మే 31న అహల్యా బాయి హోల్కర్ జయంతి - About Ahilyabai Holkar life story in telugu

megaminds
0
అహల్యా బాయి హోల్కర్

అహల్యా బాయి హోల్కర్ జీవిత చరిత్ర - About Ahilyabai Holkar life story in telugu

స్త్రీలను హిందూ సమాజంలో హీనంగా చూసారంటు బాహటంగా విమర్శించే వారికి తెలియదా లోకమాత అహిల్యా బాయి హోల్కార్ గొర్రెలు మేపుకొనే సామాన్య కుటుంబంలో పుట్టి, మహా రాణిగా ప్రజలందరినీ పాలన చేయటం ఎలా సాధ్యమైంది? ఆనాడే సమస్త సమాజం ఆమెను ఎలా గౌరవించింది?

స్త్రీలను ముఖ్యంగా వితంతువులను హిందువులలో బానిసత్వంతో చూసేవారని ప్రేలాపణలు చేస్తున్నప్పుడు, అహిల్యబాయి వితంతువులకు అల్లికలు,కుట్టు మొదలైన నైపుణ్య శిక్షణ ఎలా ఇవ్వగలిగిందని ఆలోచించరా?

స్త్రీలకు చదువు చెప్పకుండా ఇంటికే పరిమితం చేసే వారే హిందువులంటూ వెక్కిరించిన సమాజంలో 1745-50 ప్రాంతంలోనే గణితం మొదలైనవి నేర్పి, మెరికాల్లాంటి యువతులను యుద్ధ విద్యలో పారంగతురాళ్లుగా ఆమె ఎలా తీర్చి దిద్దింది?

భర్తలు భార్యలను రాచి రంపాన పెట్టేదే హిందూ సమాజం అంటూ ఎగతాళి చేస్తున్న సందర్భంలో ఆమె మామ మలహార్ రావ్ ఆమెకు పూర్తిగా స్వేచ్చ నిచ్చి, గణితం, కత్తి సాము, గుర్రపు సవారి ఎలా నేర్పాడు. భర్త ఖండేరావ్ ని కూడా ఆర్థికంగా ఎలా ఉండాలో ఎలా నియంత్రించ గలిగింది?

హిందూ సమాజంలో పురుషులదే పెత్తనం అని భావించే వేళ, ఇంట్లో అన్నీ తానై, ఆర్థికంగా కుటుంబాన్ని ఎలా నడిపించింది?

భర్త చనిపోతే గుళ్ల దగ్గరకే రానివ్వరంటూ ఎగతాళి చేసినప్పుడు ఆమె బద్రీనాథ్ నుండి రామేశ్వరం వరకు 100 కి పైగా దేవాలయాలను పున:నిర్మించే సాహసానికి ఎలా సిద్దపడింది? అప్పటి హిందూ సమాజం ఆ కార్యాన్ని ఎలా అంగీకరించింది?

మహిళా సాధికారత అంటే అర్ద నగ్న ప్రదర్శనలు చేయటం, పురుషులపై తిరుగుబాటు చేయటం, కుటుంబం, పిల్లలు, సమాజాన్ని పట్టించుకోకుండా వ్యక్తిగత ఇష్టాలతో, విశ్రుంఖలంగా విహరించటమే అని భావించే పాశ్చాత్య జీవన శైలి కి భిన్నంగా, ఆమె తనను తాను తీర్చిదిద్దుకుంటూ, కుటుంబానికి సమయమిస్తూ, ప్రజలే ఇష్ట దైవాలుగా భావించి, అన్ని వర్గాల వారికి సమ న్యాయం చేసి, తన కర్తవ్యం నెరవేర్చి, మహిళా సాధికారత కు నిజమైన సార్థకతను కల్పించిన మహనీయురాలు అహిల్యా బాయి కాదా?

ఇల్లు తప్ప బయటి ప్రపంచమే తెలియకుండా పరదా వేసి మహిళలను హింసించారంటూ విమర్శిస్తున్ప్పుడు, రైతులు, చేనేత కార్మికులు, వితంతు స్త్రీలు, యువతులు, సాధారణ ప్రజల పట్ల సమ న్యాయం ఎలా చేయగలిగింది?

అజ్ఞానం, మూఢ నమ్మకాలకే స్త్రీలు పరిమితం అయ్యారని అనుకుంటున్న సందర్భంలో వరకట్నం నిషేధం చేసి, మహిళలకు విద్య నేర్పి తన రాజ్యాన్నే కాకుండా, అన్ని రాజ్యాల వారిలో దేశభక్తి ని ఆమె మేల్కొల్పటం సాధారణ విషయం ఎలా అవుతుంది?

ఆడవాళ్లకు అన్ని రకాల హక్కులే కరువైన హిందూ సమాజంలో, తన ఆస్తి నుండే డబ్బుని ఆలయాల నిర్మాణం కోసం ఖర్చు పెట్టడం, కుటుంబాన్ని సక్రమంగా నిర్వహించి, ఆదర్శంగా తాను నిలిచి, అన్ని రకాల సంస్కరణలకు శ్రీ కారం చుట్టిన మహిళా మూర్తి లోక మాత అహిల్యా బాయి హోల్కర్ గొప్పదనం, ఆ స్త్రీమూర్తి సాధికారత గురించి నేటి హిందూ సమాజానికి తెలియకుండా ఎవరు దాచి ఉంచారు? మహిళలకే ప్రేరణ నిచ్చే ఆమె వాస్తవ జీవన చిత్రాన్ని మరుగున పరిచి, మహిళలకు, హిందూ సమాజానికి హాని కలిగించింది ఎవరు?

స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయింది. అయినా ఆమె ఎవరో తెలియని పరిస్థితుల్లో, 1725 నుండి 1795 మధ్య కాలంలో ఆమె చేసిన మహాత్కార్యాలను వెలుగులోనికి తెచ్చి, ఆమె 300 జయంతి ఉత్సవాలను ఘనంగా సంవత్సరం పాటు జరుపుకున్నాం. దేశమంతా వేలాది కార్యక్రమాలు కోట్లాది మందికి ఆమె ఎవరో తెలుసుకునే భాగ్యం లభించటం పూర్వ జన్మ సుకృతంగా భావించాలి కదా?

మే 31వ తేది అహల్యా బాయి హోల్కర్ జయంతి పురస్కరించుకుని ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. లోకమాత, ధీరవనిత అహల్యా బాయి హోల్కర్ గురించి ప్రజలకు ముఖ్యంగా యువతీ యువకులను నేటికీ కూడా ఉత్తేజపరిచే ఆమె ఘన కీర్తిని ప్రతి ఒక్కరూ చదివి, పదిమందికి తెలియజేద్దాం.

భారతదేశ చరిత్రలోనే ఒక శక్తిమంతమైన మహిళామణి రాణి అహల్యాదేవి. ఆమె అకుంఠిత దీక్షాతత్పరత, కర్తవ్య నిర్వహణ, దూరదృష్టి సాటిలేనివి. తన 33 ఏళ్ళ పాలనలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని, హిందుత్వం కోసం నిలబడ్డ ధీశాలి. మహావీరుడైన మామగారు మల్హార్ రావు వేసినబాటలో రాజ్యానికి ఏకైక వారసురాలుగా సుభిక్షంగా పాలించింది.

మేకలు, గొర్రెలు మేపుకొనే సామాన్య కుటుంబంలో, మహారాష్ట్రలోని చౌండి అనే ఒక మారుమూల గ్రామంలో శాలివాహన శకం 1674 సం జ్యేష్ట బహుళ సప్తమి నాడు (1725 మే 31వ తేది) అహల్యాబాయి జన్మించింది. మరాఠా సామ్రాజ్యానికి వెన్నెముక అయిన సుబేదార్ మల్హార్రావు కుమారుడు ఖండేరావ్, అహల్యబాయిల వివాహం 1733లో పూణేలో ఘనంగా జరిగింది. హైందవీ స్వరాజ్యంలోని అగ్రశ్రేణి సర్దార్లలో మల్హార్ రావు ఒకరు. వివాహం తర్వాత అహిల్యబాయి మొదటిసారిగా ఇండోర్లోని హోల్కర్ల రాజ ప్రాసాదానికి వచ్చింది. కోడలు శ్రద్ధా శక్తులను గమనించిన మామ మల్హార్రావు ఆమెకు అన్ని అంశాల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.

