ఝూలే లాల్ జీవిత చరిత్ర About Jhulelal in Hinduism

megaminds
0
ఝూలే లాల్ జీవిత చరిత్ర

కత్తి బలంతో పరమతాలను నిర్మూలించి, తమ ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలనే సంకల్పంతో అరబ్బులు భారతదేశం మీద ఏడో శతాబ్దంలో దండయాత్రలు ఆరంభించారు. క్రీ.శ. 712లో సింధు రాజ్యం, వారి ఆక్రమణకు గురయ్యింది. విజేతలైన అరబ్బులు వేలకొద్దీ హిందువులను చంపారు. వేలాది హిందూ స్త్రీలపై అత్యాచారాలు జరిపారు. వందలకొద్దీ దేవాలయాలను కూలగొట్టి, వాటి స్థానంలో మసీదులు నిర్మించారు. వేలకొద్దీ ప్రజలను నిర్బంధంగా మహమ్మదీయ మతంలోకి మార్చారు. ఇంకెన్నో వేల మంది హిందూ స్త్రీలను, పురుషులనూ బానిసలుగా ఇరాక్ కు పట్టుకుపోయారు.

తరువాత ముస్లిం ఏలికల పాలనలో హిందువులు దుర్భరమైన కష్టాలకు, హింసలకు గురయ్యారు. ఒకప్పుడు మిర్క్ షా అనే నిరంకుశ సుల్తాను సింధు రాజ్యంలోని హిందువులందరూ ఇస్లాం మతాన్ని స్వీకరించాలనీ, లేదా మరణశిక్ష అనుభవించాలనీ ఆజ్ఞ వేశాడు. హిందువులు భయభీతులై, తాము ఆలోచించుకోడానికి కొంత వ్యవధి కావాలని అర్థించారు. వారికి నలభై రోజుల గడువు ఇచ్చాడు మిర్క్ షా. హిందువులు ఆ నలభై రోజులూ సింధు నది ఒడ్డున ఉపవాసాలు, ప్రార్ధనలూ చేస్తూ తమను మతమార్పిడి నుంచి రక్షించమని వరుణదేవుడిని వేడుకున్నారు. ఆ నలభై రోజులూ వాళ్లు క్షురకర్మ చేసుకోలేదు. దుస్తులు మార్చుకోలేదు. ఏకధాటిగా ప్రార్థనలు, ఉపవాసాలు, స్తోత్రాలు సాగించారు.

నలభయ్యో రోజున వారికి ఆకాశం నుంచి ఒక ధ్వని వినబడింది. "భయపడకండి. క్రూరుడైన మిర్క్ షా నుంచి నేను మిమ్మల్ని రక్షిస్తాను. నేను మర్యుడిగా అవతరించి, నసర్పూర్ వాసి అయిన రతన్ చంద్ భార్య దేవకీ మాత గర్భాన పర జన్మిస్తాను" అంది. సింధు రాజ్యపు హిందువులు ఈ వార్త విని ఆనంద భరితు లయ్యారు. నెలలు నిండిన పిమ్మట చైత్రశుద్ధ విదియనాడు దేవకి మగశిశువును ప్రసవించింది. ఆ బాలుడు పుట్టగానే అకాలమైనా ఆకాశంలో మేఘాలు ముసురుకొని బ్రహ్మాండంగా వర్షించాయి. అతడికి ఉదయచంద్ అని పేరు పెట్టారు. ఉదెరో లాల్, అమర్ లాల్ అనేవి ఆ పాపడికి నసర్పూర్ హిందువులు పెట్టుకున్న ముద్దుపేర్లు. ఆ బాలుడిని ఉయ్యాలలో వేయగా, ఆ ఉయ్యాల దానంతటదే ఊగసాగింది. దానితో అతడిని ఝూలే లాల్ అని కూడా అనసాగారు. ఝూలా అంటే ఉయ్యాల అని అర్థం.

ఒక విచిత్ర బాలుడు జన్మించినట్లు మిర్క్ షా విన్నాడు. అతడు హిందూ పెద్దలను పిలిచి, "వెంటనే మతం మారండి, లేకపోతే మీ అందరికీ మరణ శిక్షే" అని చెప్పా కదా" అన్నాడు. తమ రక్షకుడు పుట్టాడన్న ధీమాతో హిందువులు "మాకు ఇంకా గడువు కావాలి. సాక్షాత్తూ వరుణదేవుడే మాకు రక్షకుడై పుట్టాడు" అని బదులిచ్చారు. "ఒక పసివాడా మిమ్మల్ని రక్షించేది? చూద్దాం! వాడూ, మీరూ కూడా ఇస్లాం స్వీకరించక తప్పదు!" అన్నాడు మిర్క్ షా. అలా వేచి చూడవద్దనీ, గడువు సడలించ వద్దనీ ముస్లిం మతగురువులైన ముల్లాలు సుల్తాను మిర్క్ షా మీద వత్తిడి పెంచారు. మిర్క్ షా తన మంత్రి అహిరియోను నసరూర్ పంపాడు. విషంలో నానబెట్టిన ఒక గులాబీ పువ్వును తీసుకుని, అహిరియో నసరూర్ చేరుకున్నాడు.

