Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

67 ఏళ్ల ధీరోదాత్త మిజో మహిళ రోపుయిలియాని - About Ropuiliani in Telugu - megaminds

ఈశాన్య భారతం సుందరమైన, అద్భుతమైన ప్రదేశాలకు మాత్రమే కాకుండా అక్కడ జన్మించిన ఎందరో వీరుల శౌర్యం, త్యాగాలకు కూడా ప్రసిద్ధి చెందింది. మిజో గ్రా...



ఈశాన్య భారతం సుందరమైన, అద్భుతమైన ప్రదేశాలకు మాత్రమే కాకుండా అక్కడ జన్మించిన ఎందరో వీరుల శౌర్యం, త్యాగాలకు కూడా ప్రసిద్ధి చెందింది. మిజో గ్రామాలలో 67 ఏళ్ల ధీరోదాత్త మహిళ రోపుయిలియాని. 1828లో జన్మించిన రోపుయిలియాని ఉత్తర మిజో నాయకుడు లాల్సావుంగా కుమార్తె. సంప్రదాయాలకు వారి కుటుంబం చాలా విలువనిచ్చేది. దక్షిణ లుషాయ్ పర్వత ప్రాంత నాయకుడైన వండులాను ఆమె వివాహం చేసుకున్నారు. 19వ శతాబ్దం చివరి నాటికి మిజో ప్రజలకు దగ్గరి ప్రాంతాల్లోనే బ్రిటీష్ వారి స్థావరాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. వలస పాలకుల అరాచకాలను ఇష్టం లేకపోయినా అక్కడి ప్రజలు భరిస్తూ వచ్చారు. బ్రిటీష్ వారి టీ తోటలు మిజో ప్రజల నివాసాల దగ్గర ఉన్న నేపథ్యంలో, తరచూ వారి వాణిజ్య ప్రయోజనాల కోసం మిజో సంప్రదాయాలకు ఆటంకం కలించే విధంగా ప్రజల మీద ఒత్తిడి తీసుకువచ్చే వారని చెబుతారు. వారి మధ్య తరచూ గొడవలు, వాగ్వివాదాలు జరిగేవి.


చివరకు 1890 ప్రాంతంలో, బ్రిటీష్ వారు కొన్ని మిజో ప్రాంతాల మీద తమ ఆధిపత్యాన్ని పెంచుకోగలిగారు. అయినప్పటికీ బ్రిటీష్ వారి గురించి తెలిసిన కొందరు మిజో ముఖ్యులు మాత్రం వారి అధికారాన్ని అంగీకరించలేదు. వారిలో వండులా కూడా ఒకరు. బ్రిటీష్ ఆధిపత్యాన్ని అంగీకరించేందుకు ఆయన విముఖత వ్యక్తం చేశారు. బ్రిటీష్ వారు అనేక విధాలుగా ఆయన్ను ఆకర్షించే ప్రయత్నం చేసినప్పటికీ, వాటికి లొంగకుండా స్వతంత్రంగా ఉండే వారు వండులా.

వండులా మరణం తర్వాత ఆయన భార్య రోపుయిలియాని పాలనాపగ్గాలు చేపట్టి, ఆమె సొంత గ్రామమైన రాల్వాంగ్ నుంచి పరిపాలించడం ప్రారంభించారు. ఆమె తండ్రి, భర్త నుంచి అలవరుచుకున్న రాజనీతితో ఆమె ప్రజారంజకంగా నాయకత్వం వహించి. లుషాయ్ ప్రాంతంలో బ్రిటీష్ వారి ప్రభావం పెరుగుతోందని, అదే సమయంలో వారి పట్ల ప్రజల్లో వ్యతిరేకత కూడా పెరుగుతోందనే విషయాన్ని ఆమె గ్రహించారు. అప్పటికే బ్రిటీష్ వారికి విరోధులు అని చెప్పే జాబితాలో ఆమె పేరు ప్రముఖంగా వినిపించేది. మిజోకు చెందిన చాలా మంది ప్రముఖులు బ్రిటీష్ వారితో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో, బ్రిటీష్ వారికి పన్నులు చెల్లించడం గానీ, వారి ఆధిపత్యాన్ని అంగీకరించడం కానీ చేయవద్దని రోపుయిలియాని తమ ప్రజలకు దిశానిర్దేశం చేస్తూ వచ్చారు.