ఆ విధంగా అహల్యా విద్యాభ్యాసం మొదలైంది. చదవటం, వ్రాయటం, గణితాలతోపాటుగా గుర్రపుస్వారీ, కత్తియుద్ధం విలువిద్యలలోనూ ఆమెకు శిక్షణ ఇచ్చారు. అహల్యాదేవి సూక్ష్మగ్రాహి. అనతికాలంలోనే ప్రతి అంశంలోనూ ఆమె పట్టు సాధించింది. నేర్పిన ప్రతి అంశములోనూ ఆమె నిష్ణాత అయ్యింది. కేవలం రాజ్యవిస్తరణకు, శాంతిభద్రతలను కాపాడటానికే ఆమె పాలన పరిమితం కాలేదు. సమాజం సుభిక్షంగా మనగలగటానికి ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించటానికి ఆమె ఎనలేని కృషి చేసింది. సామాజిక సమరసతను నెలకొల్పటానికి ఆమె అంకితం అయింది. ఆమెకు కుల పట్టింపులేదు. ధైర్యసాహసాలే కులగోత్రాలు అని చెప్పి యశ్వంతరావు అను యువకుడికి తన కూతురు ముక్తాబాయిని ఇచ్చి వివాహం చేసింది.

ఆర్థిక క్రమశిక్షణ - ఆయుధాల సమీకరణ

అహల్యాదేవి పాలనా బాధ్యతలను గత నాల్గు ఏళ్ళుగా నిర్వహిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు కావచ్చు, పాలనా సంబంధ వ్యవహారాలు కావచ్చు. న్యాయ సంబంధమైన తీర్పులు కావచ్చు. ఆమె చాలా నిక్కచ్చిగా వ్యవహరించేది. నీతి, నిజాయితీకి పక్షపాతరాహిత్యానికి మారుపేరుగా అహిల్య ఎదిగింది. ఆమె మామగారు మాత్రమేకాదు. ఆమెతో పనిచేస్తున్న ప్రతివారు ఆమెను అభిమానించసాగారు. ఆమె వ్యక్తిత్వంపట్ల ఆకర్షితులై గౌరవించసాగారు. ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణకే ఆమె పరిమితం కాలేదు. ఆయుధాగారాన్ని తరచూ సందర్శిస్తూ ఏయే ఆయుధాలను సమకూర్చుకోవాలో అంచనావేసి, ఆయుధాగారాన్ని పటిష్టపరచసాగింది. ఆయుధాలు సమకూర్చుకోవటానికి తగిన నిధులను త్వరితగతిన విడుదల చేయాలని ఆదేశించింది. మామ మల్హార్రావు, కోడలు అహల్యాల కారణంగా హోల్కర్లు ఒక బలమైన సైనికశక్తిగా ఎదిగారు. అహల్యా ముందు చూపువలన వారి ఆయుధాగారంలో ఏ ఆయుధానికిగాని వెలితి ఉండేది కాదు.

మహిళల హక్కుల రక్షణకు, స్త్రీ స్వాభిమానానికి దీపస్తంభం

అహల్యాదేవి శకం మహిళాసాధికారతకు నిలువెత్తు దర్పణంగా నిలుస్తుంది. మహిళలను సాధికారులను చేయటానికి ఆమె గట్టి కృషి చేసింది. ఇంటికే పరిమితమయ్యే మహిళలను భుజంతట్టి, ధైర్యసాహసాలతో పురుషులకు మహిళలు తీసిపోరని ఉద్బోధించింది. స్త్రీల పట్ల వివక్షకూడదని సమాజానికి నేర్పింది. వితంతువులకు అండగా నిలచి స్వయం ఉ పాధి కల్పించింది.

విద్యావంతులు, మేధాసంపన్నులు, పండితులు కూడా వరకట్నమనే దురాచారానికి తల్లడిల్లుతుంటే, సామాన్యుల స్థితి ఏమిటో ఆమె కళ్ళకు గోచరించింది. అటువంటి దురాచారాన్ని తన రాజ్యంలో ఏ మాత్రమూ కొనసాగనీయరాదని ఆమె నిర్ణయం తీసుకొంది. పెళ్ళి అనేది ఆమె దృష్టిలో ఇద్దరు కలసి అన్యోన్యంగా, ఒకరికి ఒకరు తోడుగా కలసి బ్రతకటం. రెండు ఆత్మలు ఒకటి అవటం. అంతే కాని బేరసారాల ద్వారా దగ్గరపటంకాదు. ఆడపిల్లను హిందూధర్మంలో లక్ష్మీదేవితో పోలుస్తారు. అటువంటి ఆడపిల్లను సగౌరవంగా కోడలుగా తీసుకువెళ్ళాల్సినవారు వరకట్నం అడగటం ఏమిటని ఆమెకు అన్పించింది.

వెనువెంటనే వరకట్నాన్ని నిషేధిస్తూ ఒక శాసనం చేస్తూ, తన సందేశం ప్రజలందరికీ చేరేలా ప్రకటించుమని ఆదేశాలు యిచ్చింది. ఏ కులంవారైనా, ఏ మతం వారైనా వరకట్నం యిచ్చినా. పుచ్చుకున్నా అది నేరం అవుతుందని ఆ శాసనంలో పేర్కొన్నారు. వరకట్నం పుచ్చుకున్న వాళ్ళు పుచ్చుకున్నదానికి రెట్టింపు మొత్తాన్ని, యిచ్చినవాళ్ళు ఎంత యిస్తే అంతే మొత్తాన్ని, ఎవరైన మధ్యవర్తులు ఉంటే వారు ఎంత పుచ్చుకుంటే అంత మొత్తాన్ని హోల్కర్ల కార్యాలయానికి చేర్చాలని శాసనం చేసింది.

మహిళా సైనిక దళ నిర్మాణం

అహల్యాదేవి ఒక పూర్తి మహిళా సైనికదళాన్ని నిర్మించింది. ఏభైమంది మెరికల్లాంటి యువతులను ఎంపిక చేసి వారికి సైనిక శిక్షణ యిప్పించింది. చరిత్రలో అదొక అరుదైన ఘట్టం. మహిళలు సైనిక దుస్తులు ధరించి కత్తులు, ధనుర్భాణాలు, ఈటెలు చేపట్టి, పురుషసైనికులతో సమానంగా క్షాత్ర తేజాన్ని ప్రదర్శించటానికి సిద్ధమవటం ఒక అపూర్వఘట్టం. డెబ్భైవేల మంది సైనికులు అహల్యాదేవి కోసం పోరాడేందుకు సిద్ధమయ్యారు. అహల్యాదేవి శక్తి సామర్ధ్యాలను తక్కువగా అంచనా వేశామని, ఆమె తేలికగా లొంగిపోయే మహిళ కాదని, అనుకోని ప్రమాదం ఎదురైనా అసమాన ధైర్యం ఎదుర్కోగల మహిళయని, ఆమె జోలికి వెళ్లటం వృధా ప్రయాసని, అనవసరంగా రక్తం చిందించటమే తప్ప మరేమీ ఉండదని కుట్రదారులు గ్రహించారు.

విశాల భారతదేశం - జాతీయ భావన

యుద్ధాలు, రాజకీయాలు, సంధులు, గెలుపు ఓటములు, ధైర్యసాహసాలు, పట్టువిడుపుల గురించి చర్చలు - పాలనకు సంబంధించిన లోతైన అవగాహనను యిస్తాయని ఆమెకు తెలుసు. గోడకు తగిలించిన భారతదేశపు పటాన్ని చూస్తూ ఏ ప్రాంతంలో ఎవరిది పైచేయి అయిందో ఊహించడానికి ప్రయత్నించింది. విశాల భారతదేశ చిత్రపటంలో ఏ మూల ఏ ప్రాంతం ఉందో, ఏ నది ఎక్కడ మలుపు తిరిగి ఎటునుండి ఎటువైపు ప్రవహిస్తుందో, ఏ కొండకు, గుట్టకు ఎంత ప్రాముఖ్యం ఉందో, ఎవరెవరు ఏయే ప్రాంతాలను పాలిస్తున్నారో ఆమెకు కొట్టిన పిండి. దేశచిత్రపటాన్ని ఆమె తన మనసులోనే లిఖించుకొన్నది. మరాఠా సామ్రాజ్యపుటెల్లలు, బీదర్, విదర్భ, ఢిల్లీ, ఉత్తరాది ప్రాంతాలు, నిజాంపాలన క్రింద ఉన్న ప్రాంతాలు - ఇవన్నీ ఆమెకు ఎరుకే. భారతదేశంలోని ప్రతి చిన్న ప్రదేశం గురించి కూడా ఆమెకు క్షుణ్ణంగా తెలుసు.

