Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

బ్రిటిష్ వాళ్ళ తలలు తెగనరికిన రామగడ్ వీరనారీమణి రాణీ అవంతీబాయి - About Rani Avanthibai in Telugu - MegaMinds

మీకు మీ దేశం పట్ల గౌరవం, విధేయత ఉంటే, ఆయుధాలు చేబూని పోరాటం చేయండి. లేదా ఈ గాజులు ధరించి ఇంట్లో కూర్చోండి. ఈ మాటలు రామగఢ్ రాణి అ...

మీకు మీ దేశం పట్ల గౌరవం, విధేయత ఉంటే, ఆయుధాలు చేబూని పోరాటం చేయండి. లేదా ఈ గాజులు ధరించి ఇంట్లో కూర్చోండి.

ఈ మాటలు రామగఢ్ రాణి అవంతిబాయి పొరుగు రాజ్యాల పాలకులకు పంపిన లేఖలోనివి. బ్రిటీష్ వారి దుర్మార్గమైన పాలనను  గుడ్డిగా అంగీకరించకుండా, భారతమాత వీర పుత్రులుగా ధైర్యంగా పోరాడాలని వారికి దిశానిర్దేశం చేశారు. రాణి అవంతిబాయి ఇచ్చిన ఈ ఉద్వేగభరితమైన పిలుపు అందరిలో స్ఫూర్తిని నింపడమే గాక, 1857లో మాతృభూమి స్వేచ్ఛ దిశగా పోరాడేందుకు ఈ ప్రాంతంలోని రాజులు మరియు జమిందార్లను ఉద్యుక్తులను చేసింది.

విస్మరించజాలని మహిళా స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ వారి గురించి తెలిజేయడంలో భాగంగా, ఈ రోజు రామగఢ్ కు చెందిన వీరనారి, రాణి అవంతిబాయి  గాధను గుర్తు చేసుకుందాం. ఆమె బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం మాత్రమే గాక, పొరుగు రాజ్యాల పాలకుల్లో స్వరాజ్య కాంక్షను, దేశభక్తిని ప్రేరేపించారు. 1831లో భూస్వాముల కుటుంబంలో ఆగష్టు 16న జన్మించిన రాణి అవంతిబాయి కత్తి యుద్దాలు, విలువిద్య, గుర్రపు స్వారీ వంటి వాటిల్లో చిన్న తనం నుంచే శిక్షణ పొందారు. ఆమె చాలా చిన్న వయసు నుంచే సైనిక వ్యూహాల రచనలో ఆరితేరారు. తనదైన ఉత్తమ సైనిక యుద్ధ నైపుణ్యంతో మంచి పేరు సంపాదించుకున్నారు. అనంతరం రాజా విక్రమాదిత్య సింగ్ లోధితో వివాహం తర్వాత ఆమె రామ్ గఢ్ కు రాణి అయ్యారు. 

కొన్నేళ్ళ తర్వాత రాజా విక్రమాదిత్య సింగ్ తీవ్ర అనారోగ్యానికి గురై రాజ్యాన్ని పరిపాలించడం చాలా కష్టమైంది. అదే సమయంలో వారి కుమారులిద్దరూ వయసులో చాలా చిన్న వారు కావడం వల్ల, రాణి అవంతి బాయి పరిపాలనా బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు వచ్చారు. ఉన్నతమైన రాజనీతి, సామాన్యుల పట్ల దయ, ప్రజలందరి పట్ల ఆదరంతో ఆమె పాలన సాగింది. భారతదేశం మొత్తాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలనుకునే పేరాశతో బ్రిటీష్ పాలకులు దేశ వ్యాప్తంగా ఒక్కో రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్న రోజులవి. రామగఢ్ రాజ్యం వారి తర్వాతి లక్ష్యంగా మారింది. ఈ రాజ్యం కోసం వారు ప్రత్యేకంగా ఓ అధికారిని కూడా నియమించారు. 

తనకు ఆమోదయోగ్యం కాని ఈ నిర్ణయంతో పాటు, బ్రిటీష్ వారి తదుపరి చర్యలను రాణి అవంతిబాయి అవమానకరంగా భావించారు. తొందరపడి నిర్ణయం తీసుకోకుండా, బ్రిటీష్ వారిని కట్టడి చేసేందుకు ఒక వ్యూహంతో ముందుకు సాగాలని నిశ్చయించుకున్నారు. 1857వ సంవత్సరంలో దురదృష్టవశాత్తు ఆమె భర్త మృతి చెందారు. ఆ సందర్భం ఆమె ధైర్యాన్ని, కుంగదీయలేదు సరి కదా ఒంటరితనం ఆమెను మానసికంగా మరింత ధృడంగా మార్చింది. ఆ సమయంలోనే బ్రిటీష్ వారితో పోరాడి తీరాలని నిశ్చయించుకున్నారు.  

1857లో భారతదేశ మొదటి స్వాతంత్ర్య సంగ్రామం ప్రారంభమైనప్పుడు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఐక్య కూటమిని ప్రారంభించేందుకు రాణి ఇచ్చిన స్పష్టమైన పిలుపు, పాలకుల్లో స్ఫూర్తిని రగిలించింది. అనంతరం వారంతా ఆమెతో చేతులు కలిపారు. తీవ్రమైన వనరుల కొరత ఎదురైనప్పటికీ, 4000 మంది సైన్యాన్ని సమీకరించగలిగారు. వ్యక్తిగతంగా ఆమె స్వయంగా నాయకత్వం వహించి సేనలను యుద్ధంలో ముందుకు నడిపారు. బ్రిటీష్ వారితో ఆమె మొదటి యుద్ధం మాండ్లా సమీపంలోని ఖేరి గ్రామంలో జరిగింది. ఆ సమయంలో బ్రిటీష్ వారు సులభంగానే విజయం సాధించవచ్చని భావించారు. కానీ రాణి అవంతిబాయి తెలివైన యుద్ధ వ్యూహాలు, ఆదర్శప్రాయమైన ధైర్యం బ్రిటీష్ సేనలకు చెమటలు పట్టించి, ఓటమి రుచి చూపించింది. ఊహించని ఈ ఓటమిని బ్రిటీష్ వారు అవమానంగా భావించారు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే తలంపుతో రాణి మీద పెద్ద స్థాయిలో దాడి చేసేందుకు వ్యూహాలు రచించారు. 

బ్రిటీష్ దళాలతో పోలిస్తే రాణి సైన్యం చిన్నదే అయినప్పటికీ, వారికి రామగఢ్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైందని చెబుతారు. ఈ సమయంలో బ్రిటీష్ వారు రామగఢ్ కు నిప్పంటించారు. అనంతరం దేవారిఘడ్ అడవుల్లోకి రాణి వెళ్ళవలసి వచ్చింది. సంఖ్యా పరంగా పెద్దవైన బ్రిటీష్ దళాలను సమయస్ఫూర్తితో ఎదురుకోవాలని భావించిన ఆమె, గెరిల్లా యుద్ధ పద్ధతులను వినియోగించుకుంటూ, జనరల్ వాడింగ్టన్ శిబిరం మీద దాడి చేయాలని ప్రణాళికలు రచించారు. ఆ సమయంలో ఆ అడవుల్లో చివరి యుద్ధం జరిగింది. రాణి మరియు ఆమె సైన్యాన్ని బ్రిటీష్ వారి భారీ దళాలు అన్ని దిశల నుంచి చుట్టుముట్టాయి. 

చివరికి తనను బంధిస్తారని ఆమె గ్రహించినప్పటికీ, సాహసోపేతమైన ఆ వీరనారి లొంగిపోవడానికి నిరాకరించింది. ఆ సమయంలో ఆమె ఇలా చెప్పిందని నమ్ముతారు. “హమారీ దుర్గావతీ నే జీతే జీ వైరీ కే సే. ఇసే న భూల్నా ”. (మా దుర్గావతి ఆమె జీవించి ఉన్నంత సేపు, శత్రువుల చేతుల్ని ఆమె మీద పడనీయనని శపథం చేసింది. ఈ  విషయాన్ని మరచిపోవద్దు.) రాణి దుర్గావతి మార్గాన్ని అనుసరించి, రాణి అవంతిబాయి కూడా ప్రాణత్యాగం చేశారని చెబుతారు. 1858 మార్చి 20న ఆ భారతమాత వీరపుత్రిక అసువులు బాసారు. 
రాణి అవంతిబాయి దూరదృష్టి గల నాయకురాలు. ఒంటరిగా ఎవరికి వారు యుద్ధం చేయడం కంటే, బ్రిటీష్ దళాలకు వ్యతిరేకంగా అందరూ ఐక్యంగా ఉండడమే వారిని ఒడించడానికి ఏకైక మార్గమని ఆమె నమ్మారు. అందుకే ఆమెలా ఆలోచించే అనేక రాజ్యాలను ఏకం చేసేందుకు ప్రయత్నించారు. గోండి తెగ జానపద గీతాలు వీరోచితమైన ఆమె గాథను మన కళ్ళకు కడతాయి. ఆ గాధల అనువాదాన్ని ఒక్కసారి పరిశీలిస్తే....

మా తల్లి రాణి బ్రిటీష్ వారిని అనేక మార్లు ఓడించారు.
ఆమె ఈ అరణ్యాలకు నాయకురాలు.
ఆమె లేఖలు, గాజులు పంపించి ఓ ఉన్నతమైన ఆశయం దిశగా అందరినీ ప్రేరేపించి, ఏకం చేశారు.
ఆమె బ్రిటీషర్లను ఓడించి, బయటకు నెట్టివేశారు
ఆమె బ్రిటీష్ వారిని వాడవాడలో భయభ్రాంతులకు గురి చేశారు. అనంతరం వారు దొరికిన చోటకు పారిపోయి తలదాచుకున్నారు. ఆమె అశ్వాన్ని అధిరోహించి యుద్ధభూమిలోకి ప్రవేశించిన ప్రతిసారీ ధైర్యంగా పోరాడారు, కత్తులు, తూటాలు ఆ రోజును పాలించాయి. ఆమె మా రాణి మాత. అనిర్వచనీయమైన ధైర్యాన్ని, తెగువను చూపించిన ఇలాంటి వీరుల స్ఫూర్తిదాయకమైన జీవిత గాథలు జానపద కథలకు మాత్రమే పరిమితం కాకూడదు. అవి మన చరిత్ర పాఠ్యపుస్తకాల్లో భాగమై, భవిష్యత్ తరాలను ప్రేరేపించాలని ఆకాంక్షిస్తున్నాను. ముప్పవరపు వెంకయ్య నాయుడు

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment