Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఆధునిక భారత నిర్మాణ శిల్పులు - షీల్ భద్ర యాజీ, చంద్రప్రభ సైకియాని, లక్ష్మణ్ నాయక్, బసంతీ దేవి, ఎం.ఎ.అయ్యంగార్ జీవిత విశేషాలు

ఆధునిక భారత నిర్మాణ శిల్పులు: స్వాతంత్య్ర పోరాట వీరుల త్యాగం, తపస్సు ఫలితంగా భారత్ స్వతంత్ర సార్వభౌమ దేశంగా ఆవిర్భవించింది. భారత...

ఆధునిక భారత నిర్మాణ శిల్పులు: స్వాతంత్య్ర పోరాట వీరుల త్యాగం, తపస్సు ఫలితంగా భారత్ స్వతంత్ర సార్వభౌమ దేశంగా ఆవిర్భవించింది. భారతదేశం స్వాతంత్య్రం సాధించడం చరిత్రను మలుపుతిప్పిన ఓ కీలక ఘట్టం మన స్వాతంత్ర్య సమరయోధులు స్వేచ్ఛ కోసం పోరాడటమే గాక మద్య నిషేధం, అంటరానితనం నిర్మూలన, స్వదేశీ వస్తు వినియోగం. మత సామరస్యం కొనసాగింపు వంటి చర్యల ద్వారా వివిధ సామాజిక దురాచారాల నుండి విముక్తి కోసం కూడా తీవ్రంగా శ్రమించారు. స్వాతంత్ర్యం కోసం వారి తపన కేవలం రాజకీయ స్వేచ్ఛ సాధించడానికి పరిమితం కాలేదు. జాతి నైతికత, రుజువర్తనల అనుసరణలను ఆకాంక్షించింది.

భారతదేశం కేవలం రాజకీయ స్వాతంత్ర్య కోసం మాత్రమేగాక, తన ప్రజల ఆర్థిక సాధికారత. గురించి కూడా పోరాడింది. ఈ జంట లక్ష్యాల సాధనకు మన స్వాతంత్ర్య సమర యోధులు సమష్టిగా కృషి చేశారు. ఫలితంగానే సత్వర ప్రగతి దిశగా మహాత్మాగాంధీ చూపిన బాటలో "సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్" తారకమంత్రంగా దేశం ముందడుగు వేస్తోంది. ఆ మేరకు పేదరిక నిర్మూలన, జీవన పరిమాణం పెంపు, శిశు మరణాల నివారణ, ప్రసూతి భద్రత, అక్షరాస్యత తదితర సామాజిక ప్రమాణాలపరంగా దేశం అద్భుత ప్రగతి సాధించింది. ఈ నేపథ్యంలో ఈసారి మన "ఆజాదీ కా అమృత్ మనోత్సవ్" విభాగంలో అసమాన స్వాతంత్య్రం సమరయోధులు - షీల్ భద్ర యాజీ, చంద్రప్రభ సైకియాని, లక్ష్మణ్ నాయక్, బసంతీ దేవి, ఎం.ఎ.అయ్యంగార్ తదితరుల వీరగాథలు ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం..

స్వాతంత్య్ర యోధులకు పెన్షన్ సదుపాయం షీల్ భద్ర యాజీ కృషి ఫలితమే: జనం లడ్డూశర్మగా పిలిచే ఓ బాలుడి మేధస్సుకు ముగ్ధులైన మహా పండితుడు రాహుల్ సాంకృత్యాయన్ ఆ కుర్రాడికి షీల్ భద్ర యాజీ అని నామకరణం చేశారు. తదనంతర కాలంలో ఆ బాలుడు స్వాతంత్య్ర సమర దిగ్గజాలలో ఒకరుగా ఆవిర్భవించాడు. బీహార్ లోని పాట్నా జిల్లా భక్తియార్ పూర్ లో 1906 మార్చి 22న షీల్ భద్ర యాజీ జన్మించారు. అటుపైన కళాశాలలో చదువుతున్నపుడు 1928లో స్వాతంత్రోద్యమంవైపు ఆకర్షితులై క్రమంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సన్నిహితుడయ్యారు. ఆ తర్వాత సుదీర్ఘకాలం ఆయనకు అత్యంత అంతరంగికుడుగా కొనసాగారు.

నేతాజీ విదేశాలకు వెళ్లాక కూడా విదేశీ గడ్డపై ఆయనను కలుసుకున్నారు. స్వాతంత్యం సిద్ధించిన తర్వాత సమర యోధులకు పెన్షన్ కోసం ఆయన కృషి చేశారు. నేతాజీ 1939లో 'ఫార్వర్డ్ బ్లాక్'ను ఏర్పాటు చేసిన సందర్భంగా బీహార్లో పార్టీ బాధ్యతలను యాజీ కి అప్పగించడాన్ని బట్టి నేతాజీ షేల్ భద్ర యాజీల మధ్య సాన్నిహిత్యాన్ని అంచనా వేయవచ్చు, అనంతరం నేతాజీ దేశం విడిచివెళ్లడంతో ఆయన వారసుడిగా ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ అధ్యక్ష బాధ్యతలను యాజీ చేపట్టారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నేతాజీ ప్రజల్లో అవగాహన కల్పన కార్యక్రమం చేపట్టినపుడు కేవలం షీల్ భద్ర యాజీ పిలుపు మేరకు బీహార్ లో పర్యటించారు. ఈ సందర్భంగా బీహార్ రాష్ట్రంలో ఏకంగా 438 సభలను యాజీ నిర్వహించారు, అలాగే రామ్ గఢ్ (ఝార్ఖాండ్) లో కాంగ్రెస్ సభను కూడా ఆయన నిర్వహించారు.

నేతాజీకి సన్నిహితుడైన కారణంగా ఆయన సాధారణ పౌరుడైనప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం యాజీ పై సైనిక కోర్టులో విచారణ నిర్వహించింది. కాగా, "గరం దళ్" తో సైద్ధాంతిక సారూప్యం ఉన్నట్లు భావించిన షీల్ ధద్ర యాజీ ఆ సంస్థతో సాన్నిహిత్యం నెరపారు. అలాగే నౌజవాన్ భారత్ సభ సభ్యుడుగానూ కొనసాగారు. భగత్ సింగ్ వంటి స్ఫూర్తిదాయక విప్లవమూర్తులతోనూ ఆయన పని చేశారు. భరతమాత విముక్తి కోసం సాగించిన ఉద్యమంలో భాగంగా సహజానంద సరస్వతితో సాన్నిహిత్యం కారణంగా పలుమారు జైలు జీవితం అనుభవించారు. మొత్తం మీద దేశంలోని వివిధ జైళ్లలో 8 ఏళ్లపాటు నిర్బంధంలో ఉన్నారు. అంతేకాకుండా, రెండున్నరేళ్లపాటు అజ్ఞాత జీవితం కూడా గడపాల్సి వచ్చింది. చిట్టచివరగా ఆర్థర్ రోడ్ జైలులో ఉండగా భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడంతో ఆయన విడుదలయ్యారు.

ఆయన కృషి ఫలితంగానే మయన్మార్ సరిహద్దులో మణిపూర్లోని మొరాంగ్ వద్ద ఆజాద్ హింద్ ఫౌజ్ కి చెందిన 26 వేల మంది అమరుల స్మారకం నిర్మితమై 1955లో ప్రారంభించబడింది. నిరాడంబర జీవితాన్నిఇష్టపడే ఆయన పేద, వెనుకబడిన, అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిర్వరామంగా కృషి చేశారు. రాజ్యసభ సభ్యుడుగా చిరకాలం సేవలందించిన పండిట్ షీల్ భద్ర యాజీ స్మారకార్థం న్యుఢిల్లీలోని స్వాతంత్య్ర సమర యోధుల కాలనీలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయబడింది. అలాగే ఆయన గౌరవార్థం 2001లో అటల్ బిహార్ వాజ్పాయ్ ప్రభుత్వం షీల్ భద్ర యాజీ స్మారక తపాలా బిళ్లను కూడా ఆవిష్కరించింది.

మహిళా సాధికారత కోసం పోరాడిన స్వాతంత్య్ర సమర యోధురాలు చంద్రప్రభ సైకియాని: అస్సాంలోని నాగావ్ జిల్లాలో 1925 నాటి ఓ సాహిత్య సభకు 24 ఏళ్ల నవ యువతి కూడా హాజరైంది. ఈ సందర్భంగా మహిళలు కూర్చోవడం కోసం వెదురుతో ప్రత్యేకంగా ఒక పరదా వంటిది ఏర్పాటు చేసి ఉండటం ఆమె గమనించింది. ఈ వివక్షను ఆమె భరించలేకపోయింది. అంతే.. హుటాహుటిన వేదిక పైకి ఎక్కి, అక్కడున్న మహిళలను ఉద్దేశించి "మీరంతా ఎందుకు పరదా వెనుక కూర్చున్నారు?" అని నిలదీసింది. అంతేకాకుండా, అక్కడి నుంచి ముందుకు రావాల్సిందిగా వారందర్నీ కోరింది. ఆమె పిలుపుతో సభకు హాజరైన మహిళలంతా పరదా చాటు నుంచి ముందుకు వచ్చి కూర్చున్నారు. ఆమె ఎవరో కాదు... అస్సాంలో పరదా పద్ధతికి పాతర వేయడంలో కీలకపాత్ర పోషించిన చంద్రప్రభ సైకియాని.

అస్సాంలోని కామరూప్ జిల్లా డైసింగర్ గ్రామంలో 1901 మార్చి 16న చంద్రప్రభ సైకియాని జన్మించారు. ఒకవైపు భారత స్వాతంత్య్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొంటూ మరోవైపు మహిళల హక్కుల కోసం కూడా ఆమె ఉద్యమించారు. ఈ క్రమంలో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నందుకు జైలుపాలయ్యారు. స్వాతంత్రోద్యమ కాలంలో ప్రజలను చైతన్యపరచడం కోసం సైకిల్ పై దేశవ్యాప్తంగా పర్యటించిన తొలి మహిళ చంద్రప్రభ సైకియాని.

అస్సాంలో ఇతర స్వాతంత్య్ర యోధులతో కలసి విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమం ప్రారంభించారు. ఇందులో భాగంగా మహిళలందరినీ సమీకరించి విదేశీ వస్త్రాలను సామూహికంగా తగులబెట్టారు. మహాత్మాగాంధీ తేజ్ పూర్ ను సందర్శించిన సమయంలో ఆమె ఈ ఉద్యమం నిర్వహించారు. భారత స్వాతంత్య పోరాటంలో ఆమె కాంగ్రెస్ పార్టీతో కలసి కృషి చేశారు. అటుపైన 1947 వరకూ పార్టీ కార్యకర్తగా కొనసాగారు. కేవలం 13 ఏళ్ల వయసులోనే మహిళలకు విద్యపై చొరవ తీసుకున్న ఆమె బాలికల కోసం తమ గ్రామంలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. మహిళలపై సంప్రదాయ సామాజిక నిర్బంధాలను నిరసిస్తూ అవివాహిత తల్లిగా కొనసాగాలన్న. నిర్ణయం ఆమె ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.

కాగా, చాలా చిన్న వయసులోనే తనను ఒక వృద్ధుడికి ఇచ్చి పెళ్లి చేయగా, ఆమె ఆ వివాహాన్ని తిరస్కరించి ఒంటరిగా జీవించేవారని చెబుతారు. ఈ క్రమంలో ఒక వ్యక్తితో సహ జీవనం సాగించి, తనకు జన్మించిన కుమారుడిని అవివాహిత తల్లిగానే పెంచి పెద్ద చేశారు. చంద్రప్రభ సైకియాని జీవితం ఆధారంగా 'అభిజాత్రి' పేరిట రచయిత్రి నిరుపమ బోర్గోహై రాసిన నవలకు సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. కాగా, ప్రభుత్వం 1972లో పద్మశ్రీ పురస్కారంతో చంద్రప్రభను సత్కరించింది. అస్సోం అభివృద్ధితోపాటు సామాజిక సంస్కరణలు, మహిళా సాధికారత కోసం చంద్రప్రభ సైకియాని విశేష కృషి చేశారంటూ ప్రధాని నరేంద్ర మోదీ 2021 మార్చి 16న ఆమెను కొనియాడారు.

బ్రిటిష్ ప్రభుత్వం మల్కన్ గిరి గాంధీ లక్ష్మణ్ నాయక్ ని ఉరి తీసింది: జాతీయ ఉద్యమంలో అద్వితీయ పాత్ర పోషించిన ఒడిశా గిరిజన సమాజం తమ దేశభక్తి, ధైర్యసాహసాలతో పరాయి పాలకులను సదా సవాలు చేస్తూనే వచ్చింది. క్విట్ ఇండియా ఉద్యమంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప గిరిజన వీరుడు లక్ష్మణ్ నాయక్ వారిలో ఒకరు.

లక్ష్మణ్ నాయక్ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి పడాలం నాయక్, భూయాన్ గిరిజన తెగకు అధిపతి. రెవెన్యూ వసూళ్లు, అటవీశాఖ, క్రిమినల్ కేసులు వంటి అనేకానేక రూపాల్లో బ్రిటిష్ క్రూరత్వాన్ని ఆయన చిన్నతనం నుంచే చవిచూశారు. అందుకే పరాయి పాలనపై తిరుగుబాటు దిశగా తమ సమాజాన్ని నడిపించే దిశగా కార్యరంగంలోకి దూకారు. అయితే, బ్రిటిష్ పాలకుల నిరంతర అణచివేతపై పోరులో గాంధీ ప్రభోధిత సత్యం, అహింస, శాంతియుత సహాయ నిరాకరణ వంటి సిద్ధాంతాలనే నాయక్ అనుసరించారు. తదనుగుణంగా దరలా వినియోగంపై ఇంటింటి ప్రచారం ద్వారా ప్రజల్లో స్వరాజ్య భావన బలపడేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారు. క్విట్ ఇండియా సందేశాన్ని ఒడిశాలోని గిరిజన తెగల్లోకి విస్తృతంగా తీసుకెల్లి, ఉద్యమం మరింత తీవ్రం కావడంలో తన వంతు పాత్ర పోషించారు.

మహాత్మా గాంధీ పిలుపు మేరకు 1942 ఆగస్టు 21వ కోరాపుట్లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనకు నాయకత్వం వహించిన నాయక్ మజూలి పోలీస్ స్టేషన్ ఎదుట శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యమకారులపై పోలీసులు కాల్పులకు దిగడంతో 40 మంది మరణించగా 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ పరిస్థితుల నడుమ బ్రిటిష్ పాలన యంత్రాంగం లక్ష్మణ్ నాయక్ ను హత్య కేసులో ఇరికించి మరణ శిక్ష విధించింది. అటుపైన జెహ్రంపూర్ లోని జైలులో 1943 మార్చి 29న ఆయనను ఉరితీసింది.

దేశానికి కచ్చితంగా స్వాతంత్యం వస్తుందని ఆయన ఎప్పుడూ ఘంటాపథంగా చెప్పేవారు. "సూర్యుడు నిజమైతే చంద్రుడు కూడా నిజమే.. అదే తరహాలో భారతదేశానికి స్వేచ్ఛ లభించడమూ నిజమే" అంటూండేవారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 మార్చి 12న గుజరాత్లోని అహ్మదాబాద్లో 'ఆజాదీ అమ్మత్ మహోత్సవ్' ప్రారంభోత్సవం సందర్భంగా లక్ష్మణ్ నాయక్ ని గుర్తు చేసుకుంటూ ఆయన గాంధేయ మార్గాన ప్రజల్లో చైతన్యవ్యాప్తికి అవిరళ కృషి చేశారని కొనియాడారు.

సుభాష్ చంద్రబోస్ ‘తల్లి'గా పిలుచుకున్న వనిత బసంతి దేవి: దేశబంధుగా సుప్రసిద్ధులైన చిత్తరంజన్ దాస్ స్వాతంత్య సమరయోధుడుగా, రాజకీయ కార్యకర్తగా దేశ స్వాతంత్యం కోసం జీవితాంతం పోరాడిన ప్రముఖ న్యాయవాది. ఈ పోరాటంలో ఆయన జీవిత భాగస్వామి బసంతి దేవి కూడా భర్తకు అద్యంతం తోడూనీడగా నిలిచారు. అస్సాంలోని సంపన్న కుటుంబంలో 1880 మార్చి 23న జన్మించిన బసంతి దేవికి 17 ఏళ్ల వయసులోనే చిత్తరంజన్ దాస్ తో వివాహమైంది.

కాగా, నేతాజీ సుభాస్ చంద్రబోస్ తో చిత్తరంజన్ దాస్ కు బలమైన స్నేహ సంబంధాలు ఉండేవి. ఈ కారణంగానే బసంతి దేవి కూడా నేతాజీ తో సన్నిహితంగా మెలిగేవారు. ఆనాడు దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన యువతరం ఆమెను తల్లిగా భావించేవారు. అదే తరహాలో ఆమెను ఎంతగానో గౌరవించే సుభాష్ చంద్రబోస్ కూడా బసంతి దేవిని 'తల్లి'గా సంబోధించారు. ఆమె తన భర్తతోపాటు 1917లో రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత భారత స్వాతంత్య పోరాటంలో నిరంతరం పాల్గొనసాగాడు. ఆమె తన భర్తతో పాటు శాసనోల్లంఘన ఉద్యమం, 1920 వాటి ఖిలాఫత్ ఉద్యమం సహా అనేక పోరాటాల్లో పాలుపంచుకున్నారు.

బసంతి దేవి తన భర్త అరెస్టు మరణం తర్వాత కూడా వివిధ రాజకీయ, సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న భారత స్వాతంత్య్ర్య సమర యోధురాలు, మహాత్మా గాంధీ పిలుపు మేరకు సహాయ నిరాకరణ ఉద్యమంతోపాటు 1920లో భారత జాతీయ కాంగ్రెస్ నాగ్ పూర్ మహాసభల్లోనూ ఆమె పాల్గొన్నారు. ఖాదీ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రచారోద్యమం సందర్భంగా ఆమె జైలుశిక్ష కూడా అనుభవించారు.

దేశవ్యాప్త ఉధ్యమానికి నిధులు కొరత గురించి మహాత్మా గాంధీ యోచిస్తున్న సమయంలో బంతి దేవి ముందుకొచ్చి చాలా సహాయం చేశారని చెబుతారు, మహిళా సంక్షేమం, అభ్యున్నతి దిశగా ఆమె 1921 లో చిత్తరంజన్ దాస్ సోదరీమణులతో కలసి 'నారీ కర్మా మందిర్' పేరిట ఒక శిక్షణ కేంద్రాన్ని నిర్మించారు. దేశానికి స్వాతంత్యం వచ్చిన తర్వాత కూడా బసంతి దేవి సామాజిక సేవలో చురుగ్గా పాలుపంచుకున్నారు. ప్రభుత్వం ఆమెను 1973లో పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

అంటరానితనం నిర్మూలన పైనా పోరాడిన ఉద్వేగభరిత స్వాతంత్య్ర సమర యోధుడు ఎం.ఏ. అయ్యంగార్: స్వాతంత్య్ర సమర యోధుడైన ఎం.ఏ. అయ్యంగార్ విభిన్నాంశాల్లో వాస్తవాలు- గణాంకాలపై సంపూర్ణ పరిజ్ఞానం ఉన్నవారని, అందుకే చర్చల సమయంలో ఆయన సహజ ప్రతిభ కనబరిచేవాడని చెబుతారు. కాంగ్రెస్ పార్టీ 1934లో పాలన మండళ్ల బహిష్కరణ విధానాన్ని ఉపసంహరించుకుని కేంద్ర చట్టసభ ఎన్నికలలో పోటీకి నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో అయ్యంగార్ తన శక్తిసామర్ధ్యాలతో తిరుగులేని అధిక్యం సాధించి చట్టసభకు ఎన్నికయ్యారు. ప్రభుత్వంలో కొనసాగడం ద్వారా బ్రిటిష్ పాలకులపై సమర్థంగా పోరాడగలమనే ఉద్దేశంతోనే ఆయన ఎన్నికలలో పోటీకి మొగ్గు చూపారు.

తదనుగుణంగా కేంద్ర చట్టసభ చర్చల్లో బలమైన వాదన వినిపించగల సభ్యుడుగా అయ్యంగార్ త్వరలోనే తనను తాను రుజువు చేసుకున్నారు. ఆ మేరకు అయ్యంగార్ వెనుక వరుస నుంచి ముందుకు వరుసకు చేరుకున్నారు. అప్పటి నుంచీ చట్టసభ సమావేశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జాతీయ ఉద్యమాన్ని సమర్థిస్తూ ఆయన గళం వినిపించని రోజంటూ ఉండేది కాదు. సభలో అయ్యంగార్ అద్భుత వాదనా పటిమతో ప్రభావితుడైన ఒక ఐరోపా రచయిత ఆయనను "ఎండైన్ ఆఫ్ ది అసెంబ్లీ"గా అభివర్ణించారు. 'ఎండైన్' అంటే- రెండో ప్రపంచ యుద్ధం తొలినాళ్లలో సంకీర్ణ నావికాదళాన్ని నష్టం కలిగించిన జర్మనీ జలాంతర్గామి.

ప్రతిభావంతుడైన ప్రజా ప్రతినిధిగానే కాకుండా, చిన్న వయసులోనే జాతీయోద్యమంలోకి దూకిన ప్రముఖ స్వాతంత్య్ర్య సమర యోధులలో అయ్యంగార్ కూడా ఒకరు. అంతేకాదు.. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా మహాత్మా గాంధీ పిలుపు మేరకు 1921-22 మధ్య న్యాయవాదిగా వృత్తికి విరామం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక పట్టణం తిరుపతి సమీపంలోని తిరుచానూరు అయ్యంగార్ జన్మస్థలం. స్వాతంత్య్రం పోరాటంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై ఆయన మూడేళ్లపాటు జైలుశిక్ష అనుభవించారు.

స్వాతంత్య్రానంతరం 1952లో లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గా ఎం.ఏ. అయ్యంగార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన రాజ్యాంగ (చట్ట) సభకు, ప్రావిన్షియల్ పార్లమెంటుకు డిప్యూటీ స్పీకర్ గానూ బాధ్యతలు నిర్వర్తించారు. లోకసభ స్పీకర్ జి.వి.మౌలంకర్ కన్నుమూసిన తర్వాత 1956 మార్చి 8న అయ్యంగార్ ఆ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. అటుపైన 1957లో రెండో లోక్ సభ ఏర్పడినపుడు అయ్యంగార్ మరోసారి ఏకగ్రీవంగా స్పీకర్ స్థానానికి ఎన్నికయ్యారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – రెండింటిని కలిపి చేసేవే సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం – యోగసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్యజీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండాల్సిన స్థితిలో సహజత్వం ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

No comments