కొత్త ఆయుధ కర్మాగారం ఏర్పాటుకు కృషి

అహల్యాదేవి గ్వాలియర్ వెళ్ళింది. ఒక కొత్త ఫిరంగుల తయారీ కర్మాగారాన్ని నెలకొల్పటానికి కావలసిన చర్యలను చేపట్టింది. వివిధ రకాల మరఫిరంగులు, వాటిల్లో ఉపయోగించే ఫిరంగిగుండ్ల గురించి ఆమెకు పరిజ్ఞానం ఉంది. ఫిరంగులు, గుండ్లు తయారీ నిపుణులకు కావలసిన నిధులను అహల్యా సమకూర్చడంతో, వారు రేయింబవళ్ళు కష్టపడి అసతికాలంలోనే ఒక కొత్త ఆయుధ కర్మాగారం గ్వాలియర్లో నిర్మించారు. ఫిరంగులను, అందులో ఉపయోగించే గుండ్లను తయారు చేయసాగారు. ఇదంతా అహిల్యాదేవి కృషివల్ల సాధ్యమయింది.

మన దేశాన్ని ఆంగ్లేయులు కైవసం చేసుకోవటంలో ఆంగ్లేయులు ఆధునిక ఆయుధాలు కలిగియుండటం ఒక ముఖ్యమైన అంశమని చెప్తారు. అయితే అహిల్యాబాయి నిర్మించిన ఈ ఆయుధ కర్మాగారంపట్ల చరిత్రకారుల చూపు సారింపబడలేదు. హిందూరాజులు తగిన ఆయుధాలను సమకూర్చుకోలేని అసమర్థులనే మాటయే నేటికీ ప్రచారంలో ఉంది.

కుటుంబంలో విషాదం తీరని లోటు

మల్హర్రావు ఆమెను కన్నకూతురి కన్నా మిన్నగా ప్రేమించాడు. అంతవరకు ఆమె గడిపిన జీవితమంతా ఆమెకు కళ్ళముందు ప్రత్యక్షమయింది. 12 ఏండ్ల బాలికగా హోల్కర్ల కోడలిగా, మొదటిసారి ఇండోర్ రాజభవనంలో అడుగుపెట్టినప్పటినుండి, మల్దార్ రావు, గౌతమీబాయిలు ఆమెను ఎంతో అపురూపంగా చూసుకున్నారు. అండగా నిలబడ్డారు. ఎన్నో నేర్పారు. అహిల్యాదేవి వ్యక్తిత్వం వికసించటానికి, ఎంతో సమర్థవంతంగా ఎన్నో క్లిష్ట పరిస్థితులను చక్కదిద్దేనేర్పు వారివలననే అహిల్య సొంతమయింది. భర్త ఖండేరావు, కూతురు ముక్తాబాయి మరణం ఆమెకు బాధకు గురిచేసింది. అత్త గౌతమీబాయి మరణం ఆమెకు చాలా పెద్ద దెబ్బ, దానిని ఏదో రకంగా అధిగమించింది. కాని మామ మల్హార్రావు మరణాన్ని మాత్రం ఆమె తట్టుకోలేకపోయింది. తన జీవిత వికాసానికి ఒక ఆధార స్తంభాన్ని కోల్పోయింది.

మహేశ్వర్ పట్టణం- సాంస్కృతిక వికాసం

ఇండోరు 90 మైళ్ళ దూరంలో నర్మదానది ఒడ్డున ఉన్న మహేశ్వర్ పట్టణానికి అహల్యాదేవి తన మకాంను మార్చుకోవాలని అనుకుంది. అణువణువునా ఆధ్యాత్మికత వెల్లివిరిసే మహేశ్వర్ పట్టణంలో నర్మదానది ఒడ్డున రాజరాజేశ్వర మహాదేవ ఆలయం ఉంది. పవిత్రమైన నర్మదానదిలో ప్రతిరాయికి శివలింగానికి ఉండేటంత విశిష్టత ఉంది. అహల్యాదేవి శివభక్తురాలు. అటువంటి పవిత్ర పరిసరాలలో చిత్తశాంతి కలుగుతుందని భావించి మహేశ్వర్లో అడుగుపెట్టగానే, దానిని అన్నివిధాల అభివృద్ధి చేయాలని ఆమె తలపెట్టింది. మహేశ్వర్ ప్రజలు తమకు ప్రియమైన మహారాణి తమ పట్టణాన్ని తన నివాసంగా చేసుకున్నందుకు ఎంతో సంతోషించారు. అనతికాలం లోనే ఒక విశాలమైన, నిరాడంబరంగా వున్న హాలులో అహిల్యాదేవి దర్బార్ ప్రారంభం అయింది.

ఇండోర్ కంటే మహేశ్వర్ రాజధానిగా ఉండటానికి తగినదిగా భావించింది. ఎందుకంటె మహేశ్వరు ఒకవైపు మరాఠాలు జయించిన భూభాగాలు ఉన్నాయి. మరొకవైపు ఇండోర్ ఉంది. ఇండోర్ హోల్కర్ల సైనిక స్థావరం. ఇంకొక కారణం మహేశ్వర్ అడుగడుగునా తొణికిసలాడే ఆధ్యాత్మికత, అడుగుపెట్టగానే ఆమెకు ఒక తెలియని మానసిక | ప్రశాంతత కలిగేది. మహేశ్వర్లో రాజభవన నిర్మాణం కూడా పూర్తి అయింది. దానితో ఇండోర్ రాజభవనం వదలి మహేశ్వర్ను తన స్థిరనివాసంగా మార్చుకుంది. అహల్యాదేవికి ఆ రాజ్యాన్ని సంరక్షించే శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయని అందరికీ తెలుసు.

అహల్యాదేవి మద్దతు కారణంగా వ్యాపార వాణిజ్యాలు మహేశ్వర్లో వర్ధిల్లుతున్నాయి. ఆర్థికంగా, వ్యాపారపరంగానే కాక మహేశ్వరు సాంస్కృతిక కేంద్రంగాను అభివృద్ధి చేయాలని ఆమె సంకల్పించింది. చేనేత వృత్తులవారికి తగిన ప్రోత్సాహాన్నిచ్చి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహేశ్వర్ చీరలను తయారుచేయిచింది. హోల్కర్ల ధీరత్వానికి కాణాచిగా, సాంస్కృతిక వికాసకేంద్రంగా కూడా విలసిల్లాలనేది ఆమె అభిలాష, ఇతర ప్రాంతాల నుండి ఆయా రంగాల నుండి నిష్ణాతులైన వారిని ఆహ్వానించాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రముఖ వైద్యులు, తత్త్వశాస్త్ర వేత్తలకు, శిల్పులకు, మేధావులకు, జ్యోతిషవేత్తలకు, కవులకు, రచయితలకు, విజ్ఞానశాస్త్ర పరిశోధకులకు తగిన రీతిలో ఆహ్వానపత్రాలు వ్రాసి, మహేశ్వరు తమ ఆవాసంగా చేసుకొమ్మని విజ్ఞప్తి చేసింది.

రైతులకు అండగా

రైతులకు అనుకూలంగా ప్రత్యేక చట్టాలు చేసింది. కరువు కాటకాలు వంటి అసాధారణ పరిస్థితి రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. మామిడి, నిమ్మ, చింత, రావి, మర్రి, అత్తి చెట్ల పెంపకానికి శాస్త్రీయ పద్ధతులు అవలంభించింది. తద్వారా భూగర్భ జలాల స్థాయిని పెంచింది. పేద రైతులకు భూముల నిచ్చింది. రైతులు తమ ఆదాయం పెంచుకోవడానికి వీలుగా, దేశంలో ఎక్కడైనా తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి స్వేచ్చ నిచ్చింది.

