Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఆర్యసమాజ్ నాయకుడు - హైదరాబాద్ విముక్తి పోరాట యోధుడు అల్వాల బాల్ రెడ్డి - About Alwal bal reddy

అల్వాల బాల్ రెడ్డి ( ఆర్యసమాజ్ నాయకుడు - స్వాతంత్ర్య పోరాటయోధుడు ) జాతీయ భావాలు.... దీనజనోద్దారణ.... సంఘ సంస్కరణ... ఈ మూడు లక్ష్...

అల్వాల బాల్ రెడ్డి ( ఆర్యసమాజ్ నాయకుడు - స్వాతంత్ర్య పోరాటయోధుడు )
జాతీయ భావాలు....
దీనజనోద్దారణ....
సంఘ సంస్కరణ... ఈ మూడు లక్ష్యాల నిలువెత్తు స్వరూపం అల్వాల బాల్ రెడ్డి !

అటు భారత స్వాతంత్ర్య ఉద్యమం, ఇటు హైదరాబాద్ విముక్తి పోరాటం, ఈ రెండు పోరాటాలకు తన జీవితాన్ని అంకితం చేసిన నిజమైన త్యాగధనుడు బాల్ రెడ్డి చరిత్ర పెద్దగా వెలుగు చూడలేదు. స్వేచ్చా భారతి కోసం, నిజాం ఉక్కుసంకెళ్ళ ఛేదన కోసం, తహతహ లాడుతున్న వేలాది మంది ప్రజలను ఒక్కత్రాటి మీదకు తీసుకురావడంలో వీరి కృషి పట్టుదల చెప్పుకోదగినవి. కానీ వీరి త్యాగానికి తగిన గుర్తింపు లభించలేదు.

పరిచయం: రంగారెడ్డి జిల్లా గుండ్లపోచంపల్లిలో అల్వాల మల్లారెడ్డి నర్సమ్మ దంపతులకు రాజిరెడ్డి లక్ష్మారెడ్డిల తర్వాత 1916 లో మూడవ సంతానంగా బాల్ రెడ్డి జన్మించాడు తండ్రి మల్లారెడ్డి సాధారణ రైతు. వీరి కుటుంబం మొదటి నుండి క్రమశిక్షణకు పెట్టింది పేరు. ఈ క్రమంలో బాల్ రెడ్డి చిన్నతనం నుండే సనాతన విలులను దానగుణాన్ని మానవీయ విలువలను ఒంటబట్టించుకున్నాడు.

బాల్ రెడ్డి బాల్యంలో ఉన్నప్పుడే మల్లారెడ్డి మరణించాడు. ఈ పరిస్థితిలో హైదరాబాద్ పాతనగరంలో ఉండే మేనత్త బాల్ రెడ్డిని తన వద్దకు తీసుకువెళ్ళింది. ఆమె మంచి స్థితిమంతురాలు. కానీ మగ సంతానం లేదు. అందుకే బాల్ రెడ్డిని తన కొడుకుగా భావించింది. చదువు చెప్పించింది. మేనత్త చొరవతో సామాజిక పరిస్థితుల్లో బాల్ రెడ్డి ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. తర్వాత హిందీ విశారద పూర్తి చేశారు.

ముఖ్యంగా బాల్ రెడ్డి పుట్టేనాటికి తెలంగాణలో పరిస్థితులు నిజాం అధీనంలో బిక్కుబిక్కు మంటున్నాయి. భారతదేశంలో స్వాతంత్రోద్యమం జరుగుతున్నది.ఈ పరిస్థితితుల్లో బాల్ రెడ్డికి చిన్నతనం నుండే ఇంట్లో పెద్దల చర్చల కారణంగా పరిస్థితులపై ఒక అవగాహన ఏర్పడుతూ వచ్చింది.

ఈ క్రమంలో 12- 13 ఏండ్ల నాటికే బాల్ రెడ్డిలో ఊహించని పరిపక్వత మొదలయ్యింది. దేశం, మతం, సంఘం వంటి ఆలోచనలతో బాల్ రెడ్డి ఒక స్థిరమైన వ్యక్తిత్వాన్ని బాల్యం నుండే ఏర్పరచుకున్నాడు.

విదేశీవస్తు బహిష్కరణోద్యమం: 1930 లో భారత స్వాతంత్యోద్యమంలో భాగంగా గాంధీజీ విదేశీవస్తు బహిష్కరణోద్యమం ప్రారంభించాడు. ఈ ఉద్యమం ఆనాటి యువతపై పెద్దఎత్తున ప్రభావం చూపింది. ఫలితంగా యువత గాంధీ బాటలో నడుస్తూ విదేశీ వస్తు బహిష్కరణ , ఖాదీ వాడకాన్ని గూర్చి పల్లెపల్లెలో ప్రచారం చేయసాగింది. ఇందులో భాగంగా బొంబాయిలో విదేశీ వస్తు బహిష్కరణ గురించిన సభ జరిగింది. యధావిధిగా అందులో పాల్గొని ఎందరో యువకులను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అప్పుడు బాల్ రెడ్డి వయసు 14 ఏండ్లు. నూనూగు మీసాల వయసులో ఉన్నాడు. అయితేనేం..... గుండెల నిండా వయసుకు మించిన దేశభక్తి ఉంది. తోడుగా ఉడుకు నెత్తురు పంచుతున్న ఆవేశం ఉంది.

పైగా చిన్ననాడే పరిస్థితులను అవగాహన చేసుకొన్న అనుభవం ఉంది. ఇంకేం....ఆలోచన చేయకుండా గాంధీజీ పిలుపు అందుకుని బొంబాయి నగరం చేరి ధైర్యంగా ఉద్యమంలో పాల్గొన్నాడు. బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసిన యువతలో బాల్ రెడ్డి కూడా ఉన్నాడు. ఇందుకు యెర్వాడ జైలు పూనాలో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాడు. శాసనోల్లంఘనలో భాగంగా మళ్ళీ ముంబాయి నగరం వెళ్లి 1932 లో మళ్ళీ అరెస్టు చేయబడ్డారు. ఆరు నెలలు యెర్రవాడ సెంట్రల్ జైలులో చేరాడు.

వివాహం: బాల్ రెడ్డి దేశం కోసం ప్రవర్తిస్తున్న తీరు మేనత్తలో ఆందోళన కలిగించింది. పెళ్లి చేస్తే ఇంటి పట్టున ఉండిపోతాడని భావించి, తన కూతురు రత్నమ్మను ఇచ్చి పెళ్లి చేసింది. అయినప్పటికీ బాల్ రెడ్డిలో మార్పు రాలేదు. రోజు రోజుకు దేశభక్తి ఇనుమడించింది. చివరకు ప్రాణం కంటే దేశమే మిన్న అనే పరిస్థితికి వచ్చాడు. ఈ క్రమంలోనే హిందూ మతం పట్ల అచంచలమైన అభిమానంతో " దేశం ఒక్కటే - హిందువు ఒక్కటే " అని భావించడం మొదలెట్టాడు.

సంతానం:
బాల్ రెడ్డి రత్నమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. శకుంతల, ఉర్మిల, నాగమణి, శోభ, వీరిలో పెద్దమ్మాయి మినహా మిగతా ముగ్గురు పాఠశాల టీచర్లుగా పనిచేసి పదవి విరమణ చెంది ఉన్నారు. కుమారుడు వాచస్పతిరెడ్డి. వీరు కేశవ్ మెమోరియల్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా పదవి విరమణ పొంది వున్నారు.

ఆర్యసమాజ్ ప్రభావం: నిజాం కాలం ఒక చీకటి చరిత్ర ! తెలంగాణలో ప్రజలకు కనీస హక్కులు లేకుండా, మాతృభాషకు విలువ లేకుండా, కట్టుదిట్టమైన చీకటి శాసనాలు బతుకుల ఆవహించి ఉండేవి. దీనంగా బతుకులు వెళ్ళదీస్తున్న ప్రజల నుండి ప్రభువులు బలవంతంగా పన్నులు వసూలుచేసుకునే వారు. ఆ సొమ్ములతో ప్రభువుల వారికి విలాసం.....జనాలకు విషాదంగా ఉండేది. ఈ పరిస్థితుల్లో రామానందతీర్థ నేతృత్వంలో ఆర్యసమాజ్ ఉద్యమాలు, కమ్యూనిష్టుల ఆంధ్రమహాసభ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతమయ్యాయి.

ఇటువంటి పరిస్థితుల్లో బాల్ రెడ్డి మొదట్లో కమ్యూనిస్ట్ భావాలవైపు మొగ్గు చూపాడు. కానీ గాంధీజీ ప్రభావంతో దేశ మంతటా పర్యటిస్తూ కమ్యునిజంలో ఇమడలేక పోయాడు. ముస్లిం ప్రాబల్యాన్ని నిరసించాడు. అట్లాగే స్వామి దయానంద సరస్వతి బోధనల ద్వారా ఎంతో ప్రేరణ పొందారు. ఆ విలువల కోసం నిలబడ్డాడు. ఇక తనదైన అభిమతం ప్రకారం బాల్ రెడ్డి ఆర్యసమాజ్ వేదికగా తన పోరాటానికి పదును పెట్టాడు.

ముఖ్యంగా 1930 -1935 ప్రాంతం నుండి ఆర్యసమాజ్ కార్యక్రమాల పట్ల ఆకర్షితుడు అయ్యాడు. ఈ క్రమంలో ఆర్యసమాజ్ ప్రతినిధి సభకు కార్యదర్శిగా పనిచేశాడు. కార్యదర్శి హోదాలో హైదరాబాదు రాష్ట్ర ప్రజానికాన్ని జాగృతం చేసే బాధ్యతను భుజ స్కందాలపై వేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రజల్లో సామజిక రాజకీయ చైతన్యం కలిగించే ఉద్దేశంతో ఆర్యసమాజ్ ప్రతినిధి సభలను అవకాశం ఉన్న చోట్లల్లా ఏర్పాటు చేశాడు.

1942 క్విట్ ఇండియా ఉద్యమంలో: భారతదేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణ హైదరాబాదు ప్రాంతంలోనూ క్విట్ ఇండియా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. అప్పటికే హైదరాబాదులో నిజాం వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆంధ్రమహాసభతో పాటుగా కాంగ్రెస్ ఆర్యసమాజ్ యువకులంతా పెద్దఎత్తున ఉద్యమంలో పాల్గొని సమ్మెలు చేశారు. దారుల్లో ప్రదర్శనలు జరిపారు. ఆర్యసమాజ్ తరుపున బాల్ రెడ్డి ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. కాగా ఒంటరిగా కాదు, తన తరుపున గ్రామాల నుండి జనాన్ని స్వచ్ఛందంగా సమీకరించుకుని తన శక్తిని నిరూపించుకున్నాడు.

గణేష్ ఉత్సవాల్లో: భాగంగా నిజాం పాలనలో హిందూ మతానికి విలువలేదు. తెలుగు పండుగలకు కఠిన నియమ నిబంధనలు వర్తిస్తాయి. ఈ క్రమంలో 1942 వ సంవత్సరంలో గణేష్ పండుగ సందర్భంగా అల్వాల బాల్ రెడ్డి బహిరంగ ప్రసంగం చేసాడు. ఈ విషయమై సర్కారు గుర్రుమంది. నిబంధనలు అతిక్రమించిన నేరాన్ని మోపుతూ బాల్ రెడ్డిని అరెస్టు చేశారు. అంతేకాదు, అప్పటి పోలీసు కమిషనర్ ఇకమీదట బహిరంగ ప్రసంగాలు చేయకూడదని బాల్ రెడ్డిపై నిషేదం విధించారు. కానీ బాల్ రెడ్డి నిషేదాన్ని లెక్కచేయలేదు. లక్ష్యాన్ని సాధించడానికి నిషేధాన్ని అధిగమిస్తూ ముందుకు నడిచాడు.

