
మానవజాతి స్వయం వినాశనానికి గురి కాకూడదంటే పాశ్చాత్యంతో మొదలైన అధ్యాయం భారతీయంతో ముగియ వలసి ఉన్నది, మానవ జాతి చరిత్రలో అత్యంత విపత్కర సందర్భాల నుండి మానవ జాతిని విముక్తి చేయగలిగే మార్గం భారతీయం లోనే ఉంది. అశోక చక్రవర్తి, మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గం, రామకృష్ణ పరమహంస చాటిచెప్పిన సర్వమత సామరస్యం మానవజాతి మొత్తం ఒకే కుటుంబంగా అభివృద్ధి చెందడానికి కావలసిన దృక్పథం, స్ఫూర్తి అందులో ఉన్నాయి. మనల్ని మనం సర్వనాశనం చేసుకోకుండా ఉండేందుకు మన ముందున్న ఏకైక ప్రత్యమ్నాయం భారతీయమే. ఈ విషయాలు నానిపాల్కివాలా "ది ప్రైసెలెస్ ట్రెజర్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్" గ్రంథము లోనివి, అట్లాగే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ రెండవ సర్ సంఘ చాలకులు పూజనీయ శ్రీ గురూజీ మానవాళి సమగ్ర వికాసంలోని తొలి దశ భౌతిక వాదం, వికాసం ఎప్పుడూ స్థూలం నుంచి సూక్ష్మానికి సాగుతుంది, అందుకే తొలిదశలో మనిషి భౌతిక వాదం వైపు ఆకర్షితుడై తన శక్తులన్నింటినీ భౌతిక అవసరాలు తీర్చుకునేందుకు ఉపయోగిస్తాడు, ఇంకా కొంచెం పరిణతి చెందిన దశలో భావోద్వేగాలను అర్థం చేసుకొని మానసిక ఆనందం కోసం ప్రాకులాడుతాడు ఈ స్థితిలోనే అతడు కళల పట్ల సంస్కృతి పట్ల ఆకర్షితుడవుతాడు, కళారూపాలను సృష్టించడంలో కళలలో దాగిన సౌందర్యాన్ని గుర్తించడంలోను ఆనందాన్ని పొందడం మొదలు పెడతాడు, విజ్ఞాన శాస్త్రాలనీ, తత్వ శాస్త్రాలనీ అధ్యయనం చేసేందుకు పూనుకుంటాడు. మెల్ల మెల్లగా తన అస్తిత్వ పరమార్ధాన్ని గుర్తించే స్థాయికి ఎదుగుతాడు, ఆ తర్వాత బుద్ధికి కూడా అతీతమైన సూక్ష్మ స్థితిని, సచ్చిదానందాన్ని పొందుతాడు,ఇది మానవుడు పరిణామం చెందే క్రమం, వీటి గురించి ప్రపంచం ఏమీ ఆలోచిస్తుందో మన దేశం ఏమి ఆలోచిస్తున్నదో దీనదయాళ్ ఉపాధ్యాయ సమగ్రంగా ఆద్యయనం చేసి ఆధునిక యుగానికి అవసరమైన ఒక సమగ్ర ఆలోచనను మనకు అందించారు, ఆ అలోచనే "ఏకాత్మ మానవ దర్శనం".
దీనదయాళ్ ఉపాధ్యాయ 1916 సంవత్సరం సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లాలో నగాలచంద్రభాను అనే గ్రామంలో జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు వారి చిన్న వయసు నుండే అద్భుత మేధాశక్తి వెల్లడైంది. వారి జీవితాన్ని దేశానికి సమర్పించిన మొదటి ఘట్టం 1937లో కాన్పూర్ లో డిగ్రీ చదువుతున్నప్పుడు రాష్ట్రీయస్వంసేవక్ సంఘం లో చేరటం, 1942 వ సంవత్సరం సంఘ ప్రచారక్ గా రావటం రెండవ ఘట్టం, 1952 సంవత్సరంలో భారతీయ జనసంఘ్ పార్టీలో ప్రవేశించడం మూడవ ఘట్టం, అనతికాలంలోనే భారతీయ జనసంఘంను జాతీయ పార్టీగా తీర్చిదిద్దిన సంఘటన కౌశల్యం వారిది, ఈ దేశ సమగ్ర వికాసం కోసం తద్వారా మానవ జాతి వికాసానికి నమూనాగా నిలువగలిగే ఏకాత్మత మానవ దర్శనం 1965 సంవత్సరం విజయవాడలో జరిగిన అఖిలభారత జన సంఘం కార్యకర్తల సమావేశంలో వివరించారు అది వారి జీవితంలో నాలుగో ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఆ క్రమంలో వారి ఆలోచనలను కొన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాము.
జీవన సమస్యల మీద ప్లేటో తాత్విక చింతనలను చదివిన వారు కూడా ఎక్కడ మానవ మేధస్సు అద్భుత ఆవిష్కరణలు చేసిందో, అతి ముఖ్యమైన జీవన సమస్యల మీద లోతుగా అధ్యయనం చేసిందో, ఆ భారతీయ తత్వశాస్త్రాలను వారు కూడా అధ్యయనం చేయవలసి ఉంది. మానవ జీవితాలకు గొప్ప పరిష్కారాలను ఎవరు కనుగొన్నారని నన్ను ఎవరైనా అడిగితే నేను భారతదేశాన్ని చూపిస్తాను. ఆక్కడ యూరప్ లో కేవలం గ్రీకుల, రోమన్ల, యూదుల ఆలోచనలతో ఎదిగారు. మనదేశంలో మనం మన అంతరంగ జీవితాన్ని మరింత పరిపూర్ణంగా, విస్తారంగా, విశ్వజనీనంగా, మానవీయంగా మార్చేందుకు, ఈ ఒక్క జన్మకే కాక శాశ్వతత్వాకి అవసరమైన సంస్కారాలను రూపొందించేందుకు కావలసిన వివరణ మన సాహిత్యంలో ఉన్నది. అది ఎక్కడి నుండి పొందగలము అన్న ప్రశ్న ఎవరైనా వేసిప్పుడు కూడా నేను భారతదేశాన్ని చూపిస్తాను, అని నాని పాల్కివాలా చెప్పారు.
పాశ్చాత్య దేశాల ఆలోచనల ఆసమగ్రతను లోతుగా పరిశీలించారు ఠేంగ్డే జీ. పాశ్చాత్య సిద్ధాంతాల అన్నింటిలోనూ ఉన్న ఒక సామాన్య లక్షణం ఏమిటంటే అవన్నీ కూడా ఒక విషయానికి ప్రతిస్పందనలగాను, లేదా ప్రతిక్రియాత్మకంగాను ఏర్పడిన సిద్ధాంతాలు, పోప్ నిరంకుశత్వానికి ప్రతి క్రియగా జాతీయవాదం ఏర్పడితే, రాజ్యం యొక్క విశేష అధికారాలను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యం వచ్చింది, ఆ ప్రజాస్వామ్యము పెట్టుబడిదారీ విధానాన్ని పెంపొందించింది,పెట్టుబడిదారీ విధానానికి ప్రతి చర్యగా సమాజ వాదము[సోషలిజం ], సామ్యవాదం[కమ్యూనిజం] పుట్టుకొచ్చాయి, పైన చెప్పిన మూడు ప్రతిచర్యలు కూడా ఎన్నో సంఘర్షణలకు, రక్తపాతానికి కారణమయ్యాయి. ఏ సిద్ధాంతానికైనా సంఘర్షణలు అనివార్యమని సర్దిచెప్పుకోవచ్చు అయితే అక్కడ ఆ సంఘర్షణలను నివారించటానికి బదులు సంఘర్షణలకు సిద్ధాంత రూపం ఇవ్వడం జరిగింది, జీవ పరిణామమే సంఘర్షణల పరిణామమని ఆ సిద్ధాంతం చెబుతున్నది, డార్విన్ జీవ శాస్త్ర సిద్ధాంతం, హెగెల్ ప్రతిపాదించిన గతితార్కిక వాదం, మార్క్స్ చారిత్రక విశ్లేషణ అన్ని ఆ సంఘర్షణ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకున్నవే, పోటీని, సంఘర్షణను శాస్త్రీయ సత్యాలుగా పెట్టుబడిదారి అర్థశాస్త్రం పరిగణిస్తుంది, పెట్టుబడిదారీ వ్యతిరేక శక్తులన్నిటిని సమీకరించి విప్లవం ద్వారా వర్గ రహిత సమాజాన్ని సాధించాలని కలలు కన్నది కమ్యూనిజం.
ఈ నేపథ్యంలో మానవ జీవితం గురించి దీనదయాళ్ జీ చెప్పిన మాటలు గమనిద్దాం. జీవితంలో చాలా అంశాలు ఒకదానితో మరొకటి కలిసిపోయి ఉంటాయి, ఏ అంశానికి ఆ అంశాన్ని విడివిడిగా మిగతా వాటితో సంబంధం లేకుండా అధ్యయనంచేసి దాని ఆధారంగా మానవ జీవితం మొత్తానికి సంబంధించిన తీర్మానాలు చేయడం సరైన ఫలితం ఇవ్వదు ఇలా అసమగ్రంగా సాగిన ఆలోచనలు, వాటి ఆధారంగా చేసిన సమన్వయాలే పాశ్చాత్య దేశాలలోని చాలా సమస్యలకు మూలకారణం అంటారు దీనదయాళ్ జీ. మనిషి జీవితాన్ని రాజకీయ, ఆర్థిక, సాంఘిక విషయాలు మాత్రమే ప్రభావితం చేయవు, మనిషికి కుటుంబం, జాతి,నమ్మకాలు అతని దేశచరిత్ర, సంస్కృతి సాంప్రదాయాలు, స్నేహితులు, శత్రువుల వంటివి ఎన్నో ఉంటాయి అవన్నీ అతనికి ముఖ్యం,ఈ విషయాలను గ్రహించటంలో కారల్ మార్క్స్ కూడా విఫలమైనాడు అలాగే కుటుంబాలకు దేశాలకు కూడా ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకి ఉంటాయి, ఒక కుటుంబానికి వాళ్ల కులదైవం, ఆచారాలు, సాంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఒక దేశానికి దాని చరిత్ర భౌగోళిక పరిస్థితులు ఆచారాలు, ఆదర్శాలు దానికి ఉంటాయి. వాటన్నిటితో కలిసి ఏర్పడేదే ఒక ప్రత్యేక గుర్తింపు. అలా ప్రతి వ్యక్తికి, కుటుంబానికి, దేశానికి వాటి వాటి పరిధిలో ప్రత్యేకత, శక్తి వాటికి ఉంటాయి. ఐక్యత గురించి ఆలోచించేటప్పుడు ఈ విషయాలన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నిజమైన ఐక్యత ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే ఎవరి ప్రత్యేకతలను వారు నిలబెట్టుకుంటూనే పరస్పరం సహకరించు కోగలిగినప్పుడు మాత్రమే సాధ్యం, దానినే మనం'' భిన్నత్వంలో ఏకత్వం'' అంటాము, అలా కాక భిన్నత్వాన్ని గుర్తించకుండా అన్ని వైరుధ్యాలను అణిచివేయడం ద్వారా లేక నియంత్రించడం ద్వారా ఐక్యత సాధించాలని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం మనం ఆశించిన ఫలితాలను ఇవ్వదు, ఇవ్వకపోగా ద్వేషానికి సంఘర్షణలకు కారణం అవుతుంది, క్రిస్టియానిటీ, ఇస్లాం, కమ్యూనిజం చరిత్రలు దానికి సాక్ష్యం.
ఒక శిశువుకి ఉండే పరిమిత చైతన్య స్థాయి నుంచి సకల మానవాళిని కలుపుకునే స్థితి వరకూ సాగే ఈ ప్రయాణం గురించి దీనదయాళ్ జీ ఇలా వివరిస్తారు "నేను అనే పరిధి, కుటుంబం వంటి వివిధ వృత్తుల మీదుగా ప్రయాణించి సమస్త విశ్వం వరకూ విస్తరించడమే. ఆత్మ జ్ఞానానికి నిదర్శనం ఆత్మ జ్ఞానము గూర్చి అవగాహన ఎంతగా పెరిగితే అంతగా నేను గూర్చి వ్యాపకత పెరుగుతుంది. అయితే ప్రయాణంలో నేను అన్న చైతన్యం పైస్థాయికి సాగుతున్నప్పుడు అంతకు మునుపు దాటి వచ్చిన క్రింది స్థాయిలతో ఘర్షణ ఉండదు అవికూడా ఆ చైతన్యంలో లీనమయివుంటాయి, ఈ సిద్ధాంతం లోని ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్రత్యేకంగా ఏకాంతంగా ఉండే '' నేను'' గురించి చెప్పదు, కొన్ని అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవటం , కొన్ని అంశాలను వదిలివేయడం ఉండదు అన్నిటినీ కలుపుతూ సాగుతుంది, విడివిడిగా చూడటం అంటే కుటుంబంతో కలిపినప్పుడు నేను నీ ప్రేమించి లేకపోవటం, సమాజంతో కలిసినపుడు కుటుంబాన్ని ప్రేమించి లేకపోవడం జరుగుతుంది. సర్పిలాకారము లో అటువంటి విభిన్న ఆత్మలకి స్థానం లేదు, ఉన్నది ఒక్కటే ఆత్మ, ఒకటే నేను, అంటే నాలోని నేను అనే చైతన్యం సమాజం వరకు వ్యాపించినప్పుడు నేను, సమాజాన్ని, కుటుంబాన్ని, నన్ను కూడా ప్రేమిస్తాను, అలాగే సకల మానవాళి తోనూ నన్ను నేను కలుపుకునే స్థాయికి ఎదిగినప్పుడు కూడా నా జాతిని దేశాన్ని నేను ప్రేమిస్తాను. అంతిమంగా విశ్వం తో తాదాత్మ్యం చెందినప్పుడు నేను నా దేశం తో నే ఉంటాను. వ్యక్తి, కుటుంబం, దేశం, సకల మానవాళి ఈ చరాచర సృష్టి చివరికి సర్వవ్యాపకుడైన పరమాత్మ ఇలా అన్ని విభిన్న స్థాయిలలో ఏకకాలంలో తాదాత్మ్యం చెందగలుగుతాను, అదే "ఏకాత్మతా మానవ దర్శనం".
ఒక సాధారణ వ్యక్తిగా మనం ఈ ఏకాత్మ మానవతా సిద్ధాంతం మొత్తాన్ని ఒకేసారి అర్థం చేసుకోవటం ,చేసుకున్న దానిని ఆచరించడం కష్టం కావచ్చు, కొద్ది కొద్దిగా అర్థం చేసుకొనే ప్రయత్నం చేయాలి అంచెలు అంచెలుగా మన ప్రయాణం సాగాలి. --రాంపల్లి మల్లికార్జున్.
Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.
Deendayal Upadhyaya, Pandit Deendayal Upadhyaya, Antyodaya, Jan Sangh founder, Bharatiya Janata Party history, Integral Humanism, political philosophy, economic ideology, philosopher, Hindu thought, Pandit Upadhyaya life, social equality, Indian political leader, Upadhyaya ideas