భారతదేశంలో జరిగే ఉత్సవాలు మన పూర్వజుల దార్శనికతకు మచ్చుతునకలు. సమాజం మనుగడకు, వికాసానికి అవసరమైన దృష్టికోణాన్ని, జీవన దిశను అందించే దివ్యౌషధాలు. మన జాతి అనాదిగా జరుపుకునే ఉత్సవాలలో శ్రావణ పౌర్ణమినాడు జరుపుకునే రక్షాబంధన్‌కు ఇటువంటి విశిష్టత, ప్రత్యేకత ఉంది. కాలగమనంలో సమాజ భద్రతకు, రక్షణకు సవాళ్లు ఎదురయ్యే సందర్భాలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఆ సమయంలో సమాజం మనోబలం నిలబెట్టి, వందరెట్లు పెంచి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని విజయాన్ని అందుకునే శక్తిని ఇచ్చేది రక్షాబంధన్ ఉత్సవం.
చారిత్రక కథనాలను బట్టి రక్ష: భవిష్యపురాణంలో రాక్షసుల దండయాత్రలో దేవేంద్రుడు బలహీనుడై ఓటమి అంచున ఉన్న సమయంలో ఇంద్రుని భార్య శచీదేవి దేవతలందరి తరపున దేవేంద్రునికి ‘యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బద్నామి రక్షేమాచలమాచల’ (దేనికి మహాబలసంపన్నుడైన బలిచక్రవర్తి కూడా వశమయ్యాడో, దానిని నీకు కడుతున్నాను. ఈ రక్షణ శక్తి తొలగకుండు గాక!) అని రక్షాసూత్రం కడుతుంది. ఆ శక్తి వలన దేవేంద్రుడు రాక్షసులపై గెలిచి విజయుడయ్యాడు. నాటినుండి రక్షాబంధన్ రోజున ఈ శ్లోకాన్ని పఠించడం ఆనవాయితీ అయింది.
తరువాతి కాలంలో రాజపుత్ర స్త్రీలు తమ రాజ్యానికి విదేశీయుల నుండి ముప్పు ఏర్పడినప్పుడు పొరుగు రాజులకు రక్షలు పంపేవారు. ఆ రక్షలు అందుకున్న రాజులు తమ సోదరీమణులకు రక్షాకవచంగా నిలిచి ఆ రాజ్యాలను రక్షించేవారు. ఈ విషయం తెలుసుకున్న అలెగ్జేండర్ ప్రేయసి కూడా మన పురుషోత్తముడికి రక్ష కట్టింది. విశ్వవిజేత కాంక్షతో మనదేశంపై దండెత్తిన అలెగ్జండర్‌పై జీలం నదీతీర ప్రాంత పాలకుడు పురుషోత్తముడు తలపడ్డాడు. ఆయన ధీరత్వాన్ని మెచ్చిన అలెగ్జండర్ ప్రేయసి రుక్సానా ఆయనకు రాఖీ కట్టింది. అలెగ్జండర్‌తో కత్తి ఝళిపించిన పురుషోత్తముడు తన చేతికి రాఖీ కనిపిం చడంతో తన యత్నాన్ని విరమించాడు. మహావీరుడు పురుషోత్తముడు సోదరి సమానురాలి ఆనందం కోసం బందీ కావడం రక్షాబంధన్ వెనుకగల బాధ్యత, పవిత్రత, సోదరసోదరీ బంధం విలువకు గొప్ప నిదర్శనంగా చెబుతారు.
ఒక సోదరి సోదరుడికి రాఖీ కట్టి సోదర భావన వ్యక్తపరుస్తుంది. ఇవాళ ఈ పండుగలో ఆమె తన రక్షణ కోరడం వరకు మాత్రమే పరిమితమైంది. దీని అంతరార్థాన్ని గ్రహించి, హిందూ సమాజాన్ని ఒక శక్తిమంతమైనదిగా నిలబెట్టడం కోసం మన సమాజంలో అందరిచేతా రక్షని ధరింపజెయాలి. ఈ ఉత్సవాన్ని సామూహి కంగా, సామాజికోత్సవంగా నిర్వహించాలి.