హిందూ పండుగ ఉత్సవాలు కాబట్టి హైదరాబాద్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆర్యసమాజ్ సభ్యులు ఒక సమూహంగా ఏర్పడ్డారు.వీరిలో నారాయణరావు పవార్‌తో పాటు జగదీష్, గండయ్య, తదితరులు ఉన్నారు. వీరు అజ్ఞాతంలోకి వెళ్లి తమ కార్యాచరణ గురించి వ్యూహాలు సిద్ధం చేసుకోసాగారు.

నిజాంపై బాంబు ఘటనలో:  భాగంగా 1947 డిసెంబర్ 4 వ తేదీ.... అబిడ్స్ కింగ్ కోటీ ప్యాలెస్ సమీపంలో.... నారాయణరావు పవార్ బృందం అదును కోసం కాచుకుని ఉంది. నారాయణరావు పవార్ నిజాంపై బాంబు విసిరాడు . నిజాం పోలీసులు వీరిని పసిగట్టారు. సెషన్స్ కోర్టు నారాయణరావుకు మరణశిక్ష విధించింది. మిగతా ఇద్దరికీ జీవిత ఖైదు విధించింది. నిజాం సర్కారు అంతటితో వదిలి పెట్టలేదు. చర్య పూర్వాపరాలు విచారించింది. ఈ ఘటనలో ఉపయోగించిన బాంబులు అల్వాలా బాల్ రెడ్డిని తన స్వగ్రామమైన గుండ్లపోచంపల్లిలో తయారు చేశాడనే ఆరోపణలు వచ్చాయి. బాల్ రెడ్డి అరెస్టు అయ్యాడు.వాస్తవానికి నిజాంపై ప్రయోగించిన బాంబులు నారాయణరావు బృందం స్వయంగా బొంబాయిలో కొనుగోలు చేసింది. ఈ బృందానికి షోలాపూర్ వద్ద క్రిమినల్ లాయర్ కొండా లక్ష్మణరావు బాపూజీ వీరికి కలిసాడు. విషయం తెలిసి వీరికి ఆరువందల రూపాయలిచ్చి జాగ్రత్తలు చెప్పి కూడా పంపాడు. అంతేకాదు, బొంబాయిలో రెండు బాంబులు కొని, తిరుగు ప్రయాణంలో షోలాపూర్లో లక్ష్మణరావు ద్వారా రెండు రివ్వార్లను అడిగి తీసుకున్నారు. బాంబులు విఫలమైతె రివాల్వర్ తో పని కానివ్వాలనేది పథకం. మొదటి రెండు పధకాలు విపలమైతే మూడో మార్గంగా విషం తీసుకుని చావాలని మూడు విషం సీసాలను కూడా అడిగి తీసుకున్నారు. కానీ నేరం బాల్ రెడ్డి మీదకు మోపబడింది. ఇందుకు కారణం గమనిస్తే నిజంగానే బాల్ రెడ్డి బాంబులు తయారు చేస్తున్నాడు.

బాంబుల తయారీలో బాల్ రెడ్డి: రజాకార్లు వేళాపాళా లేకుండా గ్రామాలపై దాడిచేసి స్త్రీల మాన ప్రాణాలను దోచుకుంటున్నారు. ధాన్యాన్ని దొంగతనం చేస్తున్నారు. పసిపిల్లల మర్మాంగాలు కోస్తున్నారు. బలవంతంగా మతమార్పుడులకి పాల్ప పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రజాకర్లను నిరోధించడానికి బాల్ రెడ్డి ప్రత్యేకంగా బాంబులను సిద్ధం చేస్తున్నాడు. అట్లాగే నియంతృత్వంతో చెలరేగుతున్న నిజాం వివిధ ఆస్తులపై దాడి చేయడానికి కూడా బాల్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. ఈ క్రమంలో కమ్యూనిస్టులతో ఆయనకు ఇంతకుముందు ఉన్న స్నేహపూర్వక సంబంధాలు బాంబులు తయారు చేయడానికి సహాయపడ్డాయి. మొత్తానికి బాల్ రెడ్డిని దేశద్రోహిగా పరిగణించింది నిజాం ప్రభుత్వం. ఈ విషయమై అనివార్యంగా కొన్నాళ్ళు జైలుశిక్ష అనుభవించాడు.

