Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఉగాది మరియు తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు - About Ugadi in Telugu - MegaMinds

కాలచక్రంలో మరో ఏడాది (శ్రీశార్వరి) వెనుకబడుతోంది. బ్రహ్మ సృష్టి ప్రారంభమై ఇప్పటికి 195 కోట్ల 58 లక్షల 85 వేల 121 ఏళ్లు గడిచాయని ...

కాలచక్రంలో మరో ఏడాది (శ్రీశార్వరి) వెనుకబడుతోంది. బ్రహ్మ సృష్టి ప్రారంభమై ఇప్పటికి 195 కోట్ల 58 లక్షల 85 వేల 121 ఏళ్లు గడిచాయని కాలప్రమాణం చెబుతోంది. ప్రళయం తరువాత విధాత చైత్ర శుద్ద పాడ్యమి నాడు సృష్టిని ఆరంభించారని (చైత్రమాసి జగద్బ్రహ్మససర్జ ప్రథమేహని…) ‘హేమాద్రి’ అనే ధర్మశాస్త్రం పేర్కొంటోంది.

యుగ గణాంకాల ప్రకారం, మనం ప్రస్తుతం వైవస్వత మన్వంతరం లోని 28వ మహాయుగపు కలియుగంలో ఉన్నాం. ఇది ప్రారంభమై 5121 సంవత్సరాలైంది. ప్రస్తుతం మనం ప్రవేశించే ‘ప్లవ’నామ సంవత్సరం ప్రభవాది షష్ట్యబ్దులలో 35వది. ‘తెప్ప, కప్ప, కోతి, నీరుకోడి (కన్నెలేడి), నీరుకాకి, గొఱ్టె, దాటు’ అని దీనికి నిఘంటార్థాలు ఉన్నాయి. ‘ప్రభవ’ నుంచి ‘అక్షయ’ వరకు ఒక్కొక్క సంత్సరానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నట్లే కొత్త ‘ప్లవ’ నామ వత్సరం జల విశిష్టమైనదని, జలవనరులు పుష్కలంగా ఉంటాయని పంచాంగం చెబుతోంది.

ఈ అరవై తెలుగుసంవత్సరాల పేర్లు నారద సంతానమనే కథ ప్రచారంలో ఉంది. దాని ప్రకారం, విష్ణుమాయ కారణంగా స్త్రీగా మారిన నారదుడు ఒక రాజును పెళ్లాడి అరవై మంది పుత్రులను పొందుతాడు. వారంతా ఒక యుద్ధంలో హతులవు తారు. ఖిన్నుడైన నారదుడు శ్రీహరిని ప్రార్ధించగా, ‘వారంతా కాలచక్రంగా తిరుగుతుంటారు’ అని అభయం ఇచ్చారు. అలాగే సంవత్సరాల పేర్లుగా చలామణి అవుతున్నవారు శ్రీకృష్ణుడి 16 వేలమంది భార్యలలో ఒకరైన సందీపని పుత్రులని కూడా మరో గాథ.

వసంతారంభం: ‘మధుశ్చ మాధవశ్చ వాసంతికా వృత్‌’ అని సంవత్సరం వసంతంతో ప్రారంభమవుతుందని, మధువు-మాధవం ఆ రుతువు పేర్లని యజుర్వేదం పేర్కొంటోంది. దీనిని ‘వసంతం’ అని అంటారు. ‘మధువు, మాధవం’ మాసాలే అనంతర కాలంలో చైత్రాది మాసాలుగా వ్యవహారంలోకి వచ్చాయని పెద్దలు చెబుతారు. వసంత మాసానికి ‘సురభి’ (కోరికలు తీర్చేది అని అర్థం) అనే పేరు కూడా ఉందని అమరకోశం చెబుతోంది. ‘రుతూనాం ముఖో వసంతః’ అన్న తైత్తిరీయ బ్రాహ్మణం వాక్కును బట్టి రుతువులన్నిటిలో వసంతానిదే అగ్రస్థానమని తెలుస్తోంది.

ఇతర పండుగలు, వ్రతాల మాదిరిగా ‘ఉగాది’ ఏదో ఒక దేవుడినో, దేవతనో ఉద్దేశించి చేసుకునేది కాదు. అనంతమైన కాలాన్ని మన వీలుకొద్దీ సంవత్సరంగా లెక్కించి సకలదేవతా స్వరూ పంగా భావించి ఆచరిస్తున్నాం. ప్రతిదేశం, ప్రతి రాష్ట్రం ఏదో ఒక కాలగణనంతో తమ సంప్రదాయాను గుణంగా ‘సంవత్సరాది’ని జరుపుకుంటాయి. ఆచరించే విధానంలో తేడాలు ఉన్నా ఆశయం, ఆనందాలు ఒకటే. కంటికి కనిపించని కాలస్వరూపం తానేనని ‘కాలః కాలయితా మహమ్‌’ అని అన్నారు గీతాచార్యుడు. తాను కాలాన్ని అని చెప్పుకున్నా, ప్రత్యక్ష దైవాలు సూర్యచంద్రుల గమనాలనే కాలనిర్ణయానికి ప్రామాణికంగా తీసుకుంటారు. ‘‘రుతునాం కుసుమాకరః:’ (రుతువుల్లో వసంతాన్ని)అన్న భగవానుడి మాటలను బట్టే వసంతరుతువుకు, దాని ఆరంభం పండుగ ఉగాదికి గల ప్రాశస్త్యం విశదమవు తుంది. ఈ రోజు (ఉగాది) నూతన సంవత్సరానికి ఆరంభం కనుక ‘సంవత్సరాది’ అనీ వ్యవహరిస్తారు. ఇది తెలుగువారికి తొలిపండుగ. చాంద్రమానం రీత్యా ఇది సర్వప్రథమైన రోజు.

కృతయుగం వైశాఖ శుద్ధ విదియనాడు, త్రేతాయుగం కార్తిక శుద్ధ నవమినాడు, ద్వాపరయుగం శ్రావణ శుద్ధ త్రయోదశి నాడు, ఈ (కలి)యుగం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమయ్యాయి. మత్స్యావతారధారి శ్రీహరి వేదాలను అపహరించిన సోమకుని వధించి వాటిని బ్రహ్మకు అప్పగించింది చైత్ర శుక్ల పాడ్యమి నాడే కనుక అందుకు గుర్తుగా కూడా ఈ పండుగ జరుపుకుంటున్నామని మరో గాథ ప్రచారంలో ఉంది. శ్రీరామపట్టాభిషేకం, కురుక్షేత్ర సంగ్రామానంతరం ధర్మజుడి రాజ్యాభిషేకం, విక్రమార్క, శాలివాహన శకకర్త శాలివాహనుడు ఈ తిథినాడే పట్టాభిషిక్తులయ్యారు. ఆంగ్ల కాలమానాన్ని అటుంచితే ‘షష్టి పూర్తి’ ఉత్సవానికి ఉగాదినే కొలమానంగా చెబుతారు. ‘ప్రభవ’ నుంచి ‘అక్షయ’ వరకు గల అరవై సంవత్సరాలలో అత్యధికులు తాను జన్మించిన తెలుగు సంవత్సరాన్ని ఒకసారో, రెండుసార్లో చూసుకునే అవకాశం కలుగుతుంది. వారివారి పూర్వజన్మ సుకృతాలనుబట్టి ఆ అవకాశం లభిస్తుంటుందని పెద్దలు చెబుతారు. హిందువులకు అత్యంత విశేషమైన ఈ పండుగను ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాలలో ప్రత్యేకంగా జరుపుకుంటారు. రెండు తెలుగు రాష్రాలు, కర్ణాటకలో ఉగాదిగా, మహారాష్ట్రలో ‘గుడిపాడ్వా’ అని అంటారు.

షడ్రుచుల సమ్మేళనం: ఆరు రుచులతో కూడిన ఉగాది ప్రసాదం (పచ్చడి) కష్టసుఖాలకు ప్రతీక. ఉగాది నుంచి ఏడాది పొడవునా ఎదురయ్యే సుఖదుఃఖాలు, మంచి చెడులను సంయమనంతో, సమానంగా స్వీకరించాలని ఈ ప్రసాదం సందేశాన్నిస్తోంది. తీపి (మధురం) పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం, కారం (కటు) చేదు (తిక్త) చేదు (కషాయం) పదార్థాలతో కూడిన ఈ వేపపూవు పచ్చడి తెలుగు వారికి ప్రత్యేకం. ఇది కేవలం ఆధ్యాత్మిక, లౌకిక సంబంధితమే కాకుండా ఆరోగ్య పరం గానూ మేలు చేస్తుందని, ఈ ప్రసాద సేవనం వల్ల సంపూర్ణారోరాగ్యం లభిస్తుందని, వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుందని వైద్యశాస్త్రం చెబుతోంది.

