Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

జ్వాలామణి వేలు నాచియార్ జీవిత విశేషాలు - Rani velu nachiyar history in Telugu - azadi ka amrut mahotsav

జ్వాలామణి వేలు నాచియార్ నేటి తమిళనాడు ప్రాంతములోని శివగంగ సీమ, ఆ సీమలోని రామనాథపురం. పాడి పంటలతో సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతోంది.. ఆ రాజ్యాన్...

జ్వాలామణి వేలు నాచియార్
జ్వాలామణి వేలు నాచియార్

నేటి తమిళనాడు ప్రాంతములోని శివగంగ సీమ, ఆ సీమలోని రామనాథపురం. పాడి పంటలతో సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతోంది.. ఆ రాజ్యాన్ని సుక్షత్రియుడు అయిన కాశ్యపస గోత్రజుడు చెల్లముత్తు సేతుపతి అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన భార్య సకంది ముత్తు.. వారికి లేక లేక ఒక ఆడపిల్ల కలిగింది. ఆమె పేరు వేలు నాచియార్. చిన్నతనం నుండే ఆమెను అబల అని అంతఃపురానికి మాత్రమే పరిమితం చేయకుండా అన్ని విద్యలు నేర్పారు. కత్తియుద్ధములో, కట్టె తిప్పడములో, గుర్రం స్వారీలో, విలువిద్యలో ఆనాడు ఆమెకు సాటి వారు లేరు ఆ సీమలో. మల్లయుద్ధములో కూడా అందెవేసిన చేయి ఆమె. బలాడ్యులయిన పురుషులను సైతం చిటికలో మట్టికరిపించేది.

ఒక్క యుద్ధ విద్యలే కాదు, రాజ్య పాలనా తంత్రాలు కూడా, న్యాయ శాస్త్రము, తర్కము, మీమాంస సకల విద్యల్లో ప్రవీణురాలు అయింది. పెరిగి పెద్దయిన ఆమె తండ్రికి పాలనలో చేదోడువాదోడుగా ఉండేది. ఆలయాలు కట్టించి, రహదారులు వేయించి, చెరువులు త్రవ్వించి ప్రజలకు పన్ను విధానములో కూడా సరికొత్త మార్పులు తీసుకు వచ్చారు. తమ రాజ్యములో శైవ వైష్ణవ అనే భేదాలు లేకుండా అందరినీ సమాదరంగా చూసి అందరినీ కన్నబిడ్డలవలే పాలించేవారు చెల్లముత్తు మరియు ఆయన కుమార్తె వేలు నాచియార్. కవులకు, పండితులకు, కళాకారులకు ప్రత్యేక అగ్రహారాలు, గ్రామాలూ ఏర్పాటు చేసారు. వేలు నాచియార్ కి అమిత దైవభక్తి, పెద్దలపట్ల భక్తి తత్పరత ఉండేవీ. ఆమె అయనార్ అనే దేవతను పూజించేది. రాజ్య పాలనలో క్లిష్టపరిస్థితుల్లో ఆమె ఆలయాన్ని సందర్శించి రాగానే ఆమెకు ఆ సమస్యలు ఎలా పరిష్కరించాలో అయనార్ అనుగ్రహంతో తెలిసిపోయేవి. రాజ్యములో తమిళ సంస్కృత విద్య భోధన జరిగేట్టు అనేక గురుకులాలు ఏర్పాటు చేసి పోషించారు. కాశీ విశ్వనాథునికి సకల పూజా ఉపచారాలు తమ రాజ్యం తరపున అందేట్టు చూసారు. ప్రయాణీకులకు తీర్థ యాత్రికులకు సౌకర్యాలు అందేట్టు అనేక సౌకర్యాలు, మఠాలు మరియు సత్రాలు ఏర్పాటు చేసారు.

రామనాథపురం యువరాణి వేలునాచియర్ కి శివగంగ సీమను పాలిస్తున్న ముత్తు వడగనాథ పెరియ ఉడయవర్ తో వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజ్యం సక్రమమైన పాలనతో సాగుతోంది. ఆ రాజుకు ఆమెకు ఒక కుమార్తె కలిగారు. ఆర్కాడు నవాబ్ కి శివగంగ సీమ మీద దాని సంపద మీద కన్నుబడింది. ఆంగ్లేయులతో చేతులు కలిపి శివగంగ సీమ మీద దాడి చేసారు. శివగంగ సీమ రాజు వడగనాథ పెరియ ఉడయవర్ ని యుద్ధములో మోసముతో ఆర్కాడు నవాబు మరియు ఆంగ్లేయులు చంపివేశారు. అంతఃపురాన్ని సైన్యం చుట్టూ ముట్టింది. స్త్రీలను బందీలుగా పట్టుకుంటున్నారు. మహారాణి వేలు నాచ్చియార్ పురిటికందుతో అంగరక్షకులుగా గోపాల నాయకర్ మరియు విరూపాక్ష నాయకర్ ల సహాయముతో ఆమె దిండిగల్లు కు సమీపములో ఉన్న గ్రామములో మారువేషములో ఎనిమిది సంవత్సరాలు తలదాచుకున్నారు.

తన భర్తను చంపి తమను రాజ్య భ్రష్టులను చేసిన శత్రువుల మీద ఆమె పగబట్టింది. సమీప గ్రామాలలోని యువకులను చేరదీసి వారికీ అనేక యుద్ధవిద్యలు స్వయంగా నేర్పసాగింది. దాదాపు ఇరవై వేల మంది సైనికులను గోపాలనాయకర్ మరియు ఆమె కలిసి సుశిక్షితులు చేసారు. తగ్గ సైన్యం సమకూరగానే ఆమె మైసూరును పాలించే హైదర్ అలీ తో ఒప్పందం చేసుకుని ఆంగ్లేయుల మీద దండయాత్రకు సిద్ధపడింది. ఆమె ఆత్మాహుతి దళాలను కూడా సిద్ధం చేసారు. ఆంగ్లేయులసైనిక గుడారాల వద్దకు స్త్రీ దళాలు వెళ్లి తమ ఒంటి నిండా భాస్వరం మరియు అతి త్వరగా మండే నూనెలతో వెళ్లి ఆ ముష్కర ఆంగ్ల సైనికులు నిద్రించే సమయాన వెళ్లి వాళ్ళ గుడారాలలో ప్రవేశించి ఆత్మహత్య చేసుకుని వారిని చంపివేశారు.

ఈ దళానికి నాయకురాలు కుయిలి. ఈమె ఒక నిమ్న వర్గాలకు చెందిన యువతి.. కుయిలి నాయకత్వములో బ్రిటీషు వారు దాచుంచిన మందు గుండు సామాగ్రి అంతా పేలిపోయేట్టు చేసింది. స్త్రీ దళాల పేరు తన పెంపుడు కుమార్తె ఉడైయాల్ పేరుతో ఏర్పాటు చేసింది.. ఉడైయాల్ ఆంగ్లేయుల మీద జరిపిన దాడుల్లో మరణించింది. ఆంగ్లేయులతో జరిపిన ఈ యుద్ధములో ఆమె ఆర్కాడు నవాబు సైన్యాలను మరియు ఆంగ్లేయులను ఓడించి తన రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని మహారాణి అయి శివ గంగ సీమను 1780లో తిరిగి ఆక్రమించుకున్నది. మరుదు పాండ్య సోదరులు అనే వీరాధివీరులకు అనేక అధికారులు ఇచ్చి తన కుమార్తె వెల్లాచ్చిని మహారాణిని చేసింది. దాదాపు పదహారేళ్ళపాటు శివ గంగ సీమను పాలించిన ఆమె 1796 లో మరణించింది. వేలు నాచ్చియార్ పాలన తరువాత వచ్చిన యుద్ధాలలో ఆంగ్లేయులతో మరుద పాండ్య సోదరులు వీరోచితంగా పోరాడారు. వీరికి వీర పాండ్య కట్ట బ్రహ్మన్నకు అమిత సాన్నిహిత్యం ఉండేది. అడవులలో తలదాచుకుని సైన్యాన్ని సమీకరించి కుయిలిలాంటి వీరవనితల్ని తయారుచేసి తిరిగి రాజ్యంసంపాదించుకుందే తప్ప శతృవుకి లొంగి బానిసగా బ్రతకలేదు మన జ్వాలామణి.

జ్వాలామణులు పుస్తకం నుండి సేకరణ... జ్వాలామణులు పుస్తకం కొరకు సంప్రదించండి.. మా వాట్సాప్ నెంబర్: +91 8500581928 నెంబర్ మీద క్లిక్ చేస్తే వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవ్వొచ్చు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments