సావర్కర్ పై విషప్రచారం నిజమెంత? అబద్ధమెంత? - Savarkar life History - సావర్కర్ జీవిత చరిత్ర - 30

megaminds
0
సావర్కర్ పై విషప్రచారం నిజమెంత? అబద్ధమెంత?

కొండంత సావర్కర్ పై అసత్య ప్రచారాల అద్దంలో కొంచెమై ఉండేలా, కించ పరిచేలా ఇన్నేళ్ళ తరువాత ఇప్పుడు ప్రయత్నాలూ, కుయుత్నాలూ జరుగుతున్నాయి. సావర్కర్ త్యాగాలపై, ఆయన దేశభక్తిపై, ఆయన దృఢ సంకల్పం పై ప్రశ్న చిహ్నాలు తగిలించే తుచ్ఛయత్నం జరుగుతోంది.

వీటికి తగు జవాబునిచ్చి, నిజమేమిటో తెలియజెప్పి, ఈ తరానికి సావర్కర్ గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. 1997 ఏప్రిల్ 7న  ఫ్రంట్ లైవ్ అనే వామపక్ష పత్రికలో తొలిసారి సావర్కర్ పై విషం చల్లే ప్రయత్నం జరిగినప్పుడు శ్రీ జె.డి.జోగ్లేకర్ ఒక దీటైన జవాబు వ్రాశారు. దీనిని ముంబాయికి చెందిన హిందూ వివేక కేంద్ర వీర్ సావర్కర్ విండికేటెడ్; ఎరిఫై టు ఎ మార్క్సిస్టు కాలుమ్నీ అన్న పేరిట ప్రచురించింది. దానిలోని ప్రధానాంశాల ఆధారంగా ఇది రూపొందించడం జరిగింది. సావర్కర్ జీవన యజ్ఞాన్ని భగ్నం చేసి, ముసిపూసి మారేడుకాయ చేయడానికి కుట్రలూ కుహాకాలూ జరుగుతున్న తరుణంలో ఈ రచన జాతీయవాద పాఠకులకు కరదీపికగా ఉంటుందని ఆశిస్తున్నాం.

వీర సావర్కర్ మరణానంతరం అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ "సావర్కర్ మరణంతో ఒక సమకాలీన భారతం ఓ బృహెత్ విప్లవ కారుడిని కోల్పోయింది. ఆయన సాహసానికి, దేశభక్తికీ మారుపేరు. ఆయన విశుద్ధ విప్లవవాది. ఆయన నుంచి అగణిత జనగణం ప్రేరణ పొందింది." అని పేర్కొన్నారు. నిజానికి సావర్కర్ ఎవరో, ఏమిటో చెప్పేందుకు ఈ మూడు ముక్కలే చాలు.

అండమాన్ జైలులో బందీగా ఉన్న సమయంలో సావర్కర్ నిబద్ధత నీరై కరిగి, ఆయన నిస్సారమైపోయారని, ఆయన మనో దారుఢ్యం నీరసిల్లిందని ప్రచారం జరుగుతోంది. సావర్కర్ తన విడుదలకై బ్రిటిషర్ల పాదాలు పట్టుకున్నారని దుష్ప్రవారం జరుగుతోంది. ఇదే నిజమైతే అండమాన్ జైలు నుంచి విడుదలయ్యాక ఆయనను ఏ విప్లవవాదీ కలుసుకోకూడదు. కానీ సన్యాల్, భాయి పరమానంద్, శ్రీ అయ్యర్, శ్రీ భగత్ సింగ్, శ్రీ రాజగురు తదితరులెందరెందరో ఆయనను రత్నగిరిలో ఉండగా కలుసుకున్నారు. సావర్కర్ అనుచరులైన వామన్ రావ్ చవాన్ ధోబీ తలాబ్ వద్ద ఓ బ్రిటిష్ సార్జెంట్మ కాల్చి చంపాడు. ఆయనకు ఏడేళ్ళ శిక్ష పడింది. నాయక్ బ్రిటిష్ అధికారిని హత్య చేయగానే బ్రిటిషర్ లు రెండు వారాల పాటూ సావర్కర్ ను నిర్బంధంలోకి తీసుకున్నారు. మరో అనుచరుడు గోగటే బ్రిటిష్ గవర్నర్ హోట్సన్ పై కాల్పులు జరిపాడు. అందుకు ఆయనకు ఎనిమిదేళ్ళ శిక్ష పడింది. ఈ రెండు సంఘటనల వెనుకా సావర్కర్ హస్తం ఉందని బ్రిటిష్ ప్రభుత్వం దృఢంగా నమ్మింది.

అలాగే సావర్కర్ అండమాన్ జైలులో శిక్షను అనుభవించిన భాయి పరమానంద అనంతర కాలంలో సావర్కర్ ప్రాణప్రతిష్ఠ చేసిన హిందూ మహాసభకు అధ్యక్షులుగా పనిచేశాడు. లాహిరీ జనరల్ సెక్రటరీ హోదాలో పనిచేశారు. సావర్కర్ అండమాన్ నుంచి వచ్చిన తరువాత 1937 నుంచి 1943 వరకూ హిందూ మహాసభ సర్వాభినేతగా ఉన్న తరుణంలో ఆయనతో కలిసి పనిచేశారు. సావర్కర్ బ్రిటిషర్ల శరణువేడి, తొత్తుగా మారి ఉంటే వీరిరువురు ఆయన అనుచరులుగా నిలిచేవారా?

అదే విధంగా క్విట్ ఇండియా ఉద్యమనేత అచ్యుత్ పట్వర్థన్, సోషలిస్టు ఉద్యమసారధి ఎస్ జోషీలు సావర్కర్ ని రత్నగిరిలో ఆంక్షల పర్వం పూర్తి చేసుకున్నాక 1937లో కలిసి తమ సోషలిస్టు పార్టీలో చేరమని అభ్యర్థించారు. సావర్కర్ నీరసిల్లి, నిస్సారమై పోయినట్టయితే వారెందుకు ఆయనను తనపార్టీలోకి ఆహ్వానిస్తారు?

ఆంగ్లేయుల బెదిరింపులకు భయపడి సావర్కర్ హిందూ అనుకూల వైఖరిని మార్చుకున్నారన్న ప్రచారంలోనూ అర్థం లేడు. ఆయన జైలులో నుంచి విడుదలై రత్నగిరిలో ఉండగా హిందూ సమాజంలో మార్పుకోసం, ఐకమత్యం కోసం ఎంతగానో కృషిచేశారు. శ్రీ షిండే వంటి సామాజిక సంస్కర్త తన ఆయువు కూడా పోసుకుని సావర్కర్ సమాజ సేవ చేయాలని ఆకాంక్షించారు. సావర్కర్ ఉద్యమశీలతను గుర్తించిన మహాత్మాగాంధీ తన తీరికలేని పనుల నుంచి తీరిక చేసుకుని 1927లో రత్నగిరి పర్యటనకు వచ్చిన సందర్భంగా సావర్కర్ త్యాగనిరతిని ముక్తకంఠంతో ప్రస్తుతించారు. కేవలం సావర్కర్ పట్ల పుట్టు వ్యతిరేకత ఉన్నవారు మాత్రమే ఆయన గురించి లేనిపోని అసత్యాల్ని ప్రచారం చేయగలరు.

సావర్కర్ జైలులో అనుభవించిన కష్టాలను సైతం తక్కువ చేసి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సావర్కర్ జైలులో ఉన్న సమయానికి గాంధీజీ దక్షిణాఫ్రికాలో, నెహ్రూ లండన్లో ఉన్నారన్నది గమనార్హం. అండమాన్లో సావర్కర్ కు ఆరునెలల ఏకాంతవాసం, ఏడు రోజుల పాటూ చేతులకు బేడీలు వేసి నిలబెట్టడం, కాళ్ళను ఎడంగా ఉంచేలా సంకెలలు కట్టి పెట్టడం వంటి కఠినాతి కఠిన శిక్షలను ఆయన అనుభవించారు. మన స్వాతంత్ర్య సమరనేతల్లో ఇంతటి కఠినతర శిక్షలు అనుభవించిన వారెవరున్నారు?

పైగా సావర్కర్ తాను ఆంగ్లేయులకు లేఖలు వ్రాసి విడుదలకై ప్రయత్నించిన విషయాన్ని ఏనాడూ దాచలేదు. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని అండమాన్ లో ఆజన్మాంతం అన్న తన రచనలో వ్రాసుకున్నారు. సావర్కర్ సత్యాగ్రహాన్ని జైళ్ళకు వెళ్ళడాన్ని ఏనాడూ సమర్థించలేదు. ఒకవేళ అరెష్టయిన పక్షంలో ఎలాగోలా జైలులో నుంచి బయటకు రావాలని ఆయన భావించారు. ఈ విషయంలో ఆయన శివాజీని తన ఆదర్శంగా తీసుకున్నారు. ఔరంగజేబ్ చెర నుంచి  విడుదలయ్యేందుకు శివాజీ ఎన్నో హామీలను ఇచ్చాడు. కానీ విడుదలయ్యాక ఆ హామీలన్నీ గాలిలో కలిసిపోయాయి. సావర్కర్ కూడా అదే పద్ధతిని అనుసరించారు.

కాబట్టి సావర్కర్ ని గాంధీ సిద్ధాంతం ఆధారంగా బేరీజు వేయడం తగదు. ఒకవేళ ఆయన్ని ఎవరితోనైనా బేరీజు వేయవలసి వస్తే లెనిన్ తో వేయాలి. లెనిన్ జర్మన్ క్యాపిటలిస్టు ప్రభుత్వపు సీల్డ్ కారు స్వీకరించి అందులో బయలుదేరాడు. అయితే అక్కడ నుంచి ఆయన నేరుగా బోల్షివిక్ పార్టీకి నాయకత్వం వహించాడు. స్టాలిన్ తన శత్రువైన హిట్లర్ తో ఒప్పందాలు చేసుకున్నాడు. అయినా వీరిద్దర్నీ కమ్యూనిష్టులు ద్రోహులుగా పరిగణించరు. లెనిన్, స్టాలిన్ లు చేస్తే ఒప్పు. అదేపని సావర్కర్ చేస్తే తప్పు! ఇదెక్కడి న్యాయం?

అలాగే మోతీలాల్ నెహ్రూను ప్రభుత్వం జైలు నుంచి సెప్టెంబర్ 8, 1930 న బేషరతుగా విడుదల చేసింది. ఆయన అయిదు నెలల తరువాత చనిపోయారు. చనిపోయేటప్పుడు గాంధీ, నెహ్రూలు ఆయన చెంతనే ఉన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం వారిద్దర్ని బేషరతుగా విడుదల చేసింది. అదే విధంగా నెహ్రూ భార్య కమలానెహ్రు చికిత్స నిమిత్తం యూరోప్ వెళ్ళగానే, నెహ్రూను ప్రభుత్వం హఠాత్తుగా జైలు నుంచి విడుదల చేసింది. అదే సాయంత్రం ఆయన విమానంలో ప్రయాణం చేసి ఆమె వద్దకు వెళ్ళారు. బ్రిటిష్ ప్రభుత్వం సహకరించి ఉండకపోతే ఇదంతా జరిగి ఉండేదా?

మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వం సావర్కర్ విడుదలకు సదా మోకాలడ్డుతూనే వచ్చింది. ముంబాయి ప్రభుత్వం వినాయక్ సావర్కర్, గణేశ్ సావర్కర్ల శిక్షని ఏమాత్రం తగ్గించవద్దని భావించింది. రాణిగారి క్షమాభిక్షలో భాగంగా సావర్కర్ సోదరులను విడుదల చేయబోమని భారత ప్రభుత్వం 1919 లో ప్రకటించింది. అలాగే 1921 ఫిబ్రవరి 29న ముంబాయి ప్రభుత్వం సావర్కర్ ను అండమాన్ నుంచి ముంబాయి (పెసిడెన్సీకి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ లేఖ వ్రాసింది. అలాచేస్తే సావర్కర్ అనుకూలంగా భారీ ప్రజా ఉద్యమం తలెత్తవచ్చునని హెచ్చరించింది.

