Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

1962 లో చైనాతో రెజాంగ్ లా యుద్ధం - 114 మంది భారత సైనికులు బలిదానం - మేజర్ షైతాన్ సింగ్ వీరోచిత పోరాటం

అది 1963 లద్దాఖ్ లోని ఒక గొర్రెలకాపరి చుషుల్ నుంచి రెజాంగ్ లా పాస్ దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ అతడికి ధ్వంసమైన బంకర్లు, భారీగా ప...

అది 1963 లద్దాఖ్ లోని ఒక గొర్రెలకాపరి చుషుల్ నుంచి రెజాంగ్ లా పాస్ దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ అతడికి ధ్వంసమైన బంకర్లు, భారీగా పడివున్న ఖాళీ తూటాలు కనిపించాయి. మరింత దగ్గరగా వెళ్లి చూసిన అతడికి అక్కడంతా చెల్లాచెదురుగా పడి ఉన్న సైనికుల శవాలు కనిపించాయి. ఆ గొర్రెలకాపరి వెంటనే పరుగెత్తుతూ కొండ కిందికి వచ్చాడు. సమీపంలోని ఇండియన్ ఆర్మీ పోస్టు దగ్గరకు వెళ్లి తాను చూసిందంతా చెప్పాడు. దాంతో వెంటనే భారత సైనికులు అక్కడకు వెళ్లారు. వారికి భారత జవాన్ల శరీరాలపై ఎన్నో బుల్లెట్ గాయాలు కనిపించాయి. వారిలో చాలామంది చేతుల్లో రైఫిళ్లు అలాగే ఉన్నాయి. సైన్యంలోని నర్సింగ్ అసిస్టెంట్ చేతిలో సిరంజి, బాండేజ్ కూడా అలాగే ఉన్నాయి. కొంతమంది జవాన్ల రైఫిళ్లు బుల్లెట్ దెబ్బలకు ముక్కలైనా, వాటి బటన్ వారి చేతుల్లోనే ఉంది. ఏమి జరిగింది అని ఆలోచిస్తున్నారా? కొన్ని వీరోచిత గాధలు వింటుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. అలాంటి సంఘటనే 1962 నవంబర్ 18 న భారత-చైనాల సరిహద్దు రెజాంగ్ లా పాస్ వద్ద ఒక భీకర యుద్దం జరిగింది. ఇది భారత చరిత్రలోనే పెద్ద యుద్దంగా మన సైనికుల వీరోచిత పోరాటంగా చెప్పవచ్చు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన ప్రధాని నెహ్రు సరిహద్దుల గురించి పెద్దగా పట్టించుకోక పోగా ఒక గడ్డిపూచ కూడా మొలవదు అంటూ వ్యాక్యలు చేస్తుండేవారు అది ఆయన దేశభక్తి. అదే సమయంలో చైనా వాళ్ళకి మన సరిహద్దు భూభాగాలైనా లద్ధాక్, లేహ్ ప్రాంతాలలో అక్షయ్ చీన్, రెజాంగ్ లా పాస్ ల పై చైనాకు కన్నుపడింది. ఎలాగైనా సరిహద్దులని దాటి రావాలనే కుట్రతో 800 మంది పైబడి సైన్యంతో చైనా సిద్దపడింది. సుబేదార్ రామచంద్ర యాదవ్ మాటల్లో యుద్దం గురించి పూర్తిగా తెలుసుకుందాం.

నిజానికి చైనా మన పై యుద్ధానికి సిద్ధమైందని భారత్ కి ముందే తెలుసు. యుద్ధానికి నాలుగు రోజుల ముందు ‘మీరు వెనక్కు వచ్చేయండి’ అని ఒక సందేశం వచ్చింది. మేజర్ షైతాన్ సింగ్ ‘నా జవాన్లతో మాట్లాడిన తర్వాతే నేను అలా చేయగలను’ అన్నాడు. మేజర్ షైతాన్ సింగ్ ప్రతి ప్లటూన్ దగ్గరకు వెళ్లారు. ఆయనతో అందరూ, ‘మేం చావనైనా చస్తాం.. కానీ, శత్రువును ఇక్కడే చంపుతాం, ఎక్కడికీ వెళ్లం’ అని చెప్పారు. “మూడు ప్లటూన్లు అలా చెప్పిన తర్వాత మేజర్ షైతాన్ సింగ్ ‘నా ఉద్దేశం కూడా అదే’ అన్నారు. ‘కంపెనీ ఈ ప్రాంతం నుంచి వెనకడుగు వేయదు’ అని షైతాన్ సింగ్ బ్రిగేడియర్ టీఎన్ రైనాకు సందేశం పంపించారు”. అయితే ‘మీలో చివరి జవాన్, చివరి బుల్లెట్ ఉన్నంత వరకూ యుద్ధం చేస్తూనే ఉండండి’ అని బ్రిగేడియర్ టీఎన్ రైనా లిఖితపూర్వక ఆదేశాలను పంపారు.

ఆ లిఖితపూర్వ ఆదేశాలు హిమాలయలంత ధైర్యాన్ని ఇచ్చాయి మాకు. 1962లో 13 కుమావు రెజిమెంటును చుషుల్ ఎయిర్‌స్ట్రిప్ రక్షణ కోసం పంపించారు. దాన్లో ఎక్కువగా హరియాణా జవాన్లే. జీవితంలో అప్పటివరకూ మంచు కురవడం చూడలేదు. వారికి రెండు రోజుల నోటీసులో జమ్ముకశ్మీర్ బారాముల్లా నుంచి అక్కడికి తీసుకొచ్చారు. వారికి ఎత్తైన ప్రాంతాల్లో, చలిలో ఉన్న అనుభవం లేదు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ఉండేందుకు వారి దగ్గర తగిన దుస్తులు, బూట్లు లేవు. వేసుకోడానికి వారికి జెర్సీలు, కాటన్ ప్యాంట్లు, తేలికపాటి కోట్లు ఇచ్చారు.

మేజర్ షైతాన్ సింగ్ తన జవాన్లను కొండ ముందు వాలులో మోహరించారు. ఆరోజు 1962 నవంబర్ 18. చలి మామూలు రోజుల కంటే కాస్త ఎక్కువగానే ఉంది. రేజాంగ్ లా లో మంచు కూడా పడుతోంది. “వేకువజామున మూడు గంటలకు భారీగా కాల్పులు జరిగాయి. కొండలంతా ఆ శబ్దం ప్రతిధ్వనించింది. 8 ప్లటూన్ ముందు నుంచి ఫైరింగ్ వస్తోంది. నాలుగు నిమిషాల తర్వాత 8 నుంచి 10 మంది చైనా సైనికులు మనవైపు వస్తున్నారని హరిరామ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది”. “వాళ్లు మా రేంజిలోకి రాగానే, మన జవాన్లు చాలాసేపు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో నలుగురైదుగురు చైనా జవాన్లు అక్కడే చనిపోయారు. మిగతా వాళ్లు పారిపోయారు. తర్వాత నేను(యాదవ్) నాలైట్ మెషిన్ తెప్పించుకున్నాను. అది వినగానే మేజర్ షైతాన్ సింగ్ ‘మనం ఎదురుచూస్తున్న సమయం, వచ్చింది’ అన్నారు. హరిరాం ‘మీరేం కంగారు పడకండి సర్.. మన జవాన్లు అందరూ సిద్ధంగా ఉన్నారు. మనం పట్టు సాధించాం’ అన్నారు.

7వ ప్లటూన్ జమాదార్ సూర్జారామ్ దాదాపు 400 మంది చైనా జవాన్లు తన పోస్టు వైపు వస్తున్నారని కంపెనీ కమాండర్‌కు సమాచారం అందించాడు. అప్పుడే, శిఖరం వైపు నుంచి 800 మంది చైనా జవాన్లు తమ దిశగా వస్తున్నారని 8వ ప్లటూన్ కూడా రిపోర్ట్ చేసింది. చైనా జవాన్లు మన ఫైరింగ్ రేంజిలోకి రాగానే, వారిపై కాల్పులు ప్రారంభించాలని మేజర్ సైతాన్ సింగ్ వారిని ఆదేశించారు. “చైనా జవాన్లు 300 గజాల రేంజిలోకి రాగానే, మనవాళ్ళు వారిపై ఫైర్ ఓపెన్ చేశారు. సుమారు 10 నిమిషాలు భారీగా కాల్పులు జరిపాం. మేజర్ షైతాన్ సింగ్ మాటిమాటికీ బయటికెళ్తున్నారు. తోటి సైనికులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఎందుకంటే చైనా ఆర్మీ ఎప్పుడు కాలుస్తుందో ఎవరికీ తెలీదు”.

