Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

భారతదేశ చరిత్రలో అంధయుగమని చెప్పవలసిన అవసరం లేదు

భారతదేశ చరిత్రలో సుమారు పన్నెండు వందల సంవత్సరాలు అంధయుగంగా చెపుతున్నారు. ఆ కాలం చరిత్ర తెలియడం లేదని భావం. కాని ప్రాచీన వాఙ్మయాన...


భారతదేశ చరిత్రలో సుమారు పన్నెండు వందల సంవత్సరాలు అంధయుగంగా చెపుతున్నారు. ఆ కాలం చరిత్ర తెలియడం లేదని భావం. కాని ప్రాచీన వాఙ్మయాన్ని గమనిస్తే ఇలా అంధయుగమని చెప్పవలసిన అవసరం లేదని తెలుస్తోంది. వ్యాసమహర్షి తండ్రి పరాశరుడు. ఆయన చెప్పిన విష్ణుపురాణం విషయ ప్రధానంగా ఉంటుంది. వర్ణనల వలన కలిగే విస్తరం దానిలో ఉండదు. ఇది మనకు చరిత్ర లభించే కాలానికి ముందునాటి మూడువేల సంవత్సరాలకు పైగా చరిత్రను చెబుతోంది.

పురాణానికి ప్రధానంగా అయిదు లక్షణాలు ఉంటాయి. సర్గ, ప్రతిసర్గ, వంశం, మన్వంతరాలు, వంశానుచరితం. పురాణంలో విస్తృతంగా ఉండేవి దేశ పాలకుల వంశాలు, ఆ వంశాలలో బయలుదేరిన మహానుభావుల చరిత్రలు. పురాణాలను సూతులు చెప్పేవారు. వీరు రథాలు కూడా నడిపేవారు. పూర్వం పరిపాలకులకు వందులు, మాగధులు, సూతులు ఉండేవారు. వందులు ఆ పాలకుడు చేసిన ఘనకార్యాలు చెప్పేవాడు. మాగధులు అతని వంశంలోని గొప్పవారి గురించి చెప్పేవారు. సూతులు ఇతర రాజవంశాల గురించి చెప్పేవారు.

విష్ణుపురాణంలో సూర్యవంశం, చంద్రవంశం, మగధవంశం మొదలయిన అనేక పాలక వంశాల గురించి ఉంది. మగధ వంశంలో జరాసంధుడు చాలా శక్తిమంతుడు, అతని తండ్రి బృహద్రథుడు. కాబట్టి ఇతని వంశం వారిని బార్హద్రథులు అంటారు. బృహద్రథునితో కలిపి ఈ వంశం వారు 23 మంది పాలించారు. జరాసంధుడు భీముని చేతిలో మరణించాడు. ఈ 23 మంది పేర్లు విష్ణుపురాణంలో ఉన్నాయి. వీరిలో చివరివాడు రిపుంజయుడు. ఇతని మంత్రి మునికుడు. అతడు రిపుంజయుని చంపి తన కొడుకు ప్రద్యోతుని సింహాసనంపై కూర్చోబెట్టాడు. ప్రద్యోత వంశం వారు అయిదుగురు. వీరి తరువాత శిశునాభ వంశం వారు పాలకులయ్యారు. వీరు పదిమంది. వీరిలో చివరివాడు మహానంది. ఈ మూడు వంశాల వారు 1050 సంవత్సరాలు పాలించారు. ఆ మహానందికి శూద్రస్త్రీ యందు జన్మించినవాడు మహాపద్ముడు. ఇతనిని నందుడని కూడా అంటారు. ఇతని కుమారులు సుమాల్యుడు మొదలగువారు ఎనమండుగురు. మహాపద్ముడు మొదలుకొని పరిపాలకులు శూద్రులు. మహాపద్ముని, అతని సంతానాన్ని కలిపి నవనందులు అంటారు. వీరు నూటొక్క సంవత్సరాలు పరిపాలకులు. కౌటిల్యుడు ఈ వంశాన్ని సంహరింపజేసి చంద్రగుప్త మౌర్యునికి పట్టాభిషేకం చేశాడు. ఈ వంశం వారు పదిమంది. 137 సంవత్సరాలు పాలించారు. వీరిలో చివరివాడైన బృహద్రథుని అతని సేనాపతి పుష్యమిత్రుడు చంపి ప్రభువయ్యాడు. వీరిది శుంగ వంశం. ఈ వంశం వారు 110 సంవత్సరాలు పాలించారు.

తరువాత కణ్వ వంశం వారు పాలకులయ్యారు. వీరు నలుగురు 45 సంవత్సరాలు పాలించారు. ఈ వంశంలో చివరివాడైన సుశర్మను అతని భృత్యుడు ఆంధ్రజాతీయుడు బలి పుచ్ఛకుడు చంపి తాను రాజయ్యాడు. బలిపుచ్ఛకుడి వంశానికి చెందిన పాతికమంది 456 సంవత్సరాలు పాలించారు. బృహద్రథుని దగ్గర నుంచి ఆంధ్రులలో చివరివాడైన సులోమాపి వరకు పాలకుల పేర్లను విష్ణుపురాణంలో పేర్కొన్నారు, వారి పాలనా కాలాన్నీ చెప్పారు.

ఆంధ్రభృత్యులు, ఆభీరులు మొదలయిన వారు ఏడుగురు, గర్దభులు 10 మంది, యవనులు ఎనమండుగురు, తురుష్కులు 14 మంది, ముండులు 13 మంది, మౌనులు 11 మంది మొత్తంగా 1090 సంవత్సరాలు పాలించారు. వీరిలో మౌనులు పాలించిన కాలం 300 సంవత్సరాలు. తరువాత కైంకిలులు, యవనులు ప్రభువులయ్యారు. వీరికి పట్టాభిషేకాలు లేవు. వీరి సంతానం వింధ్యశక్తి, పురంజయుడు, రామచంద్రుడు, ధర్మవర్మ, నందనుడు, సునంది, నంది యశుడు, శుక్రుడు, ప్రవీరుడు 106 సంవత్సరాలు పాలకులు. వీరి కుమారులు 13 మంది. బాహ్లికులు ముగ్గురు, పుష్యమిత్రులు, పటుమిత్రులు, ఏకలులు ఏడుగురు, కోసల యందు ఆంధ్రులు ఏడుగురు పాలించారు. వీరే నైషధులు. విశ్వస్ఫాటికుడు అనే నాయకుడు కైవర్తులను, పటువులను, పుళిందులను, బ్రాహ్మణులను ప్రభువులుగా చేశాడు.

పద్మావతీపురంలో తొమ్మిదిమంది నాగులు పరిపాలన చేశారు. గయ, గుప్తరాజ్యం, గంగాతీరం, ప్రయాగలను మాగధులు పాలించారు. కళిఙ్గ, మహిష, మహేంద్ర, భౌమ దేశాలను గుహులు పాలించారు. నైషధ, నైమిషిక, కాలక, శక జనపదాలను మణిధాన్యక వంశం వారు, త్రైరాజ్య మూషిక జనపదాలను కనకులు, సౌరాష్ట్ర, అవంతి, శూద్ర, ఆభీర దేశాలనూ, నర్మద, మరుభూమి దేశాలనూ వ్రాత్య, ద్విజ, ఆభీర శూద్రులు పాలించారు. సినుతట, దావికోర్య, చంద్రభాగ, కాశ్మీర దేశాలను వ్రాత్య మ్లేచ్ఛ శూద్రాదులు పాలించారు. వీరంతా ఏకకాలంలో వేరు వేరు భూభాగాలను పాలించేవారు.

పైన పేర్కొన్న వారిలో బృహద్రథుడు మొదలుకొని 39 మంది క్షత్రియులు పాలించారు. వారందరి పేర్ల జాబితాలున్నాయి. మహాపద్ముడు మొదలుకొని 57 మంది పాలించారు. వీరందరి పేర్లూ ఉన్నాయి. వీరిలో నవనందులు, చంద్రగుప్త మౌర్యుని నుంచి బృహద్రథుని వరకు గల పదిమందీ శూద్ర ప్రభువులు. తరువాత శుంగులు పదిమంది, కాణ్వులు నలుగురు, ఆంధ్రరాజు బలి పుచ్ఛకుడు మొదలైన 25 మంది. వీరిలో చివరివాడు సులోమాపికి ముందున్నవాడు చంద్రశ్రీ. ఇతని దగ్గర చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు ఉండేవారు. ఈ చంద్రగుప్తుడు అలెగ్జాండరుతో మాట్లాడినవాడు. కానీ, భారతదేశ చరిత్రలో మౌర్యచంద్రగుప్తుడినీ, చంద్రశ్రీ దగ్గర ఉన్న చంద్రగుప్తుడినీ ఒకరిగానే లెక్కించారు. దీనివల్ల వీరిద్దరికీ నడుమ ఉన్న 48 మంది పాలనాకాలం అదృశ్యమయింది. ఈ కాలమంతా అంధయుగంలో చేరింది.

బృహద్రథుని నుంచి 107 మంది పరిపాలకుల పేర్లు లభిస్తున్నాయి. వీరిలో అజాతశత్రువు, ఉదయనుడు, నవనందులు, చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు, అశోకవర్ధనుడు, శాతకర్ణి, పుష్యమిత్రుడు మొదలయిన వ్యక్తుల పేర్లు, కాణ్వులు, శుంగులు, ఆంధ్రభృత్యులు మొదలయిన గణనామాలు ఉన్నాయి. వ్యక్తులు కాకుండా వంశాలు, గణాల పేర్లు కూడా మనకీ గ్రంథంలో ఉన్నాయి.

జరాసంధుని నుంచి ఈ పాలకుల పరిపాలనా కాలాలు, పరిపాలక వంశాల పాలనాకాలం కలిపితే సుమారు 3397 సంవత్సరాలు వస్తున్నాయి. గణాల పాలనాకాలం దీనికి అదనం. దీని తరువాత చరిత్ర మనకు లభిస్తున్నదే. ఐదువేల సంవత్సరాల కంటె ఎక్కువ కాలం నుండి లభిస్తున్న ఈ గ్రంథాన్ని ఎందరు రాశారో! కాబట్టి దీనిలో అక్షరదోషాలు, లేఖకుల భ్రమ ప్రమాదాలు లేవనలేము. అయినా వంశాలు, వంశానుచరితాలు పరంపరగా చెప్పడమే వృత్తిగా కలిగిన సూతుల నుండి లభించిన గ్రంథం కనుక లభించే మిగిలిన ప్రమాణాలతో సమన్వయించి వీటిని గ్రహించాలి. ఈ విషయంలో పరిశోధన జరిపి ఎక్కువ గ్రంథాలు ఏకీభవిస్తున్న విషయాలను గ్రహించాలి. 107 మంది పాలకులు, వారి పాలనాకాలం లభిస్తూండగా ఇంకా అంధయుగం ఎందుకు?

సుమారుగా ఈ కాలాన్ని గుర్తించడానికి విష్ణుపురాణంలోనే మరో ఖగోళాధారం కూడా ఇచ్చారు. సప్తర్షుల చుక్కలలో మొదట ఉండే ఇద్దరి మధ్య ఒక నక్షత్రం అర్ధరాత్రి కనబడుతుంది. సప్తర్షులు ఆ నక్షత్రంలో నూరు సంవత్సరాలుంటారు. పరీక్షిత్తు కాలంలో సప్తర్షులు మఖానక్షత్రంలో ఉన్నారు (విష్ణు. 4.24–105, 106 శ్లో). ఇప్పుడు వేధశాల ద్వారా సప్తర్షులు ఏ నక్షత్రంలో ఉన్నారో గుర్తిస్తే పరీక్షిత్తు కాలం స్పష్టంగా తెలుస్తుంది.

మొదట జరాసంధ వంశ పాలనాకాలం, ప్రద్యోతాదుల పాలనాకాలం, శిశునాభాదుల పాలనాకాలం కొంత ఎక్కువ ఇచ్చారు. తరువాత పై ఖగోళాధారం ద్వారా దానిని సరిచేసి 1050 సంవత్సరాలని చెప్పారు. పాండవులు పట్టాభిషేక కాలంలో, పరీక్షిత్తు జనన కాలంలో సప్తర్షులు మఖలో ఉన్నారు. నందుని అభిషేక కాలానికి సప్తర్షులు పూర్వాషాఢలో ఉన్నారు. సప్తర్షులు ఒక్కొక్క నక్షత్రంలో నూరు సంవత్సరాలుంటారు. కాబట్టి నందాభిషేక కాలానికి 1050 సంవత్సరాలు అని చెప్పిన మాట శిలాశాసనం వలె ప్రామాణికం. పై విషయాలను బలపరిచే శాసనాధారాలు, శాస్త్రజ్ఞుల వాక్యాలు ఉన్నాయి. అవి వేరే వ్యాసంగా రాయాలి.

ఈ విషయాలన్నీ తెలియడం వల్ల లాభమేమిటని ప్రశ్న. భారతదేశ చరిత్రలో అంధయుగం తొలగడం మొదటి ప్రయోజనం. ప్రస్తుత భారతదేశ చరిత్రలో హిందువులు ఎవరితో ఎప్పుడు ఎలా ఓడిపోయారనే విషయాలే అధికం. వాటిని చదవడం వల్ల ఆత్మన్యూనతాభావం కలుగుతోంది. సుమారు 3800 సంవత్సరాల కాలం కంటె ఎక్కువ కాలం హిందువులు భారతదేశాన్ని సమర్థంగానే పాలించుకున్నారు. తరువాత అనైకమత్య దోషం వల్ల దేశం పరాధీనమయింది. అంతకుముందు ప్రపంచంలో ఎవరికీ తీసిపోలేదు, కొన్ని విషయాలలో ముందే ఉన్నారు అనే ఆత్మస్థైర్యం కలగడం మరో ప్రయోజనం.  చిఱ్ఱావూరి శివరామకృష్ణ శర్మ

No comments