Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మహల్ సుఖాలను వదిలిన బేగం హజ్రత్ మహల్ - MegaMinds

బేగం హజ్రత్ మహల్: 1857 నాటి తొలి స్వరాజ్య సంగ్రామ సమయంలో బ్రిటీష్ వారికి ఎదురు తిరిగిన మహిళల్లో ఒకరైన అవధ్ రాణి బేగం హజ్రత్ మహల్ ఒకరు. మహమ్మ...



బేగం హజ్రత్ మహల్: 1857 నాటి తొలి స్వరాజ్య సంగ్రామ సమయంలో బ్రిటీష్ వారికి ఎదురు తిరిగిన మహిళల్లో ఒకరైన అవధ్ రాణి బేగం హజ్రత్ మహల్ ఒకరు. మహమ్మది ఖానుమ్ పేరుతో ఓ పేద కుటుంబంలో జన్మించిన బేగం హజ్రత్ మహల్, నవాబు వాజిద్ అలీ సంస్థానంలో ఉండేవారు. తర్వాత నవాబు ఆమెను భార్యగా అంగీకరించి, రాణిని చేశారు. అనంతరం బిర్జిస్ ఖాదర్ అనే కుమారుడికి జన్మనిచ్చిన తర్వాత ఆమె పేరును హజ్రత్ మహల్ గా మార్పు చేశారు.

1856లో కుట్రల ద్వారా అవధ్ ను బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంటే, ఆ తర్వాత అవధ్ చివరి నవాబు అయిన వాజిద్ అలీషా కలకత్తాకు వెళ్ళిపోయారు. ఈ సంఘటన అనంతరం అన్యాయమైన ఈ చర్య పట్ల ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఎలాంటి పోరాటం లేకుండా తన రాజ్యాన్ని బ్రిటీష్ వారికి అప్పగించాలని నవాబు భావించారు. కానీ ఆయన భార్య బేగం హజ్రత్ మహల్ మాత్రం బ్రిటీష్ వారికి లోబడి ఉండేందుకు మానసికంగా సిద్ధం కాలేదు. తన కుమారుడితో కలిసి లక్నోలో ఉంటూ ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం పోరాడాలని నిశ్చయించుకున్నారు.

అనతికాలంలో భారతదేశ మొదటి స్వరాజ్య సంగ్రామం 1857లో ప్రారంభమైంది. బేగం హజ్రత్ మహల్ అవధ్ ప్రాంతంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ పరీక్షా సమయంలో ఆమె సైనిక, పరిపాలనా సామర్థ్యం అందరినీ ఆకట్టుకుంది. ఆమె స్ఫూర్తితో అవధ్ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఈ తిరుగుబాటు వ్యాపించింది. కొద్ది రోజుల్లోనే ఇది ప్రజా ఉద్యమంగా రూపు దాల్చింది.

ఆదర్శవంతమైన సైనిక నైపుణ్యం, రాజనీతిజ్ఞతతో, అవధ్ ప్రజల మద్దతుతో బేగం హజ్రత్ మహల్ పెద్ద ఎత్తున సైన్యాన్ని కూడగట్టి, బ్రిటీష్ దళాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. నానా సాహెబ్ మరియు మౌల్వి అహ్మద్ ఉల్లా షాలు ఈ యుద్ధంలో ఆమెకు అత్యంత సన్నిహితులు. ఆమె నాయకత్వం అత్యంత స్ఫూర్తిదాయకంగా, వ్యూహాత్మకంగా సాగిందని, ఫలితంగా బ్రిటీష్ వారు అవధ్ లోని చాలా భాగాల మీద నియంత్రణ కోల్పోయారని, లక్నోలో వారు ఉన్న ప్రాంతానికే పరిమితం కావలసి వచ్చింది.

తన 11 ఏళ్ళ కుమారుడు బిర్జిస్ ఖాదర్ ను అవధ్ నవాబుగా పట్టాభిషేకం చేసి, అతడి తరుఫున బేగం హజ్రత్ పాలనా పగ్గాలు చేపట్టారు. అనతి కాలంలోనే ఆమె ఉత్తమ పాలకురాలిగా కీర్తినొందారు. ఎప్పటికప్పుడు సైన్యంలో స్ఫూర్తిని నింపుతూ, ఏ క్షణంలోనైనా శతృవుల దాడికి సిద్ధంగా ఉండే విధంగా చర్యలు చేపట్టారు. హిందువులను, ముస్లింలను ఏకం చేసి, వ్యక్తిగతంగా కలిసి, వారితో మాట్లాడి సైనిక బలాన్ని మరింతగా వృద్ధి చేశారు. అంతే కాదు సంగ్రామం దిశగా మహిళలను సైతం ప్రేరేపించి, ప్రత్యేక మహిళా సైన్యాన్ని తయారు చేశారు. ఆమె నాయకత్వం వారికి నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది.

సరిగ్గా అదే సమయంలో భారతీయులను శాంతింపజేసేందుకు ఇంగ్లాండ్ రాణి ఒక ప్రకటన విడుదల చేయగా, అలాంటి వాగ్దానాలను ప్రజలెవరూ నమ్మొద్దు అంటూ మరో ప్రకటనను విడుదల చేసిన బేగం హజ్రత్ మహల్, బ్రిటీష్ వారి దురాగతాలను ఎండగట్టారు. 1857 భారత స్వరాజ్య సంగ్రామంలో భారతీయ యోధులు ఆదర్శప్రాయమైన ధైర్యాన్ని, తెగువను ప్రదర్శించినప్పటికీ వారి దగ్గర చాలినన్ని వనరులు లేకుండా పోయాయి. కొద్ది కాలంలోనే ఈ సంగ్రామానికి ప్రధాన కేంద్రమైన ఢిల్లీని బ్రిటీష్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. తర్వాత వారు లక్నో మీద దాడి చేశారు. బ్రిటీష్ దళాలు, బేగం హజ్రత్ మహల్ దళాల మధ్య వరుస భీకర యుద్ధాలు జరిగాయి.

ఓటమి అనివార్యమైన క్షణంలో, బ్రిటీష్ వారికి లొంగిపోవడం ఇష్టం లేక తన సహ విప్లవ నాయకులతో కలిసి నేపాల్ అడవుల్లోకి వెళ్ళారు. దురదృష్టవశాత్తు ఆమె తన జీవితంలో చివరి రెండు దశాబ్ధాలు నేపాల్ లో రాజకీయ ఆశ్రయంలో గడపాల్సి వచ్చింది. భారీగా భరణం, ఇతర విలాసవంతమైన సౌకర్యాల ఆశ చూపి, బ్రిటీష్ వారు ఆమెను తిరిగి లక్నోకు రప్పించడానికి ప్రయత్నాలు చేసినా, ఆమె ఈ ప్రతిపాదనలను తిరస్కరించారు. స్వాతంత్ర్య అవధ్ రాజ్యం తప్ప తనకు మరేదీ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

ఆమె తిరిగి అవధ్ స్వాతంత్ర్యం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, అవేవీ ఫలించలేదు. చివరకు 1879లో ఆమె పరమపదించారు. ఆమె సమాధి ఇప్పటికీ ఖాట్మండులో ఉంది. బేగం హజ్రత్ మహల్ భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శి. ఉన్నతమైన ఆదర్శాలు కలిగిన వీరవనిత. బ్రిటీష్ వారికి బానిసలా మారకుండా, ఆత్మగౌరవంతో జీవించాలని త్రికరణశుద్ధిగా నమ్మారు. చరిత్రలో చాలా క్లిష్టమైన సమయంలో అనేక సవాళ్ళను ఎదుర్కొంటూనే ధైర్యం, తెగువ, త్యాగబుద్ధితో మాతృభూమి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం పోరాడిన ఆ మహా యోధురాలి స్మృతికి నివాళులు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments