Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

హోలీ ఉత్తరాది పండుగా? హోళీ పండుగ శుభాకాంక్షలు Happy Holi

నెలలో వచ్చేటువంటి ప్రతి పౌర్ణమి కి మనం ఏదో ఒక పండుగ జరుపుకుంటాం. అయితే వసంత ఋతువు లో ఫల్గుణ మాసములో వచ్చే శుద్ద పౌర్ణమిని దేశం అంతా జరుపుకుం...


నెలలో వచ్చేటువంటి ప్రతి పౌర్ణమి కి మనం ఏదో ఒక పండుగ జరుపుకుంటాం. అయితే వసంత ఋతువు లో ఫల్గుణ మాసములో వచ్చే శుద్ద పౌర్ణమిని దేశం అంతా జరుపుకుంటారు‌. ఇది కులాలకతీతంగా, వర్గ, ప్రాంతాలకతీతంగా నిర్వహించుకోవడమే హోళీ లేదా హోలీ పండుగ విశిష్టత. ఈ మధ్య కొందరు మేదావులు ఇది ఉత్తరాది పండుగ అంటూ ప్రచారం చేస్తున్నారు. కాని ఇది వాస్తవం కాదు. దేశం అంతా ఈ పండుగను వివిధ పేర్లతో జరుపుకుంటారు.

ఆంధ్రా తెలంగాణ ల్లో కాముని పున్నంగా జరుపుకుంటారు. కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. సతీవియోగంతో విరాగిగా మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకున్నారు. మన్మథుడు శివుడిపైకి పూలబాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగించాడు. తపో భంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు.

అలాగే ఈ పండుగ ను తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది రోజుల పాటు గ్రామాల్లో జరుపుకునే ఆచారం ఇప్పటికీ వుందంటే ఆశ్చర్యం కలుగకమానదు. కొంచెం ఇప్పుడు సందడి తగ్గింది కానీ నా చిన్నతనంలో  భలే ఆడేవాళ్ళు.

హోలీ పాటలు భలే ఉంటాయి, కోలలు పట్టుకుని రిథమిగ్గా కొడుతూ అందుకు తగిన పాటలు పాడుతారు. ఆ ఆటను కాముడు జాజిరి అంటారు. జాజిరి జాజిరి దండాకోల్ అనే మకుటంతో పాటలు సాగేవి. ఇల్లిల్లూ తిరిగి ఆడుతూ పాటలు పాడుతుంటే ఆ ఇంటోళ్లు ధాన్యమో డబ్బులో ఇస్తారు.

ఆ ధాన్యాన్ని ఆ గ్రూపులోని పెద్ద ఇంట్లో జమ చేసేవాళ్లు లేదా ఏరోజుకారోజు ఊళ్లోని కిరాణాషాపులో అమ్మి డబ్బులుగా మార్చుకుని నమ్మకమైనవాళ్ల దగ్గర పెట్టేవాళ్లు. ఎనిమిది రోజులూ సాయంత్రం మొదలుపెట్టి రాత్రివరకు ఆడుతారు. పదో రోజు ఆడిన కోలలను కూడా వేసి కామదహనం చేస్తారు. వాడకో రెండు మూడు జట్టులుంటాయి. కామదహనం మరునాడు అంటే హోలీ రోజు ఎంతో సందడిగా జరుపుకుంటారు. పిల్లలతో పాటు పెద్దలూ జట్టుకట్టి సరదాగా ఆడుతారు. మరి మనం ఇప్పుడు చెప్పుకున్న దానిని బట్టి ఇది ఉత్తరాది పండుగా మీరే చెప్పండి. ఇదొక సామజిక సమరసతను, తోటి వ్యక్తుల పట్ల సద్భావనను పెంచే పండుగ హోలి పండుగ.

అలాగే ఇంకా ఈ హోలీ కి మరికొన్ని ఆధారాలు ఉన్నవి. హోలీ అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. ఫాల్గుణ శుధ్ధ పూర్ణిమ విశేష శక్తితో కూడినది. ఈ రోజున రాక్షస పీడ పోయేందుకు హోళికా అనే ఒక విధమైన శక్తిని ఆరాధిస్తారు. ఆమె ప్రీతి కోసం అందరూ కలిసి గానాలు చేయడం, పరిహాసాలాడడం చేస్తారు. హోలికాగ్నిని రగిల్చి ఆరాదించే సాంప్రదాయం ఇప్పుడు తగ్గిపోయి పరిహాసాది క్రియలే మిగిలాయి.

ఈరోజుననే శ్రీకృష్ణుని ఉయ్యాలలో వేసి ఆరాదించాలి. దీనిని డోలోత్సవం అని అంటారు. ఒరిస్సావంటి ప్రాంతాలలో డోలా పూర్ణిమ పేరుతో ఇప్పటికీ దీనిని ఆచరిస్తారు.

నరాడోలాగతం దృష్ట్వా గోవిందం పురుషోత్తమం !ఫాల్గుణ్యం  ప్రయతో భూత్వా గోవిందస్య పురంవ్రజేత్ !!

ఉయ్యాలలో అచింపబడిన పురుషోత్తముడైన గోవిందుని ఈరోజున దర్శించిన వారికి వైకుంఠలోకం ప్రాప్తిస్తుందని ధర్మశాస్త్రాల వాక్యం.

అలాగే 

హిరణ్యకశ్యపుడి పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే, అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించ గలిగాడు.

హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా , ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు , ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.

కష్టాలను తట్టుకుని నిలబడితే ఆనందాలు వస్తాయనే ఆశావహ దృక్పథాన్ని ఈ పర్వదినం ఆవిష్కరిస్తూ ఉంటుంది. మన ఆచార వ్యవహారాలను సజీవంగా నిలుపుతన్న పండుగలు. హోలీ పండుగను ఆదరించి, ఆచరించే ఈ పండుగ పురాణ ఇతిహాసాల్లోనూ చోటు సంపాదించుకుంది.

జ్యోతిర్లింగ క్షేత్రంలో కొలువై ఉన్న మహాకాళుడిని స్థానికులు ఉజ్జయిని క్షేత్ర రాజుగా భావిస్తారు. అందుకే ఏ పండుగైనా మొదట మహాకాళుని సన్నిధిలోనే జరుగుతుంది. హోలీ పూర్ణిమ ముందురోజు సాయంత్రం మహాకాళుని ఆలయ ప్రాంగణంలో హోలికా దహనం నిర్వహిస్తారు. అనంతరం గర్భాలయంలో జ్యోతిర్లింగానికి రంగులతో అభిషేకం చేస్తారు. మహాకాళునికి జయహో అంటూ గులాల్ చల్లుతారు. ఇదే సమయంలో ఆలయంలో వేచి ఉన్న భక్తులు సైతం రంగులు చల్లుకుంటారు. రంగులద్దుకున్న జ్యోతిర్లింగానికి ప్రత్యేక హారతినిస్తారు. మరుసటి రోజు ఉదయం కూడా భస్మహారతితో పాటు రంగుల హారతి కూడా నిర్వహిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగ ధామాల్లో హోలీ వసంతోత్సవం జరిగే ఏకైక క్షేత్రమిది. ఉజ్జయిని మహారాణి గండ కాళికా అమ్మవారి ఆలయంలో హోలీ సందర్బంగా శాస్త్రోక్తంగా భస్మ హోలీ వేడుకలు నిర్వహిస్తారు. కొన్ని చోట్ల వసంతోత్సవం జరుపుకుంటారు. ఇలా దేశం అంతా ఏదో ఒక పేరుతో జరుపుకునే పండుగ ఉత్తరాది పండుగా ఎలా అవుతుందో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి విమర్శకులు.

ప్రాథమిక పరిశోధనల ప్రకారం ఏడవ శతాబ్దంలో రత్నావళి అనే సంస్కృత నాటకం వలన హోలీ పండుగ ఉత్సవాలు జరుపుకొన్నారని తెలిసింది.

హోలీ విశ్వ వ్యాప్తంగా ప్రకాశించే రంగుల పండుగ. చిమ్మే తుపాకుల నుండి రంగు నీటిని జల్లుకుంటారు. సంగీత కచేరీల ద్వారా పండుగకు సంబంధించిన పాటలను మరియు రాధా మరియు కృష్ణ పురాణ ప్రేమ కథ గురించి పాటలు పాడేవారు.

సరిహద్దులో సైనిక దళాల హోలీ సంబరాలు జరుపుకోవడం కూడా మనం చూస్తుంటాం. సంవత్సరాలు గడుస్తున్నకొద్ది, ప్రవాసభారతీయులు ఉంటున్న చాలా ప్రాంతాలలో అనగా ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో, యూరప్ మరియు దక్షిణ ఆసియాకు దగ్గర ఉన్న ప్రాంతాలలో హోలీ పండుగను ఘనంగా జరపుకుంటారు. వసంత కాలంలో వాతవరణములో మార్పూలు జరగటం వల్ల వైరల్ జ్వరం మరియు జలుబు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకని , సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం.

సంప్రదాయముగా రంగులను నిమ్మ , కుంకుమ, పసుపు, బిల్వ లను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కొరకు, మోదుగ పుష్పములు రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలగి ఉంటుంది.  రసాయన రంగుల ఉపయోగం హానికరంగా తయారయ్యింది. వీటి వల్ల అంతుచిక్కని వ్యాధులు వస్తున్నాయి.  అలాంటి వ్యాధులు రాకుండా వుండాలి అంటే రసాయన రంగులను ఉపయోగించకుండా వుంటే మంచిది.

అలాగే కొంత పాశ్చాత్య మోహంలో పడి హోలి అంటే రోత పుట్టించే విధంగా కొందరు అసభ్యంగా జరుపుకోవడం కాస్త చిరాకు తెప్పించే విషయమే. హోలీ ఉత్సవాలు పురస్కరించుకుని కొన్ని జాగ్రత్తలు మనం తప్పనిసరిగా పాటించాలి. అవేంటో చూద్దాం....

👉 సమరసత పాటిస్తూ సంతోషకర వాతావరణంలో హోళి పండగ జరుపుకోవాలి.

👉 హోలీ పండగ రోజు సంప్రదాయ రంగులు ఉపయోగం ఆరోగ్యకరం.

👉 ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించొద్దు ఇబ్బంది కలిగించవద్దు. మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.

👉 కొన్ని శక్తులు కావాలని ఐక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంటాయి వాటి నుండి మనం జాగ్రత్త వహించాలి. అసత్య ప్రచారాలు నమ్మకుండా సంప్రదాయ పండుగలు ఏవైనా ప్రజలు కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలి.

👉 ద్విచక్ర వాహనాలపై వేగంగా మరియు సైలెన్సర్లు తోలగించి పెద్ద శబ్దాలు చేసుకుంటూ వెళ్ళవద్దు అది శబ్ద కాలుష్యాన్ని పెంచడమే కాక మన మానసిక ఒత్తిడిని పెంచుఫుంది.

అందరికీ హోలీ శుభాకాంక్షలు... జయ్ హిందురాష్ట్ర. నన్నపనేని రాజశేఖర్.

#Holi #Festival #Wishes #Traditional #colors #celebrations #HappyHoli

No comments