దేశానికి స్వాతంత్య్రం అందించడంలో కీలక పాత్ర పోషించిన సత్యాగ్రహం అనే ఒక పదం

megaminds
0
సత్యాగ్రహం


సత్యాగ్రహం: దేశానికి స్వాతంత్య్రం అందించడంలో కీలక పాత్ర పోషించిన "సత్యాగ్రహం" పదాన్ని తొలిసారిగా 1906 సెప్టెంబర్ 1వ తేదీన దక్షిణాఫ్రికాలో ప్రస్తావించారు. సత్యం చెప్పాలని పట్టుబట్టడం, సత్యానికే కట్టుబడడం అని దాని అర్థం. అలా దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ చేపట్టిన సత్యాగ్రహం తదుపరి దశలో భారతదేశ స్వాతంత్ర్య సముపార్జనకు చక్కని వేదిక కల్పించింది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన భారతదేశం స్వాతంత్య్రం సాధించిన 75వ సంవత్సరంలో అడుగుపెట్టిన సమయంలో ఎవరికీ బాధ కలిగించకుండా, ఎలాంటి ఏహ్యతకు తావు లేకుండా నిరసన తెలియజేయడానికి, దౌర్జన్య కాండ లేకుండా స్వేచ్చ కోసం పోరాడడానికి ఓర్పునకు చిహ్నమైన "సత్యాగ్రహ" ప్రక్రియ గురించి స్వాతంత్ర్య అమృత మహోత్సవాలలో భాగంగా ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

బాపూజీ అభిప్రాయంలో అహింస లేదా నిష్క్రియాత్మక ప్రతిఘటన కన్నా శక్తివంతమైనది సత్యాగ్రహం. 1906 సంవత్సరంలో ప్రత్యేకంగా తమ దేశంలో నివశిస్తున్న భారతీయులను కించపరిచే ఒక ఆర్డినెన్సును దక్షిణాఫ్రికా ప్రభుత్వం జారీ చేసింది. అందుకు నిరసనగా 1906లో గాంధీజీ నాయకత్వంలో భారతీయులు జోహెన్నెస్ బర్గ్ లో ఒక ప్రత్యేక బహిరంగ సభ నిర్వహించారు. ఆర్డినెన్సును ఉల్లంఘించి. శిక్షను అనుభవించాలని ప్రతినబూనారు. అక్కడే సత్యాగ్రహం అనే పదం ఆవిర్భవించింది. సత్యాగ్రహులు 7 సంవత్సరాలకు పైగా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడారు. ఇందులో ఎన్నో ఎగుడుదిగుడులు ఏర్పడినప్పటికీ మహాత్మాగాంధీ నాయకత్వంలో స్వల్పసంఖ్యాకులైన భారతీయులు శక్తివంతులైన ప్రత్యర్థులకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించారు. తమ ఆత్మగౌరవానికి, నైతికతను దిగజార్చుకున్న చట్టం ముందు తల వంచడానికి బదులు తమ జీవనోపాధిని త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు.

ఈ పోరాటం దక్షిణాఫ్రికా ప్రభుత్వం విశ్వసనీయతను, ప్రతిష్టను విశేషంగా దెబ్బ తీసింది. దాంతో భారత, బ్రిటిష్ ప్రభుత్వం ఒత్తిడుల నడుమ తమను తాము కాపాదుకునే ఒక ఒప్పందానికి అంగీకరించింది. ఆ రకంగా ఇక్కడ నుంచే గాంధీజీ భారత స్వాతంత్ర్యానికి అనుకూలమైన వాతావరణం కల్పించారు. భారతదేశానికే కాదు, తదుపరి కాలంలో దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర సాధనలో ఇది విజయవంతమైన సాధనంగా నిరూపించుకుంది. ఈ సత్యాగ్రహ మౌలిక మంత్రమే భారత స్వతంత్రతా బాటలో ఎదుర్కొంటున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే కొత్త మార్గాన్ని చూపింది. జాతిపిత మహాత్మాగాంధీ సత్యం, అహింస మార్గం అనుసరిస్తూ శాసనోల్లంఘన, దండి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఎన్నో ప్రధాన ఉద్యమాలు నిర్వహించారు. ఎవరైనా సత్యాగ్రహం ఆచరించవచ్చునని మహాత్మాగాంధీ చెప్పారు. ఆయన దృష్టిలో సత్యాగ్రహం అనేది శాఖోపశాఖలు గల ఒక పెద్ద మర్రిచెట్టు.

గాంధీజీ నాయకత్వంలోని సత్యాగ్రహులు అసమాన త్యాగాలతో బ్రిటిష్ బానిసత్వ శృంఖలాల నుంచి మా భారతికి విముక్తి కలిగించారు. సత్యాగ్రహులు స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలంగా పాల్గొనడమే కాదు దేశంలో సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు సాగించారు. బ్రిటిష్ వారసత్వ శృంఖలాల నుంచి దేశాన్ని విముక్తం చేసిన శక్తివంతమైన అహింసాయుత ఆయుధం సత్యాగ్రహం, వంద సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికీ సత్యాగ్రహం సమర్థవంతమైన సాధనం. అది ఏ కాలంలో అయినా సమర్థవంతమైన ఆయుధంగానే ఉంటుంది, చంపారన్ సత్యాగ్రహం సమయంలోనే మహాత్మాగాంధీ ఈ ప్రాంతంలోని బార్హర్యా లఖన్ సేన్ నుంచి స్వచ్ఛతా ప్రచారోద్యమం ప్రారంభించారు. బాపూజీ స్వచ్ఛతా ఉద్యమాన్ని మరింత ముందుకు నడుపుతూ ఇప్పుడు మనం సత్యాగ్రహం నుంచి స్వచ్ఛాగ్రహంగా పాటించాలి.

భూదానోద్యమానికి ఆద్యుడు, మాహాత్మా గాంధీ తొలి సత్యాగ్రహి వినోబా భావే: మహాత్మా గాంధీ జీవనంలో ఆధ్యాత్మికతకు ఎంతో ప్రాధాన్యం ఉంది... అదే సత్యాగ్రహానికి మార్గదర్శంగా నిలిచింది. మహాత్మా గాంధీ ఆధ్యాత్మిక వారసత్వానికి నిజమైన వారసుడు వినోబా భావే. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతానికి చెందిన గగోదా గ్రామంలో ఆయన 1895 సెప్టెంబర్ 11వ తేదీన జన్మించారు. ఆయన అసలు పేరు వినాయక్ నరహరి భావే. దేశంలో భూదానోద్యమానికి ఆయనే బీజం వేశారు. స్వాతంత్య్ర యోధుడు, సామాజిక కార్యకర్త, గాంధేయవాదిగా ఆయన ప్రముఖుడు, వినోబా అంకిత భావాన్ని గమనించిన గాంధీజీ వార్థా ఆశ్రమ నిర్వహణను ఆయనకు అప్పగించారు.

1940 సంవత్సరం వరకు వినోబా భావే పేరు ప్రఖ్యాతులేవీ లేని ఒక సాధారణ నాయకుడు. 1940 అక్టోబర్ 5వ తేదీన మహాత్మా గాంధీ ఆయనను దేశానికి పరిచయం చేశారు. ఆయనను తొలి సత్యాగ్రహిగా పేర్కొంటూ గాంధీజీ ఒక ప్రకటన చేశారు. సత్యాగ్రహోద్యమానికి మహాత్మా గాంధీ ఎంపిక చేసిన తొలి వ్యక్తి భావే. మహాత్మా గాంధీ చింతనకు ప్రభావితుడైన వినోబా భావే స్వాతంత్ర్యోద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించారు. సహాయ నిరాకరణోద్యమంలో చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో వినోభా భావే క్రియాశీల భాగస్వామ్యం పట్ల బ్రిటిష్ పాలకులు ఆగ్రహం చెంది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకిగా ఆయనపై అభియోగం మోపారు.

ప్రభుత్వం ఆయనను ఆరు నెలల పాటు ధూలియా జైలులో పెట్టింది. తన నిర్బంధ సమయంలో జైలులోని ఖైదీలకు ఆయన భగవద్గీత బోధించారు. చరఖాపై తాను నూలు వడుకుతూ ఇతరులను కూడా అలా చేయమని ప్రోత్సహించే వారు. సామాజిక నాయకత్వానికి గుర్తింపుగా రామన్ మెగసెసే అవార్డు పొందిన తొలి వ్యక్తి వినోబా భావే. ఆయనకు సంస్కృతం, కన్నడ, ఉర్దూ, మరాఠీ సహా 7 భాషలపై అవగాహన ఉంది. ఆత్మ నియంత్రణ చేసుకున్న ఏ వ్యక్తి అయినా ప్రపంచాన్ని నియంత్రించగలదని ఆయన చెప్పారు..

వినోబాజీ పిలుపు మేరకు 100 ఎకరాలు విరాళంగా ఇచ్చిన మొదటి వ్యక్తి. పోచంపల్లికి చెందిన శ్రీ వెదిరే రాంచంద్రా రెడ్డి వినోబా సర్వోదయ ఉద్యమం, గ్రామ్ దాన్ కార్యక్రమం గాంధీజీ ప్రతిపాదించిన గ్రామ పునర్నిర్మాణం, గ్రామీణ అభ్యున్నతి సూత్రాలకు సజీవ ఉదాహరణలు. గ్రామాల సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన సహకార వ్యవస్థ అది. మహాత్మా గాంధీ విశ్వాసపాత్రులైన మద్దతుదారుల్లో వినోబా భావే ఒకరు. సామాజిక జీవనం, విద్య, గో రక్షణ రంగాల్లో ఆయన చేసిన అసాధారణమైన సేవ ఇతరులకు ఆదర్శం.

మహాత్మా గాంధీ ఆచార్య వినోబా భావే గురించి ఇలా అన్నారు... "నిన్ను ఎలా పొగడాలో నాకు తెలియడంలేదు. నీ వ్యక్తిత్వం, నీ ప్రేమ, నీ స్వయం విమర్శ నన్ను ఆకర్షిస్తున్నాయి. అందుకే నీ విలువను మదింపు చేయడానికి నేను సరైన వాడను కాను"

యుకె పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు దాదాభాయ్ నౌరోజీ: 1892లో బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు దాదాభాయ్ నౌరోజీ. మహాత్మా గాంధీ జాతీయ స్థాయిలో తిరుగులేని నాయకుడుగా ఎదగడానికి ముందు అత్యంత ప్రముఖ నాయకుడు నౌరోజీ. బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే, మహాత్మా గాంధీ కూడా ప్రగాఢమైన జాతీయవాది అయిన నౌరోజీ నుంచి రాజకీయాల్లో తొలి పాఠాలు నేర్చుకున్నారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు మాత్రమే కాదు, బ్రిటిష్ పాలనను సవాలు చేసిన, విదేశాల్లో భారత ప్రయోజనాల రక్షణ కోసం కృషి చేసిన ప్రముఖుడు. భారత్ కు స్వరాజ్యం కావాలని కోరిన తొలి వ్యక్తి ఆయన.

1906లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ మహా సభల్లో స్వరాజ్ అంటే భారతదేశంలో స్వయంపాలన కాంగ్రెస్ లక్ష్యం అని ప్రకటించిన వ్యక్తి దాదాభాయ్ నౌరోజీ. బ్రిటిషర్లు భారతదేశాన్ని దోచుకుంటున్నారని ఆయన తొలి దశలోనే గుర్తించారు. ఈ దోపిడీని అరికట్టడానికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారు. భారత పౌరులకు వారు దోపిడీకి ఎలా గురవుతున్నది వివరించేందుకు శ్రమించారు. బ్రిటిషర్ల దోపిడీపై భారత పౌరులను విద్యావంతులను చేయడం లక్ష్యంగా పలు వ్యాసాలు వ్రాశారు. ప్రసంగాలు చేశారు. క్రమంగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఆయన రాజకీయ క్రియాశీలత భారతదేశానికి నవోదయం అయింది. కులతత్వ, వలసవాద వ్యతిరేక వాదిగా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 1825 సెప్టెంబర్ 4వ తేదీన పేద పార్శీ కుటుంబంలో జన్మించిన నౌరోజీ చిన్న వయసులోనే ప్రగతిశీల ఆలోచనలు అలవరచుకున్నారు.

బాలికల విద్యకు ఆయన గట్టి మద్దతుదారుడు. 1840లో బాలికల కోసం ఆయన ప్రత్యేక పాఠశాల ప్రారంభించారు. దేశంలోని సాంప్రదాయవాదుల నుంచి గట్టి వ్యతిరేకత ఎదురైనా ఆయన తన సంకల్పాన్ని నీరుగార్చలేదు. ఐదు సంవత్సరాల కాలంలోనే బొంబాయి బాలికల పాఠశాల అత్యధిక విద్యార్థుల నమోదును సాధించి ఆయన సంకల్పానికి మరింత బలం చేకూర్చింది. ఆయన లింగసమానత్వాన్ని డిమాండు చేశారు. మహిళలు, పురుషులకు సమాన చట్టాలుండాలని వాదించారు. భారత్ పై బ్రిటిష్ ఆర్థిక దోపిడీపై ఆయన చేసిన పరిశోధన ప్రముఖమైనదిగా నిలిచిపోయింది.

భారతదేశం నుంచి బ్రిటన్ కు "సంపద తరలింపే" భారతదేశ పేదరికానికి ప్రధాన కారణమని "పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా" అనే పుస్తకంలో ఆయన నొక్కి చెప్పారు. ఆయనను "భారతదేశానికి చెందిన గౌరవనీయుడైన వృద్ధుడు"గా కూడా ఎంతో ఆదరంగా పిలిచే వారు. "పిల్లవాడు తండ్రి వైపు ఎలా చూస్తారో భారతీయులు మీ వైపు అలాగే చూస్తారు. భారతదేశంలో మీ పట్ల గల వాస్తవ సెంటిమెంట్ ఇదే" అని మహాత్మాగాంధీ ఆయనకు రాసిన ఒక లేఖలో చేసిన ప్రస్తావనే దేశ స్వాతంత్య్రానికి ఆయన అందించిన అద్భుతమైన సేవకు గుర్తింపు. ఈ మహోన్నత దేశం ఆయనను అంత గౌరవించడానికి ఇదే కారణం.

అంకిత భావం గల దేశభక్తుడు గోవింద్ వల్లభ్ పంత్:
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్ర బోస్ వర్గాల రెండింటి మధ్య రాజీకి పంత్ మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించారు. దేశ స్వాతంత్య్రం కోసం వెన్ను చూపని పోరాటం సాగించడమే కాదు, ప్రజల మనసుల్లో విప్లవ భావం ప్రజ్వరిల్లింపచేసిన ఎందరో యోధులున్నారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఉన్నత స్థానంలో నిలిచిన అలాంటి నాయకుల్లో భారతరత్న గోవింద్ వల్లభ్ పంత్ ఒకరు.

ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరాలో పంత్ 1887 సెప్టెంబర్ 10వ తేదీన జన్మించారు. ఆయన అలహాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన మురీ కాలేజిలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. విద్యలో అద్భుత ప్రతిభ కనబరిచినందుకు ఆయన లుమ్స్ డెన్ మెడల్ కూడా బహుమతిగా పొందారు. కాకోరి కేసులో ఆయన ఒక ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు గడించారు. ఆయన అత్యంత ప్రముఖుడైన స్వాతంత్య్ర సమర యోధుడే కాదు పెద్ద మానవతావాది. ఆయన గోపాలకృష్ణ గోఖలే, మదన్ మోహన్ మాలవీయ ఇద్దరిని ఆదర్శంగా భావించే వారు. వారి నుంచి పొందిన స్ఫూర్తితో 18 సంవత్సరాలు చిన్న వయసులోనే భారత జాతీయ కాంగ్రెస్ లో వలంటీర్ గా పని చేశారు. 1921లో ఆయన కాంగ్రెస్ లో చేరి వెంటనే సహాయ నిరాకణోద్యమంలో పాల్గొనడం ప్రారంభించారు.

మహాత్మాగాంధీ చర్యలతో స్ఫూర్తి పొందిన పంత్ ఉప్పు సత్యాగ్రహం నిర్వహించారు. అందుకు ఆయన 1930లో జైలుపాలయ్యారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మహాత్మాగాంధీ, సుభాష్ చంద్ర బోస్ వర్గాల మధ్య సఖ్యత కుదిర్చేందుకు మధ్యవర్తిగా కూడా పంత్ వ్యవహరించారు. మహాత్మాగాంధీ, ఆయన మద్దతుదారులు ఆ యుద్ధంలో బ్రిటన్ కు మద్దతుగా నిలవాలని వాదించగా సుభాష్ చంద్రబోస్ వర్గం మాత్రం బ్రిటిష్ రాజ్ అంతానికి పరిస్థితిని ఒక సాధనంగా వాడుకోవాలని వాదించారు. 1942లో క్విట్ ఇండియా తీర్మానంపై సంతకం చేసినందుకు అరెస్టయిన పంత్ 1945 వరకు మూడు సంవత్సరాల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇతర సభ్యులతో పాటు అహ్మద్ నగర్ జైలులో గడిపారు. కాని అనారోగ్య కారణాలపై పంత్ విడుదలయ్యారు.

భారతరత్న పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ యునైటెడ్ ప్రావిన్సుల ప్రెసిడెంట్ గా (1937-1939). ఉత్తరప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా (1946-1954), కేంద్ర హోం మంత్రిగా (1955-1961) పని చేశారు. ఆయనకు 1957లో దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న బహూకరించారు. రాజ్యసభలో నాయకుడుగా కూడా ఆయన పని చేశారు. గొప్ప దేశభక్తుడు, సమర్థుడైన పాలకుడు, అద్భుత వాదనా పటిమ గల వాడు, తార్కికమైన, స్వేచ్ఛావాద ఆలోచనా ధోరణులు గలవాడు అయిన పంత్ జమీందారీ వ్యవస్థ రద్దు, అడవుల సంరక్షణ, మహిళా హక్కులు, ఆర్థిక స్థిరత్వం, సమాజంలో నిరాదరణకు గురవుతున్న వర్గాలకు జీవనోపాధి భద్రత కల్పన వంటి ప్రధాన సంస్కరణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆయన కేంద్ర హోం మంత్రిగా కూడా తన బాధ్యతలు ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. భారత పౌరుల ప్రజాస్వామ్య సాధికారతకు ప్రధానంగా కృషి చేశారు. హిందీని జాతీయ భాషగా చేయాలన్న ప్రయత్నాలకు కూడా ఆయన మద్దతు ఇచ్చారు.

వైకం సత్యగ్రహాన్ని నడిపిన టికె మాధవన్: టికె మాధవన్ భారతదేశానికి చెందిన సంఘసంస్కర్తే కాదు, జర్నలిస్టు, విప్లవకారుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. గాంధీజీకి గట్టి మద్దతుదారైన ఆయన గాంధీజీ చూపిన అహింసా మార్గం ఆయుధంగా అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాడి వైకం సత్యాగ్రహాన్ని విజయవంతం చేయడానికి శ్రమించారు. కేరళలోని కార్తిక్ పల్లి లో ఒక సంపన్న కుటుంబంలో 1885 సెప్టెంబర్ 2వ తేదీన ఆయన జన్మించారు. ఆయనను ప్రజలు ఎంతో ఆదరంగా టికే అని పిలుచుకునే వారు.

మాధవన్ తండ్రి పేరు కేశవన్ చన్నార్ కాగా తల్లి పేరు ఉమ్మిని అమ్మ, దేశ స్వాతంత్ర్యోద్యమం ఒక రాజకీయ పోరాటమే కాదు, జాతి పునరుజ్జీవం, సామాజిక సాంస్కృతిక చైతన్య ఉద్యమం. ఇలాంటి వాతావరణంలో అస్పృశ్యత దురాచారానికి వ్యతిరేకంగా మాధవన్ వైకం సత్యాగ్రహం (1924-25) ప్రారంభించారు. కేరళలోని తిరునల్వేలిలో ఆయన మహాత్మాగాంధీని కలిశారు.

వైకం వెళ్లడానికి ఆయన మహాత్మాగాంధీ సహాయం కోరడమే కాకుండా అందుకు ఆయనను అంగీకరింపచేశారు. కేరళలో బలహీన వర్గాల పోరాటమే వైకం సత్యాగ్రహం. దక్షిణ కేరళలోని ఓ చిన్న పట్టణంలో దేవాలయ వీధుల్లో నడిచేందుకు తమకు గల హక్కు కోసం బలహీనవర్గాల వారు పోరాటం సాగించారు. టికె మాధవన్ గట్టిగా పట్టు పట్టడం వల్లనే మహాత్మాగాంధీ వైకం ఉద్యమాన్ని భారత జాతీయ కాంగ్రెస్ అజెండాలో చేర్చి దానికి వ్యక్తిగతంగా మద్దతు ఇవ్వడం కూడా సాధ్యమయింది. వైకం సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు మాధవన్ 1924లో అరెస్టయ్యారు.

ఆయనతో పాటు ఎందరో సత్యాగ్రహంలు కూడా అరెస్టు కావడంతో దేశం నలుమూలల నుంచి సత్యాగ్రహులు ఆ పోరాటానికి మద్దతు పలికేందుకు వైకం తరలి వచ్చారు. దేశం మొత్తంలో వైకం సమస్య చర్చనీయాంశం అయింది. ఆ పోరాటానికి మద్దతు పలికేందుకు దూర ప్రాంతాల వారు కూడా తరలిరావడం ప్రారంభించారు. ఎట్టకేలకు 1925 మార్చిలో గాంధీజీ నాయకత్వంలో ట్రావెంకూర్ రాణికి, నిరసనకారులకు మధ్య ఒక అంగీకారం కుదిరింది. వాస్తవానికి మాధవన్ నిపుణుడైన ఒక నాయకుడు, గొప్ప వక్త, రచయిత, తన భావాలను సుస్పష్టంగా తెలియచేయగల చతురుడు.

ప్రజలకు వారి హక్కులపై చైతన్యం కలిగించేందుకు దేశాభిమాని పేరిట ఆయన ఒక వార్తాపత్రిక ప్రారంభించారు. 1925 జరిగిన కాన్పూర్ కాంగ్రెస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చెట్టికులంగరలో ఆయన గౌరవార్ధం ఒక స్మారకం నిర్మించారు. 1964లో సంగైర్ కులంగరలో ఆయన పేరు మీద ఒక కళాశాల కూడా ప్రారంభించారు.


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top