బాల ఝూలేలాల్ ను చూడగానే అతడి వర్చస్సుకు విస్మయం చెందాడు అహిరియో. ధైర్యం తెచ్చుకుని తాను తెచ్చిన విషపు గులాబీని ఆ బాలుడికి ఇచ్చాడు. ఆ పసివాడు దానిని చిరునవ్వుతో ఒక్క ఊదు ఊదాడు. అది వెళ్లి, దూరంగా పడింది. అహిరియో నిర్ఘాంతపోయి చూస్తుండగానే ఝూలేలాల్ పొడవైన గడ్డం కలిగిన వృద్ధునిగా మారిపోయాడు. మరుక్షణంలో ఆ వృద్ధుడు పదహారేళ్ల కుర్రవాడై పోయి, ఖడ్గం ధరించి, గుర్రం మీద స్వారీ చేయసాగాడు. అతడి వెంట వరుసలు తీరిన యోధులు ఉన్నారు. అహిరియోకు భయంతో చెమటలు పట్టాయి. “నన్ను దయ చూడు, సింధు దేవా! నేను విశ్వసిస్తున్నాను” అన్నాడు.

అహిరియో తిరిగి వెళ్లి, జరిగినదంతా మిర్క్ షా కు చెప్పగా, అతడు నమ్మలేదు. "గారడీ చూపించి, నిన్ను చవటను చేశారు” అని అన్నాడే కానీ, అతడికి కూడా మనసులో బెదురు పుట్టింది. ఆ రాత్రి అతడికి ఒక పీడకల వచ్చింది. ఆ కలలో అతడి పీక మీద ఒక బాలుడు ఎక్కి కూచున్నాడు. చూస్తుండగానే ఆ పసివాడు వృద్ధుడిగా మారిపోయాడు. అంతలోనే ఖడ్గధారి అయిన వీరుడుగా మారి, యుద్ధం చేస్తున్నట్లు కనిపించాడు. మరునాడు ఉదయమే మిర్క్ షా, అహిరియోను పిలచి ఆ బాలుడిని ఏదో ఒకటి చేసెయ్యాలని తొందరపెట్టాడు. ఓపిక పట్టమని అన్నాడు అహిరియో.

ఝూలే లాల్ పుట్టిన కొద్ది కాలానికే అతని తల్లి చనిపోయింది. తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఝూలేలాల్ అద్భుతాలను ప్రదర్శిస్తూ, రోగులకు స్వస్థత కలిగిస్తూ, పెరిగి పెద్దవాడవుతున్నాడు. తమను రక్షించడానికి దేవుడే అవతరించాడని నసరూర్ ప్రజలకు గట్టి నమ్మకం కుదిరింది.

ఝూలే లాల్ సవతితల్లి అతడికి వేయించిన సెనగలు ఇచ్చి, బజారులో అమ్మి, డబ్బు తెమ్మని పంపేది. ఝూలేలాల్ సింధు నది ఒడ్డుకి వెళ్లి, ఆ సెనగలలో సగం భిక్షకులకు, పేదలకు, సాధువులకు ఇచ్చేసే వాడు. మిగిలిన సగమూ సింధు నదిలో వేసేసే వాడు. రోజల్లా అక్కడ కూర్చొని ప్రజలకు ఆధ్యాత్మిక విషయాలను బోధించే వాడు. సాయంత్రం నదిలోంచి బియ్యంతో నిండి ఉన్న ఒక గిన్నెను బయటకు తీసి, ఇంటికి వెళ్లి, సవతి తల్లికి ఇచ్చేవాడు. భార్య పంపగా ఒకనాడు రతన్ చంద్ తన కొడుకును అనుసరించి వచ్చి, ఇదంతా చూశాడు. దూరం నుంచే అతడు ఝూలే లాల్ కు నమస్కరించాడు.

ముల్లాలు మిర్క్ షా మీద ఒత్తిడి పెంచారు. “మన అల్లా ఒక్కడే సత్యమైన దేవుడు. హిందువులు అది నమ్మి, ఇస్లాంలోకి రావలసిందేనని ఆజ్ఞాపించు. లేకపోతే కాఫిర్లుగా, అంటే దైవద్రోహులుగా ప్రకటించి శిక్షిస్తామని చెప్పు” అని తొందర పెట్టారు. తనకు ఝూలేలాల్ ను కలుసుకునే ఏర్పాటు చేయమని అహిరియోను మిర్క్ షా ఆజ్ఞాపించాడు.

