యాసుడిని దర్శనం చేసుకున్న పరమపురుషులు ఉన్నారు. వారిలో ప్రథములు జగద్గురు ఆది శంకరులు. వ్యాసభగ వానుడి సూచన ప్రకారం ఆయన బ్రహ్మసూత్రాలకు శంకరులు భాష్యం రాశారని ఐతిహ్యం.

గురుశిష్య అనుబంధం

అన్ని జన్మలలోనూ మానవ జన్మ దుర్లభం, ఉత్తమమైనది (‘జంతూనాం నరజన్మ దుర్లభం’) అన్నారు ఆదిశంకరులు. అలాంటి జన్మను విద్యా విజ్ఞానాలతో సార్థకం చేసుకోవాలి. అందుకు గుర చరణాలే శరణ్యం. గురువు దేవదేవుడి ప్రతినిధి అనే భావనతో ఆయన పాదపద్మాలను ఆశ్రయించడం, ఆయన ఉప దేశాలను నిస్సంకోచంగా ఆచరించడం, గురుబోధ మీద అమిత నమ్మకం కలిగి ఉండడం, నిరంతరం గురుధ్యానం, గురునింద చేసే వారికి దూరంగా ఉండడం శిష్యుడి కనీస ధర్మాలని శాస్త్ర వచనం. గురువు మాట పొల్లుపోదని, మరుగున పడిన విజ్ఞానాన్ని వెలికితీసి, చైతన్యవంతులు చేసేది గురువు మాత్రమేనన్న విశ్వాసం పెంపొందించు కోవాలి. గురువు జ్ఞాన సాగరం లాంటి వారు. ఆ సాగరం నుంచి విజ్జానాన్ని ఒడిసి పట్టడంపైనే శిష్యుని భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందంటారు.

అదే సమయంలో గురువు శిష్యవర్గం పట్ల ప్రేమవాత్సల్యాదులు కలిగి ఉండాలి. గురువంటే స్వరూప జ్ఞానాన్ని పూర్తిగా స్వాయత్తం చేసుకున్న బ్రహ్మ విద్యావేత్త (అధిగత తత్త్వుడని) అని ఆదిశంకరుల భాష్యం. భక్తి, శక్తి, ధైర్యం,పరాక్రమం, సాహసం, ఉత్సాహం అనేవి గురుప్రసాదితాలని పెద్దలు చెబుతారు. శిష్యుడికి నీతి పాఠాలు బోధించడంతో పాటు ముందుగా తాను పాటించాలని, అప్పుడే విద్యార్థులకు స్ఫూర్తి కలుగుతుందని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి.

సూర్యచంద్రులు సర్వ జగత్తుకు వెలుగు, వెన్నెల ప్రసాదిస్తున్నట్లే గురువులకు పక్షపాత వైఖరి ఉండదు, ఉండకూడదు. ‘రాగ•ద్వేషాలకు అతీతంగా, సంయమనంతో వ్యవహరిస్తూ శిష్యుల పట్ల సమాన వాత్సల్యం చూపే వారే ఉత్తమ గురువులు. పవిత్రాత్మ గల గురువులున్న చోట సర్వదేవతలు సంచరిస్తుం టారు. చిత్తశాంతి కలిగించేవారు, ప్రేరణాత్మక ప్రబోధకులు, సందేహాలను సంయమనంతో నివృత్తి చేయగల మహానీయుడే సరైన గురువని, అలాంటి వారికోసం శోధించాలని పెద్దలు చెబుతారు.

గురుపూర్ణిమను జైన, సిక్కు, బౌద్ధ సాంప్రదాయలలో కూడా పర్వదినంగా పాటిస్తారు. ‘తత్వం ఎరిగినవాడు, ధర్మాన్ని బోధించేవాడు, దైవత్వం కలవాడు మాత్రమే గురువు కాగలడు. గురువు మాత్రమే కైవల్యప్రాప్తిని కలిగించగలడు’ అని జైనుల భావన. ‘దైవత్వాన్ని తెలుసుకునే జ్ఞాన మార్గానికి గురువు ఆలంబన’ అని సిక్కులు విశ్వసిస్తారు. ‘గురువే ధర్మం, గురువే సంఘం’ అని బౌద్ధులు నమ్ముతారు. బుద్ధత్వాన్ని పొందిన వారిని అత్యుత్తమ గురువుగా వారు పరిగణిస్తారు.

‘గురు మధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః
విశ్వరూపో విరూపోసౌ తస్మై శ్రీ గురవే నమః’…
విశ్వమంతా గురువులో ఉంది. గురువు విశ్వమంతటా ఉన్నాడు. సాకార విశ్వరూపుడు, నిరాకార పరబ్రహ్మ తానే అయిన గురువుకు నమస్కారం. అంతటి ఉన్నతి కలిగిన ‘గురు’శబ్దానికి వర్తమానంలో దక్కుతున్న గౌరవం ఏపాటిదో, ఎందరు తమ స్థానానికి విలునిస్తున్నారో, విలువలు నిలుపుకుంటున్నారో ఎవరికి వారే ఆత్మపరిశీలన చేసుకోవాలి.

‘నారాయణ సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం!
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరాం పరాం!!’
అని భగవానుడితో ఆరంభమైన గురు పరంపర వ్యాస భగవానుడి నుంచి కొనసాగుతోంది. ఆ గురుపరంపరకు గురుపూజోత్సవం సందర్భంగా భక్తి పూర్వక అక్షరాంజలి. – డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

Guru Purnima (గురుపౌర్ణమి)

Source : Jagriti

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

megaminds

Guru Purnima Significance in Telugu, గురు పౌర్ణమి విశిష్టత, గురు పౌర్ణమి శుభాకాంక్షలు, Guru Purnima Telugu, Guru Purnima 2025 quotes Telugu, megaminds, గురు పౌర్ణమి 2025, Vyasa Purnima 2025, Ashada Purnima 2025


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top