బిల్లులకు ఉపాధి కల్పన

పర్యాటకులకు సహాయకులుగా భిల్లులు పనిచేయాలని, తీర్ధయాత్రలకు వచ్చేవారిని నదులు దాటించటం, దేవాలయాలకు తీసుకొనివెళ్లటం వారి బాధ్యత అని, అందుకుగాను వారు పర్యాటకులు, యాత్రికుల నుండి కొంత రుసుం వసూలు చేసుకోవచ్చునని ప్రకటించింది. ఖిల్లుల నాయకులకు 'నాయక్' బిరుదును ప్రసాదించింది. వారిని అధికారికంగా ఆ విధంగా గుర్తిస్తూ అప్పటికప్పుడు సిద్ధం చేసిన నియామక పత్రాలపై రాజముద్ర వేసింది. సాగు చేసుకోవటానికి భిల్లులకు భూములను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

గొప్ప న్యాయనిర్ణేత

నిష్పాక్షికతకు మారు పేరే రాణి అహల్యా, ప్రజల అనేక వివాదాలను పరిష్కరించిన మంచి తీర్పరి, న్యాయనిర్ణేత, ప్రలోభాలకు లొంగేది కాదు. పక్షపాత బుద్ధి ఆమెకు లేదు. తమ రాణిగారి మీద ఆమె ప్రజలకు అపారమైన విశ్వాసం. ప్రతి రోజు ఒక నిర్ణీత సమయంలో ఆమె న్యాయదేవత పాత్రలో ఇమిడిపోయేది.

పొరుగు రాజ్యాలతో స్నేహం హిందూ సంస్కృతీ పరిరక్షణ

అహల్యాదేవి ఆలోచనలు తన రాజ్య క్షేమానికి మాత్రమే పరిమితమయ్యేవికావు. విశాల భారతదేశ అహల్యా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ఆలోచించేది. ఇరుగు పొరుగు రాజ్యాలతో అప్పుడప్పుడు కయ్యాలు వచ్చినా, ఆమెకు ఎవరిపట్ల శాశ్వత శత్రుత్వం లేదు. దేశంలోని రాజులందరూ కలసికట్టుగా పనిచేస్తే, దేశం సర్వతోముఖాభివృద్ధి ఐకమత్యంతో కలసి మెలసి ఉండటం జాతిక్షేమం, మనుగడ, అభివృద్ధి అవుతుందని ఆమె ఆశించేవారు. దృష్ట్యా అవసరమని ఆమె అందరితోనూ అనేవారు. హిందూ రాజులు, చక్రవర్తులు పగలు, స్పర్ధలతో రగులుతూ పరస్పరం దాడులు చేసుకోవటం, యుద్ధాలకు దిగటం ఆమెకు నచ్చేదికాదు. పైపెచ్చు అట్టి సంఘటనలు జరిగినప్పుడల్లా ఆమె ఎంతో బాధపడేవారు. ఆమెకు ఎంతో స్పష్టత ఉంది.

హిందువులలో ఐక్యతను సాధించటంమీద ఆమె దృష్టి పెట్టారు. హిందూ ఐక్యత వల్లనే దేశం సుభిక్షంగా మనగలదని ఆమె విశ్వాసం, ముస్లింలు హిందూ దేవాలయాలను నేలమట్టం చేసిన సందర్భాలు దృష్టికి వచ్చినప్పుడు, ఆమె చాలా బాధపడేవారు, దేవాలయాలను ధ్వంసం చేయకుండా మసీదులు నిర్మాణం చేసుకోలేరా అని అనుకొనేవారు. హిందువులకు ఎంతో పవిత్రమైన దేవాలయాలను వారు కూల్చటం వెనుకవున్న దురుద్దేశాన్ని ఆమె ప్రశ్నించేవారు. ఎవరైనా ముస్లిం ఫకీర్ ఆమె దర్శనానికి వచ్చినప్పుడు వారికి డబ్బు యిచ్చేది. వారి ద్వారా దేవాలయాలను విధ్వంసం చేయవద్దన్న తన సందేశాన్ని ముస్లిం రాజులకు, మత పెద్దలకు చేరవేయుమని అడిగేది. జరిగిన విధ్వంసం చాలును, మరింత విధ్వంసం జరగకుండా చూడండని విజ్ఞప్తి చేసేది కూడాను.

