International Day of Yoga 2025 - యోగ దినోత్సవం 2025 June 21

megaminds
0
మనం యోగా ఎందుకు నేర్చుకోవాలి? International Day of Yoga 2025 - యోగ దినోత్సవం 2025 June 21

మనం యోగాను “ఆరోగ్యం” కోసం నేర్చుకుందాము అనుకుంటున్నాము. యోగా యొక్క అంతిమ లక్ష్యం ఆరోగ్యం కాదు. అంతిమ లక్ష్యం “భగవస్సాక్షాత్కారం”. అయితే మనకు ముందుగా భగవంతుడు గురించిన ఆలోచన కన్నా మన శరీరానికి సంబంధించిన ఆలోచనలూ మనమూ, మన జీవిత భాగస్వామి, మన పిల్లలూ, మన కుటుంబం ఇదే రకమయిన ఆలోచనలు తో సతమతం అవుతూ ఉంటాము. ఈ ఆలోచనల నుండి బయట పడడం చాలా కష్ట సాధ్యం అయిన పని. అందుకు ఎంతో సాధన కావాలి, పట్టుదల కావాలి. ఆదిశగా మనలను నడిపించేదే యోగం. యోగా ద్వారా మనం ముందుగా మన శారీరక సమస్యలనుండి బయట పడడం జరిగితే మన మనసులో ఒక పరివర్తన వస్తుంది. ఆ పరివర్తన కలగడమే “యోగం”. ఇది నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్య. ఈ సమస్యను పదేళ్ల క్రితమే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు గుర్తించి 2014 లో ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించారు. భారత్ చేసిన ఈ ప్రతిపాదనకు 177 దేశాలు మద్దతు ఇచ్చాయి, ఇది ఒక రికార్డు. యోగాని గుర్తించి డిసెంబర్ 11, 2014 న, ఐక్యరాజ్యసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 69/131 తీర్మానం ద్వారా ప్రకటించింది. అప్పటి నుండి, యోగా దినోత్సవం కొత్త రికార్డులను సృష్టిస్తోంది.

మొదటగా 2015లో, ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో 35,000 మందితో కలిసి యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలు పైబడి యోగ దినోత్సవాన్ని నిర్వహించాయి. ఇది కూడా ప్రపంచ రికార్డు. 2023 సంవత్సరం, USAలోని UN ప్రధాన కార్యాలయంలో 130 కంటే ఎక్కువ దేశాల నుండి ప్రజలు పాల్గొన్న యోగా దినోత్సవ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. 2024 లో జమ్మూ శ్రీనగర్లో మోడీ గారు పాల్గొన్నారు. ఈ యోగా ప్రయాణం నిరంతరం కొనసాగుతోంది. ఆయుష్ విభాగం భారతదేశంలో యోగా సాధకుల కోసం యోగా సర్టిఫికేషన్ బోర్డును ఏర్పాటు చేసింది. నేడు దేశంలోని 100 కంటే ఎక్కువ ప్రధాన సంస్థలను ఈ బోర్డు గుర్తించింది. విదేశాలలో పది ప్రధాన సంస్థలు కూడా ఈ బోర్డు నుండి గుర్తింపు పొందాయి.

ప్రపంచవ్యాప్తంగా యోగా సాధన చేసే వారి సంఖ్య గత పదేళ్లగా పెరుగుతోంది. అనేక దేశాలలో యోగా రోజువారీ జీవితంలో భాగమవుతోంది. 2015లో తుర్క్‌మెనిస్తాన్‌లో ఒక యోగా కేంద్రాన్ని ప్రారంభించారు. నేడు, యోగా అక్కడ బాగా ప్రాచుర్యం పొందింది. తుర్క్‌మెనిస్తాన్‌లోని స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో కూడా యోగా చికిత్స చేర్చబడింది. సౌదీ అరేబియా తన విద్యావ్యవస్థలో యోగాను కూడా చేర్చింది. మంగోలియన్ యోగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగోలియాలో అనేక యోగా పాఠశాలలు నడుస్తున్నాయి. యూరోపియన్ దేశాలలో కూడా యోగా వేగంగా పెరుగుతోంది. నేడు, జర్మనీలో సుమారు 1.5 కోట్ల మంది యోగా సాధకులుగా మారారు. ఫ్రాన్స్‌కు చెందిన 101 ఏళ్ల మహిళా యోగా టీచర్‌కు 2024 సంవత్సరం భారత్‌లో పద్మశ్రీ లభించింది.