అంతే కాదు, బ్రిటీష్ వారి అధికారాన్ని ఆమె సవాలు చేశారు. “నాకు సంబంధించిన ప్రాంతాలు గానీ, నేను గానీ ఎప్పుడూ ఎలాంటి పన్ను చెల్లించడం జరగదు. అదే విధంగా వలసపాలకుల బలవంతం మీద శ్రమించేది కూడా లేదు. ఎందుకంటే మేము ఈ భూమికి యజమానులం” అని ఆమె గర్వంగా ప్రకటించింది. ఆమె ప్రాంతంలో బ్రిటీషర్లు పన్నులు వసూలు చేయడానికి గానీ, ప్రజల చేత బలవంతంగా పని చేయించడానికి గానీ భయపడేవారు.

ప్రజలను, భూమిని రక్షించడం తన కర్తవ్యమని ఆమె త్రికరణ శుద్ధిగా నమ్మారు. తుపాకులను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించవద్దని, బదులుగా మరిన్ని సేకరించాలని తన కుమారుడు సహా, పౌరులందరికీ ఆమె దిశానిర్దేశం చేసే వారు. అంతే కాదు బ్రిటీష్ వారితో చేతులు కలిపిన వారిని ఉద్దేశించి “మీరందరూ లొంగిపోయినా పరాయి పాలకులకు తలవంచని ఉత్తర మిజో పాలకుడు లాల్సావుంగా కుమార్తె ధైర్యంగా నిలబడింది” అంటూ ప్రకటించింది. ఆమెను ఆదర్శంగా తీసుకుని, ఆమె స్ఫూర్తితో ఇతర మిజో సంస్థానాలు సైతం బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించాయి. ఆమె ప్రతిఘటనతో ఆగ్రహించిన బ్రిటీష్ వారు ఆమె ప్రాంతంలో పోస్టులను ఏర్పాటు చేయడమే గాక, ప్రచారాలను నిర్వహించే వారు. అలాంటి ఒక ప్రచారంలో బ్రిటీష్ లెఫ్టినెంట్ స్టీవర్ట్ సహా మరో ఇద్దరు సైనికులు మరణించారు. ప్రజల సంప్రదాయాలకు వ్యతిరేకంగా కూలీలు కావాలన్న బ్రిటీష్ డిమాండ్ ను ప్రతిఘటిస్తూ స్థానిక ప్రముఖులు సైతం నిరసనలు వ్యక్తం చేశారు. రోపుయిలియాని మరియు ఆమె కుమారుడు లాల్తువామాలే ఈ దిశగా వారందరినీ ప్రేరేపించారని బ్రిటీష్ వారు ఆరోపించారు.

రోపుయిలియాని మరియు ఆమె ప్రజల స్వేచ్ఛా స్ఫూర్తిని లొంగదీసే ప్రయత్నంలో భాగంగా కెప్టెన్ షేక్స్పియర్ నేతృత్వంలోని బ్రిటీష్ సైనికులు 1893లో వారి గ్రామం మీద దాడి చేశారు. తెల్లవారు జామున హఠాత్తుగా జరిగిన దాడిలో ఆమెను, ఆమె కుమారుణ్ని అరెస్టు చేశారు. రోపుయిలియాని, ఆమె కుమారుడు బ్రిటీష్ వారికి వ్యతిరేంగా ప్రజలను ప్రేరేపించినట్లు, అలాగే ప్రభుత్వ కార్యకర్తలను చంపడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని అభియోగాలు మోపారు. ఆమె పట్టుబడిన తర్వాత కూడా, ఈ ప్రాంతంలో బంధీగా ఉంటే ఆమె స్థానికుల్లో ఉద్రిక్తత మరియు అసంతృప్తిని పెంచుతారని బ్రిటీష్ వారు భయపడ్డారు. వయోధికురాలైన ఆమెను చిట్టగాంగ్ కొండ ప్రాంతాల్లో ఉన్న రంగమతికి పంపారు. చిట్టగాంగ్ జైలులో దాదాపు రెండు సంవత్సరాలు బంధీగా ఉంచారు. 1895లో జైలులోనే పరమపదించిన ఆమె, భారత స్వాతంత్ర్య పోరాటానికి ఉత్తేజకరమైన వారసత్వాన్ని అందించారు.

వలస పాలకులకు వ్యతిరకంగా లుషాయ్ పర్వత ప్రాంతానికి చెందిన ఎంతో మంది వీరవనితలు పోరాడినట్లు చెబుతారు. అయితే దురదృష్టవశాత్తు వారి గాధలు, జానపద కథల్లో మినహాయించి చారిత్రక రికార్డుల్లో ఎక్కడా అందుబాటులో లేవు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments