Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

అంబేద్కర్ గురించి మనమందరం ఎందుకు తెలుసుకోవాలి?

ఏటివాలున ఈదేవారు ఎందరో ఉంటారు. ఏటికి ఎదురీదేవారు కొద్దిమంది ఉండవచ్చు. ఏటి నీటిని ఎదురు తిప్పేవారు ఎందరుంటారు? డాక్టర్ అంబేడ్కర్ ...

ఏటివాలున ఈదేవారు ఎందరో ఉంటారు. ఏటికి ఎదురీదేవారు కొద్దిమంది ఉండవచ్చు. ఏటి నీటిని ఎదురు తిప్పేవారు ఎందరుంటారు? డాక్టర్ అంబేడ్కర్ అలాంటి వ్యక్తి.

సాంఘిక దురాచారాలకు లొంగిపడి ఉండేవారు ఎందరో ఉంటారు. వాటిని ఎదిరించేవారు కొద్దిమంది ఉండవచ్చు. ఆ దురా చారాలను రూపుమాపడానికి కంకణం కట్టుకున్నవారు ఎందరుంటారు ? ఆ కృషిలో అద్భుత విజయాలు సాధించినవారు ఎందరుంటారు?

డాక్టర్ అంబేడ్కర్ అలాంటి అపురూప వ్యక్తి.

దళితులు, పీడితులు, ఉపేక్షితులు అంతా సగర్వంగా తల ఎత్తుకు తిరగాలి. అంతరాలూ అపోహలూ అంతమై సమాజంలో సమత మమతలు వెల్లివిరియాలి అదే ఆయన ఆలోచన, అదే ఆయన ఆకాంక్ష, అదే ఆయన ఆవేదన, అదే ఆయన కార్యరంగం, అదే ఆయన జీవన లక్ష్యం.

ఆ లక్ష్య సాధనలో ఎన్ని విజయాలు సాధించినా తృప్తి అనేది. ఎరగని వ్యక్తి ఆయన. తాను గొప్పవాడు కావడంతో ఆయన తృప్తిపడలేదు. ఆయనకు పెద్ద పెద్ద పదవులే లభించాయి. స్వతంత్ర భారతంలోని తొలి మంత్రి వర్గంలో ఆయన మంత్రి అయినారు. ఆ పదవి వల్ల దళిత జన సేవకు ప్రయోజనం లేదని తెలుసుకున్న మరుక్షణంలో ఆయన దానిని కాలదన్నారు. దళిత జన సేవకు ఇతర మార్గాలను చేపట్టారు.

అంబేడ్కర్ జీవితం త్యాగమయం, కర్మమయం, తపోమయం. ఆయన పలుకు, ఆయన వ్యవహరణ తీరు, ఆయన నాయకత్వ లక్షణం, ఆయన సంఘటనా దక్షత, అందరిని కలుపుకుంటూ ముందుకు పోవడంలో ఆయన చూపిన ప్రతిభ, ఆయన పాండిత్యం అన్నీ విలక్షణమైనవి. అట్టడుగు కుటుంబంలో జన్మించి, తనసంకల్ప బలంతో మహామనిషిగా ఎదిగిన వ్యక్తి ఆయన.

అంబేడ్కర్ లో మేధాసంపత్తి, కరుణాగుణం ఒండొంటితో పోటీ పడుతూ వుంటాయి. ఈ శుభ లక్షణాలు రెంటినీ సమపాళ్ళతో కలబోసుకున్న అరుదైన వ్యక్తిత్వం ఆయనది. ఆయన తన జీవిత చరమాంకంలో బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి ఒక కారణం ఈ మేలి కలయికయే.

అంబేడ్కర్ అక్షరాలా విప్లవవాది. సాహసంతో, ఆత్మ విశ్వాసంతో సుదీర్ఘ పోరాటం సాగించిన యోధుడు ఆయన. మహత్తర కార్యాలు సాధించాలనే పట్టుదల ఆయనకు పెట్టని సొమ్ము. అట్టడుగు మనిషి పడుతున్న పాట్లు పట్ల ఆయన మనసులోని వేదన ఆయన రచనలలో, ప్రసంగాలలో వ్యక్తమయ్యేది. ఆదర్శవాదం, దూరదృష్టి ఆయన జీవితంలో అడుగడుగునా కనిపించే అంతస్సూత్రాలు.

ఆనాడు బుద్ధుడు పంచశీలను ప్రపంచానికి ప్రబోధించాడు. తన జీవితం అంతటిలో ఆ బుద్ధుని బోధనలను మననం చేసుకున్న అంబేడ్కర్ మరో పంచశీలను దళిత ప్రజలకూ, దేశవాసులకూ, మానవాళికీ వారసత్వంగా ఇచ్చి వెళ్ళారు. విద్య, పోరాటం, సంఘటన, పునర్నిర్మాణం, ఐక్యత - ఇవే ఆ అయిదు సూత్రాలు.

అంబేడ్కర్ గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. వాటిని తొలగించి ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన కార్యాన్నీ, ఆయన సిద్ధాంతాలను తెలియజేసే ప్రయత్నమే ఈ వ్యాసాలు...

No comments