గత పదేళ్లుగా యోగా విస్తరణ యోగాతో ముడిపడి ఉన్న అవగాహనలను మార్చివేసింది. యోగా ఇప్పుడు పరిమిత సరిహద్దులను దాటి ఉద్భవిస్తోంది. ప్రపంచం కొత్త యోగా ఆర్థిక వ్యవస్థ పెరుగుదలను చూస్తోంది. భారతదేశంలో, రిషికేశ్ మరియు కాశీ నుండి కేరళ వరకు యోగా పర్యాటకంలో కొత్త ధోరణి కనిపిస్తుంది. ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు నిజమైన యోగా నేర్చుకోవాలని కోరుకుంటూ భారత్‌కు వస్తున్నారు. యోగా రిట్రీట్‌లు మరియు యోగా రిసార్ట్‌లు స్థాపించబడుతున్నాయి. విమానాశ్రయాలు మరియు హోటళ్లలో యోగా కోసం ప్రత్యేక సౌకర్యాలు సృష్టించబడుతున్నాయి. యోగా కోసం డిజైనర్ దుస్తులు మరియు పరికరాలను తయారవుతున్నాయి. ప్రజలు ఇప్పుడు వారి ఫిట్‌నెస్ కోసం వ్యక్తిగత యోగా శిక్షకులను నియమించుకుంటున్నారు. ఉద్యోగుల వెల్‌నెస్ చొరవలో భాగంగా కంపెనీలు యోగా మరియు మైండ్‌ఫుల్‌నెస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తున్నాయి. ఇవన్నీ యువతకు కొత్త అవకాశాలు మరియు ఉపాధిని సృష్టించాయి.

యోగా అనేది కేవలం ఒక విభాగం మాత్రమే కాదు, ఒక శాస్త్రం కూడా. సమాచార విప్లవం యొక్క ఈ యుగంలో, ప్రతిచోటా సమాచార వనరులు వెల్లువలా ప్రవహిస్తున్నప్పుడు, ఒకే విషయంపై దృష్టి పెట్టడం మానవ మనస్సుకు పెద్ద సవాలుగా మారుతోంది. యోగా దీనికి కూడా ఒక పరిష్కారాన్ని అందిస్తుంది. ఏకాగ్రత మానవ మనస్సు యొక్క గొప్ప బలం అని మనకు తెలుసు. ఈ సామర్థ్యం యోగా మరియు ధ్యానం ద్వారా కూడా పెరుగుతుంది. అందువల్ల, క్రీడలకు సైన్యంలో యోగాను చేర్చుతున్నారు. అంతరిక్ష కార్యక్రమ శిక్షణలో భాగంగా వ్యోమగాములకు యోగా మరియు ధ్యాన శిక్షణ కూడా ఇస్తారు. ఇది ఉత్పాదకత మరియు ఓర్పును పెంచుతుంది. ఈ రోజుల్లో, అనేక జైళ్లలో ఖైదీలు కూడా యోగాను అభ్యసించవలసి వస్తుంది, తద్వారా వారు తమ మనస్సులను సానుకూల ఆలోచనలపై కేంద్రీకరించగలరు. యోగా సమాజంలో సానుకూల మార్పులకు మార్గం సుగమం చేస్తోంది.

యోగం అంటే కలయిక
మన శరీరం మన మనసుతో కలవాలి.
మన మనసు మన బుద్ధితో కలవాలి.
మన బుద్ది మన ఆత్మతో కలవాలి.
మన ఆత్మ మన పరమాత్మ తో కలవాలి.
ఇది ఎలా సాధ్యపడుతుంది ? అందుకు మనం చెయ్యవలసినది “ప్రాణాయామం”

యోగం అనేది ఒక ప్రక్రియ కాదు ఒక జీవన శైలి. మన పూర్వీకులు యోగాకు ఎనిమిది అంగములు ఉన్నాయి అంటారు .
 
అవి 1. యమము 2. నియమము 3. ఆసనము 4. ప్రాణాయామము 5. ప్రత్యాహారం 6. ధారణ 7. ధ్యానం 8. సమాధి. ఇవి అన్నీ ఆచరించినవాడు దైవసమానుడు. దైవ దర్శనం చేసిన అనుభూతిని ప్రతి క్షణం అనుభవించగలడు.

1. యమము అనగా ఇంద్రియ నిగ్రహము

అహింసా సత్యాస్తేయా బ్రహ్మచర్యా పరిగ్రహా యమాః

1. అహింస 2. సత్యము 3. అస్తేయము (మనో వాక్కాయ కర్మలచేత పర ద్రవ్యమునందు కోరిక లేకుండా ఉండుట) 4. దొంగిలింపకుండుట 5. బ్రహ్మ చర్యము

2. నియమము

శౌచ సంతోష తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని నియమాః

1. శౌచం 2. సంతోషము 3. తపస్సు 4. స్వాధ్యాయము 5. ఈశ్వర ప్రణిధానము నియమములు

3 .ఆసనం

పతంజలి చెప్పిన "ఆసనం" అంటే మనస్సును ఆత్మతో సంధానం చేసి స్థిరంగా ఉండటం. దీనినే "స్థిర సుఖాసనం" అన్నారు. ఇవి ఎన్ని అనే విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు.

4. ప్రాణాయామం

శ్వాసను క్రమబద్దీకరించడమే ప్రాణాయామం. బాబా రామ్ దేవ్ గారు శరీర ఆరోగ్యం దృష్ట్యా ఎనిమిది రకాల ప్రాణాయామాలు అందరూ చెయ్యాలని చెబుతున్నారు.

