Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

భారతీయ కమ్యూనిస్టులెటువైపు? - About Communist's in Telugu

భారతీయ కమ్యూనిస్టులెటువైపు? అక్టోబర్ 14వ తేదీ నుంచి 5 రోజుల పాటు విజయవాడలో సిపిఐ 24వ జాతీయ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా విజయవాడ ...

భారతీయ కమ్యూనిస్టులెటువైపు?

అక్టోబర్ 14వ తేదీ నుంచి 5 రోజుల పాటు విజయవాడలో సిపిఐ 24వ జాతీయ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా విజయవాడ మహా నగరమంతటా ఎర్రజెండాలు, కమ్యూనిస్టు కార్యకర్తల ర్యాలీలు, కోలాహలం కనిపించాయి. ఓట్లు, సీట్ల సంగతెలా ఉన్నా కమ్యూనిస్టులకు ఈ తరహా ఆర్భాటం అలవాటే. ఒకరిద్దరు కమ్యూనిస్టులున్న చిన్న చిన్న గ్రామాలలో సైతం ఊరి మొదట్లోనే కమ్యూనిస్టు జెండాల రెపరెపలు మనకు తరచుగా కనిపిస్తూ ఉంటాయి.

ఆ సంగతలా ఉంచితే విజయవాడలో జరిగిన జాతీయ మహాసభలకు బంగ్లాదేశ్, నేపాల్, క్యూబా, ఫ్రాన్స్, రష్యా, కొరియా, చైనా వంటి 20 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఆయా దేశాల కమ్యూనిస్టు పార్టీల నుంచి తాము మోసుకొచ్చిన సందేశాలను మహాసభలలో వినిపించారు. అందులో భాగంగా చైనా కమ్యూనిస్టు పార్టీ పంపించిన సందేశాన్ని భారత సిపిఐ జాతీయ నాయకుడు పల్లపు సేన్ గుప్తా చదివి వినిపించారు. భారతదేశంలో సిపిఐ సాగిస్తున్న ప్రజాపోరాటాలకు తాము సంపూర్ణ మద్దతునిస్తామని చైనా కమ్యూనిస్టు పార్టీ తమ సందేశంలో తెలిపింది. భారతీయ కమ్యూనిస్టులు ఏ తరహా పోరాటాలు చేస్తున్నారో, వారికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఎలాంటి మద్దతునిస్తుందో కూడా తెలిపి ఉంటే బాగుండేది. భారత కమ్యూనిస్ట్ పార్టీల చరిత్ర మొత్తాన్ని పరికిస్తే వారు భారత జాతి నిర్మాణం కోసం, ప్రగతి కోసం పాటుపడింది శూన్యం. కార్మిక వర్గాల కోసం కమ్యూనిస్టులు చేసిన కొన్ని పోరాటాలు ఆయా కార్మిక వర్గాలకి కొన్ని తాత్కాలిక ప్రయోజనాలను కలిగించి ఉంటే ఉండవచ్చు గాక, అనేక ప్రభుత్వ, ప్రైవేటు పారిశ్రామిక సంస్థల పతనానికి మాత్రం కారణమయ్యాయి. నిజానికి కమ్యూనిస్టుల పోరాటాలన్నీ భారత ప్రగతికి నిరోధకాలయ్యాయి. కనుక ఇప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీలు చేసే భారత ప్రగతి నిరోధక పోరాటాలకు మద్దతునిస్తుందని మనం అర్థం చేసుకోవాలా?

పాపం మన కమ్యూనిస్టు జాతీయ నేత పల్లపు సేన్ గారు ఉత్సాహంలో చైనాపై పలు ప్రశంసలు కూడా గుప్పించారు. చైనా గణనీయమైన ప్రగతిని సాధించిందట. ప్రపంచ ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషిస్తోందట. మరే దేశాలకూ అలవి కాని రీతిలో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందట. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే చైనా, భారత్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో పనిచేస్తోందట. వరుస లాక్ డౌన్ లతో చైనా ఆర్థిక పరిస్థితి కుదేలైపోయిన సంగతి బహుశా మన భారతీయ కమ్యూనిస్టు మేథావులకు తెలియదేమో? ప్రపంచ ఆర్థిక రంగంలో చైనా క్రియాశీల పాత్ర పోషిస్తున్నదని ప్రశంసలు కురిపించిన మన కమ్యూనిస్టు నేతలకు, తన చౌకబారు వస్తువులను భారతీయ విపణిలోకి విచ్చలవిడిగా దిగుమతి చేసి భారతీయ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చెయ్యడానికి నిన్న మొన్నటి వరకూ చైనా చేసిన కుటిల యత్నాలు తెలియవనుకోవాలా? మరే దేశాలకూ అందని రీతిలో చైనా ప్రగతి పథంలో దూసుకు పోతోందని గొప్పల డప్పులు మోగించిన ఈ కమ్యూనిస్టు నాయకులకు ప్రపంచం పైకి కరోనా బూచిని వదిలి యావత్ ప్రపంచాన్ని, మానవాళిని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసిన చైనా దుర్మార్గం కనపడలేదా?

గాల్వాన్ లోయలో భారతీయ సైనికులను అన్యాయంగా పొట్టనపెట్టుకున్న చైనా నాయకత్వాన్ని ప్రశంసించడానికి మేథావులమని చెప్పుకునే మన నేతలకు నోరెలా వచ్చిందో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. చైనానింతగా పొగడ్తలలో ముంచెత్తుతున్న మన దేశ కమ్యూనిస్టు నాయకులు గాల్వాన్ లోయలో చైనా చేసిన భారత సైనికుల హత్యలకు నైతిక బాధ్యత వహిస్తారా?

చైనా, భారత్ పట్ల ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తోందట. అందుకేనా చైనా సైనికులు తూర్పు లడ్డాఖ్ లో బాసింపట్టు వేసుక్కూర్చున్నది? అందుకేనా భారత్ - చైనా సరిహద్దుల్లో అనునిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది? అందుకేనా భారత్ పొరుగునున్న దేశాలను నయానో భయానో లొంగదీసుకుని భారతదేశ భద్రతకు భంగం కలిగించే రీతిలో రోడ్లు, విమానాశ్రయాల, సైనిక స్థావరాలను, బంకర్లను ఏర్పాటు చేసుకుంటున్నది? అందుకేనా శ్రీలంకను బ్లాక్ మెయిల్ చేసి భారత రహస్యాలను కనుక్కోవడానికి శ్రీలంకకు అక్రమంగా తమ నిఘా నౌకను పంపింది? అందుకేనా దేశంలోని మేథావులను, మీడియాను కొనుగోలు చేసి భారత వ్యతిరేక వార్తలను, వ్యాసాలను పుంఖానుపుంఖాలుగా వండి వారుస్తున్నది? చైనాలో మీ కమ్యూనిస్టు మిత్రులేగా రాజ్యమేలుతుండేది? మీ మిత్రులతో మాట్లాడి వారి భారత వ్యతిరేక విధానాలను, సరిహద్దులలో వారి ఆగడాలను మీరు కట్టడి చేయగలరా?

భారత కమ్యూనిస్టు నాయకులకు ఎప్పుడండీ కనువిప్పు కలిగేది? చైనా తమ చుట్టూ ఉన్న ఏ ఒక్క పొరుగుదేశంతోనైనా సఖ్యతగా ఉన్నదా? తైవాన్ తో, జపాన్ తో, రష్యాతో, భూటాన్ తో, భారత్ తో అన్నిటితోనూ ఆ కయ్యాలమారి చైనాకు సరిహద్దు తగాదాలేనాయె. అన్ని చోట్లా దురాక్రమణ యత్నాలానాయె. అలాంటి దురాక్రమణ వాద దేశం దన్నుతోనా వీరు ప్రపంచ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది? భారతీయ కమ్యూనిస్టులు వారి నోటితో ఏనాడూ భారతదేశాన్ని, దేశ ప్రగతిని, దేశం సాధిస్తున్న విజయాలనూ ప్రశంసించి ఎరుగరే, చైనా, రష్యాలను మాత్రం తెగ పొగుడుతుంటారే, ఇక భారతీయ జనాభా వారిని విశ్వసించేదెలా? మాట్లాడితే లౌకిక వాదాన్ని పరిరక్షిస్తామంటూ ఊదరగొట్టే కమ్యూనిస్టులు, చైనా, తమ దేశంలోని లక్షలాది ఉయిగర్ ముస్లింలను బంధించి, వారిచేత గొడ్డు చాకిరీ చేయిస్తూ, పశువుల కంటే హీనంగా చూస్తూ ఉన్న తీరుపై ఏమని సమాధానం చెప్తారు? చైనాలో క్రైస్తవులపై నిత్యమూ జరుగుతున్న దాడులు, అణచివేత, చర్చిల కూల్చివేతలు, మూసివేతలపై ఏమని సమాధానమిస్తారు?

మరో విడ్డూరమైన విషయమేమిటంటే బంగ్లాదేశీ కమ్యూనిస్టులతో కలిసి భారతీయ కమ్యూనిస్టులు ఆసియాలో మతతత్వ శక్తుల విచ్ఛిన్నానికై కృషి చేస్తారట. అయ్యా భారతీయ కమ్యూనిస్టు మేథావులూ... బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి నిత్యం జరుగుతున్న అక్రమ చొరబాట్లను, వారికి ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు, ఇంటి స్థలాలు ఇచ్చి స్థానికుల గొంతు కోస్తున్న మమతా బెనర్జీ లాంటి కొందరు ముఖ్యమంత్రుల తీరును, బంగ్లాదేశ్ నుంచి కొనసాగుతున్న భారత వ్యతిరేక ఇస్లామిక్ తీవ్రవాద కార్యకలాపాలను మీరేనాడైనా ప్రశ్నించారా? బంగ్లాదేశ్ లోని మీ కమ్యూనిస్టు మిత్రులతో ఏనాడైనా చర్చించారా? ఆపటానికి కనీసం ప్రయత్నించారా? అసలు వాటిపై మీ వైఖరేమిటో ఎప్పుడైనా స్పష్టం చేశారా? అసలింతకీ మీరెటువైపు? భారత్ వైపా? భారత్ వ్యతిరేకుల వైపా? ముందది తేల్చండి. సభలు, సందేశాల సంగతి తర్వాత తేల్చుకుందాం. - శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి, 9550463236.

No comments