Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

షహీద్ దివస్ మార్చి 23 - March 23 Balidan Diwas - megaminds

‘దిల్‌సే నిక్‌లేగీ నా మర్ కర్ వతన్ కీ ఉల్ఫత్ మెరీ మిట్టీ సేభీ ఖుష్‌బూ-ఏ-వతన్ ఆయేగీ’ ‘మాతృభూమిపై నా ప్రేమను, నా అభిమానాన్ని మరణం ...

‘దిల్‌సే నిక్‌లేగీ నా మర్ కర్ వతన్ కీ ఉల్ఫత్
మెరీ మిట్టీ సేభీ ఖుష్‌బూ-ఏ-వతన్ ఆయేగీ’
‘మాతృభూమిపై నా ప్రేమను, నా అభిమానాన్ని మరణం కూడా ఆపలేదు, మరుభూమికి చేరిన తర్వాత కూడా నా అస్తికలనుంచి కూడా ఈమట్టి వాసనే పరిమళిస్తుంది’ అని దీనర్థం.

1931లో ఇదేరోజు భరతమాత ముద్దుబిడ్డలు, వీర స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, శివరాం రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్‌లు మరణభీతి లేకుండా పాటలు పాడుతూ, చిరునవ్వులు చిందిస్తూ ఉరికంబం వైపు నడిచారు.

మధ్యలో భగత్‌సింగ్, కుడివైపు రాజ్‌గురు, ఎడమవైపు సుఖ్‌దేవ్ ఉరికంబం వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనపర్యవేక్షిస్తున్న మెజిస్ట్రేటు, ఈ ముగ్గురి ముఖాల్లో చిరునవ్వులు చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు భగత్‌సింగ్.. మెజిస్ట్రేటును ఉద్దేశించి ‘చూడండి. తమ ఆదర్శాల కోసం భారత విప్లవ వీరులు చావును కూడా ఎంత ఆనందంగా స్వీకరిస్తారో చూడటం మీ అదృష్టం’ అని అన్నాడు.

అయితే ఉరిశిక్షకు ముందు ఖైదీలు కోరుకునే చివరి కోరిక ప్రకారం, ఆ ముగ్గురికీ రెండు నిమిషాలపాటు సంకెళ్లు తీశారు. దీంతో ఆ ముగ్గురు, ‘సామ్రాజ్యవాదం నశించాలి, ఇంక్విలాబ్ జిందాబాద్, వందేమాతరం’ అని నినాదాలు చేస్తూఒకరినొకరు హత్తుకున్నారు. అనంతరం తలారి ఆ ముగ్గురి చేతులను కట్టేసి, వారి ముఖాలకు ముసుగులు తొడిగేశాడు. తర్వాత వారి మెడకు ఉరితాడు వేశాడు.

సరిగ్గా సాయంత్రం 7.33 నిమిషాలకుమెజిస్ట్రేటు చేతి గడియారాన్ని చూస్తూఉరితీయండని సైగచేస్తూ చేతులు పైకెత్తాడు. వెంటనే తలారి తన పనిని కానిస్తూ ముగ్గురినీ ఉరితీశాడు. ఆ ముగ్గురు భౌతికంగా లేకపోయినా, వారి త్యాగానికి ప్రతీకగా ఆ వీర స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు భారత చరిత్రలో అజరామరంగా నిలిచిపోయాయి. 

జైల్లో ఉన్నప్పుడు ఓ సందర్భంలో భగత్‌సింగ్ తన మిత్రులతో మాట్లాడుతూ, ‘వాళ్లు నన్ను చంపగలరేమో గానీ నా ఆదర్శాలను మాత్రం కాదు. వారు నా శరీరాన్ని తునాతునకలు చేయగలరేమో గానీ, నా స్వాతంత్ర్య స్ఫూర్తిని మాత్రం కాదు’ అని పేర్కొన్నారు.

ఈ ముగ్గురు విప్లవ వీరులు అమరులై 90 ఏళ్లు గడుస్తున్నా వారి ధైర్యసాహసాలు, వారి త్యాగం, మాతృభూమిపై వారి ప్రేమాభిమానాలు.. ఇప్పటికీ ప్రతి భారతీయుడికీ ప్రేరణను కలిగిస్తూనే ఉన్నాయి.

ప్రతి ఏడాది మార్చి 23ను మనంబలిదాన దినం (బలిదాన్ దివస్‌)గా జరుపుకుంటాం. భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లతోపాటు భరతమాతను దాస్యశృంఖలాలనుంచి విముక్తం చేసేందుకు ఎందరో భారత స్వాతంత్ర్య వీరులు చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటాం. వలసపాలనను అంతమొందించి దేశానికి స్వేచ్ఛ, స్వాంత్ర్యాలు అందించేందుకు అపారమైన ధైర్యసాహసాలను ప్రదర్శించిన ఎందరో విప్లవ వీరులు, వీరాంగనలను గుర్తుచేసుకుందాం.

తల్లి భారతికి స్వేచ్ఛనందించి, తమ రుణం తీర్చుకునే ఏకైక లక్ష్యంతో జీవితాలను పణంగా పెట్టిన వారి త్యాగాలకు జాతి యావత్తూ రుణపడి ఉంటుంది. భారతదేశం పునర్వైభవాన్ని పొందేందుకు దేశాన్ని విదేశీ పాలన నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఎంతటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వారువెనుకకు తగ్గలేదు. ఎవరికీ తలొగ్గలేదు. వీరి త్యాగాల స్ఫూర్తి కారణంగానే మిగిలిన భారతీయుల్లోనూ స్వాతంత్ర్యకాంక్ష మరింత పెరిగింది.

చావుకు భయపడుతున్నావా? అని రాజ్‌గురు ను తోటి విప్లవవీరుడు అడిగినపుడు.. ‘నీలాగే నేను కూడా, నేను సాధించినదాని పట్ల చాలా గర్వపడుతున్నాను. చావుకు సవాల్ విసిరిన తర్వాతే నేను ఈ వాస్తవాన్ని అర్థం చేసుకున్నాను. మా త్యాగాల ద్వారా తోటి భారతీయులకు స్వేచ్ఛను అందించడంలో విజయం సాధించగలిగితే మా మరణానికి సార్థకత చేకూరినట్లే’  అని చెప్పాడు.

ఉరిశిక్షకు కొద్దిరోజుల ముందు మహాత్మాగాంధీకి సుఖ్‌దేవ్ లేఖ రాస్తూ, ‘లాహోర్ కేసులో ఉరిశిక్ష పడిన ఈ ముగ్గురు ఖైదీలకు దేశవ్యాప్తంగా అభిమానం పెరిగింది. అయితే విప్లవవీరుల పార్టీకి వీరు మాత్రమే సర్వస్వం కాదు. వీరి శిక్షను తగ్గించినా, ఉరిశిక్ష అమలైనా పెద్ద నష్టమేమీ జరగదు’ అని అందులో పేర్కొన్నారు. మాతృభూమికి స్వాతంత్ర్యాన్ని అందించే విషయంలో, అందుకోసం చేయాల్సిన త్యాగం విషయంలో వీరు అన్నింటికీ సిద్ధపడ్డారనే విషయం సుస్పష్టం.

ఈ ముగ్గురు మహనీయుల స్ఫూర్తిదాయకమైన త్యాగాలను గుర్తుచేసుకుంటూ, వారు కన్న కలలను నిజం చేసేందుకు మనమంతా ఐకమత్యంగా ముందుకెళ్దాం. వారు దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. వారి స్ఫూర్తితో ఇప్పుడు మనం జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్తూదేశాభివృద్ధిలో భాగస్వాములమవుదాం. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో సర్వస్వాన్నీ త్యాగం చేసిన వారి గురించి నేటి యువత, మరీముఖ్యంగా రేపటి తరమైన చిన్నారులు తెలుసుకోవాలి. మనం కూడా జాతీయత మరియు దేశం కోసం సమయం కేటాయించి ఆ వైపు అడుగులు వేద్దాం.

40 మంది స్వాతంత్ర్య కోసం పనిచేసి అమరులైన మన మహిళా స్వాతంత్ర్య వీరాంగల గురించి తెలిపే జ్వాలామణులు పుస్తకం కొరకు సంప్రదించండి... మా వాట్సాప్ నెంబర్: +91 8500581928 నెంబర్ మీద క్లిక్ చేస్తే వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవ్వొచ్చు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments