గాంధీజీ నుంచి 'నేతాజీ' బిరుదు పొందిన సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన ఈ నినాదమే ఇవాళ మన జాతీయ నినాదంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా సుభాష్ చంద్రబోస్ కు సన్నిహితులైన కెప్టెన్ అబ్బాస్ అలీ, రాస్ బిహారీ బోస్, గురుబక్ష్ సింగ్ ధిల్లాన్, కల్నల్ నిజాముద్దీన్ సహా 'ఆజాద్ హింద్ ఫౌజ్' సైనికుల జీవితాలను మనం పరిశీలిద్దాం. వారు బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై అలుపెరుగక పోరాడటమే కాకుండా నేతాజీ పిలుపుతో భరతమాత కోసం సర్వస్వం త్యాగం చేశారు.
బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలించిన యోధుడు కెప్టెన్ అబ్బాస్ అలీ: కెప్టెన్ అబ్బాస్ అలీ ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ జిల్లా ఖుర్జాలో 1920 జనవరి 3న ముస్లిం రాజ్ పుత్ కుటుంబంలో జన్మించారు. వారిది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం. 1857లో తొలి స్వాతంత్ర్య పోరాటం తర్వాత ఆయన తాత రుస్తమ్ అలీఖాన్ ను ఉత్తరప్రదేశ్లోని బులందోహర్లో ఉరితీశారు.
ఇక బ్రిటిష్ పాలకులు 1931 మార్చి 23న షహీద్-ఎ-ఆజం భగత్ సింగ్ ను ఉరితీసినప్పుడు అబ్బాస్ అలీ వయసు కేవలం 11 సంవత్సరాలు. అయినప్పటికీ, ఆయన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలలో పాల్గొనడం కొనసాగించారు. అలాగే భగత్ సింగ్, ఆయన సహచరులు స్థాపించిన 'నౌజవాన్ భారత్ సభ' లో సభ్యుడుగా చేరారు. అటుపైన అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో చదువుతున్నపుడు 'అఖిల భారత విద్యార్థి సమాఖ్య' (ఎఐఎస్)లో సభ్యుడయ్యారు. చదువు పూర్తయ్యాక తిరుగుబాటుకు నాంది పలికే లక్ష్యంతో 1939 లో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరారు. బ్రిటిష్ ఆర్మీలో కమిషన్డ్ ఆఫీసరుగా పనిచేస్తున్న కెప్టెన్ అబ్బాస్ అలీని జపాన్తో పోరాటంలో భాగంగా ప్రభుత్వం 1940లో ఆగ్నేయాసియా యుద్ధరంగానికి పంపింది.
అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1944లో సింగపూర్ నుంచి సాయుధ విప్లవానికి నాయకత్వం వహించినప్పుడు కెప్టెన్ అబ్బాస్ అలీ బ్రిటిష్ ఆర్మీ ఉద్యోగానికి స్వస్తి చెప్పి 'ఆజాద్ హింద్ ఫౌజ్' లో చేరారు. అనంతరం మయన్మార్ లోని ప్రస్తుత రాజైన్ ప్రావిన్స్ పరిధిలోగల అరకాన్లో బ్రిటిష్ సైన్యంతో పోరాడారు. కానీ జపనీయులు మిత్రరాజ్యాల దళాలకు లొంగిపోవడంతో అబ్బాస్ అలీ సహా 60 వేల మందికి పైగా ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు అరెస్టయ్యారు. ఆ తర్వాత ఆయనతోపాటు ముగ్గురు సహచరులను ముల్తాన్ కోటలో నిర్బంధించి విచారణ చేపట్టారు. చివరకు అబ్బాస్ అలీపై సైనిక న్యాయస్థానంలో విచారణ అనంతరం 1946లో మరణశిక్ష విధించబడింది.
మాతృభూమి కోసం ప్రాణత్యాగానికి ఆయన సిద్ధమైనప్పటికీ 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడంతో కారాగారం నుంచి విడుదలయ్యారు. స్వతంత్ర భారతంలో ఆయన సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనడంతోపాటు భారత నిర్మాణంలో తనవంతు పాత్ర పోషించారు.
ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు రాస్ బిహార్ బోస్: నేతాజీ దేశం విడిచి జర్మనీ వెళ్లిన సమయంలో ఆజాద్ హింద్ ఫౌజ్ పగ్గాలను ఆయనకు అప్పగించాలని రాస్ బిహార్ బోన్ నిర్ణయించుకున్నారు. ఆ మేరకు నేతాజీని ఆయన టోక్యో రావాల్సిందిగా కోరారు. ఈ ఆహ్వానంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1943 జూన్ 20న టోక్యో వెళ్లారు. సుభాష్ చంద్ర బోస్ ప్రత్యక్షంగా కలుసుకున్న ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు రాస్ బిహారి బోస్ తమ రహస్యం సంభాషణను బెంగాలీ భాషలో నడిపించారు. ఈ సందర్భంగా దేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తం చేస్తామని వారు ప్రతిన బూనారు.
ఈ ఇద్దరు నాయకులూ బెంగాలీలు... విప్లవ మూర్తులు కావడంతోపాటు వీరిద్దరి మధ్య ఇంటి పేరు సహా అనేక సారూప్యాలు ఉండటం విశేషం. రాస్ బిహారి బోస్ సింగపూర్లో ఆజాద్ హింద్ ఫౌజ్ నాయకత్వ బాధ్యతలను జూలై 5న నేతాజీకి అప్పగించి, తాను సలహాదారు పాత్రకు పరిమితమయ్యారు. కాగా, రాస్ బిహార్ బోస్ 1886 మే 25న బెంగాల్లోని బర్ధమాన్ జిల్లా సుభాల్దా గ్రామంలో జన్మించారు. చదువుకునే రోజుల్లోనే విప్లవ కార్యకలాపాల పట్ల ఆకర్షితులై అతి చిన్న వయసులోనే నాటు బాంబుల తయారీ నేర్చుకున్నారు. బంకిం చంద్రుని 'ఆనంద్ మఠ్' నవల ఆయనలో విప్లవ జ్వాలను రగిల్చింది. దీంతోపాటు స్వామి వివేకానంద సురేంద్రనాథ్ బెనర్జీల జాతీయవాద ప్రసంగాలతోనూ ఆయన ఎంతగానో ప్రభావితమయ్యారు.
కాగా, ముజఫర్పూర్ మేజిస్ట్రేట్ కింగ్స్ ఫోర్డ్ చంపడానికి ఖుదీరామ్ బోస్, ప్రఫుల్లా చాకీ ఉపయోగించిన బాంబును రాస్ బిహారీ బోస్ తయారు చేసినట్లు చెబుతారు. అలాగే 1912లో అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ హార్డింజ్ ను హతమార్చడానికీ ప్రణాళిక రచించినా ఈ ప్రయత్నంలో ఆయన విఫలమయ్యారు. ఆ తర్వాత గదర్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బ్రిటిష్ ప్రభుత్వం వెంటాడటంతో దానిబారి నుంచి తప్పించుకుని జపాన్ వెళ్లి, భారతదేశానికి సహకరించేలా అక్కడి ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఆ తర్వాత జపాన్ యువతిని వివాహమాడారు. అప్పట్లో జపాన్ తమ రెండో అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్': ప్రధానం ద్వారా ఆయనను సత్కరించింది. మాతృభూమి కోసం ఆయన చేసిన అవిరళ కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది.
పవిత్రాశయ సాధనలో గురుబక్ష్ సింగ్ ధిల్లాన్ వెన్నంటి నడిచిన దేశం: గురుబక్ష్ సింగ్ ధిల్లాన్ చదువులో ప్రజ్ఞాశాలి, భారీకాయుడు కావడంతో సైన్యంలో చేరాల్సిందిగా ఆయన తండ్రి స్నేహితులు సలహా ఇచ్చారు. ఆ మేరకు ఆయన తదనుగుణంగా సన్నద్దమై 1933లో ఇండియన్ ఆర్మీ లో చేరాడు. ఆ విధంగా 14వ పంజాబ్ రెజిమెంట్ కు ఎంపికై, శిక్షణ పొందిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడేందుకు 1941లో మలేషియా వెళ్లాల్చి వచ్చింది. ఆ తర్వాత 1942లో జపాన్ సైన్యం యుద్ధఖైదీగా నిర్బంధించడంతో ఆయన జీవితం మలుపు తిరిగింది. అక్కడ జైలులో ఉన్న సమయంలో ఆయన మనసు మార్చుకుని మాతృభూమి కోసం బ్రిటిష్ సైన్యంతో పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలో జైలునుంచి విడుదలైన తర్వాత సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరారు. బ్రిటిష్ వారితో తలపడటంలో ధిల్లాన్ అద్భుత పోరాట పటిమను ప్రదర్శించారు.
నేతాజీ డ్రైవర్, అంగరక్షకుడు కల్నల్ నిజాముద్దీన్: నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2014 మే 9వ తేదీన ఓ కార్యక్రమంలో పాల్గొన్నపుడు ఆ వేదికపైగల ఒక వ్యక్తి పాదాలకు నమస్కరించారు. ఆయన మరెవరో కాదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యుడైన కల్నల్ నిజాముద్దీన్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కారు డ్రైవరుగా ఉండే ఈయన తుపాకీ పేల్చడంతో గొప్ప గురిగలవారే కాకుండా 11 భాషలలో నైపుణ్యంగలవారని భావిస్తారు.
యుద్ధరంగంలో ఒక బ్రిటిష్ యుద్ధవిమానాన్ని ఆయన కూల్చేశారని చెబుతారు. కాగా, సింగపూర్లో ఆజాద్ హింద్ ఫౌజ్ సైనిక నియామకాలు నిర్వహిస్తున్నపుడు ఆయన తొలిసారి నేతాజీని కలుసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని అజంగఢ్ జిల్లా ధక్వా గ్రామంలో జన్మించిన నిజాముద్దిన్ కు సుభాష్ చంద్రబోస్ కల్నల్ హోదా ప్రకటించారు. సుభాష్ చంద్రబోస్ మేనకోడలు రాజ్యశ్రీ చౌదరి 2015లో అజంగఢ్ కు వెళ్లి నిజాముద్దీన్ ను కలుసుకోవడాన్ని బట్టి, నేతాజీతో ఆయనకుగల బంధం ఎంత బలమైనదో అర్ధం చేసుకోవచ్చు.
కాగా, ఆయన తొలుత బ్రిటిష్ ఆర్మీలో పారాట్రూపర్గా పనిచేసేవారని, ఆ తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ తో కలిసిపోయేందుకు ఆనాటి మద్రాసు, కాశ్మీరు సహచరులతో కలసి వెళ్లిపోయారని చెబుతారు. ఒక సందర్భంలో తన వెన్నులో మూడు బుల్లెట్లు దిగబడినా సుభాష్ చంద్రబోస్ ని రక్షించగలిగానని, డాక్టర్ లక్ష్మీ సెహగల్ ఆ బుల్లెట్లను బయటకు తీశారని కల్నల్ నిజాముద్దీన్ గుర్తు చేసుకుంటూండేవారు.
నిజాముద్దీన్ 2017లో అజంగఢ్ పరిధిలోని ముబారక్ పూర్లో కన్నుమూశారు. ఆయన మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేస్తూ నిజాముద్దీన్ ను తాను కలుసుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. గుండెలనిండా దేశభక్తి, ఆదర్శాలు, అకుంఠిత ధైర్యసాహసాలకు ఆయన మారుపేరని, ఆయనలోని ఈ లక్షణాలు స్వాతంత్ర్యోద్యమాన్ని బలోపేతం చేశాయని ప్రధాని కొనియాడారు.

