Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

శారదాదేవి జీవిత విశేషాలు - About Sharada Devi in Telugu - MegaMinds

వేదకాలం నుంచి మన చరిత్రలో మహిళలది ప్రత్యేక స్థానం. ఎందరో భక్తురాళ్లు... మరెందరో కర్మయోగినులు... ఇంకెందరో జ్ఞానులు... కానీ, ఒకే మ...

వేదకాలం నుంచి మన చరిత్రలో మహిళలది ప్రత్యేక స్థానం. ఎందరో భక్తురాళ్లు... మరెందరో కర్మయోగినులు... ఇంకెందరో జ్ఞానులు... కానీ, ఒకే మహిళ అటు భక్తురాలిగా, ఇటు కర్మయోగినిగా, మరొకవైపు జ్ఞానిగా జీవించిన దాఖలాలు తక్కువ. అలా జీవించి, తాను తరించి, తనను కొలిచినవారిని తరింపజేసిన మాతృమూర్తి నూరేళ్ళ పైచిలుకు క్రితం మన మధ్యనే భౌతికంగా నడయాడింది. ఆమె.. అమ్మ... దివ్యజనని... శారదాదేవి. శ్రీరామకృష్ణ పరమహంస దివ్యపత్ని, ప్రథమ శిష్యురాలైన శారదాదేవిది ఒక విలక్షణ జీవితం. విశిష్టమైన వ్యక్తిత్వం.
 
ఆమె వివాహిత... భర్తకు తగిన భార్యగా జీవించారు. కానీ, కన్యగానే జీవితం గడిపారు. కన్యగా జీవించినా, కొన్ని వేలమంది ‘అమ్మా... అమ్మా’ అని పిలిచే రీతిలో తల్లిలా మెలిగారు.  ఆమె గడిపింది - అసాధారణమైన కుటుంబ పరిస్థితుల మధ్య! కానీ, స్వామి వివేకానంద లాంటి సన్న్యాస చక్రవర్తులకి స్ఫూర్తిమంత్రమై, సమున్నత సన్న్యాస నిలయినిగా విలసిల్లారు. ఇలా పరస్పర భిన్నమైన అంశాలెన్నిటికో మేళవింపు - శ్రీశారదాదేవి సంపూర్ణ జీవితం. మాతృభావ విలసితమైన ఆమె సమస్త జీవనం!
 
శ్రీరామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక జీవితంతో, మానవోద్ధరణకి ఆయనిచ్చిన సందేశంతో శారదాదేవిది విడదీయరాని సంబంధం. బెంగాల్ రాష్ర్టం బంకూరా జిల్లాలోని జయరావ్‌బాటి గ్రామంలో సంప్రదాయ పేద బ్రాహ్మణ కుటుంబంలో 1853 డిసెంబర్ 22న ఆమె జన్మించారు. ఆమె బడికి వెళ్ళి చదువుకోలేదు కానీ, పెద్దయ్యాక కొద్దిగా చదవడం, రాయడం వచ్చేలా బెంగాలీ వర్ణక్రమం నేర్చుకొన్నారు. దైవికంగా ఆమెకు అయిదో ఏట, 23 ఏళ్ళ గదాధరునితో (అప్పట్లో శ్రీరామకృష్ణ పరమహంసని అలా పిలిచే వారు) వివాహమైంది. అప్పటి ఆచారాల ప్రకారం ఆమె పుట్టినింటే ఉండి, పెరిగారు.
 
ఆమెకు 18 ఏళ్ళ వయసులో దక్షిణేశ్వరంలోని గుడిలో తీవ్రమైన భగవత్ వ్యాకులతతో ఆధ్యాత్మిక జీవితం సాగిస్తున్న శ్రీరామకృష్ణుల మానసిక స్థితి గురించి గ్రామంలో అమ్మలక్కల మాటలు చెవినపడ్డాయి. ఆ కష్టసమయంలో భర్త సన్నిధిలో ఉండి, ఆయనను సేవించడం ధర్మమని శారదాదేవి భావించారు. తండ్రి వెంట రాగా, 60 మైళ్ళు నడిచి, ఏ సమాచారం పంపకుండానే ఒక రాత్రి దక్షిణే శ్వరం చేరారు. ‘కామినీ కాంచన త్యాగ’మనే వైరాగ్య భావనతో ఉన్నా, శ్రీరామకృష్ణులు ఆమె బసకు ఏర్పాట్లు చేశారు.
 
అప్పట్లో 12 ఏళ్ళ పాటు ఆయన వివిధ మతసాధనలు చేస్తూ, సమస్త జీవరాశిలో దైవాన్ని దర్శించారు. శారదాదేవి కూడా ఆయనకు ప్రథమ శిష్యురాలై, ఆయనను సేవిస్తూ, ఉపదేశించిన విధానాలను అభ్యసించారు. అలా 1872 నుంచి 1886లో రామకృష్ణులు మహాసమాధి చెందే వరకు (మధ్య మధ్య తల్లి దగ్గరకు వెళ్ళిన స్వల్పవ్యవధి మినహా) తక్కిన కాలమంతా భర్త సేవలోనే గడిపారు.
 
దక్షిణేశ్వర ఆలయానికి ఉత్తరాన నహబత్ అనే చిన్న గది ఆమె నివాసం. అక్కడ నుంచి రామకృష్ణుల గది కనిపిస్తూ ఉండేది. నహబత్‌లోనే ఆమె వంటా వార్పు, అతిథుల్ని ఆదరించడం - అన్నీ చేసేవారు. తెల్లవారుజామున 3 గంటలకే లేచి, అన్ని పనులూ ముగించుకొని, రామకృష్ణులకీ, అక్కడికొచ్చే భక్తులకీ వంట చేసి, సేవించేవారు. నిరంతర జపధ్యానాల్లో గడిపేవారు. అలా శ్రీరామ కృష్ణుల శిక్షణతో ఆజన్మాంతం భక్తి, కర్మ మిశ్రీతమైన ఆదర్శ జీవితం గడిపారు. జగజ్జనని ఆశీస్సులతో భర్త ఆధ్యాత్మిక జీవితానికి అడ్డు రాకుండా, శారీరక వాంఛలకు పూర్తి దూరంగా జీవించారు.
 
శ్రీరామకృష్ణుల మహా సమాధి తర్వాత ఆయన శిష్యుల్నీ, పాశ్చాత్యం నుంచి వచ్చిన మహిళా భక్తుల్నీ కన్నబిడ్డల్లా ఆదరిం చారు. సంప్రదాయ సమాజంలో పెరిగినా అభ్యుదయభావాలతో నడిచారు. సిస్టర్ నివేదిత ప్రారంభించిన బాలికల పాఠశాలతో సన్నిహితంగా మెలిగారు. ఆధ్యాత్మికోన్నతి సాధించినా, నిగర్వంగా, నిరాడంబరంగా, సామాన్య స్త్రీలా జీవితం సాగించారు. రామకృష్ణ సంఘ ఉద్యమ సారథులైన స్వామి వివేకానంద లాంటి అందరికీ మార్గదర్శకులయ్యారు.
 
శారదాదేవి గురించి స్వామి వివేకానంద అన్నట్లు- ‘‘ఆధునిక యుగ స్త్రీలకు శారదాదేవే ఆదర్శం... అమ్మా! మీ అనుగ్రహంతో వందలాది వివేకానందులు ఆవిర్భవిస్తారు. కానీ మీ లాంటి మాతృదేవి మరొకరుండరు.’’ అవును. అందుకే, ఏ తల్లి జీవితచరిత్ర పవిత్రమో, ఏ తల్లి జీవనమంతా పావనమో, మూర్తీభవించిన పవిత్రతగా ఏ తల్లి విరాజిల్లుతోందో, అలాంటి దివ్యజననికి ప్రణామాలు!పవిత్రం చరితం యస్యాః పవిత్రం జీవనమ్ తథా, పవిత్రతా స్వరూపిణై్య తస్యై కుర్మో నమో నమః

శారదాదేవి చివరి రోజులు కలకత్తాకు జయరాంబాటికి మధ్య పయనిస్తూ గడిపారు. 1919 జనవరిలో, జయరాంబాటి వెళ్ళి అక్కడే ఒక యేడాది కాలం గడిపారు. అక్కడ చివరిమూడు నెలలూ ఆమె ఆరోగ్యం క్షీణించగా ఫిబ్రవరి 27, 1920 న తిరిగి కలకత్తాకు తీసుకువచ్చారు. మరి ఐదు నెలలు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడ్డారు. నిర్యాణానికి ముందు ఆవిడ శిష్యులతో అన్న మాటలివి. "ఒక్క విషయం చెబుతాను-- మీకు మనశ్శాంతి కావాలంటే ఇతరుల్లో తప్పులు వెతకడం మానండి. మీలోనే తప్పులెంచి సరిదిద్దుకోండి. ఎవ్వరూ పరాయివారు కాదు. ప్రపంచమంతా మనదే". దీన్నే ఆమె అంతిమసందేశంగా భావిస్తారు. ఆవిడ 1920 జూలై 20 న రాత్రి ఒకటిన్నరకు పరమపదించారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments