Type Here to Get Search Results !

వందేమాతరం ఎలా పుట్టింది? - About Vandemataram History in Telugu - megamindsమన వందేమాతరం ఎలా పుట్టింది?: ఒకానొక సిరా చుక్క... లక్షలాది మెదళ్లకు కదలిక తెస్తుంది. అలాగే భావోద్వేగాన్ని మేలుకొల్పే ఒక్కొక్క గీతిక నిలువెల్ల తనవును పులకరింపజేస్తుంది. పదిమంది కలిసి పాడినప్పుడు... తమ అందరి గుండెలయ ఒక్కటేనని అనిపిస్తుంది. పదం పదం కలసిపాడటమే కాదు.. కదం కదం కలిపి తాము అంతా నడువగలమని.. ఏ పనినైనా సాధించగలమనే విశ్వాసాన్ని ప్రోదిచేస్తుంది. దేశమాత పట్ల భక్తిభావాన్ని, కర్త్యవం పట్ల నిష్ఠను, నరనరానికి, కణకణానికి వ్యాపింపజేయటంలో సంగీతానికి గల శక్తి అసామాన్యమైనది. 1875లో బంకించంద్రుడు రాసిన వందేమాతర గీతం... తర్వాతి కాలంలో కోట్లాది మంది భారతీయుల గొంతుకగా మారింది. భారత స్వాతంత్ర్య పోరాటంలో సమరశంఖనాదం అయ్యింది.
 
అధ్వరణవేదంలోని పృథివీ సూక్తంలో భూమిని తల్లిగా.... ఆ భూమిపై నివసించేవారిని ఆమె పుత్రులుగా అభివర్ణించారు భారతీయ బుషులు..! మాతా భూమిః పుత్రోహంపృథివ్యాః...ఈ పుడమి నా తల్లి.., నేను ఆమె పుత్రుడను...! ఈ భావన భారతీయ సంస్కృతిలో ప్రధానమైన అంశం. భారతీయుల్లో నెలకొన్న నిరాశను తొలగించి మాతృభూమి కొరకు సర్వస్వాన్ని సమర్పించే విధంగా జాతి జనులను జాగృతం చేసేందుకు రచించిన గీతమే వందేమాతరం...!
 
మనది అనాది కాలం నుంచి కూడా ఒకటే దేశం. మనం ఒకజాతిగా అన్నివిధాల అత్యంత వైభవోపేతమైన జాతిగా వెలుగొందేనాటికి ప్రపంచంలోని మిగతా జాతులేవీ కళ్లు కూడా తెరవనేలేదు. మనం జాతిగా వికసించి స్థిరపడిన తర్వాతనే చైనా, బాబిలోనియా, సుమేరు, ఈజిప్టు వగైరా దేశాలు జాతులుగా రూపొందాయి. అధ్వరణవేదంలోని పృథివీ సూక్తంలో భూమిని తల్లిగాను, ఆభూమిపై నివసించేవారు ఆమె పుత్రులని ప్రాచీన భారతీయ రుషులు తెలిపారు. మాతృభూమి భావన మన దేశంలో అనాది కాలం నుంచి ఉంది. ఇది మన భారతీయ సంస్కృతిలో ప్రధానమైన అంశం. ఈ సంస్కృతే బంకించంద్రుని రచనల్లో కనిపిస్తుంది.

కళాశాలలో చదువు కొనసాగుతున్నప్పుడే బంకించంద్రుడు సంస్కృతం భాషను నేర్చుకున్నారు. ప్రాచీన భారతీయ గ్రంథాలను అధ్యయనం చేశాడు. ఈశ్వర చంద్ర గుప్త నడిపే "సంబాబ్ ప్రభాకర్" , "సంబాబ్ సాధురంజన్" పత్రికలకు బంకిం చంద్రుడు కవితలు వ్రాసేవారు. భారత్ దాస్యానికి ఆంగ్లేయులతోపాటు....దేశ భక్తిలేని భారతీయులు కూడా ఓ కారణమనే ఆయన అభిప్రాయపడ్డారు. భారతీయులలో నెలకొన్న నిరాశను తొలగించి మాతృభూమి కొరకు సర్వస్వాన్ని సమర్పించే విధంగా వారిని తీర్చిదిద్దటం చాలా అవసరమని ఆయన ఆలోచించారు. ఇలా తీర్చిదిద్దాలంటే అందరిలో దేశభక్తిని, మాతృభూమి పట్ల ప్రేమను నింపాలి. దైవం తర్వాత మాతృభూమికే ప్రాముఖ్యతను నివ్వాలనే భావనతో..., వందేమాతరమ్ అనే గీత రచనకు ఆయన సంకల్పించారు.

క్రీ.శ. 1875 నవంబర్ నెల, కార్తిక మాసం రోజున... వందేమాతర గీతం ఆయన కవితారూపంలో ఆవిర్భవించింది. కర్తవ్య నిర్వహణకు కావలసిన జ్ఞానం, దాని కొరకు కష్టపడే సంసిద్ధత, ధ్యేయం సాధించితీర్తాననే ఆత్మవిశ్వాసం ఈ గీతంలో ప్రతిబింబించాయి. ఆరు చరణాలున్న ఈ గీతంలో సంస్కృత పదాలతో పాటు కొన్ని బెంగాళీ భాషాపదాలున్నాయి. అయినా ఈ గీతం ఓ అనుభూతి అందరి హృదయాలను స్పృశిస్తుంది. 1875లోనే ఆయన సంపాదకత్వంలో ప్రచురితమయ్యే బంగ దర్శన్ పత్రికలో ప్రచురించబడింది ఈ గీతం. ఈ గీతం అచ్చు అయినప్పుడే... దీని భావం అర్థం కావాడానికి బెంగాల్ ప్రజలకు 30 సంవత్సరాలు పడుతుందని బంకిం చంద్రుడు అప్పుడే ఊహించారంటా...! సరిగ్గా బంకిం చంద్రుడు ఊహించినట్లే జరిగింది. బంగ దర్శన్ పత్రికలో ఆయన1880-1881 మధ్యకాలంలో ఆనందమఠ్ నవలను ధారావహికగా ప్రచురించారు. ఈ నవలలో వందేమాతర గీతాన్ని యథాతథంగా పొందుపర్చాడు.

ఆనంద మఠం నవలలో ఆ గీతాన్ని పాడుతూ భవానందుడు... మాకు తల్లి లేదు, తండ్రి లేడు, అన్నాతమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు లేరు. భార్యాబిడ్డలు లేరు, ఇల్లూ వాకిలీ లేదు. మాకున్నదొక్కటే..., సుజల, సుఫల, సస్యశ్యామల అయిన భారత మాతయే... మేమందరం ఆమె సంతానం...! బంకించంద్రుడికి కూడా వందేమాతరంలోని పదాలకు అద్భుతమైన ప్రభావం ఉందని... ఇది దేశ ప్రజలందరిని ఒక్కటి చేస్తుందనే ఆత్మవిశ్వాసం ఆయనలో ఉండేది. ఈ గీతం శాశ్వాతంగా నిలుస్తుంది. దేశ వాసుల హృదయాలను ఆకర్షిస్తుందని...జయిస్తుందని ఆయన తన అక్కకుమారినితో కూడా అన్నారని అంటారు. తర్వాతి కాలంలో ఈ వందేమాతరమే....స్వతంత్ర సాధానాయజ్ఞానికి తారక మంత్రమైంది.

కులం, భాష, ప్రాంతం, తెగలు అనే బేధాలు లేకుండా దేశ ప్రజలందరూ ఒక్కటిగా ఈ గీతాన్ని గానం చేశారు. ఇది భారతీయ ఏకాత్మతను సాక్షాత్కరింపజేసిన గీతం..! పుడమి తల్లి జయగానం చేస్తూ నేల కొరిగిన వేలాది భారత పుత్రులకు ఇది ప్రేరణ స్రోతస్సు...! మదాంధకారంతో నిదురపోతున్న ఆంగ్లేయులను ఉలిక్కిపడేలా చేసిన శరాఘాతం, ఆబాలగోపాలం పెదవులపై తొణకిలాడిన స్వరాజ్య గానం వందేమాతరం.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Tags

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. అవును మనల్ని నడిపిస్తున్నది సుజల, సుఫల, సస్యశ్యామల అయిన భారత మాతయే...🙏

    ReplyDelete

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..