ఇల్లు తగలబెట్టారు: బాంబు కేసులో బాల్ రెడ్డి అరెస్టయినప్పుడు, అతని కుటుంబం సర్కారు నుండి తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంది. ఇంటిని సమూలంగా తగులబెట్టారు. పిల్లలు మహిళలపై జాలి చూపకుండా అందరినీ హింసించారు. ఇటువంటి పరిస్థితిలో నిజాం రజాకర్లకు భయపడి ఆ కుటుంబానికి ఆశ్రయం ఇవ్వడానికి ఊరు కూడా వెనుకడుగు వేసింది. ఊరు చిగురుటాకులా వణికిపోయింది. చివరకు ఆ కుటుంబం కోటిలో అరకొర సౌకర్యాలు ఉన్న ఒక చిన్నగదిలో తలదాచుకున్నారు.

తబ్లీగ్ నుండి  శుద్ధి కార్యక్రమం: నిజాం కొనసాగించిన దాష్టీకాల్లో మతమార్పిడి ఒకటి. నిజాం అండదండలతో ఖాసిం రజ్వీ నేతృత్వంలో రజాకార్లు ఈ దారుణానికి ఒడిగట్టారు. హిందువులను, మరీ ముఖ్యంగా దళితులను ముస్లింలుగా బలవంతంగా మతం మార్పిడి చేశారు. ఈ చర్యను ‘తబ్లీగ్’ అనేవారు.

ఈ చర్య కారణంగా క్రమంగా గ్రామాల్లో హిందూ జనాభా తగ్గిపోవడం మొదలయ్యింది. ఈ పరిస్థితుల్లో ఆలస్యం చేస్తే మనుగడకే ముప్పు వాటిల్లుతుందని ఆర్యసమాజ్ భవిష్యత్తును అంచనా వేసింది. ఈ నేపథ్యంలో స్వామి రామనాదతీర్థ, ఆర్యసమాజ్ పండిట్ నరేంద్రజీ నాయకత్వాన్ని బాల్ రెడ్డి అనుసరించారు.

స్వామి దయానంద సరస్వతి ఉపదేశం ప్రకారం " పవిత్ర భారతదేశంలో పవిత్ర హిందూమతం వేదమతం. ఇది పునరుజ్జీవనంలో ఉన్నది. వేదాన్ని వదలొద్దు. వదిలితే "వేదాలకు తిరిగి వెళ్ళు" అనే నినాదాన్ని పాటించారు. హిందూ సమాజ రక్షణ కోసం వేదాంత యుద్ధాన్ని కొనసాగిస్తూ తబ్లీగ్ కు ధీటుగా " శుద్ధి " కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పద్దతి ప్రకారం ముస్లింగా మారిన వ్యక్తిని తిరిగి హిందూమతంలోకి తీసుకువచ్చే "ఘర్ వాపసీ " ప్రక్రియ కొనసాగింది. బాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో అహర్నిశలు కృషి చేసాడు. ప్రాణాలకు తెగించి పల్లెలు తిరుగుతూ ఎక్కడ తబ్లిగ్ జరిగిందో అక్కడ శుద్ధి కొనసాగించాడు. తిరిగి హిందూమతాన్ని స్వీకరించిన తరువాత కొందరు మహిళలకు సగటు సమాజంలో భవిష్యత్తు ఇబ్బందికరం అయ్యింది. ఇట్లాంటి మహిళలకు ఆర్యసమాజ్ ఉమ్దాబజార్ మందిరంలో ఆదర్శ భావాలు ఉన్న హిందూయువతతో వివాహం వివాహం జరిపించాడు బాల్ రెడ్డి. అంతే కాదు వారికి ఆశ్రయం రక్షణ కల్పించాడు.

శుద్ధి మతమార్పిడి సమయంలో అందరికీ భరోసా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఆశ్రితుల సంరక్షణ కోసం సొంత ఆస్తులను పోగొట్టుకున్నాడు. భార్య నగలు కూడా ఇందుకు వినియోగించుకున్నారు. రజాకార్లచే పీడించబడే ఆనాటి కొందరు జాతీయ భావాలు ఉన్న నిరుపేద ముస్లింలు స్వచ్ఛందంగా బాల్ రెడ్డి ఆధ్వర్యంలో హిందూమతాన్ని స్వీకరించారు. తిరిగి హిందూ మతంలోకి వచ్చిన దళితులు ఆర్యసమాజ్ ను పాటించారు.

1947 - 1948 సాయుధ పోరాటం: సాయుధ పోరాటం 1948 మే నాటికి ఉదృతం అయ్యింది. ఈ పరిస్థితిలో 1948 ఆగస్టు 24 వ తేదీన ""' హెదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్ కార్యాచరణ కమిటీ సమావేశం "" బెజవాడలో జరిగింది. ప్రాణాలకు తెగించి పోరాటాన్ని కొనసాగించాలని కమిటీ పిలుపునిచ్చింది. పోరాటం విషయంలో దృఢసంకల్పాన్ని కలిగి ఉన్న బాల్ రెడ్డి తన ఉద్యమ తీవ్రతను రెట్టింపు చేసాడు.

హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన నాయకుడిగా ఉన్న స్వామి రామానందతీర్థ నాయకత్వంలో ముందుకు నడిచాడు. సమాజాన్ని సంఘటితం చేయడంలో పల్లె పల్లె తిరిగాడు. జనాలతో మమేకం అయ్యాడు. జనాలను జాగృతం చేసాడు. కాగా ఈ విషయమై చరిత్రలో ఆర్యసమాజ్ కృషికి పెద్దగా గుర్తింపు రాలేదు. మొత్తానికి ప్రభుత్వం బాల్ రెడ్డిని గమనించింది. వివరాలు సమీకరించింది. భారత స్వాతంత్య్ర సంగ్రామానికి మార్గదర్శకుడిగా చేయడంతో మొదలెట్టుకుంటే.. రజాకర్లను ఎక్కడివాళ్లను అక్కడ నిలువరిస్తూ, నిజాంకు వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తుండటం వరకు అన్ని వివరాలు తెలిసాయి. ఫలితంగా నిజాం సర్కారు బాల్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపింది.

సమాజం కోసం: బాల్ రెడ్డి ఎప్పుడు కూడా పదవులు ఆశించలేదు. సమ సమాజాన్ని, సంఘ సంస్కారాన్ని ఆశించాడు. ఈ క్రమంలో కొన్ని పదవులు కూడా బాల్ రెడ్డిని వెదుక్కుంటూ వచ్చాయి.కానీ ఇవి వారి లక్ష్యం కాదు. అయినప్పటికీ పదవులకు న్యాయం చేస్తూ తన సంకల్పం కొనసాగించాడు.

ఆర్యసమాజ్ మందిరాలు: తెలంగాణ విముక్తిలో భాగంగా హిందూ యువకులు పోరాటాలకు సిద్ధం కావడం కోసం, మతమార్పిడుల నివారణ కోసం, ఆర్యసమాజ్ మందిరాలు నిర్మించాడు. ఆ మందిరాల పక్కనే శారీరక దారుఢ్యాలు పెంపొందించుకోవడం కోసం వ్యాయామశాలలు ఏర్పాటు చేశాడు.