ఉగాది నుంచి చైత్రపూర్ణిమ వరకు దీనిని సేవించడం వలన సంవత్సరమంతా ఎలాంటి అనారోగ్య లక్షణాలు పొడచూపవని, వాతపిత్త్త శ్లేష్మాల వలన కలిగే దోషాలు తొలిగిపోతాయని ‘ధర్మసింధు’ పేర్కొంటోంది.

పంచాంగ శ్రవణం: ఉగాదినాడు పంచాంగ శ్రవణం మరో ప్రధానాంశం. పంచాంగ శ్రవణంతోనే ఉగాది పర్వదినం పరిసమాప్తమైనట్లని చెబుతారు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదింటి కలయికే ‘పంచాగం’. వీటిని దేవతాస్వరూపాలుగా సంభావించి నిత్యం తలచుకోవడం అంటే కాలదేవతా శక్తిని ఆరాధించడమేనని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.

‘శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం / గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం / ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం / నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతామ్‌’

– (‌పంచాంగ శ్రవణం వలన సంపదలు కలిగి సద్గుణాలు అలవడతాయి. శత్రువులు నశిస్తారు. చెడుకలలు తొలగిపోతాయి. గంగాస్నాన, గోదాన ఫలితం లభిస్తుంది. ఆయుష్షు పెరుగుతుంది. సంతానం కలుగుతుంది. అంటే వంశాభివృద్ధి సంప్రాప్తిస్తుంది) అని ‘పంచాగం’ శ్రవణ విశిష్టతను శ్లాఘించారు. అప్పట్లో పంచాంగ కర్తలు కాలమానాన్ని ఘడియలు, విఘడియలుగా విభజించేవారు. ఆధునిక తరానికి వాటి పట్ల అవగాహన లేకపోవడంతో సులువుగా అర్థమయ్యేలా గంటలు, నిమిషాల్లోకి మారుస్తున్నారు. అలా వచ్చిందే ‘గంటల పంచాంగం’.

పాశ్చాత్య సంప్రదాయానికి భిన్నంగా మన పంచాంగం సూర్యోదయం నుంచి సూర్యోదయానికి ఒక రోజుగా లెక్కిస్తుంది. ఈ పండుగ నాడు పంచాంగం శ్రవణం ద్వారా సంవత్సరంలో వారి స్థితిగతులపై ఒక అవగాహన కలుగుతుంది. భవిష్యత్‌ ఎలా ఉంటుందో చూచాయగా తెలుసుకుని కొత్త ఏడాదిని ఆశావహంగా ప్రారంభించుదాం అనుకుంటారు. ఈ రోజున తలపెట్టే కార్యాలన్నీ విజయవంతంగా పూర్తిచేస్తారనే విశ్వాసం ఉంది. వ్యాపారులు ఈ రోజున కొత్తలెక్కలు (దస్త్రం పెట్టడం), మొదలుపెడతారు. ఈ తిథిని ఆరాధిస్తే కాలాత్మకుడైన భగవానుడు సుప్రసన్నుడవుతాడని చెబుతారు.

‘పఠనం’పై పరిహాసం: కొత్త సంవత్సర ఫలితాలను ముందుగానే తెలుసుకోవాలనుకునే కుతూహలం చాలామందికి సహజం.అయితే వర్తమానంలో పంచాంగ పఠన, శ్రవణాలపై పరిహాసోక్తులు వింటుంటాం. ముఖ్యంగా పాలక, ప్రతిపక్షాలు నిర్వహించే ఈ కార్యక్రమాలలో ఫలితాలు వారివారికి అనుకూలంగానే ఉండడం అందుకు కారణం. అయినంత మాత్రాన ‘పంచాగం పఠనం అంతా అబద్ధం’ అని తోసిపుచ్చడానికి వీలులేదు. సూర్యచంద్ర గ్రహణాలు ఏ రోజున, ఏ సమయంలో వస్తాయో కచ్చితంగా చెప్పగలిగేది పంచాంగమే. చెప్పేవారిలో ఇసుమంతైనా దోషం ఉండవచ్చేమో కానీ పంచాంగ‘శాస్త్రం’ మాత్రం తప్పుకాదని విషయ నిపుణులు గట్టిగా చెబుతున్నారు. జ్యోతిశ్శాస్త్రజ్ఞుడు నిర్వహించే నిత్య పూజాదికాలు, వారి శీలసంపత్తిపై వారు చెప్పే ఫలితాలు ఆధారపడి ఉంటాయని, అలాంటి అనుష్టానపరుల వాక్కులోనే అమ్మవారు నిలిచి ఉంటారని పెద్దలు చెబుతారు.

మొదట చెప్పుకున్నట్లు ఇతర పండుగలు, వ్రతాల మాదిరిగా ‘ఉగాది’ ఏదో ఒక దేవుడినో, దేవతనో ఉద్దేశించి చేసుకునేది కాకపోయినా ఇష్ట దేవత(ల)ను అర్చించి పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా అవకాశం ఉంటే ఆవునేతితో దీపారాధన చేసి, హారతి ఇవ్వాలని పండితులు చెబుతారు. సంవత్సరాదినాడు కలశస్థాపన చేసి నాలుగు రోజులపాటు దేవీపూజలు చేయడం వలన అపమృత్యు భయం ఉండదని ‘ధర్మసింధువు’ తెలియచేస్తోంది.

నవరాత్రులు: ఉగాది నుంచి నవరాత్రులు ప్రారంభమవు తాయి. వీటిని వసంత నవరాత్రులు అంటారు. ఈ ఉత్సవాలకు అధిపతి వసంతుడు. ‘నూతన సంవత్సర కీర్త నాద్యారంభం/ ప్రతి గృహ ధ్వజోరోహణం / నింబపత్రాశ సంవత్సరాది శ్రవణం నవరాత్రారంభో’ (సంవత్సరాదినాడు ప్రతి ఇంటికి తోరణం కట్టి వేపపూతతో చేసిన ప్రసాదాన్ని స్వీకరించి పంచాంగ శ్రవణం చేయాలి)అని ‘ధర్మసింధువు’ చెబుతోంది. వసంత నవరాత్రులలో భాగంగా శ్రీరాముడు, లలిత, దుర్గాది దేవతలకు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహిస్తారు.

ఉగాది ఆస్థానం’: తిరుమలలోని శ్రీనివాసుడికి నిర్వహించే ప్రధాన ఉత్సవాలలో ‘ఉగాది ఆస్థానం’ ఒకటి. ఆలయ కార్యక్ర మాలు, ఉత్సవాలు ఉగాది నుంచే ప్రారంభమవు తాయి. శ్రీవారి పాదపద్మాలపై గల పంచాంగాన్ని భక్తితో స్వీకరించి ఆస్థాన సిద్ధాంత నూతన పంచాంగ విశేషాలు వినిపిస్తారు. ప్రత్యేకించి స్వామి వారి తిరునక్షత్రం శ్రవణం విశేషాలను, ఉభయదేవేరుల నక్షత్ర ఫలితాలను విన్నవిస్తారు. ఆ రోజు సాయం వేళలో భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి మాడవీథుల్లో ఊరేగుతూ భక్తులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలతో పాటు దివ్యమంగళరూపంతో దర్శనం అనుగ్రహిస్తారు. ఈ ఉత్సవం నలభై రోజుల పాటు- అంటే వైశాఖ శుద్ధ దశమి వరకు ఆగమ సంప్రదాయానుగుణంగా సాగుతుంది. దీనిని ‘నిత్యోత్సవం’ అంటారు

‘దుఃఖస్యానంతరం సుఖమ్‌’ ‌సూక్తిని నిజం చేస్తూ, కరోనాతో విలవిలలాడిన జగతిని ప్లవ నామ సంవత్సరం జాగృత పరచి, ఆహ్లాదం కలగించాలని కోరుకుందాం. శ్రీ శార్వరికి సగౌరవంగా వీడ్కోలు పలుకుదాం.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్. జాగృతి వారపత్రిక నుండి సేకరణ.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments