Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఓటు వేద్దాం భారత భవిష్యత్తు నిర్ణయిద్దాం

భారతదేశానికి ఇది అమృతకాలం: స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని  అమృత మహోత్సవాలు జరు...

భారతదేశానికి ఇది అమృతకాలం: స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని  అమృత మహోత్సవాలు జరుపుకున్నాం. అలాగే మన రాజ్యాంగం ప్రపంచంలోనే మహోన్నతమైన రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. 75 సంవత్సరాల ఈ కాలఖండంలో ఎన్నో ఎన్నికలు జరిగాయి. రాబోయే 18వ లోక్ సభ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్యాంగం మనకు ఇచ్చిన ప్రాథమిక హక్కులలో "ఓటు" హక్కు ఒకటి. ఈ ఓటు హక్కును వినియోగించుకోవడానికి 97 కోట్ల మంది భారత ప్రజలు సంసిద్ధమయ్యారు.

18వ లోక్ సభ ఎన్నికల ఓటర్ల జాబితా విడుదల: మార్చి 16న భారత ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ 18వ లోక్ సభ ఎన్నికల ఓటర్ల వివరాలు వెల్లడించారు. మొత్తం ఓటు హక్కు పొందిన వారి సంఖ్య 96.82 కోట్లు. ఇందులో మహిళలు 47.1 కోట్లు పురుషులు 49.72 కోట్లు. మొత్తం ఓటర్లలో 1000 మంది పురుషులకు 948 మహిళలు ఉన్నారు. కాగా ఇందులో మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకునే వారి సంఖ్య (18-19 వయసు) 1.82 కోట్లు. ఈ ఓటర్ల సంఖ్య 137 దేశాల జనాభా కంటే ఎక్కువ. అలాగే 20-29 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఓటర్ల సంఖ్య 19.74 కోట్లు. మొత్తం 29 సంవత్సరాలలోపు ఓటు హక్కుని వినియోగించుకునే వారి సంఖ్య 21.56 కోట్లు. మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకునే 1.82 కోట్లలో 85 లక్షల మంది మహిళలు ఉన్నారు. అయితే 2024 ఓటర్ల జాబితాలో 12 రాష్ట్రాల్లో పురుషుల కన్నా కూడా మహిళలు అధికంగా ఉన్నారు, అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. గతంలో జరిగిన లోక్ సభ ఎన్నికలలో 2019 - 91.2 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మొదటిసారి ఓటు హక్కు కలిగి ఉన్నవారు 1.5 కోట్లు. అదేవిధంగా 2014 లోకసభ ఎన్నికలలో 81.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మొదటి సారి ఓటు హక్కు 2.3 కోట్లమంది యువత ఓటు హక్కు కలిగిఉన్నారు‌. అయితే గత పది ఏళ్లలో (2014-2024) 81.5 కోట్ల నుండి 96.8 కోట్లమంది పెరిగారు. అంటే 15.3 కోట్లమంది ఈ పదేళ్ళలో ఓటర్లయ్యారు. 15.3 కోట్ల లో 1.82 కోట్ల మంది కొత్తగా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి సిద్దమయ్యారు.

యువత ఓటేయడం కోసం ఏంచేయాలి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీరిని ఉద్దేశించి నా దేశం కోసం నా తొలి ఓటు ( మేరా పెహలా ఓట్ దేశ్ కేలియే) అంటూ నినదించి ఫిబ్రవరి 28 నుండి మార్చి 6 వరకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఏడు రోజులు ప్రచార కార్యక్రమం వలన కొంత మేరకు యువతలో అవగాహన కలిగింది. ఇంకా జరగాల్సిన పని కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పని పెద్దగా జరగలేదని చెప్పాలి. యువతకు ఓటు హక్కు గురించి వివరించే సమయంలో ఈ స్లొగన్స్ అందించారు.
Mera Pehla Vote Desh Ke Liye
Your vote is your voice
Nothing like Voting, I vote for sure
Voting is your right
Our vote is our right
Lets vote ఈ నినాదాలతో దేశం అంత మారుమ్రోగింది.

ఎన్జీవోలు, విద్యార్థి సంఘాలు, సంస్థల పాత్ర: దేశవ్యాప్తంగా భారత ఎన్నికల విభాగం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కొన్ని ఎన్జీవోలు, సామాజిక సంస్థలు, విద్యార్థి సంఘాలు ఓటు హక్కును వినియోగించడం పై అవగాహన కల్పిస్తున్నాయి. కొన్ని సంస్థలు వివిధ పేర్లతో ఇంటింటికీ కరపత్రాలతో వెళ్లి ఓటును వినియోగించుకోవడంలో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రచార కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు సెమినార్లు నిర్వహించడం. ఓటు ప్రతిజ్ఞ చేయించడం. ఫ్లాష్ మాబ్ పేరుతో హడావుడి ఉండే సెంటర్లలో ఆటపాటలతో అలరించి ఓటు హక్కుని బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలి అంటూ ప్రచారం చేస్తున్నారు. మరికొన్ని సంస్థలు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నాయి. ప్ల కార్డులతో కూడళ్ళల్లో నిలబడటం. సామాజిక మాధ్యమాల్లో పోస్టర్లతో లక్షలాదిమందికి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక కార్యకర్తలు కొద్దిమంది ఓటు హక్కు వినియోగంపై ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇదంతా ఒక జాతరగా, పండుగలా జరుగుతుంది, ఇంకా జరగాల్సింది ఉంది.

నయా భారత్ వికసిత భారత్ లో ఇంకా ఓటేయమని చెప్పాలా: 29 సంవత్సరాల లోపు ఉన్న 21.5 కోట్ల మందికి నిజంగా మనం ఓటు హక్కు పై అవగాహన కల్పించాలంటారా! అంటే కల్పించాలని చెబుతాము. సహజంగా నేటి నయాభారతంలో యువత ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. ఈరోజు స్మార్ట్ ఫోన్ లేని వారు లేరు కనుక అన్ని విషయాలు అందరికీ తెలుస్తున్నాయి. ప్రపంచం వారి గుప్పెట్లో ఉంది ఇలా జరగడానికి కారణం ఈ అభివృద్ధికి కారణం ఎవరో వారికి తెలియదు అంటారా! 18 ఏళ్ల యువకులందరూ పదేళ్ల క్రితం అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతూ వెళ్లేవారు కానీ ఈరోజు ఏ గ్రామానికి చూసినా సిమెంట్ రోడ్డు ఉంది. అలాగే వాహన సౌకర్యం ఉంది. గ్రామాల్లో దాదాపు 3.75 లక్షల కిలోమీటర్ల మేర కొత్త రహదారులు యువత చూస్తున్నారు.

అమ్మ కట్టె పుల్లలతో అన్నం వండడం చూసినవారు, గ్యాస్ ఉన్నా పది రోజుల తర్వాత కానీ రాదు, ఇప్పుడు ఒక రోజులో ఇంటికి వస్తుంది. ఇప్పటికీ 10 కోట్ల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, దేశంలో ఈ 10 ఏళ్లలో ఇవ్వడం జరిగింది. అమ్మ  ఇంట్లో మరుగుదొడ్డి లేక బయటకెళుతుంటే అమ్మతో పాటే వెళ్ళిన పిల్లలు నేడు ఓటెయ్యడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు మరుగుదొడ్డి లేని ఇల్లే లేదు, 11 కోట్ల మరుగుదొడ్లు ఈ 10 ఏళ్లలో నిర్మించడం జరిగింది. పూరి గుడిసె నుండి పక్కా ఇళ్ల ద్వారా నాలుగు కోట్ల 10 లక్షల పేద కుటుంబాలకు పక్కా ఇళ్ళు నిర్మించడం జరిగింది‌. ఈ ఓటర్లలో ఆ పూరి గుడిసెలో ఉన్న యువత ఉన్నారు. పదేళ్ల క్రితం దీపాల కింద చదువుకున్న పిల్లలు నేడు విద్యుత్ కాంతుల మధ్య ఇంజనీరింగ్ లు చదువుతున్నారు. ఈరోజు భారతదేశంలో కరెంటు లేని గ్రామం లేదు అంటే ఆశ్చర్యం కలగకమానదు. అలాగే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలతో ఖాళీ భీడు భూముల్లో సోలార్ గ్రిడ్ ల ద్వారా విద్యుత్ అందించే స్థాయికి మన దేశ యువత ఎదిగారు. సరిహద్దు భద్రతకు తేజస్, రఫెల్ యుద్ధ విమానాలు చుస్స్తున్నారు. సబ్ మెరేన్ లు చూస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలలో పర్యాటక రంగాన్ని అద్బుతంగా తీర్చిదిద్దడం చూశాం, అండమాన్ నికోబార్ దీవులు, లక్ష దీవుల్లో ఏప్పుడూ లేనంతగా పర్యటకులు వెళుతున్నారు. నిత్యస్మరణీయులకి విగ్రహాలు అంబేద్కర్ కి పార్లమెంట్ లో, కర్తవ్య పథ్ లోనే తాజీ, నర్మదా నదిపై పటేల్, ఈశాన్యం లో లాచిత్ బర్ఫుకన్ ఇలా అనేక ప్రదేశాలు ఉన్న నాయకులకి అరుదైన గౌరవం. ధనవంతులకే కాక పేదవారికి, మొక్కలు నాటే వారికి, పర్యావరణ ప్రేమికులకి, జంతు ప్రేమికులకి అవార్డ్ లు చూస్తున్నారు.

వర్షాలు వచ్చి పంటలు పాడైతే ఏడ్చిన తల్లిదండ్రులను చూసిన పిల్లలు ఈరోజు కిసాన్ సమ్మాన్ ద్వారా పంట నష్టానికి పరిహారం చూస్తున్నారు. యూరియా కోసం సైకిల్ పై తండ్రి వెంట వెళ్లిన పిల్లలు నేడు సబ్సిడీ ద్వారా ట్రాక్టర్లు పొందిన తల్లిదండ్రులను చూస్తున్నారు. ప్రతి గ్రామంలో వ్యవసాయ సహకార సంఘాలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణాలో పసుపురైతుల కన్నీళ్ళ నుండి ప్రతిరైతు ఇంట్లో బంగారమే అయ్యింది. ప్రతి పంటకూ మద్ధతు ధర లభిస్తుంది. ప్రతి నాలుగు నెలలకు నేరుగా తండ్రి ఖాతాలో 2000 రూపాయలు జమ అవ్వటం చూస్తున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థని అద్బుతంగా చూస్తున్నాం, జనధన్ ఖాతాలు మొదలుకొని, డిజిటల్ ఇండియాలో భాగంగా బ్యాంకుల చుట్టూ ఎ.టి.ఎం ల చుట్టూ తిరగకుండా డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం. సంక్షేమ పథకాలన్నీ బ్యాంక్ ఖాతాలకే అందుతున్నాయి ఒక్క ఆంధ్రప్రదేశ్ లో తప్ప ఇది దోపిడీ అనే చెప్పాలి పెన్షన్ లు వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేతికిస్తున్నారు. అలాగే మధ్యం అమ్మకాలు క్యాష్ రూపలో తీసుకుంటున్నారు. ఇది ఎటువంటి అభివృద్దో ఆ రాష్ట్రప్రజలకు, నాయకులకే తెలియాలి. అక్కకు పెళ్లి అయ్యి ఉద్యోగం చేస్తున్నా, అల్లుడు, కోడలు పుడితే ఆరు నెలలు ఇంటిలోనే ఉండి పాలు ఇవ్వడం చూస్తున్నారు. అన్న సంపాదించే డబ్బుల్లో ఈపీఎఫ్ ద్వారా జమ అయ్యే డబ్బులు అవసరమైతే క్షణాల్లో తీసుకునే వెసులుబాటు నేడు ఉంది. మన ఊరికి పెద్ద రోడ్డు ఉంటే బాగుండు అనుకునే పరిస్థితి నుండి నేడు గ్రీన్ ఫీల్డ్ హైవేలు చూస్తున్నారు.

రైళ్లు ఎప్పుడు వస్తాయో లేదో తెలియదు అన్న పరిస్థితి నుండి నేడు వందే భారత్, నమో భారత్ ,అమృత భారత్ రైళ్ల వేగాన్ని చూస్తున్నారు. ఒకప్పుడు మెట్రో ఎక్కాలంటే మూడు నాలుగు నగరాలలో మాత్రమే ఉండేవి కానీ నేడు 20 నగరాల్లో మెట్రో రైళ్లు ఉన్నవి. ఎలక్ట్రిక్ బస్సులు చూస్తున్నారు. అదిగదిగో విమానం పోతోంది అంటూ చూసిన పిల్లలే నేడు ఓటరయి 149 విమానాశ్రయాల్లో విమాన యానం చేస్తున్నారు. మన రాయలసీమలో అయితే ప్రతి జిల్లాలో విమానాశ్రయం వుంది. ఆసుపత్రికి వెళ్లాలంటే భయపడే రోజుల నుండి ఆయుష్మాన్ భారత్ అకౌంట్ కింద 53 కోట్ల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు ఉన్నాయి. కరోనాతో ప్రపంచదేశాలన్నీ ఆరోగ్యం, సామాజిక రుగ్మతలతో అతలాకుతలం అవుతుంటే కరోనా వ్యాక్సిన్ అందించి చిన్నదేశాలకి పెద్దన్నగా నిలిచింది.

స్టార్టప్ కంపెనీ పెట్టాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది కానీ నేడు లక్షల్లో స్టార్ట్ అప్ కంపెనీలు పెడుతున్నారు ఈ యువ ఓటర్లు. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లో భాగంగా సెల్ ఫోన్లు తయారీ, రైళ్ల భోగిల తయారీ, మన బొమ్మలను తయారు చేసి ఇతర దేశాలకి అమ్ముతున్నారు. తీవ్రమైన సంక్షోబాల మధ్య వేగంగా అభివృద్ధి చెందుతూ 7.5 శాతం వృద్దిరేటు ని కొసాగిస్తూ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్ధికవ్యవస్థగా స్థానం సంపాదించింది. ఎప్పటి నుండో అమలుపరచాల్సిన సి.ఎ.ఎ చట్టాన్ని అమలులోకి తెచ్చి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ నుండి వచ్చిన హిందూ, సిఖ్, జైన్, క్రైస్తవులకి పౌరసత్వాన్నిస్తుంది. ఒకప్పుడు ఇతర దేశాల నుండి ప్రముఖులు వస్తే సమాధులు చూపించేవారు, నేడు గంగా హారతి, కాశీ కారిడార్, ఉజ్జయిని కారిడార్ లు చూయించి ఆధ్యాత్మిక సుగందాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు, ఇవన్నీ యువత చూస్తున్నారు, గమనిస్తున్నారు.

ఒకప్పుడు క్రికెట్లో గెలిస్తేనే పండుగా: దేశ యువత అందరూ రోడ్ల మీదకు వచ్చి సంబరాలు జరుపుకునేది ఒకేసారి అదీ క్రికెట్లో పాకిస్తాన్ పై గెలిచినప్పుడు మాత్రమే కానీ గత దశాబ్ద కాలంలో ఎన్నో పండుగలు జరుపుకున్నారు. ఎప్పుడు బయటకు రాని ముస్లిం మహిళలు కూడా "త్రిపుల్ తలాక్" రద్దుతో బయటకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో సాధారణ పౌరులను చంపుతుంటే చూసి భయపడ్డ మనం పొరపాటున మన పైలట్ అభినందన్ పాకిస్థాన్లో దిగితే 48 గంటల్లో మన దేశానికి అప్పజెప్పిన రోజు ఈ దేశ యువత సంబరాలు చేసుకుంది. ఉగ్రవాదులను పాక్ వెళ్లి మరి "సర్జికల్ స్ట్రైక్" చేస్తే ఈ దేశ యువత పండుగ జరుపుకుంది. గత 75 ఏళ్లలో కాశ్మీర్ ప్రజలను పట్టిపీడిస్తున్న "370 ఆర్టికల్" రద్దుతో దేశ యువత సంబరాలు జరుపుకుంది.