5. ప్రత్యాహారం

ఇంద్రియ జనితములైన బాహ్య ప్రపంచ శబ్దములు దృశ్యముల నుండి దృష్టి నిగ్రహించి అంతరంగముపై చింతించుట ప్రత్యాహారము.

6. ధారణ

ధారణ అంటే బ్రహ్మమును (ఈశ్వరుని అనుకోవచ్చు) హృదయపద్మములో ధరించుట.

7. ధ్యానము

ఈశ్వరుని గురించిన చింతలో ఉండుటయే ధ్యానము.

8. సమాధి

అహంబ్రహ్మాస్మి (నేనే ఆ బ్రహ్మమును) అనే ఎరుక కలిగియుండు అవస్థయే సమాధి.

యోగసాధనకు ఉపక్రమించడం ఎలాగో తెలుసుకుందాం: ప్రాణాయామం ఖాళీ కడుపుతో చెయ్యండి. ఉదయం చాలా మంచిది. అలా కుదరని వారు భోజనం చేసిన నాలుగు అయిదు గంటల తర్వాత చెయ్యండి. మన మనసు ఎప్పుడో ఎదో ఒక విషయం ఆలోచిస్తూనే ఉంటుంది. మన ఆలోచనల ఫలితమే మన వ్యక్తిత్వం. ఒక మనిషిని మంచివాడుగా, దొంగగా ఉగ్రవాదిగా, సాత్వికుడుగా, ఋషిగా రూపొందించేవి అతని ఆలోచనలే. దీనికి మూలకారణం మనస్సు. దీనినే చిత్తం అంటారు. చిత్త వృత్తి నిరోధానికి మనం చేసేదే ప్రాణాయామం. చిత్తాన్ని మంచి వైపుకు మళ్ళించేది యోగం.

మనం జీవించి ఉన్నంత కాలం జరిగే ప్రకియ శ్వాసక్రియ. శ్వాస ఆగితే ప్రాణం పోయింది అంటాము. అంటే మనం పీల్చే గాలిలో మన ప్రాణం ఉంది అన్నమాట. ఈ ప్రాణం యొక్క ఆయామమే ప్రాణాయామం.

ప్రాణాయామానికి ముందు సంసిద్ధత

1. స్థిర సుఖమపి ఆసనం ( స్థిరంగా , సుఖంగా కూర్చోవాలి ).
2. శరీరం నెలకు తగలకుండా విద్యుద్వాహకం కాని దుప్పటి గాని , బొంత కానీ , రబ్బరు మేట్ గానీ వేసుకోండి.
3. గాలి ధారాళంగా వీచే చోటును చూసుకోండి (కిటికీలు తెరచి ఉంచండి. ఆరుబయట చెయ్యండి ).
4. ఒక్కరు ఎక్కువ సేపు చెయ్యడం కష్టం కనుక కనీసం అయిదారుగురు కలిసి చెయ్యండి.
5. ప్రశాంతమైన మ్యూజిక్ వింటూ ( ఆధ్యాత్మిక విషయాలు గానీ , భక్తి పాటలు గానీ వింటూ ) ప్రాణాయామం చెయ్యండి.
6. శక్తికి మించి చెయ్యకండి. రోజు రోజుకూ శక్తి పెరుగుతుంది.
7. శ్వాస క్రియను ముక్కుతో మాత్రమె చెయ్యండి.
8. కళ్ళను మూసుకుని ప్రాణాయామం చెయ్యండి.
9. మనసును చేస్తున్న ప్రాణాయామం మీద పెట్టండి. వేరే ఆలోచనలను వదిలివేస్తూ ప్రాణాయామ   మీదకు తిరిగి తిరిగి తీసుకు వస్తూ ఉండండి.

ఇపుడు మనం స్థిరంగా సుఖంగా కూర్చోవాలి అందుకు అనుకూలమైన ఆసనాలు పద్మాసనం, సిద్ధాసనం, వజ్రాసనం, స్వస్తికాసనం, సుఖాసనం. ఈ ఆసనాలు ఏవీ నా వల్ల కాదు అని మీరు అనుకుంటే కాళ్ళు చాపుకుని కూర్చోవచ్చు. అది దండాసనం. అది కూడా వీలు కాదు అనుకుంటే కుర్చీలో కూర్చుని కూడా మీరు “ప్రాణాయామం” చేయవచ్చు.

2025 జూన్ 21  యోగ దినోత్సవానికి ఇప్పటి నుండే తయారవుదాం. ఈ వేసవి సెలవుల్లో మీరు, మీ పిల్లలు కలిసి కనీసం మూడు ఆసనాలు, అలాగే సూర్య నమస్కారాలు అభ్యాసం చేయండి. అలాగే 2025 June 21 యోగ దినోత్సవం లో పాల్గొందాం...

International Yoga Day 2025, Yoga Day 2025, World Yoga Day 2025, Yoga Day theme 2025, Yoga Day date 2025, Yoga Day 2025 celebration, Yoga Day 2025 activities, Yoga Day 2025 speech, Yoga Day 2025 essay


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Megamindsindia


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top