“సూరజ్‌రామ్ రేడియోలో మేం చైనా జవాన్లను తరిమికొట్టామని చెప్పాడు. మా జవాన్లు అందరూ సురక్షితంగా ఉన్నారు. వారికి చిన్న దెబ్బ కూడా తగల్లేదు. మేం ఎత్తుల్లో ఉన్నాం. చైనీయులు కింది నుంచి వస్తున్నారు. అదే మాట్లాడుతున్నప్పుడు హఠాత్తుగా, చైనా మొదటి ఫిరంగి గుండు మా బంకర్ మీద పడింది. మేజర్ షైతాన్ సింగ్ వెంటనే ఫైరింగ్ ఆపమన్నాడు. తర్వాత ఆయన మోర్టార్ ప్రయోగించే జవానుకు ‘టార్గెట్ తోతా’ అని కోడ్‌వర్డ్ ఆదేశం ఇచ్చాడు. మా మోర్టార్ ఫైరింగ్‌తో చైనా సైన్యం బెదిరిపోయింది. వారి ఆ దాడి కూడా విఫలమైంది”.

అన్ని దాడులూ విఫలమవడంతో చైనా సైన్యం తమ ప్లాన్ మార్చింది. ఉదయం నాలుగున్నరకు అన్ని పోస్టుల మీదా ఒకేసారి గుండ్ల వర్షం కురిపించారు. 15 నిమిషాల్లో అంతా అయిపోయింది. ఎక్కడ చూసినా శవాల గుట్టలు, భారీ విధ్వంసం కనిపించింది.అప్పుడు భారత జవాన్ల దగ్గర లైట్ మెషిన్ గన్స్, 303 రైఫిళ్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా సింగిల్ లోడ్, అంటే బుల్లెట్ పేల్చిన తర్వాత దాన్ని మళ్లీ లోడ్ చేయాలి. అంత చలిలో జవాన్ల వేళ్లు గడ్డకట్టినట్టు అయిపోయాయి”

“15 నిమిషాల్లోపే చైనా జవాన్లు భారత బంకర్లను ధ్వంసం చేశారు. గుడారాలకు మంటలంటుకున్నాయి. జవాన్ల శరీర భాగాలు అక్కడంతా చెల్లాచెదురుగా పడున్నాయి. కానీ, ఆ తర్వాత కూడా మేజర్ షైతాన్ సింగ్ తన జవాన్లలో ధైర్యం నూరిపోస్తూ వచ్చారు. పొగ చెదిరిన తర్వాత శిఖరం మీద వారికి ఆయుధాలు మోసుకొస్తున్న జడలబర్రెలు, గుర్రాలు కనిపించాయి. జవాన్లకు కాసేపు అల్ఫా కంపెనీ తమను కాపాడ్డానికి వస్తోందేమో అనిపించింది. సంతోషంతో బైనాకులర్స్ అందుకున్నారు. దాన్లోంచి చూశాక, వస్తున్నవారు చైనా జవాన్లనే విషయం వారికి తెలిసింది. తర్వాత చైనా సైన్యం మూడో దాడి మొదలైంది”. ఈలోపు మేజర్ షైతాన్ సింగ్ భుజానికి షెల్ తగిలింది. ఆయన బాండేజ్ కట్టుకునే తన జవాన్లను ముందుకు నడిపించాడు. శిఖరం మీద ఉన్నప్పుడు, నేరుగా ఆయన కడుపుపై కాల్పులు జరిపారు. సైతాన్ సింగ్ మీద కాల్పులు జరుపుతున్న చైనా జవాన్ మీద హర్‌ఫూల్ లైట్ మెషిన్‌ గన్‌తో ఫైరింగ్ చేశాడు. హర్‌ఫూల్‌కు కూడా బుల్లెట్లు తగిలాయి. అతడు పడిపోతూ నాతో “మేజర్ సాబ్‌ను శత్రువు చేతుల్లో ఓడిపోనివ్వకు” అన్నాడు. మేజర్ షైతాన్ సింగ్‌కు రక్తం తీవ్రంగా పోయింది. దాంతో ఆయన మాటిమాటికీ స్పృహతప్పిపోతున్నారు. ఆ కష్ట సమయంలో నేను ఆయన వెంటే ఉన్నాను. ఆయన్ను సజీవంగా చూసిన కొద్ది మందిలో నేను కూడా ఒకరు.

“మేజర్ సాబ్ నాతో ‘రామచంద్ర కడుపులో చాలా నొప్పిగా ఉంది. నా బెల్టు విప్పు’ అన్నాడు. నేను ఆయన చొక్కా పైకి తీశాను. ఆయన పేగులన్నీ బయటికొచ్చాయి. కానీ, నేను ఆయన బెల్ట్ తీయలేదు. ఎందుకంటే, అలా చేస్తే, పేగులన్నీ బయటికొస్తాయి. అక్కడ ఫైరింగ్ జరుగుతూనే ఉంది. స్పృహతప్పిన మేజర్ సైతాన్ సింగ్‌కు మళ్లీ తెలివొచ్చింది”.

“ఆయన కష్టంగా ఊపిరి తీసుకుంటూ ‘నేను చెప్పేది విను. నువ్వు బెటాలియన్‌లోకి వెళ్లిపో. కంపెనీ ఇలా పోరాడింది అని అందరికీ చెప్పు. నేను ఇక్కడే చచ్చిపోవాలనుకుంటున్నా, అన్నాడు. సరిగ్గా 8.15 నిమిషాలకి మేజర్ సాబ్ ప్రాణాలు పోయాయి” . నేను మేజర్ శవాన్ని అక్కడే వదిలేశాను. చైనా జవాన్లకు కనిపించకుండా దానిపై కొంత మంచు కప్పాను. కిందికి వెళ్లి ఎవరినైనా తీసుకొచ్చి మేజర్ సాబ్ శవాన్ని తీసుకెళ్దామని క్వార్టర్ మాస్టర్ దగ్గరకు వచ్చాను.

“ఆలోపు చైనా జవాన్లు మా బంకర్లలోకి చొరబడడం నేను చూశాను. మా 13 కుమావు జవాన్లు, చైనా జవాన్లతో చేతులతోనే ఘర్షణకు దిగారు. మా సహచరుడు సిగ్రాం దగ్గర బుల్లెట్లు అయిపోవడంతో చైనా జవాన్లతో పోరాడుతూ చనిపోయాడు. అతడు ఒక చైనా జవాన్‌ను కాళ్లు పట్టుకుని రాయి కేసి కొట్టి చంపాడు. తర్వాత 7 ప్లటూన్‌లో ఒక్క జవాన్ కూడా ప్రాణాలతో బతకలేదు. బందీలుగానూ చిక్కలేదు”. చుట్టూ శవాలు చెల్లాచెదురుగా పడున్నాయి. మేజర్ సైతాన్ సింగ్ గుడారం పూర్తిగా ధ్వంసమైంది. ఆయన స్నేహితుడు చిమన్ తల మొండెం నుంచి వేరయింది. మండోలాకు చెందిన మహేందర్ సింగ్ కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. కానీ నేను కిందికొచ్చేసరికే అక్కడంతా మంటలు కనిపించాయి. దానిని మా వాళ్లే తగలబెట్టారు. వాటన్నిటినీ ధ్వంసం చేసి చుషుల్‌లో హెడ్ క్వార్టర్స్ కు తిరిగిరావాలని వారికి ఆదేశాలు అందాయి. అప్పుడే నాకు ఒక జీప్ వచ్చింది. దాన్లో నేను హెడ్ క్వార్టర్స్ చేరుకోగలిగాను” అని రామచంద్ర యాదవ్ చెప్పారు. ఈ యుద్ధంలో 13 కుమావుకు చెందిన 124 మంది జవాన్లలో 114 మంది చనిపోయారు.

ఏం జరిగిందంటే, ఆ యుద్ధం ముగిసిన తర్వాత భారీగా మంచు కురిసింది. దాంతో, ఆ ప్రాంతాన్ని ‘నో మాన్స్ లాండ్‌’గా ప్రకటించారు. దాంతో, అక్కడకు ఎవరూ వెళ్లలేకపోయారు.ఆ యుద్ధం తర్వాత 114 మంది సైనికులు ఏమయ్యారో అంతవరకు ఎవరికీ తెలియలేదు. చాలా మంది వారిని యుద్ధఖైదీలుగా చైనా సైన్యం పట్టుకుందని అనుకున్నారు. వారంతా భయంతో యుద్ధం నుంచి పారిపోయారని, పిరికిపందలని ప్రచారం జరిగింది. ప్రాణాలతో తిరిగి వచ్చిన ఇద్దరుముగ్గురితో కూడా జనం మాట్లాడడం మానేశారు. వారి పిల్లలను స్కూళ్ల నుంచి కూడా బయటకు పంపేశారు. వారందరూ నిజానికి పిరికివారు కాదని, హీరోలని చెప్పడానికి ఒక ఎన్జీవో ఎంతో ప్రచారం చేయాల్సి వచ్చింది. అలాంటి వారిలో ఒకరు రామచంద్ర యాదవ్ కూడా.

చైనాతో యుద్ధం ముగిసిన మూడు నెలల తర్వాత ఒక లద్దాఖ్ గొర్రెలకాపరి చుషుల్ నుంచి రెజాంగ్ లా పాస్ దగ్గర గొర్రెలు కాస్తుంటే అక్కడ అమరులైన మన సైనికుల పార్థీవశరీరాలు కనిపించాయి. బండరాయి వెనుక అదే స్థలంలో మేజర్ షైతాన్ సింగ్ మృతదేహం కనుగొనబడింది. దానిని జోధ్‌పూర్‌కు తరలించి పూర్తి సైనిక లాంఛనాలతో దహనం చేశారు. మేజర్ షైతాన్ సింగ్ అత్యున్నత శౌర్య పతకం అయిన పరమవీర చక్రను అతని అచంచలమైన ధైర్యం, నాయకత్వం మరియు విధి పట్ల ఆదర్శప్రాయమైన అంకితభావానికి అందించారు. ఆ సైనికులే లేకుంటే లేహ్, కార్గిల్, జమ్ము-కశ్మీర్ అన్నీ ప్రమాదంలో పడుండేవి. చైనా సైన్యాన్ని అడ్డుకుంది వారే. తమకు భారీ నష్టం జరగడంతో చైనా స్వయంగా యుద్ధ విరమణ చేసింది. మనం యుద్ధ విరమణ చేయించలేదు.

మేజర్ షైతాన్ సింగ్ భాటి డిసెంబర్ 1, 1924న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో సైనిక కుటుంబంలో జన్మించారు. ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ హేమ్ సింగ్ భాటి కుమారుడు, మేజ్ షైతాన్ సింగ్ 01 ఆగస్టు 1949న కుమావోన్ రెజిమెంట్‌లోకి నియమించబడ్డాడు. ఇంతటి తెగువ చూపిన సైనికుల బలిదానాలను పరిహాసం చేసేలా చైనా ఆక్రమించిన నేలలో గడ్డిపరక కూడా మొలవదని జవహర్ లాల్ నెహ్రూ పార్లమెంటు సాక్షిగా మాట తూలారు. చూడండి 114 మంది సైనికులు ఎమయ్యారో కూడా పట్టించుకోని నాయకత్వం ఆనాటిది. రెజాంగ్ లా పాస్ వద్ద యుద్ధ వీరుల స్థూపాన్ని నిర్మించారు. ఇది మన సైనికుల త్యాగం. జై జవాన్ జై హింద్.

No comments