సావర్కర్ తో పోలిస్తే బ్రిటిష్ ప్రభుత్వం గాంధీ, నెహ్రూల పట్ల అత్యంత అనుకూల వైఖరిని ప్రదర్శించింది. ఉదాహరణకి 1922లో గాంధీజీకి ఆరేళ్ళ జైలు శిక్ష విధించడం జరిగింది. ఏ మాత్రం అవకాశం చిక్కినా జైలుశిక్షను తగ్గించి, తక్షణం విడుదల చేస్తామని సర్ రాబర్ట్ బ్రూమ్ ఫీల్డ్ ప్రకటించాడు. ఆయన్ని రెండేళ్ళ తరువాతే విడుదల చేశారు.

నెహ్రూ భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆమెను చూసేందుకు ఆయనను 11 రోజుల పాటూ విడుదల చేశారు. ప్రభుత్వం బేషరతుగా విడుదల చేసినా నెహ్రూ ఈ 11 రోజుల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లోనూ పాల్గొనలేదు. ఆయన అలా చేయరన్న నమ్మకం ఆంగ్లేయులకు ఉంది. కానీ సావర్కర్ విషయంలో ఆంగ్లేయులకు అ నమ్మకం లేదు. అందుకే ఆయన్ను విడుదల చేయడానికి ఇష్టపడలేదు.

నిజానికి గాంధీజీ ఆంగ్లేయుల అధీనంలో ఉంటూ స్థానిక స్వపరిపాలనకు అంగీకరించినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల్లో దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఇది సర్దుబాటు అని, శరణు జొచ్చడం మాత్రమేనని నెహ్రూ సైతం భావించారు. సహాయ నిరాకరణ ఉద్యమం అనంతరం కాంగ్రెస్ నేతలు మరోసారి జైలుకు వెళ్ళేందుకు సాహసించలేదు. దీనితో ఉద్యమం చల్లబడిపోయింది. అప్పటికి కాంగ్రెస్ వారు పూర్తిగా నీరసిల్లిపోయారు.

దీన్నిబట్టి నిజానికి నీరసించి పోయిందెవరో సులువుగానే అర్థం చేసుకోవచ్చు. సావర్కర్ అండమాన్ నుంచి షరతులతో విడుదలైనా సుభాష్ చంద్రబోస్, నెహ్రూలు ఆయన విడుదలను స్వాగతించారు. మనం నేతాజీ నెహ్రూల విచక్షణను నమ్మాలా లేక సావర్కర్ విరోధుల విష ప్రచారాన్ని నమ్మాలా?

ఇక హిందూ మహాసభను ప్రారంభించింది సావర్కర్ కాదు. 1915లో సావర్కర్ జైలులో ఉండగా స్వామీ శ్రద్ధానంద, లాలా లజపతిరాయ్, మదన్ మోహన్ మాలవ్యాలు దాన్ని స్థాపించారు. 1923లో హిందూ మహాసభ ప్రత్యేక సదస్సుకు ప్రథమ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. సావర్కర్ హిందూ మహాసభను ఒక రాజకీయ శక్తిగా చేశారు.

సావర్కర్ పిరికి వాడై ఉంటే ఆయన జీవితాన్ని ప్రాయోపవేశం ద్వారా ఆత్మత్యాగం చేసి ఉండేవారు కాదు. ఆయన హిందుత్వ వాదానికి జీవధార, నేడు హిందుత్వం ఒక తిరుగులేని శక్తిగా అవతరించింది. సావర్కర్ పై బురదజల్లినంత మాత్రాన హిందూ జగన్నాధ రథయాత్ర ఆగిపోదు.

సావర్కర్ పై దుమ్మెత్తి పోయడం, విషం చిలకడం కన్నా పాకిస్థాన్ ఏర్పడటానికి గల కారణాలను, పాకిస్థాన్ ఏర్పడి, భారత్ రెండు ముక్కలైనా ముస్లిం వేర్పాటువాదం విష వృక్షమై విస్తరించడానికి గల కారణాలను విశ్లేషించడం అత్యవసరం!

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Megamindsindia

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top