Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

‘సంపూర్ణ స్వరాజ్యం’ ఆరెస్సెస్ నినాదమే.. - MegaMinds

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) ప్రారంభమై 93 ఏళ్లు కావస్తోంది. హిందూ సంఘటన ఆధారంగా దేశ పునర్నిర్మాణానికి కృషిచేస్తున్న...

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) ప్రారంభమై 93 ఏళ్లు కావస్తోంది. హిందూ సంఘటన ఆధారంగా దేశ పునర్నిర్మాణానికి కృషిచేస్తున్న ‘సంఘ్’ ప్రారంభం నుండీ ఎన్నో విమర్శలను, ఆరోపణలనూ ఎదుర్కొంటూనే ఉంది. ‘ఆర్.ఎస్.ఎస్. భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనలేదు’-అన్నది ఆ విమర్శలలో ఒకటి. ఈ సంస్థ గురించి వాస్తవాలు తెలియనివారే అలా అసత్య ఆరోపణలు చేస్తుంటారు.
డాక్టర్ కేశవరావ్ బలీరాం హెడ్గెవార్ 1925లో ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించారు. ‘సంఘ్’ ఆవిర్భావం సందర్భంగా ఆయన స్వయం సేవకులతో మాట్లాడుతూ, ‘మీరు రోజూ ఒక గంట సమయాన్ని సంఘ శాఖకి వెచ్చించండి. మిగిలిన సమయంలో మీకు నచ్చిన విధంగా ఏ ఉద్యమాల్లో పాల్గొన్నా, ఏ రాజకీయ పార్టీ కార్యకలాపాలలో పాల్గొన్నా ఏ ఇబ్బందీ లేదు’ అని స్పష్టంగా అన్నారు. ఆయన తర్వాత ‘సంఘ్’ బాధ్యతలను స్వీకరించిన గురూజీ కూడా ఆ పరంపరనే కొనసాగించారు. ‘మీరు మీ అభీష్టం మేరకు దేశ స్వాతంత్య్రం కోసం ఏ ఉద్యమంలోనైనా నిస్సందేహంగా పాల్గొనవచ్చు. అయితే అది మీ వ్యక్తిగతంగానే. ఆర్‌ఎస్‌ఎస్ పేరుగల బ్యానర్లతోగాని, సంఘ గణవేష్ ధరించి గానీ మీరు ఎలాంటి ఆందోళనలలోనూ పాల్గొనరాదు’ అని చెప్పేవారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ను 1925 లో ప్రారంభించిన సమయంలో స్వా తంత్య్రోద్యమం తీవ్రస్థాయిలో జరుగుతోంది. అప్పటికి ‘సంఘ్’ శైశవ దశలోనే ఉంది. అతి కొద్దిమందితో నాగపూర్‌లోను, పరిసర ప్రాంతాలలోనూ కొన్ని ‘శాఖ’లు నడుస్తూండేవి. సంస్థాగత ఎదుగుదలపైనే ప్రధానంగా దృష్టిపెట్టినా, దేశ స్వాతంత్య్ర సాధనకై సాగే వివిధ ఉద్యమాలలో ఎలాంటి సంకోచం లేకుండా స్వయం సేవకులు పాల్గొనేవారు. ఆర్‌ఎస్‌ఎస్ కంటే 40 ఏళ్ల క్రితమే ప్రారంభమైన కాంగ్రెస్ 1929లో ‘సంపూర్ణ స్వరాజ్య’ సాధనకు పిలుపునిచ్చింది. 1920 నుండి 1929 వరకు జరిగిన ప్రతి జాతీయస్థాయి సమావేశాలలోనూ కాంగ్రెస్ ‘‘డొమీనియన్ స్టాటస్’’ మాత్రమే కోరేది. కాంగ్రెస్ ఆవిర్భవించిన తొలినాళ్ళలో 1880, 1890 దశకాలలో జరిగే ప్రతి జాతీయ సమావేశాలలోనూ ‘బ్రిటిష్ పాలన భారతదేశానికి దైవదత్తమైన బహుమానం’ అంటూ కొందరు నేతలు బహిరంగంగానే కొనియాడేవారు. వారి తీర్మానాలు కూడా ఆమేరకే రూపొందింపబడేవి.
ఆర్‌ఎస్‌ఎస్ ప్రారంభం నుండీ స్వయం సేవకులు దేశ స్వాతంత్య్రం కోసం పూర్ణసమర్పిత భావంతో పనిచేసేవారు. ఎందరో స్వయం సేవకులు బ్రిటిష్‌వారి లాఠీదెబ్బల రుచి చూశారు, బ్రిటిష్ వారి తుపాకీ తూటాలకి బలయ్యారు. ఈ విషయం చాలాకొద్దిమందికి మాత్రమే తెలుసు. ఇందుకు కారణం దేశం కోసం పనిచేయడం ఒక ‘ప్రచార ఆర్భాటం’ ఒక అవసరమని సంఘ్ భావించకపోవడమే.

ఆర్‌ఎస్‌ఎస్ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనలేదనే అనుకుందాం. మరి దేశ స్వాతంత్య్రం కోసం కమ్యూనిస్టులు ఏం చేశారు? ఆర్‌ఎస్‌ఎస్, భారత కమ్యూనిస్టు పార్టీ సుమారుగా ఒకేసారి ప్రారంభించబడ్డాయి కదా... ఒకవైపు స్వయం సేవకులు హిందూ సంఘటన కోసం కృషిచేస్తుంటే, మరోవైపు కమ్యూనిస్టులు బ్రిటిష్ వారికి తొత్తులుగా వ్యవహరిస్తూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల స్వాతంత్య్ర సాధనా ప్రయత్నాలకి వెన్నుపోటు పొడుస్తూ వచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్ వారితో రష్యా విభేదించినప్పుడు మాత్రమే మన కమ్యూనిస్టులు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచే వారు బ్రిటిష్ వారినీ, అమెరికా వారినీ ‘సామ్రాజ్యవాదులు’గా పిలవడం మొదలుపెట్టారు. తిరిగి రష్యన్ నియంత స్టాలిన్ ఎప్పుడైతే మిత్రరాజ్యాలతో చేతులు కలిపాడో మన కమ్యూనిస్టులు తిరిగి బ్రిటిష్ వారిని పొగడటం మొదలుపెట్టారు.

అసలైన దేశభక్తుడు...
ఆర్‌ఎస్‌ఎస్ సంస్థాపకుడు డాక్టర్ కేశవరావ్ బలీరాం హెడ్గెవార్ పుట్టుకతోనే దేశభక్తుడు. ఆయన ప్రాథమిక విద్య నాగపూర్‌లోని నీల్ సిటీ స్కూల్‌లో జరిగింది. ఆ సమయంలో విక్టోరియా రాణి 60వ పట్ట్భాషేక మహోత్సవాలను ఆంగ్లేయులు ఘనంగా జరిపారు. అన్ని స్కూళ్లలో మిఠాయిలు పంచారు. కానీ బాలకేశవుడు తనకు ఇచ్చిన మిఠాయిని తినకుండా బయటనున్న పెంటకుప్పపై పడేశాడు. అది చూసినవారు అదేమని అడిగితే- ‘మన దేశాన్ని కుతంత్రాలతో ఆక్రమించుకుని, మనల్ని బానిసలుగా చేసుకున్న పరాయి పాలకులు వేడుకలు చేసుకుంటుంటే మనమెందుకు సంబరపడాలి?’ అని ఎదురుప్రశ్న వేశాడు. ఇదీ బాలకేశవుని దేశభక్తి. ఆయనలోని ఈ అచంచల దేశభక్తియే ఆ తరువాతి కాలంలో ఆయన ప్రారంభించిన ఆర్‌ఎస్‌ఎస్‌కు గట్టి పునాదియై నిలిచింది.

1920లో నాగపూర్‌లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల ఏర్పాట్లకు సంబంధించిన కార్యకర్తల బృందానికి కేశవుడే నాయకత్వం వహించారు. ఆ సమావేశాలలో సంపూర్ణ స్వరాజ్య సాధనే ఏకైక లక్ష్యంగా తీర్మానం ప్రవేశపెట్టాలని నాగపూర్ నేషనల్ యూనియన్ డిమాండ్ చేసింది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్ఠించి ఇతర జాతులను కూడా సామ్రాజ్యవాద దేశాల కదంబ హస్తాల నుండి విముక్తి కలిగించే దిశలో అడుగుల వేయాలని ఆయన కాంగ్రెస్‌కు సూచించారు. కానీ కాంగ్రెస్ సమావేశాలలో ఆ విధంగా తీర్మానం ప్రవేశపెట్టలేదు. 1929 డిసెంబరులో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశాలలో సంపూర్ణ స్వరాజ్య సాధనే లక్ష్యంగా కాంగ్రెస్ మొదటిసారి తీర్మానం ప్రవేశపెట్టింది. అంటే- అంతకు సుమారు పదేళ్ల క్రితమే 1920లో డాక్టర్ హెడ్గెవార్ సంపూర్ణ స్వరాజ్య సాధనకు తీర్మానం ప్రవేశపెట్టాలన్న తన బలమైన ఆకాంక్షను వెల్లడించారన్నమాట.

1920లో నాగపూర్ కాంగ్రెస్ సమావేశాలలో హెడ్గెవార్ కోరిన సంపూర్ణ స్వరాజ్యసాధన తీర్మానానికి కాంగ్రెస్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ హెడ్గెవార్ ఆకాంక్ష ఎందరి దృష్టినో ఆకర్షించింది. ‘తీర్మానం విషయమై హెడ్గెవార్ చేసిన ప్రతిపాదన కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ దృష్టిని విశేషంగా ఆకర్షించింది’ అని ‘మోడరన్ రివ్యూ ఆఫ్ కలకత్తా’ పత్రిక మార్చి, 1921 సంచికలో పేర్కొంది. 1921లో గాంధీజీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా జరిగిన సహాయ నిరాకరణోద్యమంలో హెడ్గెవార్ ఎంతో క్రియాశీలంగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా వారొకచోట ప్రసంగిస్తుండగా పోలీసులు అరెస్టుచేసి వారిని కోర్టులో హాజరుపరిచారు. తన తరఫున వాదించడానికి న్యాయవాది అక్కర్లేదని, ఆయనే తన వాదనను వినిపించారు. అది విన్న న్యాయాధికారి స్మెల్లీ- ‘ఇంతకుముందు హెడ్గెవార్ చేసిన ప్రసంగాలకన్నా ఇదే ఎక్కువ రాజద్రోహకరంగా ఉంది’అని వ్యాఖ్యానించాడు. దీంతో ఆయనలో స్వాతంత్య్రకాంక్ష ఎంత తీవ్రమైనదో తెలుస్తుంది. ఆ తరువాత ఆయనకు ఏడాది కఠిన కారాగారవాస శిక్ష పడింది. దేశభక్తి, జాతీయ భావనల ఆధారంగా శక్తివంతమైన, సుసంఘటిత జాతి నిర్మాణానికి 1925లో విజయదశమి పర్వదినాన హెడ్గెవార్ ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించారు. సంఘ్ ముఖ్యోద్దేశం హిందూ సంఘటనే అయినా ‘మన ప్రథమ లక్ష్యం దేశాన్ని పరాయి పాలన నుండి విముక్తం కావించడమే’అంటూ ఆయన స్వయం సేవకుల చేత ప్రతిజ్ఞ చేయించేవారు.

డిసెంబర్ 31, 1929న జరిగిన చారిత్రాత్మక లాహోర్ సమావేశాలలో కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్య సాధనకు పిలుపునిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దేశమంతటా జనవరి 26, 1930న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరపాలని నిర్ణయించింది. అప్పటికి సరిగ్గా పదేళ్ల క్రితం హెడ్గెవార్ కాంగ్రెస్ సమావేశాల్లో ఆశించినది ఇదే. సంపూర్ణ స్వరాజ్య సాధనకు కాంగ్రెస్ తీర్మానించడం ఆయనకు ఎంతో సంతోషాన్ని కలిగించడంతో- సంఘ శాఖలన్నింటిలో జనవరి 26, 1930న మిఠాయిలు పంచుకుని వేడుకలు జరుపుకోవాలని, జాతీయ పతాకాన్ని ఎగురవేసి, దేశ స్వాతంత్య్ర సందేశాన్ని సర్వత్రా వ్యాపింపజేయాలని ఆయన స్వయం సేవకులను ఆదేశించారు.

1929లో కాంగ్రెస్ చేసిన సంపూర్ణ స్వరాజ్య సాధనా తీర్మానాన్ని ఆర్‌ఎస్‌ఎస్ ఎలాంటి సంకోచమూ లేకుండా సమర్ధించింది. అప్పటికే మధ్య పరగణాలలోని 37 సంఘ్ శాఖలకు హెడ్గెవార్ స్పష్టమైన సందేశం ఇచ్చారు. ‘దేశ సంపూర్ణ స్వరాజ్య సాధనే లక్ష్యంగా కాంగ్రెస్ తీర్మానించడం, జనవరి 26, 1930న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని పిలుపునివ్వడం మనకు సంతోషం కలిగించే విషయం.. ఆరోజున స్వయం సేవకులంతా భాగవాధ్వజాన్ని ఎగురవేసి, దానికి వందనం చేసి, స్వాతంత్య్రం ఆవశ్యకతను గురించి అందరికీ తెలియజేయాలి. తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్‌కు అభినందనలు తెలపడం ద్వారా మన కార్యక్రమాన్ని ముగించాలి’ అని ఆయన నుంచి ఆదేశాలు వెళ్ళాయి. హెడ్గెవార్ మరణానంతరం మాధవ సదాశివ గోల్వర్కర్ (శ్రీ గురూజీ) ఆర్‌ఎస్‌ఎస్ సరసంఘ చాలక్ బాధ్యతలను చేబట్టారు. మే 3, 1942న సంఘ శిక్షణ శిబిరంలో ఆయన ప్రసంగిస్తూ, స్వంత బలం ఆధారంగా సంఘ్ ఎదగాలనీ, బతిమాలుకోవడం ద్వారా స్వరాజ్యం సాధ్యం కాదనీ, స్వశక్తితోనే అది సాధ్యమన్నారు.

