Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

స్వాతంత్ర్య సమరం సాగిన వేళ వ్యవస్థల విధ్వంసం - తంగేడుకుంట హెబ్బార్ నాగేశ్వర రావు - megaminds

ఒకటి కాదు వంద కాదు దురంతాలు వేలు వేలు.. ‘జిహాదీ’లు ‘పరంగీ’లు జరిపినట్టి ఘాతుకాలు ! ప్రతిఘటనా పౌరుషాగ్ని పెల్లుబికిన భరత సుతులు ప...

ఒకటి కాదు వంద కాదు
దురంతాలు వేలు వేలు..
‘జిహాదీ’లు ‘పరంగీ’లు
జరిపినట్టి ఘాతుకాలు !

ప్రతిఘటనా పౌరుషాగ్ని
పెల్లుబికిన భరత సుతులు
ప్రజాహృదయ సీమలలో
ప్రతినిత్యం స్మరణీయులు..

వేదాన్ని నిరంతరం వల్లించడమే జీవనంగా ప్రస్థానం సాగించిన పండితవంశాలలో అది ఒకటి. ఆ అవధాన వంశంలోని గంగాధరభట్టు పొలం పనులు పర్యవేక్షించడం కేవలం లాంఛనం! మైసూరు ప్రభువులు ప్రదానం చేసిన ఆ పొలాలు వారికి అప్పటికి దాదాపు నాలుగువందల ఏళ్లుగా అన్నం ప్రసాదించాయి! పండిరచిన కర్షకులు పంటలో ఆరవవంతు (షడ్భాగం) పన్ను రూపంలో పాలకులకు చెల్లిం చిన సమయం అది! అంటే రైతు పొలంలో ఆరు ‘బస్తాలు’ గింజలు పండినట్టయితే రైతు ఐదు బస్తాలను ఉంచుకొని ఒక బస్తాను పన్ను రూపంలో చెల్లించేవాడు! అంటే భూమిపై హక్కు దున్ని పండిరచిన వానిదే! అనాదిగా మనదేశంలో ఈ వ్యవసాయ వ్యవస్థ పరిఢవిల్లింది!

ఈ ఆరవవంతును అంటే పంటలో షడ్భాగాన్ని కర్షకుల నుంచి సేకరించడం మొదలు రాజ్య ప్రధాన కేంద్రానికి తరలించే వరకు అంచెలంచెలుగా ‘రాజనియోగ’ వ్యవస్థ ఏర్పడి ఉండేది! ‘గణకుడు’ పంట పండే భూముల వివరాలను తయారు చేసేవాడు! ఈ వివరాల ప్రాతిపదికగా ‘పల్లెల సమూహం’లో కళ్లాల వద్దకు లేదా ఇళ్ల వద్దకు వెళ్లి పన్ను సేకరించిన ‘వైశ్యుడు’ ఆ ధాన్యాన్ని బండ్లమీద ఆ ‘చట్రం’ లోని ప్రధాన గ్రామానికి తరలించేవాడు! ఈ పనిలో ‘అద్దికం’ వాళ్లు ఆ ‘వైశ్యుడి’కి సహకరించేవారు! ఇది అట్టడుగు స్థాయి! ఈ పన్ను లు మళ్లీ ‘చట్రం’లోని ప్రధాన గ్రామం నుంచి ‘విషయం’ ప్రధానకేంద్రానికి తరలిపోయేవి! ఐదారు పల్లెలు కలిపి ఒక ‘చట్రం’గా ఉండేది! పది నుంచి పదిహేను చట్రాలు కలిపితే ఒక ‘విషయం’! నాలుగైదు ‘విషయాలు’ కలసిన ప్రాంతం ‘పరగణము’. కొన్ని ‘పరగణాలు’ కలసి ‘మండలం’. ప్రతి రాజ్యం అనేక ‘సంస్థానాలు’గా ‘సంస్థానాలు’ ‘మండలాలు’గా వ్యవస్థీకృతం అయినట్టు స్థానిక చరిత్ర వల్ల తెలుస్తోంది! అంటే పల్లె, చట్రం, విషయం, పరగణం, మండలం, సంస్థానం, రాజ్యం! అఖండ భారత్ లోని సమీకృత రాజ్యాంగ వ్యవస్థలో యాబయి ఆరు రాజ్యాలు ఉండేవన్నది చరిత్ర ప్రసిద్ధం!!

ఇలా పల్లెలో సేకరించిన పన్ను అంచెలంచెలుగా రాజ్య కోశానికి చేరేది! ప్రతిస్థాయిలోను పన్నులో కొంత భాగం మినహాయించుకొని మిగిలినదానిని పైస్థాయి రాజ్య విభాగానికి పంపేవారు! ఇలా పల్లెకు, చట్రానికి, విషయానికి, పరగణాకు, మండలానికి, సంస్థానానికి, రాజ్యానికి ‘పన్ను’ లో భాగం లభించేది! యాబయి ఆరు రాజ్యాల పాలకులూ సామ్రాజ్యానికి పన్ను చెల్లించేవారు! ఇదే రీతిలో వర్తకం మీద లభించే ‘లాభం’లో కూడా ‘షడ్భాగం’ పన్ను రూపంలో రాజ్యానికి లభించేది!

అంటే పాలకులకు వ్యవసాయ భూమిపై పండిన పంటలో ఆరవవంతు పన్నుగా తీసుకొనే అధికారం మాత్రమే ఉండేది. భూమిపై అధికారం కర్షకునిదే, పండించిన వారిదే!! పాలకులు వివిధ సమయాలలో దేవాలయాలకు, సేవా సంస్థలకు, వేదపండితులకు, కవులకు, కళాకారులకు, అధికారులకు, ఉద్యోగులకు, గ్రామీణ వృత్తి నిపుణులకు భూమిని ప్రదానం చేసేవారు! అలా భూమిని పొందిన వారు తరతరాలుగా వంశపారంపర్యంగా ఆ భూమిని తమదిగా భావించేవారు.

అంటే కర్షకులు రాజ్యానికి చెల్లించవలసిన పన్నును ఇలాంటి సందర్భాలలో ఆయా ఆలయాలకు, పండితులకు ఇతర దానగ్రహీతలకు చెల్లించేవారు! పన్నును స్వీకరించినవారు అలా మారారు, భూమిని దున్నినవారు , పన్నును చెల్లించినవారు మారలేదు!! 

బోడిగుట్ట ప్రాంతాన్ని సోమరాజమల దక్షిణ ప్రాంగణం లోని భూములను గంగాధరభట్టు వారసులు, అవధానం వంశీయులు నిర్వహించిన తీరు ఇది. కర్షకులు రాజునకు కాక ఈ పండితులకు పన్ను చెల్లించారు! ఈ రాబడితో ‘జీవిక’ ఏర్పడిన గంగాధరభట్టు వంశీయులు నిరంతర వేదాధ్యయన వేదాధ్యాపన కార్యక్రమాలను అలా నాలుగు వందల ఏళ్ళు కొనసాగించారు! విజయనగర సామ్రాజ్యం ఆరంభ కాలంలో అంటే కలియుగం నలబయి ఐదవ శతాబ్ది మధ్యలో (పాశ్చాత్య శకం పదునాలుగవ శతాబ్దిలో) మైసూరు రాజులు గంగాధరభట్టు అన్న అవధాన వంశపు కుర్రవాడికి ‘బోడిగుట్ట’ ప్రాంతపు వ్యవసాయ క్షేత్రాలను ‘అగ్రహారం’గా ఇవ్వడం పూర్వ విదితం! అదే సమయంలో ‘కేసరాచార్య’ అన్న మరో వేదపండితుడికి సోమరాజమల ప్రాంగణం మధ్య భాగంలోని ‘తంగేడు వనాల’ ప్రాంతాన్ని విజయనగర పాలకులు ‘అగ్రహారం’గా ప్రదానం చేయడం కూడా పూర్వ విదితం! దాదాపు నాలుగువందల ఏళ్లు గడిచాయి ! ఈ రెండు పండిత అగ్రహారాలు పరిఢవిల్లాయి. గంగాధరభట్టు వంశంలోని మరో గంగాధరుడు ‘దేవకుంట’ ప్రాంతంలో ఇంటివైపునకు పొలం వద్ద నుంచి పరుగులు తీస్తూ వెళ్లిన దృశ్యానికి ఇదంతా శతాబ్దుల నేపథ్యం.

కొల్లగొట్టిన జిహాదీలు  పాడుపెట్టిన పరంగీలు:
గోసంతతి, వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, అటవీ ఉత్పత్తులు వికేంద్రీకృత భారతీయ ఆర్థిక వ్యవస్థకు అలా ఆధారస్తంభాలుగా నిలిచాయి! లక్షల ఏళ్లు పరిఢవిల్లిన ఈ వ్యవస్థను కలియుగంలో మూడువేల ఎనిమిది వందల ఏళ్లు గడిచిన తరువాత విదేశీయ ‘జిహాదీలు’ ధ్వంసం చేశారు! అంతకు పూర్వం పరిపాలకులు మారినప్పటికీ రాజ్యాంగ, సామాజిక వ్యవస్థలు మారలేదు! కర్షకులు, వర్తకులు, గోసంపన్నులు, అటవీ ఉత్పత్తికారులు చెల్లించిన ‘షడ్భాగం’ పన్ను మారలేదు! ‘జిహాదీ’లు ఈ వ్యవస్థను మన్నించలేదు. ధ్వంసం చేశారు! ‘జిహాదీ’లు పాలించలేదు, కొల్లగొట్టారు! గుంపులు గుంపులుగా పల్లెలలోకి చొఱబడిన ‘జిహాదీ’లు అన్ని ఇళ్లలోని ధాన్యం, వెండి, బంగారం, ఆభరణాలు కొల్లగొట్టుకొని పోయారు! ‘గణకులు’ నిర్మూలనకు గురి అయ్యారు! ‘వైశ్య’ నియోగులు ‘ అద్దికం శ్రామి కులు అంతరించారు! ప్రతిఘటించి నిలిచిన పల్లెలకు మిగిలిన ‘చట్రం’లోని గ్రామాలతోను ‘విషయం’తోను సంబంధాలు తెగిపోయాయి!

అంతవరకు రాజులు పాలకులు పాలెగాళ్లు ప్రభువులు మారినప్పుడు దేవాలయ, వేదపండిత, సేవాసంస్థల, వృత్తి కళాకారుల ‘మాన్యాలు’ మాత్రం యథాపూర్వంగా కొన సాగాయి. ‘జిహాదీ’లు ఈ వ్యవస్థను కూడ కుళ్లబొడిచారు, కుదేలుమనిపించారు! ‘పాలకులు’గా చెలామణి అయిన ఖిల్జీలు, తుగ్లక్లు, ‘బహమనీ’లు, మొఘలాయిలు, తరువాతి కాలంలో హైదర్అలీ, టిప్పుసుల్తాన్ వంటివారు పంటలో ‘మూడవవంతు’ పన్నుగా గుంజుకున్నారు! అంటే అంతకు పూర్వం ‘ఆరుబస్తాలు’ పండించిన రైతు ‘ఒక బస్తా’ గింజలు పన్నుగా రాజ్యానికి చెల్లించాడు! ‘ఖిల్జీ’ల నుంచి ‘జిహాదీ’లు ‘టిప్పు సుల్తాన్ వరకూ బీభత్సపాలన చేసిన కాలంలో ‘ఆరుబస్తాలు’ పండిరచిన కర్షకుడు ‘రెండుబస్తాల’ గింజలు పన్నుగా చెల్లించవలసి వచ్చింది! అంతవరకు ఉండిన పన్నుల సేకరణ వ్యవస్థ నశించి ‘దళారీ’లు విస్తరించారు! క్రమంగా ఈ దళారీలు భూమి యజమానులుగా స్థిరపడి కర్షకులపై కర్రపెత్తనం మొదలుపెట్టారు! దేశంలోని కొన్ని ప్రాంతాలలో ‘జిహాదీ’లు పంటలో మూడింట రెండువంతులు ‘పన్ను’ రూపంలో కొల్లగొట్టారు! అంటే ‘ఆరుబస్తాలు’ పండించిన రైతు ‘నాలుగుబస్తాలు’ పన్ను రూపంలో ‘జిహాదీ’ పాలకులకు చెల్లించవలసి వచ్చేది! ఫలితంగా లక్షలాది కర్షకులు వ్యవసాయం మానుకొని సంచార వర్తకులు కావలసి వచ్చింది! భూములు పాడుపడి కృత్రిమమైన కరవు కాటకాలు విస్తరించాయి! పాశ్చాత్య శకం పదిహేడవ శతాబ్ది లో దక్షిణ భారతంలో సంభవించిన భయంకరమైన ‘కరవు కాటకాల’కు అదీ కారణం. ‘ప్లాసీ’ కుట్ర తరువాత వంగ ప్రాంతంలోని జనాభాలో మూడవవంతు జనాభాను హతం చేసిన దుర్భిక్ష విలయం విస్తరించడానికి కారణం ‘పరంగీ’లు (ఆంగ్లేయులు), జిహాదీలు సాగించిన ఉమ్మడి దోపిడీ.

ఐదు దశాబ్దుల విధ్వంసం:
నాలుగు వందల ఏళ్లపాటు బోడిగుట్ట ప్రాంతంలోను దేవకుంట పరిసరాలలోను ప్రశాంతంగా జీవించిన ‘గంగా ధరభట్టు’ పరివారానికి కర్నాటక యుద్ధాలు, మైసూరు యుద్ధాల సమయంలో ఇక్కట్లు ప్రారంభం అయ్యాయి! కలియుగం 4848 నుంచి 4865 వరకు మూడు ‘కర్నాటక’ యుద్ధాలు జరిగాయి. పాశ్చాత్య శకం ప్రకారం 1746 నుంచి 1763 వరకు ‘పరంగీ’లకు (బ్రిటన్ వారికి) ‘పరాసుల’కు (ఫ్రాన్స్వారికి) మధ్య ఈ కుమ్మలాటలు జరిగాయి ! అవి మూడు కుమ్ములాటలు!! కలియుగం 4869 నుంచి 4901 వరకు ఆంగ్లేయు లకు, హైదర్ అలీ అతని కుమారుడు టిప్పూలకు మధ్య ఆధిపత్యపు పోరాటాలు జరిగాయి. ఈ నాలుగు కుమ్ము లాటల సమయంలో ఫ్రాన్స్వారు, మరాఠా వీరులు, హైదరా బాదీ నిజామీ జిహాదీలు యుద్ధాలు చేశారు! పాశ్చాత్య శకం ప్రకారం 1767-1799 సంవత్సరాల మధ్య జరిగిన నాలుగు కుమ్ములాటలకు ఆ తరువాత ‘పరంగీ’లు మైసూరు యుద్ధాలని పేరు పెట్టారు.

ఇలా కర్నాటక, మైసూరు యుద్ధాల పేరుతో యాబయి మూడేళ్లపాటు జరిగిన అధర్మ యుద్ధాల కాలంలో దక్షిణ భారతంలో స్వజాతీయ జనజీవనం భయంకర సంక్షోభాలకు బలయింది!

‘పరాసులు’ ‘పరంగీలు’ కొల్లగొట్టారు, విధ్వంసం చేశారు, తగలబెట్టారు, మహిళలను అవమానించారు! హైదర్ అలీ, టిప్పుల ద్వయం పెత్తందారీతనం ప్రబలిన తరువాత ‘జిహాదీ’లు ఇవన్నీ చేశారు. అదనంగా లక్షలమంది స్వ జాతీయ హిందూమతాలవారిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. హత్య చేశారు. స్వస్థలాల నుంచి తరిమివేశారు.

దేవకుంట వద్ద గంగాధభట్టు వంశంలోని మరో గంగా ధరభట్టు ఇల్లు అగ్నిజ్వాలలకు ఆహుతి కావడానికి ఇదీ నేపథ్యం. ప్రశాంతంగా ఉండిన మధ్యాహ్న సమయంలో ‘జిహాదీ’లు (తురకలు) దేవకుంటలోకి చొఱబడినారు! గంగా ధరభట్టు ఇంటి మీదికి మొదట దాడి చేశారు. తగుల బెట్టారు, వేదపండితుడన్నవాడు తమ ‘రాజ్యం’లో మిగలరాదన్న ‘హైదరాలీ, టిప్పుల దుష్టద్వయం’ విధానాన్ని జిహాదీలు అమలు జరపడం ఆరంభించారు. మైసూరు రాజ్యమంతటా ఇలా పండిత హననం ఆరంభమైంది, హైందవ నిర్మూలన కొనసాగింది!!

జిహాదీ తురకలు దాడి చేసిన సమయంలో దేవకుంట లోని యువకులు ప్రతిఘటనకు పూనుకున్నారు! కానీ సంఖ్యాధిక్యం కారణంగా జిహాదీలు పెట్రేగిపోయారు, గంగాధరుని ఇల్లు పూర్తిగా కాలిపోయింది! మండుతున్న ఇంటిపైకి కొన్ని గంధపు చెక్కలను విసిరి నమస్కరించాడట గంగాధరభట్టు!! అదే సమయంలో ముఖాలకు మసిపూసుకున్న కొంతమంది అజ్ఞాతవీరులు కొండలలో నుంచి ‘దేవకుంట’లోకి దూసుకొని వచ్చారు! ఆ ‘మసి ముఖాల’ వీరులు జిహాదీలను కొట్టడం మొదలుపెట్టారు! జిహాదీలు క్షతగాత్రులయ్యారు పారిపోయారు. ఆ ‘మసిముఖాల’ వారు ‘ఆంబోజగిద్దడు’, ‘కాంబోజరంగడు’, వారి అనుచరులు!! ఇప్పుడు గంగాధరభట్టు కుటుంబం సురక్షితం.

చీకటి దూకిన వేళల
చతికిల పడలేదు జాతి,
వేకువ విశ్వాసంతో
విప్లవించె భరత నీతి..
మతోన్మాది నోరు తెరచి
మంటలు కక్కిన నేల
విస్తరించె పర్జన్యుని
జల శరముల సమరహేల. : తంగేడుకుంట హెబ్బార్ నాగేశ్వర రావు. విశ్వహిందు పత్రిక 2023 మార్చి సంచికలో ప్రచురితము భారత్ మాతాకీ జయ్.

No comments