స్త్రీ విద్య కోసం: వితంతు ఆచారాలు, బాల్య వివాహాలు, సతీ సహగమనం, వంటి దురాచారాలు రూపుమాసి పోవాలంటే స్త్రీకి విద్య అవసరం అని గుర్తించాడు. అందుకే వ్యయ ప్రయాసలకు ఓర్చుకుంటూ ప్రత్యేకంగా బాలికల కోసం 1949 లో హైదరాబాదులోని పాతనగరంలో దూద్‌బోలిలోని ఉమ్దాబజార్‌లో కస్తూర్భా పాఠశాలను స్థాపించాడు.

కులరహిత సమాజం కోసం: అల్వాలబాల్ రెడ్డి అస్పృశ్యత అంటరానితనాన్ని వ్యతిరేకించాడు. " కులం తక్కువ " మాటను పూర్తిగా వ్యతిరేకించాడు. సమ సమాజాన్ని నిర్మించడానికి కృషి చేశాడు. ఇందులో భాగంగా హరిజనుల కోసం ఒక రాత్రి బడిని ప్రాథమిక పాఠశాలగా స్థాపించాడు. దళితులు పగలంతా పనికి వెళ్లి రాత్రుళ్ళు చదువుకోవడానికి ఈ పాఠశాల సౌలభ్యాన్ని కలిగించింది.

వేదాలు - మంత్రాలు: హిందువులు అంతా ఒకటే అని హిందూసమాజం కోసం పరితపిస్తూ బ్రాహ్మణులకు అతీతంగా ఇతర కులాలకు వేదాలు మంత్రాలు నేర్చుకునే అవకాశం కల్పించాడు. ఇందుకు ప్రత్యేకంగా సంస్థను ఏర్పాటు చేసాడు. ఇందులో దళితులకు కూడా ప్రవేశం కల్పించాడు. సహపంక్తి భోజనాలు, హరిజనుల ఆలయ ప్రవేశం తదితర సంస్కరణలు కూడా బాల్ రెడ్డి కొనసాగించాడు.

వివాహాలు: అప్పటికి ఇప్పటికీ ఏ సమాజంలో అయినా కులాంతర మతాంతర వివాహాలు పట్ల అన్ని వర్గాలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అట్లాగే ఆనాటి సమాజంలో వితంతు వివాహాలు కూడా వ్యతిరేకించబడేవి. కాగా ఎవ్వరైనా ఇటువంటి వివాహాలు చేసుకోవాలి అనుకున్నప్పుడు బాల్ రెడ్డిని పెద్దదిక్కుగా భావించి ఆశ్రయించేవాళ్ళు. బాల్ రెడ్డి తన స్వంత ఖర్చులతో ఆశీర్వదించి, వాళ్లకు ప్రాణహాని ఉంటే తన వద్దే ఆశ్రయం కూడా ఇచ్చేవాడు. ఇందుకోసం తన ఇంటి వెనుక ఒక పెద్ద ఇంటినే ప్రత్యేకంగా కేటాయించి పెట్టాడు కూడా.

గజారోహణం: 
అల్వాలా బాల్ రెడ్డి 1958 లో ఆర్యసమాజ్ కార్యదర్శిగా అనేక సంస్కరణలు చేపట్టారు. హోలీ దసరా ఉత్సవాల సందర్భంగా ఆర్యసమాజ్ ద్వారా హిందూ సమాజానికి దశ దిశ నిర్దేశాలు చేస్తూ హిందూ సంప్రదాయాలను పటిష్టపర్చాడు. అప్పటికి తగ్గని ఉర్దూ ప్రాబల్యంలో హిందూ సమాజాన్ని ధైర్యంగా పాతబస్తీలో ముందుకు నడిపించాడు. వీరు చేసిన సేవలను గుర్తించి హైదరాబాద్ వీధుల్లో ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో గజారోహణం జరిపి సత్కరించారు.

భార్య రత్నమ్మ సహకారం: 
బాల్ రెడ్డి ఒక విశిష్ట వ్యక్తిగా ఎదగడానికి సహకరించిన వ్యక్తుల్లో భార్య రత్నమ్మను మొదటి వరసలో చెప్పుకోవచ్చు. బాల్ రెడ్డి పోరాట జీవితాన్ని, సంస్కరణ ఉద్యమాలను ఆదరిస్తూ వెంట నడిచింది. రత్నమ్మ ధనిక కుటుంబానికి చెందిన మహిళ. ఆమెకు పేదరికం తెలియదు. కానీ భర్త పోరాట జీవితంలో భాగస్వామ్యం అవుతూ ..... భర్తతో పాటుga నడవడానికి తన అన్ని భోగాలను వదులుకుంది. సౌకర్యవంతమైన జీవితం మొదలుకుని మంచి ఆహారం, మంచి బట్టలు ఆభరణాలను అన్నింటిని వదులుకుంది. రత్నమ్మ త్యాగం బాల్ రెడ్డిని ప్రజా బంధువుగా మలచడంలో పరిపూర్ణంగా తోడ్పడింది.

ముఖ్యంగా బాల్ రెడ్డి సమాజం కోసం పోరాటాలు చేస్తూ ఎక్కువ సమయం బయటే ఉండేవాడు. కుటుంబాన్ని అనివార్యంగా దూరంగా ఉండేవాడు. ఈ పరిస్థితిలో రత్నమ్మ కుటుంబాన్ని అన్నీ తానై చూసుకుంది .కుటుంబంలో సమస్యలను భర్త వరకు తీసుకెళ్లకుండా కుటుంబాన్ని కాపాడుకుంది.

నిర్వహించిన పదవులు: హైదరాబాదు ట్రేడ్ యూనియస్ కాంగ్రెస్ కు ప్రధాన కార్యర్శిగా 1942-1954 వరకు పని చేశాడు. 1952లో బుర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జి.వెంకటస్వామి, టి.అంజయ్య వంటి నాయకులుతో కలిసి ట్రేడ్ యూనియన్‌లో చురుకుగా పనిచేశారు. హైదరాబాద్ మొట్టమొదటి మునిసిపల్ కార్పొరేషన్ కు ( బల్దియా ) రెండుసార్లు కౌన్సిలర్ గా ఎన్నికై సేవలందించాడు. వరుసగా 1951-1956 లో రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

విదేశాల పర్యటన: బాల్ రెడ్డి రాజకీయాల్లో ఇమడలేక పోయాడు. రాజకీయాలను త్యజించి సామాజిక సేవకు పరిమితం అయ్యాడు. అట్లాగే తాను విశ్వసించిన ఆర్యసమాజ్ భావాల ప్రచారం కోసం బాల్ రెడ్డి దేశ విదేశాలు తిరిగాడు. 1960 లో మారిషస్‌కు వెళ్లి ఆర్యసామజ్ సూత్రాలను విస్తృతముగా వ్యాప్తి చేశారు. ఆర్యసమాజ్ లో సంపూర్ణ సామాజిక కార్యకర్తగా చెదరని ముద్రను స్వంతం చేసుకున్నాడు.

విమోచన దినోత్సవం: ప్రత్యేక తెలంగాణ కోసం కృషి చేసిన బాల్ రెడ్డి విముక్తి దినం 1948 సెప్టెంబర్ 17 న జైలులో ఉన్నారు.

మరణం: ఆగస్టు 29 , 1992 న బాల్ రెడ్డి పాతనగరం దూద్ బోలిలో ఉన్న తన స్వగృహంలో అనారోగ్యంతో మరణించారు. దేశం కోసం సమాజం కోసం, దేశంలో వ్యక్తి రక్షణ కోసం, మతం మనుగడ కోసం, అలుపెరుగక పోరాడిన బాల్ రెడ్డి భావితరాలకు ఆదర్శప్రాయుడు. చరిత్రలో చిరస్మరణీయుడు.

No comments