అఖండ భారతదేశాన్ని గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగష్టు 14 న అఖండ భారత్ దివస్  జరుపుకుంటున్నాం. జనవరి 26, ఆగష్ట్ 15 కాకుండా ఇంకా మనం ఎప్పుడూ జాతీయ జెండాకి వందనం చేయం అలాంటిది 15 రోజులపాటు ప్రతి ఇంటి మీదా జాతీయ జెండా ఎగరేసుకుని పండుగ జరుపుకున్నాం. ప్రధాని తిరంగా తో సెల్ఫీ పంపమంటే 16 కోట్ల మంది యువత జాతీయ జెండా తో సెల్ఫీ దిగి పంపి, పండగ చేసుకున్నారు. చట్టసభల్లో మహిళా బిల్లు పాస్ అయితే మహిళలంతా రోడ్లెక్కి పండుగ జరుపుకున్నారు‌. చంద్రయాన్-3 దక్షిణ ధ్రువం పై నిలిపి మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన రోజు పండుగ జరుపుకున్నాం. ఆదిత్య మిషన్ విజయం సాధించిన రోజు పండుగ చేసుకున్నాం. ఆసియా క్రీడల్లో భారత్ కి తొలిసారి 100 పథకాలు పైగా గెలిచిన రోజు సంబరాలు జరుపుకున్నాం. చారిత్రాత్మక G-20 శిఖరాగ్ర సమావేశాలు విజయవంతం చేసి సంబరాలు చేసుకున్నాం. 75 ఏళ్ల తర్వాత కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం,  సెంగోల్ ప్రతిష్ట చేసి సంబరాలు జరుపుకున్నాం. 500 ఏళ్ళ ఆకాంక్ష, హిందువుల స్వాభిమాన సంకేతమైన రామ మందిర నిర్మాణం, ప్రాణ ప్రతిష్ట ప్రతి ఇంటిలో దీపాలు వెలిగించి పండుగ చేసుకుంది. ఇలా ఎన్నో సందర్భాల్లో యువత జాతీయ జెండా పట్టుకుని వీధుల్లో వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా కాక అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ని చూసిన 21.5 కోట్ల మంది యువతకు ఇంకా మనం ఓటేయమని చెప్పాలా!

విదేశీ శక్తులతో జాగ్రత్త: జార్జ్ సోరోస్ లాంటి వ్యక్తులు హార్వర్డ్ విశ్వవిద్యాలయ కేంద్రంగా జరిపే రాజకీయాలకు, మన దేశపు ఆర్థిక ఉగ్రవాదులు కుటుంబ పాలకులు దేశం పై విషం చిమ్ముతున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది! నియంతృత్వం వస్తోంది!! ప్రజలంతా పేదరికంతో మగ్గుతున్నారు!!! సంతోషం అనేది చాలా తక్కువ!!!! అంటూ యువతను పక్కదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ముందు జరుగుతున్న అతి పెద్ద కుట్రను దేశ ప్రజలంతా జాగ్రత్తగా గమనించాలి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు కొన్ని విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా వరుసగా సొంత పైత్యాలతో వోకిజం పేరుతో ప్రజల్లో అయోమయం సృష్టించే నివేదికలను వదులుతున్నాయి. మణిపూర్ అల్లర్లని, రైతుల ధర్నా అని ఇలా ఎన్నో ఎన్నో పేర్లతో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీటన్నింటినీ తిప్పి కొట్టాలంటే యువతకు ఓటు హక్కును వినియోగించుకోవాలి అనే విషయం తెలియాలి.

యువ ఓటర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: దేశంలో యువత మధ్యానికి బానిసలవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ తాగుడు అలవాటు ముఖ్యంగా డిసెంబర్ 31 నాడు అలాగే ఎన్నికల సమయంలో కొత్తాగా మధ్యంసేవించే అలవాటవుతుంది కనుక రాజకీయనాయకులు మద్యం పంచకూడదు యువతను దూరంగా ఉంచే పనిజరగాలి, దూరంగా ఉండాలి. ఓటుకి నోటు ని కూడా యువత తిరస్కరించాలి. స్వాతంత్రోధ్యమ సమయంలో గోపబందు "నాశరీరం ఈ మట్టిలో కలిసిపోనివ్వండి" అన్నారు. రాంప్రసాద్ బిస్మిల్ "మాతృభూమి సేవలో రాలిపోయే వరమీయి తల్లీ" అంటూ రోధించారు. నేడు మనం ప్రాణత్యాగాలు చేయాల్సిన పనిలేదు. కేవలం ఎన్నికల రోజుని ఒక "హాలీ డే లా కాకుండా హోలి డే" గా బావించి అందరికిన్నా ముందే మనం ఓటు వేయాలి, వేయించాలి. ఓటు మన హక్కే కాదు ఓటు వేయడం మన బాధ్యత. రాజశేఖర్ నన్నపనేని, సామాజిక కార్యకర్త, సాందీపని మాస పత్రిక.

2 comments

  1. Manchi vishayam chepparu

    ReplyDelete
  2. పోటీలో ఉన్న అభ్యర్థులు మీకు నచ్చకపోతే నోటా కు మీ ఓటు వేయండి కానీ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి 🚩

    ReplyDelete