నేటి సమాజంలో మనమంతా ఒక్కటేననే, ఒకే సమాజ పురుషుని వారసులమనే భావన అడుగంటి కులం, భాష, ప్రాంతాల పేరుతో కొట్లాడు కుంటున్నాము. ఎక్కువ తక్కువ అనే భేదభావాలు, అంటరానితనం పేరుతో కొంతమంది మన సోదరులనే దూరం పెడుతున్నారు. వాస్తవానికి మన శాస్త్రాలలో, గ్రంథాలలో ఎక్కడా అంటరానితనం గురించి చెప్ప లేదు. మధ్యయుగంలో అనేక విదేశీ దురాక్రమణల పర్యవసానంగా కాలక్రమంలో ఈ దురాచారం మన సమాజంలో చొరబడింది. దాన్ని దూరం చేసి సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది.
మన దేశంలోని తిరుపతి, శ్రీశైలం, అయోధ్య, మధుర, కాశీ లాంటి దేవస్థానాలలో అంటరానితనం లేదు. అందరికి ప్రవేశం ఉంది. అంటే మన శాస్త్రాలలో, మన వ్యవహారంలో దానికి స్థానం లేదని అర్థం అవుతుంది. కానీ, చిన్న గ్రామంలోని చిన్న ఆలయంలో ఈ వివక్ష కొనసాగడమంటే అది దురాచారమే.
మనిషి దేశవిదేశాల్లో తన మేధస్సుద్వారా బుల్లెట్ రైళ్లు, సూపర్ కంప్యూటర్లు కనుగొన్నాడు. కాని మానవ సంబంధాలను మెరుగుపరుచుకునే విజ్ఞానం కనుగొనలేదు. వ్యక్తికీ కుటుంబంలోని మరొక వ్యక్తికీ మధ్య, ఒక కుటుంబానికీ మరొక కుటుంబానికీ మధ్య, మెరుగైన సంబంధాలు ఎంతో అవసరం. అలాగే మన కుటుంబ వ్యవస్థను బలపరచుకోవాలి. పరస్త్రీని తల్లిగా, పరులసొమ్ము మట్టిగా, సమస్త సృష్టిని భగవంతుని రూపంగా తలచి జీవించే శ్రేష్ట సంస్కృతికి వారసులం మనం. విశ్వకళ్యాణం కోసం ఈ సంస్కృతిని మనం పదిలంగా కాపాడుకుని తరువాతి తరాలకు అందించాలి. మన కుటుంబాలు, గ్రామాలు ఈ మహోన్నత సంస్కృతికి పట్టుకొమ్మలుగా నిలవాలి. ఆధునీకరణ పేరుతో నేడు మనం పాశ్చాత్య జీవన విధానాన్ని అనుకరిస్తూ మన కుటుంబ విలువలను దిగజార్చుకుంటున్నాం. ఆ స్థితి నుండి మన సమాజాన్ని రక్షించుకోవవలసిన అవసరం నేడు ఏర్పడింది. అందుకు మనకు స్ఫూర్తినిచ్చేది రక్షాబంధన్ మహోత్సవం జరుపుకోవాలి.
సమాజంలో సామరస్యత నిర్మాణం కోసం.. మనలో భేదభావాలు లేవని, మనం ఒకే తల్లి సంతానం అనే భావనను కల్పించడం, కుటుంబంలో అందరికి సంస్కారాలు అందించడం లాంటి విషయాలపై దృష్టిపెట్టవలసి ఉంది. పర్యావరణం పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం, చెట్లను పెంచడం, నీటిని పొదుపుగా వాడడం వంటి అంశాల పట్ల రక్ష (కంకణం) ధరించి నిర్ణయం తీసుకుందాం. వీటన్నింటితోపాటు ప్రతి హిందువు మంచి పౌరునిగా తయారుకావాలి.
నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష. మనం ఈ జాతి సమైక్యతకు, సమగ్రతకు కుటుంబ వ్యవస్థను, పర్యావరణాన్ని, దేశ సరిహద్దులలో ఉన్న మన సైన్యానికి మద్దతునిస్తూ, మనవైపు నుండి అవినీతి జరగకుండా చూసుకోవాలి.. జై హింద్. రాజశేఖర్ నన్నపనేని
Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.
Raksha Bandhan 2025, Shravana Purnima festival, Rakhi celebration, importance of Raksha Bandhan, Raksha Bandhan rituals, Rakhi festival history, Raksha Bandhan significance, brother sister festival, Hindu festivals August, Raksha Bandhan traditions