దేవాలయాల పునరుద్ధరణ

నాలుగు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అయిన బదరీనాధ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రిలలో అహల్యాదేవి ధర్మసత్రాలు కట్టించారు. యాత్రికులకు వసతి కల్పించారు. జ్యోతిర్లింగాలను పునఃప్రతిష్ట చేసారు. సప్తమోక్ష ద్వారాలు అయిన పవిత్ర పుణ్యక్షేత్రాలలో అనేక ధర్మకార్యాలు చేపట్టారు. శ్రీశైలం మల్లికార్జున, శ్రీ వైద్యనాధ, శ్రీ కాశీవిశ్వనాథ మందిరాలను నిర్మించారు. త్రివేణి సంగమం, ఆర్ ఎస్ ఎస్ స్థాపకులు హెడ్గేవార్ పూర్వీకుల గ్రామమైన కందకుర్తిలో (ఇందూరు జిల్లా) శివాలయాన్ని నిర్మించింది. శ్రీ సోమనాథ్, శ్రీ ఓంకారేశ్వర ఆలయాలలో మూర్తిప్రతిష్ఠలు చేసారు. బదరీనాథ్, ద్వారకా, రామేశ్వర్, జగన్నాధపురిలలో ధర్మశాలలు నిర్మించారు. అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ కాంచీ, అవంతికా (ఉజ్జయిని) వంటి ఆధ్యాత్మిక నగరాలలో తీర్థయాత్రికులకు సౌకర్యాలు కల్పించారు. మహారాష్ట్ర, మాల్వా ప్రాంతాలలో బావులు, ఘాట్లు, ధర్మసత్రాలు మొదలైన వాటిని అభివృద్ధి చేసారు. వందకు పైగా దేవాలయాలను నిర్మించారు. పాదచారులకు ఎండాకాలంలో చల్లని నీరు, శీతాకాలంలో వేడి నీరు త్రాగటానికి అందించే ఏర్పాటు చేశారు.

నేటి తరానికి అహల్యా బాయి స్ఫూర్తిప్రదాత

1767 సంవత్సరం నుండి 1795 వరకు ఇండోర్ రాజ్యాన్ని పరిపాలించిన ఆమె భారతదేశంలో గొప్ప గొప్పవారి ఘనమైన గుణాలను పుణికి పుచ్చుకొంది. ఛత్రపతి శివాజీ మహారాజ్, శంకరాచార్యులలో ఉన్న విశాలదృష్టి, ఆర్యచాణక్యుని పాలనా, దౌత్యనీతులు, సమర్థ రామదాసు, సంత్ జ్ఞానేశ్వర్ దివ్యత్వాల మేలుకలయికగా అహల్యాదేవి నిలుస్తారు. ప్రజాసమస్యల పట్ల సానుభూతి, అవగాహన ఉన్న ఒక కరుణాత్మకమైన నాయకత్వానికి ఆమె ఉదాహరణగా నిలుస్తారు. భీష్మాచార్యులవారు వర్ణించిన అన్ని ఆదర్శలక్షణాలు రాణి అహల్యాదేవిలో పుష్కలంగా ఉన్నాయి. దిలీపుడు, జనకుడు, ధర్మరాజులలో ఉన్న అనేక సద్గుణాలు ఈ ధీరవనితలో కన్పిస్తాయి. ప్రపంచములోని అనేక దేశాలను, ఆ దేశాలను పరిపాలించిన పాలకులను, వారిపాలనా తీరుతెన్నులను పరిశీలించిన తరువాత అహిల్యాదేవి ఏకైక స్పూర్తిదాయక పరిపాలకురాలని మనకు నిశ్చయంగా తెలుస్తుంది. అహిల్యా పాలన శాంతి సౌభాగ్యాలకు, సుస్థిరత్వానికి నిలయమై భారతదేశ చరిత్రకు వన్నె చిన్నెలు అద్ది, తరతరాలకు స్ఫూర్తిదాయకమై నిలుస్తుంది.

తన చివరి రోజులలో భగవన్నామ స్మరణతో మహేశ్వర్ మారు మ్రోగింది. మహా దేవుని ఆలయంలో శివ నామ స్మరణ శబ్దం తప్ప ఆమెకు మరేది వినబడటం లేదు. ఆమె ధ్యానంలోకి వెళ్ళింది. ఆమె శ్వాస క్రమంగా మందగించి 13 ఆగస్టు 1795 శ్రావణ మాసంలో ఆమె ఆత్మ పరమ శివునిలో లీనం అయింది. లోకమాత అహల్యాబాయికి భారతజాతి శ్రద్ధాపూర్వక జోహార్లు అర్పిస్తుంది. - MegaMinds

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Megamindsindia

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top