అహిరియో సింధునది ఒడ్డుకు వెళ్లి, తనను సంకటం నుంచి బయట పడెయ్యమని ఖ్వాజా భిర్జ్ అనే తను నమ్మిన దైవాన్ని ప్రార్థించాడు. తాను గతంలో ఝూలే లాల్ ను చూసినపుడు కనిపించిన తెల్లగడ్డపు వృద్ధుడే ఒక మత్స్యం మీద కూర్చుని అతడికి ప్రత్యక్షమయ్యాడు. వరుణదేవుడైన ఝూలేలాల్, తాను ఆరాధించే ఖ్వాజా ఖిర్జేకే మరొక రూపమని అహిరియోకు అర్థమయింది. అతడు ఝూలేలాల్ కు తలవంచి నమస్కరించాడు. అతడు చూస్తుండగానే ఝూలే లాల్ ఒక గుర్రం మీదకు దూకి, ఒక చేత ఖడ్గాన్ని, ఒక చేత జండాను పట్టుకుని వేగంగా స్వారీ చేస్తూ కనుమరుగయ్యాడు.

అహిరియో స్థిరనిశ్చయంతో మిర్క్ షా వద్దకు వెళ్లి, “మన చుట్టూ కనిపించేదంతా భగవంతుని సృష్టే. ఆ భగవంతుడినే మనం అల్లా అంటున్నాం. హిందువులు ఈశ్వరుడు అంటున్నారు" అన్నాడు ముల్లాలు. "ఇతడి మాటలు వినవద్దు” అని మిర్క్ షాను ఆదేశించారు. ఝూలే లాల్ ను బంధించమని అతడిని నిర్బంధించారు. చేసేది లేక ఝూలే లాల్ ను బంధించమని తన సైనికులను ఆజ్ఞాపించాడు మిర్క్ షా.

అంతలో బ్రహ్మాండమైన నీటి కెరటాలు వచ్చి పడి రాజభవన ప్రాంగణాన్ని ముంచెత్తాయి. అదే సమయంలో అగ్నికూడా వ్యాపించి, రాజభవనం దగ్ధమైంది. మిర్క్ షా, అతడి సభాసదులు పీకల లోతు నీళ్లలో ఉక్కిరిబిక్కిరయ్యారు. “మిర్క్ షా! మీ దేవుడు, మా దేవుడు ఒక్కరే. వేర్వేరు కాదు. నా ప్రజలను ఎందుకు బాధిస్తున్నావ్?” అని ఝూలేలాల్ ప్రశ్నించాడు. మిర్క్ షా హడలిపోయాడు. "ప్రభూ! నా తెలివి తక్కువతనం తెలిసి వచ్చింది. నన్ను నా పరివారాన్ని రక్షించు” అని వేడుకున్నాడు. వెంటనే నీరు వెనక్కి పోయింది. అగ్నిజ్వాలలు ఆరిపోయాయి. మిర్క్ షా అతడికి నమస్కరించి, హిందువులను, ముస్లింలను సమదృష్టితో చూస్తానని మాట ఇచ్చాడు. "మిర్క్ షా మనసు మారిన సందర్భాన్ని సూచిస్తూ ఒక గుడిని నిర్మించండి. దానిలో అహోరాత్రులూ దీపం వెలుగుతూ ఉండాలి. అన్నివేళలా తీర్థం లభించాలి" అన్నాడు ఝూలేలాల్. తన దగ్గర బంధువు పాగడ్ ను ఆ దేవాలయానికి మొదటి అర్చకునిగా నియమించాడు. అతడికి ఏడు పవిత్రచిహ్నాలను అందించాడు. ఈ సంప్రదాయం దర్యాహీపంథ్ వాడుకలోకి వచ్చింది.

తరువాత తిజూహర్ అనే గ్రామానికి సమీపంలో ఝూలే లాల్ తన అవతారాన్ని చాలించాడు. అప్పటికి అతని వయసు పదమూడు. అప్పుడక్కడ హిందువులు, ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. దానిని చూడడానికి మిర్క్ షా మనుషులు కూడా వచ్చారు. ఝూలేలాల్ ఆత్మ దేహం నుంచి నిష్క్రమించాక ఆ స్థలంలో హిందువులు తమ సంప్రదాయం ప్రకారం సమాధిని నిర్మించాలనుకున్నారు. ముస్లింలు తమ పద్ధతిలో దర్గా నిర్మిస్తామన్నారు. ఈ వాదన సాగుతుండగా భోరున వర్షం కురిసి, ఆకాశవాణి “నేను మీ అందరికీ చెందిన వాడిని. నా సమాధిని ఒకవైపు దేవాలయంలాగా, మరోవైపు దర్గా లాగా నిర్మించండి” అని వినవచ్చింది.

సింధీప్రజల ఇష్టదైవంగా ఝూలేలాల్ నేటికీ ఆరాధించబడుతున్నాడు. క్రీ.శ. 1356లో కట్టిన అతడి సమాధి నేటి పాకిస్తాన్లోని సెహ్వాన్లో ఉంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Megamindsindia

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top