క్విట్ ఇండియా ఉద్యమంలో..
ఆర్‌ఎస్‌ఎస్‌కు గోల్వార్కర్ నాయకత్వం ప్రారంభమైన కాలంలోనే 1942లో క్విట్ ఇండియా ఉద్యమం, 1947లో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడం జరిగాయి. క్విట్ ఇండియా ఉద్యమానికి దూరంగా ఉండడం ద్వారా స్వాతంత్య్ర పోరాటానికి ఆర్‌ఎస్‌ఎస్ సహకరించలేదని ఆరోపణలు చేసేవారున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై దుష్ప్రచారం చేసేవారికి వాస్తవాలు తెలిసి ఉండకపోవచ్చు. లేదా ఆ వాస్తవాలను అర్థం చేసుకోవాలన్న ఆలోచనే వారికి ఉండకపోవచ్చు.

ఆగస్టు 9, 1942న గాంధీజీ నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అయితే దాని గురించి ముందస్తు వ్యూహరచన చేయలేదు. ఆ ఉద్యమం గురించి తెలిసిన బ్రిటిష్ పాలకులు కాంగ్రెస్ అగ్రనేతలను ముందుగానే అరెస్టు చేసింది. నడిపించే నాయకులు లేకపోవడంతో ఉద్యమం కాస్తా చుక్కాని లేని నావయ్యింది. డాక్టర్ హెడ్గెవార్ ఆలోచనలను అనుసరించి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు క్విట్ ఇండియా ఉద్యమంలో ఆందోళనలకు దిగారు. విదర్భ ప్రాంతంలో చీమూర్-అస్తిలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి కొద్దికాలం నడిపారు కూడా. తిరుగుబాటు చేసిన కొందరు స్వయం సేవకులని బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసింది కూడా. కొందరు స్వయం సేవకులు ఢిల్లీ-ముజఫర్‌నగర్ రైల్వే లైన్లను ధ్వంసం చేసారు. ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలోని మేవాన్ తహశీల్‌దారు కార్యాలయంపై మువ్వనె్నల జెండాని ఎగురవేయడానికి వెళ్ళిన స్వయం సేవకులు కొందరు పోలీసు తూటాలకు బలయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అజ్ఞాతవాసంలోకి వెళ్ళిన ఎందరో ప్రముఖ నాయకులకు ఆర్‌ఎస్‌ఎస్ సురక్షిత ఆశ్రయాన్నిచ్చింది. అరుణా అసఫ్ అలీ, లోకనాయక్ జయప్రకాష్ నారాయణలకు ఢిల్లీ సంఘ సంచాలక్ లాలా హన్సరాజ్‌గుప్తా ఇంట్లో ఆశ్రయం కల్పించారు. అచ్యుత్ పట్వర్థన్, సానే గురూజీలకు పూనా సంఘచాలక్ భావుసాహేబ్ దేవ్‌మఖ్ ఇంట్లో ఆశ్రయం లభించింది. అవధ్ సంఘచాలక్ పండిట్ ఎం.డి.సాత్వలేకర్ ఇంట్లో క్రాంతివీర్ నానాపాటల్ ఆశ్రయం పొందారు. అరుణా అసఫ్ అలీ 1967లో ఢిల్లీ నుంచి వెలువడే హిందీ పత్రిక ‘హిందూస్తాన్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అన్నారు... ‘దేశంలోని ఉన్నతస్థాయి నేతలంతా వివిధ జైళ్లలో ఉన్నారు. బయట ఉన్న ఉద్యమకారులకు దిశానిర్దేశనం చేసేవారే లేరు. ఇది అవకాశంగా ఎవరికివారే స్వంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమం వల్లనే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది అనడం ఏమాత్రం అర్థం లేనిది.’ ఉద్యమకారులకు సరైన దిశానిర్దేశనం లేకపోవడం వల్ల, వారిలోని అనైక్యత వల్ల 1942 క్విట్ ఇండియా ఉద్యమాన్ని బ్రిటిష్ పాలకులు నిర్దాక్షిణ్యంగా అణచివేశారు. ఆ సమయంలో స్వయం సేవకులు ఉద్యమకారులకు అండగా నిలిచారు. కాంగ్రెస్, సోషలిస్టుల గురించి గురూజీ మాట్లాడుతూ, ‘‘వాళ్ళు కూడా మనవాళ్ళే. వారి పట్ల మనం క్షమనే చూపాలి’’అన్న మాటలను క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో స్వయం సేవకులు ఆచరించి చూపారు. ‘ఆర్‌ఎస్‌ఎస్ అంతిమ లక్ష్యం బ్రిటిష్‌వారిని పారద్రోలి దేశాన్ని విముక్తం చేయడమే’అని 1943లో ఇంటెలిజెన్స్ డిపార్టుమెంట్ నివేదిక పేర్కొంది.

స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం లీగ్ కుట్రలను భగ్నం చేయడంలో స్వయం సేవకుల ప్రయత్నాలను గురించి ‘భారతరత్న’, ప్రముఖ తత్త్వజ్ఞాని డా.భగవాన్ దాస్ వివరించారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చాక నాటి కాంగ్రెస్ నాయకులందరినీ మట్టుపెట్టడానికి ముస్లిం లీగ్ పెద్ద కుట్ర పన్నింది. అయితే సంఘ కార్యకర్తలు ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టి జవహర్‌లాల్ నెహ్రూకి, సర్దార్‌పటేల్‌కి సమాచారాన్ని అందించారు. మారణాయుధాలతో పెద్ద ఎత్తున ముస్లిం లీగ్ కార్యకర్తలు దాడులు జరిపి, మంత్రులను, ఉన్నతస్థాయి ప్రభుత్వ అధికారులను చంపి ఎర్రకోటపై పాకిస్తాన్ జెండాను ఎగురవేసి, దేశంలో పాక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పథకం రచించిన సమాచారాన్ని స్వయం సేవకులు సకాలంలో చేరవేయడంవలన మన ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకుని ఆ కుట్రలను భగ్నం చేసింది’ అని అక్టోబర్ 1, 1948న భగవాన్ దాస్ రాశారు.

ఆయన ఇంకా ఇలా అన్నారు.. ‘ఆర్‌ఎస్‌ఎస్‌కి చెందిన నిజాయితీగల దేశభక్త యువకుల ముస్లిం లీగ్ కుట్రల గురించి నెహ్రూకి, పటేల్‌కి సకాలంలో తెలియజేసి ఉండకపోయినట్లయితే ఈపాటికి భారత్ పాకిస్తాన్‌గా మారిపోయి ఉండేది. లక్షల సంఖ్యలో హిందువులు మారణకాండకు బలయ్యేవారు. అంతకంటే పెద్దసంఖ్యలో హిందువులు ఇస్లాం మతంలోకి మార్చబడి ఉండేవారు. భారత్ మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోయి ఉండేది. భారత ప్రభుత్వం లక్షలాదిగా గల ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల నిస్వార్థ సేవలను దేశభద్రత కోసం వినియోగించుకోవాలి. అంతేగాని ‘సంఘ్’ను అణచివేయాలనుకోవడం ఏ విధంగానూ మంచిది కాదు’. డా.భగవాన్ దాస్ ఈ మాటలు రాసిన సమయంలో వేల మంది ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు జైళ్ళలో మగ్గుతున్నారు. అందుకు కారణం- వారెన్నడూ కలలో కూడా ఊహించని భయంకర నేరారోపణ ఆర్‌ఎస్‌ఎస్‌పై పడింది. అది మహాత్మా గాంధీని హత్యచేశారన్న అభియోగం. ఆ ఆరోపణతోనే ప్రభుత్వం దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించింది. ఆర్‌ఎస్‌ఎస్‌పై మోపబడిన ఆ హత్యా నేరారోపణను ఏ న్యాయస్థానమూ, ప్రభుత్వం నియమించిన ఏ విచారణ సంఘమూ రుజువుచేయలేకపోయాయి. చివరికి ప్రభుత్వం దిగివచ్చి బేషరతుగా సంఘంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే, ఇది జరిగి ఎన్నో దశాబ్దాలు గడిచినా, ఇప్పటికీ దేశంలోని సెక్యులర్ మేధావులు, వామపక్షీయులు గాంధీజీ హత్యలో ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర ఉందంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. (ఆంధ్రభూమి 2018 ఆగష్టు 11 ) -డా. దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments