Page Nav

HIDE

Gradient Skin

Gradient_Skin

Pages

JUST IN

latest

అంబేద్కర్ చెప్పిన జాతీయతని అర్ధం చేసుకోలేమా? - సామల కిరణ్ - megaminds

అంబేద్కర్ అంబేద్కర్ ప్రఖర జాతీయతాభావ సంస్కర్త. దేశ సమగ్రత కు రాజీలేని ఉద్దీపనని అందించిన చారిత్రక మహాపురుషుడు. బాబాసాహెబ్ చెప్పిన జాతీయతని ద...

అంబేద్కర్


అంబేద్కర్ ప్రఖర జాతీయతాభావ సంస్కర్త. దేశ సమగ్రత కు రాజీలేని ఉద్దీపనని అందించిన చారిత్రక మహాపురుషుడు. బాబాసాహెబ్ చెప్పిన జాతీయతని దేశ ప్రజలంతా పార్టీలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా అర్ధం చేసుకోవాలి, అనుసరించాలి.
 
జాతీయతా విషయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల్ని గమనిద్దాం. దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ
భారత రాజ్యాంగం తుది సమావేశంలో 25 నవంబర్, 1949 న ప్రసంగిస్తూ “నేడు మనకు లభించిన స్వాతంత్రం సుస్థిరంగా ఉండాలంటే మనం మనకులము, ప్రాంతము, పార్టీ, సంస్థల ప్రయోజనాల కంటే దేశప్రయోజనాలకు పెద్దపీట వేయాలి” అని అందరకూ పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఇచ్చిన ఈ పిలుపుని జాతీయతకు ఇచ్చిన గొప్ప నిర్వచనంగా చెప్పవచ్చు. అన్నింటి కన్నా దేశప్రయోజనాలే మిన్నగా భావించటం మించిన జాతీయత ఏముంటుంది? స్వార్థ ప్రయోజనాల కోసం దేశాన్ని కులం, మతం, వర్గం, ప్రాంతం పేరుతో చీల్చే చర్యల్ని అంబేద్కర్ వ్యతిరేకించారు.

భారత రాజ్యాంగం ద్వారా ఒకే రాష్ట్రంగా (Nation) భారతదేశాన్ని నిలబెట్టే ప్రయత్నం రాజ్యాంగ కర్తల ద్వారా జరిగింది. సాంస్కృతిక సమైక్యతతోపాటు సామాజిక సమైక్యత అవసరమని తెలియజేస్తూ భారత రాజ్యాంగం ద్వారా సామాజిక సమానత్వం అనే అమృతాన్ని అంబేద్కర్ అందించారు. సాంస్కృతిక భావ ధార తెగకుండా, బలమైన సమైక్య రాజకీయ భారతం అవసరమని భావిస్తూ బలమైన కేంద్రంగల భారత రాజ్యాంగాన్ని మనకందించారు. ఒకే ప్రజ నుండి ఒకే రాజ్యం ­- ఒకే రాష్ట్రం వైపు భారత్ రూపొందే విధంగా భారత రాజ్యాంగాన్ని డా|| అంబేద్కర్ అందించారు. డా. అంబేద్కర్ ఈ శతాబ్దపు మేధావి. అనేక రంగాలలో వారు ఎంతో అధ్యయనం చేశారు. కనుకనే భారత రాజ్యాంగ నిర్మాతగా వారికి అవకాశం లభించింది.

‘భారతదేశ విభజన – పాకిస్థాన్ ఏర్పాటు‘ అనే గ్రంథంలో కోట్ల సంఖ్యలో ఉన్న ముస్లింలను కలుపుకునే శక్తి హిందూసమాజంలో లేదని, కనుక పాకిస్థాన్ ఏర్పడటమే మిగిలిన భారతదేశంలోని హిందువులకు మేలు కలిగిస్తుందని అన్నారు. పాకిస్థాన్ ఏర్పడిన తరువాత హిందూ ముస్లిం జనాభా మార్పిడి జరగాలని వారు కోరారు. పాకిస్తాన్లో హిందువులకు, షెడ్యూల్ కులాల వారికి ఏమాత్రం రక్షణ ఉండదని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన జోస్యం నేడు కళ్ళముందు కన్పిస్తుంది. మత రాజ్యంగా ఏర్పడ్డ పాకిస్థాన్ లో హిందువుల సంఖ్య తగ్గటమే దీనికి తార్కాణం. మెజార్టీ హిందువులుగా ఉన్న భారత్ లో మాత్రం సమన్వయముతో అందరం జీవించటం గొప్ప విషయం.దీనికి ప్రధాన కారణం హిందూత్వంలోని విశాలతయే తప్ప మరొకటి కాదు.

ఏ మతానికి చెందిన వారైనా పుట్టిన దేశాన్ని మాతృభూమిగా, ఇక్కడి వారసత్వాన్ని తమదిగా, ఇక్కడి చారిత్రక పురుషులు నా వాళ్ళుగా భావించుకోవటంలో సందేహం ఉండక్కర్లేదు. ఇందులో సంకుచితానికి తావు లేదు. మతతత్వానికి అవకాశమే లేదు. ప్రాంతీయ వాదాలకు చోటు లేదు. వీటి అన్నిటికి సర్వోపరి జాతీయత అని గుర్తించాలి. డా|| అంబేద్కర్ దళితుల ఉన్నతికోసం, సమానత్వం కోసం పనిచేస్తూనే దేశ ప్రయోజనాల కోసం అహరహమూ శ్రమించారు. ఎక్కడా రాజీ పడలేదు. కనుక వారిని మనం జాతీయ నాయకుడిగా గుర్తించి గౌరవించాలి. జాతీయతను అర్ధం చేసుకోవాలి. ఆయన అందించిన సమరసతా స్ఫూర్తిని కొనసాగించాలి. సంకుచిత భావాలకు చోటివ్వకుండా, ప్రాంత, భాష, వర్గ, కుల, మతం పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే పార్టీలకు, నాయకులకు బుద్ధి చెప్పి, ప్రజాస్వామ్య కాంతులు పరిఢవిల్లేలా, దేశ శ్రేయస్సుకి కలిసి నడుద్దాం. ఇది మనందరి బాధ్యత. - సామల కిరణ్,  ప్రముఖ జాతీయవాది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..