Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

బ్రిటీష్ పాలకుల అణచివేతను ఎదిరించిన అగ్గిపిడుగు – శ్రీ అల్లూరి సీతారామరాజు

మన్య సీమ గాండ్రించిన మగటిమి గల మొనగాడు, తెల్లదొరల అదలించిన తెలుగు తల్లి బిడ్డడు, శ్రీ అల్లూరి సీతారామరాజు గురించి రచయిత డా. సి.నారాయణరెడ్డి ...

అల్లూరి సీతారామరాజు


మన్య సీమ గాండ్రించిన మగటిమి గల మొనగాడు, తెల్లదొరల అదలించిన తెలుగు తల్లి బిడ్డడు, శ్రీ అల్లూరి సీతారామరాజు గురించి రచయిత డా. సి.నారాయణరెడ్డి గారు రాసిన ప్రేరణాత్మక పంక్తులివి. మన దగ్గర సరైన బలం ఉంటే ఎవరైనా పోరాడగలరు. కానీ పరిమిత వనరుల మధ్య, నిరక్షరాస్యులైన మన్యం ప్రజల మధ్య తానే వనరులను సృష్టించుకుంటూ, ప్రజల్లో ప్రేరణ నింపుతూ, బ్రిటీష్ సామ్రాజ్య పెత్తనాన్ని ఎదిరిచడమంటే... సామాన్యులు ఊహించే విషయం కాదు. ఈ విధంగా ముందుకు సాగాలంటే ఎంతో ఆత్మ విశ్వాసం కావాలి. నిరక్షరాస్యులను కూడగట్టాలంటే మరింత సహనం కావాలి. 22 ఏళ్ళ యువకుడిగా శ్రీ అల్లూరి ఆచరించి చూపించిన బాట ఇది.
 
శ్రీ అల్లూరి సీతారామరాజు గారి దేశభభక్తి, ఆత్మవిశ్వాసం, కార్యదీక్ష, చిత్తశుద్ధి యువతకు ఆదర్శనీయమైనవి. 27 ఏళ్ళ వయసులో బ్రిటీష్ సామ్రాజ్య శక్తిని ప్రతిఘటిస్తూ వీరమరణం పొందడం సామాన్యమైన విషయం కాదు. రంప విప్లవానికి నాయకత్వం వహిస్తూ అశువులు బాసిన శ్రీ అల్లూరి గారి గురించి గాంధీ మహాత్ముడు... “నేను సాయుధ విప్లవాన్ని ఆమోదించను. కానీ అల్లూరి సీతారామరాజు సాహసి.” అంటూ యంగ్ ఇండియా పత్రికలో రాసిన మాటలు స్ఫూర్తిని రగిలిస్తాయి.

1897 జులై 4న పాండ్రంగిలో జన్మించిన శ్రీ అల్లూరి సీతారామరాజు 22 ఏళ్ళ వయసులోనే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల పట్ల జరుగుతున్న అన్యాయాల గురించి తెలుసుకుని, వారికి న్యాయం చేసేందుకు పోరాటం ప్రారంభించారు. ఇదే పోరాటం కొంత కాలానికి సాయుధ పోరాటంగా మారింది. ఆయుధాల కోసం మన్యం పోరాట వీరులు బ్రిటీష్ పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేశారు. ఉత్తరం రాసి, సంతకం పెట్టి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్న అల్లూరి ధైర్యసాహసాలు ఆశ్చర్యం కలిగించకమానవు.

శ్రీ అల్లూరి సీతారామరాజు సాగించిన రంప విప్లవం బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఎంతగా భయపెట్టిందంటే, ఆయన ఉద్యమాన్ని అణచివేసేందుకు మలబార్ నుంచి ప్రత్యేక సైనిక దళాలను కూడా పిలిపించింది. ఆ రోజుల్లో శ్రీ అల్లూరి ఉద్యమం వెనుక ఉన్న లక్ష్యాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. స్థానిక సంస్థల అభివృద్ధి, మద్యపాన నిషేధం, అందరికీ విద్య వంటి మహోన్నత లక్ష్యాలను ఆయన నిర్దేశించుకుని ముందుకు సాగారు. ఇవే అల్లూరి ముందు చూపును మన కళ్ళకు కడుతున్నాయి. నేటికీ సమాజ అభివృద్ధికి ఇదే తరహా సమస్యలు సవాళ్ళు విసురుతున్నాయి.

శ్రీ అల్లూరి తెలుగు వారికి మాత్రమే పరిమితమైన స్వరాజ్య యోధుడు కాదు. మన్నెం సీమలో గాండ్రించిన ఈ బెబ్బులిని దేశవ్యాప్తంగా ఎంతో మంది ఆదర్శంగా తీసుకుని స్వరాజ్య ఉద్యమంలో ముందుకు సాగారు. నిజానికి అల్లూరి అనుసరించింది విప్లవ మార్గమే. అయితే అది ప్రజల బాగును కోరిన సంక్షేమ మార్గం.

శ్రీ అల్లూరి సీతారామరాజు జన్మస్థలాన్ని యువత ఇలాంటి ప్రదేశాలను సందర్శించే ప్రయత్నం చేయాలి. ఇలాంటి మహనీయుల జీవితాల గురించి పరిశోధన గావించాలి. స్వరాజ్యం సముపార్జించుకుని 75 ఏళ్ళ మైలురాయిని చేరుకుంటున్న తరుణంలో భారతప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుండడం ఆనందదాయకం. ఈ కార్యక్రమాల్లో యువత భాగస్వాములు కావాలి. ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛకు కారణమైన స్వరాజ్య సమరయోధుల గురించి తెలుసుకోవడమే గాక, మన చుట్టుపక్కల వారికి తెలియజేసేందుకు ఇదో మంచి తరుణం. భారతీయ యువత ఇలాంటి మహనీయుల జీవితాల గురించి తెలుసుకుని, వారి స్ఫూర్తితో నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాము. జైహింద్.

సావర్కర్ వ్రాసిన అండమాన్ లో ఆజన్మాంతం పుస్తకం కొరకు వాట్సాప్ ద్వారా సంప్రదించండి:
మా వాట్సాప్ నెంబర్ : +91 8500-5819-28

or Directly Buy

No comments