Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

అయోధ్య రామ జన్మభూమి శంకుస్థాపన భావోద్వేగ క్షణాలు - ఆకారపు కేశవరాజు, విశ్వహిందు పరిషత్

అయోధ్యా మథురా మాయా కాశి కాంచి అవంతికా పూరీ ద్వారావతీ చైవ సప్తైతాన్ మోక్షదాయికా   మోక్షము నిచ్చెడు ఏడు నగరాలలో మొదటిది అయోధ్య. అయోధ్యా నగ...


అయోధ్యా మథురా మాయా కాశి కాంచి అవంతికా పూరీ ద్వారావతీ చైవ సప్తైతాన్ మోక్షదాయికా మోక్షము నిచ్చెడు ఏడు నగరాలలో మొదటిది అయోధ్య. అయోధ్యా నగరాన్ని దేవతలు నిర్మించారని ఇది స్వర్గపురి అని అధర్వణవేదం తెలియజేస్తున్నది. బ్రహ్మ మానస పుత్రుడు మనువు సరయు నది ఒడ్డున నిర్మించిన పట్టణమని రామాయణం తెలియజేస్తున్నది. అతడి కుమారుడు ఇక్ష్వాకు అయోధ్య రాజధానిగా కోసల రాజ్యాన్ని పాలించాడు. ఈ వంశానికే చెందిన పృధువు అనే రాజు వలన ఈ భూమికి పృధ్వి అనే పేరు వచ్చిందని చెబుతారు.

సత్యవాక్పరిపాలనకు ప్రసిద్ధి చెందిన హరిశ్చంద్రుడు. ఆయన తన సత్యవాక్కుతో వంశ ప్రతిష్టను ఇనుమడింప జేశాడు. వీరందరూ సూర్యవంశానికి చెందిన వారుగా ప్రసిద్ధికెక్కారు. గంగను భువికి దించిన భగీరధుడు అయోధ్యా రాజ్య విస్తరణ చేసిన రఘు మహారాజుల కీర్తి కూడా ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. రఘుమహారాజు పాలనానంతరం  సూర్యవంశాన్ని రఘువంశం అని కూడా పిలిచేవారు. అదే వంశములో జన్మించిన దశరధ మహారాజు రాజధాని కూడా అయోధ్య పట్టణమే. దశరధ మహారాజుకు అనేక పూజల ఫలితంగా కలిగిన సంతానమే శ్రీరాముడు. అయోధ్యలో జన్మించి అయోధ్య పట్టణమే రాజధానిగా చేసుకొని శ్రీ రాముడు చాలాకాలం రాజ్య పరిపాలన చేశారు. వారి ఆదర్శవంతమైన పాలనా కాలాన్ని రామరాజ్యం అన్నారు.

శ్రీరాముని అనంతరం ఆయన పెద్ద కుమారుడు కుశుడు రాజయ్యారు శ్రీరాముడి పరిపాలనాకాలం యొక్క విశేషాలను తదనంతర కాలంలో ప్రచారం చేసి రామరాజ్యాన్ని కొనసాగేలా పరిపాలన చేశారు అదే సమయంలో శ్రీరామచంద్రుడు జన్మించిన చోట 10 వేల ఎకరాల స్థలంలో భవ్యమైన శ్రీ రామమందిరం నిర్మాణం చేశారు ఇలా యుగాలు గడిచిపోయాయి. ఇప్పటి మన  కలియుగం ప్రారంభమైంది, రాచరికపు వింత పోకడలు, అనాగరిక రాక్షస జాతుల శక్తి పెరిగి మళ్లీ బీభత్సం సృష్టించడం మొదలుపెట్టాయి, ధర్మదేనువు ఒకే పాదంపై  నిలిచి ఉన్న పరిస్థితి ప్రజలకు ప్రాణసంకటంగా పరిణమించింది. ధార్మిక క్రతువులు, గోపూజలు నిర్వహించే భూభాగాలు గోమాతల రక్తంతో, సజ్జనుల హత్యలతో పాపం పెరిగిపోయింది, అఖండమైన భారతదేశ భూభాగాలు కుంచించుకు పోయాయి, ధర్మాన్ని బోధించే ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి, ఈ క్రమంలోనే అయోధ్యలో రామజన్మభూమి మందిరాన్ని బాబర్ అనే విదేశీ ముష్కరుడు తన సైన్యాధిపతి 'మీర్ భక్షి' చేత విధ్వంసం చేయించాడు.

ఇదే రాక్షస జాతి ప్రజలకు విద్యాబుద్ధులను  అందించే గురుకులాలను కూడా కాల్చి బూడిద చేశారు. స్త్రీ మూర్తులను అవమానించారు, అఖండ భారతాన్ని ముక్కలు చేశారు. ముక్కలైన భూభాగాలన్నింటిలో ఇదే దారిద్ర్యం తాండవం చేస్తున్న స్థితి దాపురించింది. దోపిడీలు దొంగతనాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పెద్దలుగా వ్యవహరించబడే వాళ్లలో చాలామంది విదేశీయుల చేతులో కీలుబొమ్మలుగా మారి స్వజాతి నియమాలు మరిచిపోయారు, మతం మారిపోయారు విచ్చలవిడితనం పెరిగిపోయింది.

ఈ స్థితిని మార్చడం కోసం చేసిన ప్రయత్నాలు, అనేక మంది నాయకులు దేశభక్తుల రక్త తర్పణాలు, ప్రాణార్పణలు, బలిదానాల అనంతరం స్వతంత్ర్యం ప్రాప్తించింది. తదనంతర భారతం ధార్మిక భావాలున్న నాయకుల నేతృత్వంలో మళ్లీ రామరాజ్యమే మాలక్ష్యం అంటూ భారతరాజ్యాంగంలో రాసుకొన్నాము. అనేక ఆటంకాలు ఎదురయ్యాయి, స్వదేశీయుల ముఖాలను ముందు పెట్టి విదేశీయులే మన దేశపు పగ్గాలు  చేతబట్టి  తమ ప్రాబల్యం చూపిస్తూ మన జాతిని అణచివేసే ప్రయత్నం చేస్తుంటే అది సహించని  హిందువులు అనేక ఉద్యమాలు పోరాటాలు చేస్తూనే ఆటంకాలన్నింటినీ అధిగమించి రామరాజ్యం సాధించడం కోసం ప్రతినబూనారు.

ఆ క్రమంలోనే పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం విధ్వంసం చేయబడిన అయోధ్య శ్రీరామ మందిరాన్ని పునర్నిర్మాణం చేయడం ద్వారా రామరాజ్యాన్ని సాధించాలని ఆలోచనాక్రమం. "అనేక దశల్లో 76 సార్లు జరిగిన పోరాటాలలో కొన్నిసార్లు విజయాలు అనేకసార్లు అపజయాలు, నాలుగు లక్షల మందికి పైగా హిందూ వీరులు బలిదానమై నేల కొరిగారు" అయినా మన జాతి సంకల్పాన్ని వీడలేదు.

చివరిపోరాటం: 1983వ సంవత్సరం ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ లో జరిగిన హిందూ సమ్మేళనం, భారతదేశానికి రెండు సార్లు ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరించిన గుల్జారీలాల్ నందా గారు పాల్గొన్నసభలో ఆ రాష్ట్రప్రభుత్వ క్యాబినెట్ మంత్రిగా ఉన్న "దావూదయాళ్ ఖన్నా" గారు  రామజన్మభూమి మందిర విముక్తి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఈ విషయాన్ని పట్టించుకోని అప్పటి కాంగ్రెస్ పార్టీ పోకడను గ్రహించి పార్టీ సభ్యత్వానికి మంత్రి పదవికి రాజీనామా చేసి, విశ్వహిందూ పరిషత్ తో కలిసి ధార్మిక స్థలాల విముక్తికోసం రామజన్మభూమి ముక్తి యజ్ఞ సమితి,  అనంతరం మహంత్ అవైద్యనాథ్ గారు అధ్యక్షులుగా  శ్రీదావూదయాళ్ ఖన్నా గారు కార్యదర్శిగా "రామజన్మభూమి న్యాస్" ప్రారంభించడం జరిగింది. అక్కడి నుండి ప్రారంభమైన చివరిదశ ఉద్యమాన్ని 1984 సంవత్సరం నుండి విశ్వహిందూ పరిషత్ ఉద్యమ పగ్గాలను చేతబూని గతంలో జరిగిన అనుభవాలను అపజయాలను పరిశీలించి  ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతం వాళ్లు వెళ్లి  అయోధ్య విముక్తి చేసిన  చరిత్రను చూసి పాఠం నేర్చుకుని  ఆసేతు హిమాచలం  ఒక్కసారిగా ఉద్యమించాలని  అనేక కార్యక్రమాలు రచించి దేశ ప్రజలందరినీ ఒక్కతాటిపై తెచ్చి సాగించిన పోరాటం విజయపథాన సాగింది. నిరంతర సంఘర్షణలు, ఒత్తిడులు జరుగుతున్నప్పటికీ హిందూసమాజం యొక్క విజయం మాత్రమే కోరుకున్న వారైనందున దీర్ఘకాలికమైన పోరాటానికి సిద్ధపడి వ్యూహాత్మకమైన ఎత్తుగడలు అనేక పద్ధతులలో పోరాటాలు చేస్తూ వచ్చిన కారణంగా 492 సంవత్సరాలుగా హిందూ జాతి జరుపుతున్న పోరాటానికి విజయం లభించింది.

రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు: భారత అత్యున్నత న్యాయస్థానం  2019 నవంబర్ లో సర్వ సమ్మతితో రామజన్మభూమిలో శ్రీరామమందిర నిర్మాణం కోసం ఒక కమిటీని నిర్మాణం చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరుసటి నెలలోనే 15 మంది సభ్యులతో "రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్" నిర్మాణం చేయడం, 13 మంది సభ్యులను కూడా ఎన్నుకొని ప్రకటించడం అనంతరం ఈ 13 మంది సభ్యులు మరో ఇద్దరు సభ్యులను ఒకరు అయోధ్యకు చెందిన శ్రీ నృత్యగోపాల్ దాస్ గారు అధ్యక్షులుగా మరొకరు విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షులైన శ్రీ చంపత్ రాయ్ గారిని కార్యదర్శులుగా ఎన్నుకోవడం జరిగింది . ప్రజల నుండి నిధులు సేకరించడం ద్వారా రామ జన్మభూమిలో మందిర నిర్మాణానికి సమ్మతిని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం తమ వంతుగా "ఒక రూపాయిని" ఇచ్చి పని ప్రారంభించాల్సిందిగా  ట్రస్ట్ ను కోరింది.

అప్పటికే రామజన్మభూమి న్యాస్ పేరుతో ఖరీదు చేసిన భూమి మరియు గతంలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం మందిరం కోసం ఇచ్చిన భూమిని కలుపుకొని, ఎనిమిది కోట్ల కుటుంబాల నుండి, కుటుంబానికి ఒక రూపాయి 25 పైసలు చొప్పున దేశం నలుమూలలనున్న ప్రజల నుండి సేకరించిన ధనంతో చెక్కబడిన శిల్పాలు,  2 లక్షల 80 వేలకు పైగా గ్రామాల నుండి సేకరించిన రామ శిలలను, మరియు సేకరించిన ధనంలో శిల్పాల తయారీకయిన ఖర్చు పోగా మిగిలిన ధనాన్ని మొత్తం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అప్పగించడం జరిగింది.

అనేకమార్లు సమావేశాలు జరిపి రామజన్మభూమి మందిరాన్ని త్వరగా నిర్మించాలని తలంపుతో 1992 డిసెంబర్ 6వ తేదీ రోజున బాబర్  కట్టడాన్ని తొలగించి అదే స్థలంలో గుడ్డతో నిర్మించిన బాల రాముడి తాత్కాలిక మందిరం నుండి భవ్య మందిరం నిర్మించే వరకు చెక్కతో కట్టిన మరో తాత్కాలిక మందిరంలోకి ఉగాది రోజున మహంత్ యోగి ఆదిత్యనాథ్ గారి చేతుల మీదుగా తన ముగ్గురు సోదరులు తో కూడిన బాల రాముని మూర్తులను  తిరిగి ప్రతిష్టాపన చేయడం జరిగింది. వెనువెంటనే ప్రస్తుతం ట్రస్ట్ ఆధీనంలో ఉన్న 77 ఎకరాల భూభాగాన్ని సమతలం చేసే పనిని కూడా  ప్రారంభించడమైనది. ఈ క్రమంలోనే అనేక పురాతన శిల్పాలు శివలింగము స్తంభాలు లభించాయి.

1989లో కామేశ్వర్ చౌపాల్ గారి ఆధ్వర్యంలో శిలా న్యాసము జరగగా, 2020 ఆగస్టు 5వ తేదీన భారత ప్రధాని చేతుల మీదుగా భూమిపూజ జరిపి రామజన్మభూమిలో బాలరాముడు ( రామ్ లలా) కు భవ్య మందిరాన్ని కట్టడం ప్రారంభించాలని నిర్ణయం జరిగింది.

అయోధ్యా కరతీహై ఆహ్వాన్ ఛలో, కరో మందిర్ కా నిర్మాణ్: అనుకున్నట్లుగానే భారత ప్రధానమంత్రిని మరియు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ పరమపూజనీయ శ్రీ మోహన్ భాగవత్ గారిని ఆహ్వానించారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి దాదాపు  అన్ని ప్రముఖ భాషలు మాట్లాడే వారు మరియు బౌద్ధ జైన సిక్కు వైష్ణవ శైవ గాణాపత్య, ప్రకృతి ఆరాధకులు వంటి అన్ని ఆరాధనా పద్ధతుల ప్రముఖులను ఆహ్వానిస్తూ సందేశాలు వెళ్ళాయి. కరోనా మహమ్మారి కరాళరూపం ఒకవైపు భయపెడుతున్నా, మరోవైపు ఉత్సాహంతో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇలా జాతి ఏకత్వానికి ప్రతీకగా రామజన్మభూమి మందిరం ఉండబోతున్నదనే సంకేతం ప్రపంచ ప్రజల్లోకి వెళ్లి పోయింది.

అదిగదిగో అయోధ్యాపురి మహిమాన్విత మను నిర్మిత నగరి: అని తలుస్తూ పిలిచిన వారందరూ బయలుదేరి వస్తున్నట్లు సమాచారం అందింది. భూమి పూజ కార్యక్రమంలో ఉపయోగించడానికై అప్పటికే దేశంలోని అన్ని ప్రముఖ నదులనుండి, సముద్రాల నుండి సేకరించిన పవిత్ర జలాలు మరియు పవిత్ర స్థలాలు, పుణ్యక్షేత్రాల నుంచి సేకరించిన పవిత్రమైన మృత్తిక దాదాపు దేశంలోని అన్ని జిల్లాల నుండి వచ్చి చేరాయి.

జార్ఖండ్ రాష్ట్రం నుండి మొదట 11 పవిత్ర నదుల నుండి 11 పవిత్రమైన పుణ్యక్షేత్రాలు నుండి సేకరించాలని అనుకోగా, ఎస్టీలుగా పేర్కొనబడే అనుసూచిత జనజాతి సమూహాలు పవిత్ర క్షేత్రాలుగా భావించే "సర్నాస్థల్" నుండి కూడా పవిత్రమైన మట్టిని సేకరిస్తామని ప్రకటించగానే,  క్రైస్తవులుగా మారిన అనేకమంది మేము హిందువులం కాదు 'సర్నాస్థల్' నుండి మట్టిని సేకరించడానికి వీలులేదు. మమ్మల్ని వేరే జాతిగా చూడండి, మమ్మల్ని హిందువులుగా మార్చకండి అంటూ విశ్వహిందూ పరిషత్ యొక్క దిష్టిబొమ్మలను తాలూకా స్థాయిలో అనేక చోట్ల దగ్ధం చేయడం ప్రారంభం చేశారు. ఇది గమనించిన హిందూ పద్ధతిలో జీవనం కొనసాగిస్తున్న గిరిజన సమూహాలు విజృంభించి రామయ్య గుడి కట్టడానికి మా ఊరు నుండి కూడా మట్టిని పంపిస్తున్నామంటూ ఉత్సాహంతో రెండు వేల ఒక వంద గ్రామాల 'సర్నాస్థల్' ల నుండి సేకరించి రాజధాని నగరం రాంచీకి పంపించారు అట్టి పవిత్ర మట్టిని తీసుకుని జూలై 30న అయోధ్యకు వెళ్లి అప్పగించడమే కాకుండా గిరిజన సమూహాలు అధికంగా కలిగిన జార్ఖండ్ రాష్ట్రము నుండి ప్రాతినిధ్యం వహించేటట్లుగా భగవాన్ బిర్సాముండా వారసులైన 'శ్రీమాన్ ధనేశ్వర్ ముంఢా'  గారిని కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా  ఆహ్వానించడం, దానికి ఆహ్వానపత్రం తయారుచేసి తీసుకు వెళ్లడం జరిగింది.

రామమందిర భూమిపూజ సౌరంభం: ఆగస్టు 3వ తేదీ నాటికే అనేకమంది స్వామీజీలు పెద్దలు వచ్చి చేరారు. విశ్వహిందూ పరిషత్ పెద్దలు కార్యాధ్యక్షులు శ్రీఆలోక్ కుమార్ జీ మహామంత్రి శ్రీ మిలింద్ పరాండేజీ అంతకుముందు నుండే అయోధ్యలోనే ఉన్న శ్రీచంపత్ రాయ్  గారు కార్యక్రమ ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా, ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ శ్రీ అశోక్ తివారీ గారు మొదలైనవారు వచ్చిన వారిని స్వాగతించే పనిలో ఉన్నారు. వివిధ ఆశ్రమాలు, ధర్మశాలలు, సత్రాలలో దేశం నలుమూలల నుండి వచ్చిన వారికి వసతి కల్పించడం కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు జరిగాయి.

విశ్వమంతా మరో దీపావళి: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి చొరవతో జూలై 20వ తేదీ నుండే అయోధ్య నగరాన్ని శుభానికి  సంకేతమైన పసుపుపచ్చ రంగు వేసి అలంకరించారు. రంగురంగుల ధార్మిక, రామాయణ  చిత్రాలను కన్నుల పండువగా  చిత్రీకరించారు. ఆగస్టు 1వ తేదీ నాటికి అయోధ్య నగరమంతా  వినిపించేటట్లు  ధ్వని వ్యవస్థ ఏర్పాటు చేశారు. మూడవ తేదీ నాటికి వీధులలో కూడా పసుపు పచ్చని తోరణాలు, పసుపు రంగు వస్త్రాలతో అలంకరించారు. అయోధ్యకు  చేరే ప్రతి దారినీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి అలంకరించారు. ప్రతి ఇంటిపై కాషాయపు జెండాలు ఎగురుతున్నాయి. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామమందిర నిర్మాణానికి  తమ ప్రాణాలనిచ్చి తమ సర్వస్వాన్నిచ్చి బలిదానమైన  నాలుగు లక్షలకు పైగా  ధర్మ రక్షకులను, కరసేవకులను గుర్తు చేసుకుంటూ ఆగస్టు 4 వ తేదీ, అయోధ్య నగరంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5వ తేదీ నాడు సాయంత్రం  దీపోత్సవం నిర్వహించాలని పిలుపునిచ్చింది.

4వ తేదీ నాడు అయోధ్యా నగర ప్రజలు ఉప్పొంగిన ఉత్సాహంతో త్రేతాయుగంలో వనవాసం పూర్తి చేసుకొని రావణ సంహారం గావించి,  సీతమ్మతో కూడి లక్ష్మణ హనుమత్  సమేతులై పుష్పక విమానంలో  అయోధ్య చేరుకున్న శ్రీరాముని స్వాగతించినప్పటి ఆనందకర దీపావళి గుర్తుకు వచ్చింది. ఆనాటి గుర్తుగానే ఇప్పటికీ దేశమంతా ప్రపంచమంతా దీపావళి పండుగ జరుపుకుంటూనే ఉందికదా అలాంటి దీపావళి మళ్లీ జరుపుకుంటున్నారు. రామయ్యకు  గుడి కట్టించ పోతున్నాము అనే ఆనందంతో అయోధ్య నగరంలోని ప్రతివీధి, ప్రతిఇల్లు, ప్రతిగుడి దీపాల మయమైపోయాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యొక్క సహకారంతో సరయూనది తీరంలో, వివిధ ఘాట్ లలో లక్షల దీపాలను వెలిగించడమే కాక వీధులలో రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రపంచాన్ని అబ్బుర పరిచారు.
ఇది ఇలా ఉండగా ఐదవ తేదీ నాడు జరగబోయే భూమి పూజనాడు బాలరాముడికి కైంకర్యము, భక్తులకు ప్రసాద నిమిత్తం ట్రస్ట్ ఒక లక్ష లడ్డూలను తయారు చేయించగా అయోధ్యలోని సుమారు ఐదు వేల దేవాలయాలు దేశ వ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ప్రసాదాలు తయారు చేయించాయి.

బాల రాముడికి తిరుపతి లడ్డు: బాల రాముడికి 5వ తేదీ నాడు భోగం నిర్వహించడానికి తిరుపతి నుండి వచ్చిన ప్రసాదాలు చేయడంలో సిద్ధహస్తులైన పదిమంది మా బీహార్లోని పాట్నా పట్టణంలో ఉన్న మహావీర్ మందిర్ ఆధ్వర్యంలో సంచలిత మవుతున్న అయోధ్యలోని మరో మందిరంలో సుమారు 25000 పైగా తిరుపతి లడ్డూలు తయారు చేయించి దేశవ్యాప్తమైన భక్తులకు ప్రసాదంగా పంపారు. ఇక 5వ తేదీ నాటి భూమిపూజ కోసం సమతలంగా చేయబడిన రామజన్మభూమి భూభాగాన్ని చక్కగా అలంకరించి గుడారాలు వేసి కరోనా మహమ్మారి ప్రకోపం దృష్టిలో పెట్టుకొని దూరదూరంగా కూర్చోవడం కోసం ఏర్పాట్లు, సానిటేషన్ మరియు వచ్చిన వారందరినీ పరీక్షించడం కోసం ఆహ్వానితులైన వారందరికీ, వారి శిష్యులకు రక్షకులకు వసతి భోజన ఏర్పాట్లు చక్కగా చేశారు.

4 వ తేదీ దీపోత్సవం దర్శించడానికి అయోధ్యా నగర వీధుల్లోకి, అనంతరం  సరయునది  ఒడ్డున  ఉన్న ఘాట్ ల వద్దకు వెళ్ళిన మాకు అక్కడి దృశ్యాలను చూసేందుకు రెండు కన్నులు సరిపోలేదు. మనసంతా అనిర్వచనీయమైన ఆనందం మాటిమాటికి వినిపిస్తున్న జయ కారాలు పులకింప జేస్తున్నాయి తిరిగి వస్తున్న మాకు రేపు జరగబోయే కార్యక్రమం ఎలా ఉండబోతుందో అన్న ఉత్సుకత, దేశ విదేశాల నుండి వస్తున్న మిత్రుల పలకరింపులు అయోధ్యలో ఉండడమే భగవంతుడిచ్చిన గొప్ప అవకాశంగా భావించుకుంటూ వసతి చేరుకున్నాము.
   
ఆగస్టు 5వ తేదీ: ఎదురు చూస్తున్న ఆగస్టు 5వ తేదీ బుధవారం రానే వచ్చింది ఉదయం నాలుగు గంటలకు "కౌసల్య సుప్రజ రామ" అంటూ ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గానం చేసిన సుప్రభాతం వింటూ భగవాన్ శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో శ్రీరామున్ని నిద్ర నుండి మేమే మేల్కొలుపుతున్నామనే అనుభూతి ఆనందంలో తెల్లవారింది. అయోధ్యలో బాల రాముడికి భవ్య మందిరం నిర్మాణం ప్రారంభమైన రోజు, లక్షలమంది బలిదానం అయిన ధర్మ వీరుల ఆత్మలు  అయోధ్యను వీక్షిస్తున్న రోజు, కోట్ల మంది రామ భక్తులు ఎదురు చూస్తున్న రోజు నా అదృష్టం కొద్దీ 4వ తేదీ ఉదయానికే చేరుకున్నాము.  అప్పటికే పరిషత్ అధికారులతో పాటు 1984 నాటి ధర్మ సంసద్ జరిగి ఉద్యమం మొదలైనప్పటి  నుండి రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్న మహానుభావులు యుగపురుష్ పరమానందజి, దీదీమా సాధ్వీఋతంభర గారు, పూజ్య అవదేశానందగిరి మహరాజ్, పూజ్యముని చిదానందజి మహారాజ్, పూజ్య రామభద్రాచార్యజీ, పూజ్యశ్రీ గోవింద దేవగిరిజి, స్వామి రాందేవ్ జి, సాధ్వీ ఉమాభారతిజీ, ఢిల్లీ వాల్మీకి మందిర్ పూజ్య శ్రీకృష్ణ విద్యార్థిజీ, ఉజ్జయిని వాల్మీకి క్షేత్రం నుండి వచ్చిన పూజ్య బాలయోగి ఉమేషానాథ్ జీ, వంటి మహామహులు ఉన్నారు.

మరోచోట దక్షిణాది తెలంగాణ  ప్రాంతం నుండి  పూజ్యులు సంగ్రామ్ మహారాజ్ మరియు  పూజ్యులు శివస్వామి గారు, తమిళనాడు రామేశ్వరం నుండి కూడా వచ్చారు, మహారాష్ట్ర ప్రాంతంలోని  వర్కరీ సంప్రదాయ పెద్దలను కలుపుకుని మొత్తం 36 ఆరాధనా విధానాలకు చెందిన 184 మంది పూజ్య స్వామీజీలు వచ్చి చేరుకున్నారు. వివాహ సమయంలో పెళ్లికూతురుకు పసుపు బట్టలను కట్టించినట్లుగా అయోధ్య నగరంలోని మొత్తం భవనాలు పసుపు రంగులోకి మారిపోయాయి. ఆ దృశ్యాలను చూస్తూ చూస్తూ గొంతు గద్గధమై పోతున్నది అప్పుడప్పుడు మాట ఆగిపోతున్నది, మాటిమాటికీ శరీరం పులకరిస్తున్నది. అప్పుడప్పుడు కంపిస్తున్నది. అసంకల్పితంగానే కళ్ళనుండి  ఆనందభాష్పాలు రాలుతున్నాయి, ఒక్కొక్కప్పుడు కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. అద్భుతమైన దివ్యానుభూతికి లోనవుతున్నాను అప్పుడప్పుడు నిలుచున్న చోటనే కళ్ళు మూసుకుపోతున్నాయి. ఈ అనుభూతి కేవలం నా ఒక్కడికేనా అనుకుంటూ చుట్టూ చూసిన నాకు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట్లయ్యిందీ అక్కడ చేరిన వందలాదిమంది నాలాంటి అనుభూతికి లోనైనట్లుగానే కనిపిస్తున్నది. కొంతమంది తనను తాను మరచి నృత్యాలు చేస్తున్నారు నడవడం మాని ఎగురుతూ వెళ్తున్నారు. నాలుగు వైపుల నుండి ఉత్సాహాన్ని ఉద్రేకాన్ని కలిగించే "జైశ్రీరామ్" నినాదం దానితోపాటు సీతమ్మ వారిని  గుర్తు చేసుకుంటూ "జై జై సియారామ్" అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి.

ఆహ్వానితులను తీసుకొని వాహనాల కాన్వాయ్ బయలుదేరింది. ప్రముఖులు వివిధ స్థలాల్లో ఏర్పాటు చేసిన తమ వసతుల నుండి బయలుదేరి ఒక్కరొక్కరుగా వాహనాలు కాన్వాయ్ లో కలుస్తున్నాయి. సురక్షాదళాల మధ్య రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆఫీస్ ఎదురుగా ఒక్కొక్క వాహనాన్ని ఆపి ఆహ్వానితులను సగౌరవంగా ఆహ్వానిస్తూ వారికి శానిటైజర్ లు అందించి వారి ఉష్ణోగ్రతను పరీక్షించి ఒక్కరొక్కరుగా భూమిపూజ మండపం లోకి వెళ్ళేటట్లు చక్కటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఉద్దండులైన మహాత్ములందరూ  ఒక్కరొక్కరుగా వస్తుంటే  మనసు ఉప్పొంగి పోతున్నది ఒక్క మహాత్ముని దర్శించుకోవడానికే అవకాశం కోసం రోజుల తరబడి వేచి చూడాలి కానీ, కానీ ఇంత మంది మహాత్ములు ఒక్క చోటనే ఒకరి తర్వాత ఒకరు  వెళ్తుంటే  వారి యొక్క పాదాలను సృష్టించి  ఆశీస్సులు పొందాలని  నా మనసు ఎంతగా ఆరాట పడిందో, కనీసం వారి పాదధూళి అయినా సోకాలనీ ఎంతగా ఆనంద పడిపోయిందో.

ఉదయం 11 గంటల వరకు మాతో వచ్చిన  ఆహ్వానితులతోపాటు అందరూ లోపలికి వెళ్లారు. లోపల మండపంలో సాధువులు కుడివైపున, మిగిలిన వారు ఎడమవైపున కూర్చున్నారు. మా పని పూర్తయింది నేను బయటికి వచ్చేశాను. వాహనాలను పార్కింగ్ లో పెట్టి ఆ పక్కనే ఉన్న మందిరంలో కూర్చున్నాము. ప్రధానమంత్రి మరియు యోగి ఆదిత్యనాథ్ గారు కలిసి వస్తున్నట్లు సమాచారం అందింది ఆ వెనువెంటనే వారు రావడం మొదట హనుమాన్ గడి వెళ్లి ప్రదక్షిణలు చేసి హనుమంతుడి ముందు చేతులు జోడించుకొని నిలుచున్నారు, పూజలు పూర్తయ్యాయి మందిరము లోని మూలవిరాట్టుకు ఎదురుగా ఉన్న మండపంలో కూర్చుండబెట్టి మందిర సంప్రదాయం ప్రకారం అర్చక మహాశయులు ప్రధానికి తలకు పట్కా చుట్టి ఆశీర్వచనాలు కావించారు. ఆ సమయంలో మాస్కు పెట్టుకొని కూర్చున్న ప్రధానమంత్రి అచ్చంగా హనుమంతుని వలే కనిపిస్తున్నాడు అంటూ మెసేజ్ ల మీద మెసేజ్ లు వస్తున్నాయి.

అక్కడి నుండి బయలుదేరిన ప్రధాని నేరుగా "రామ్ లలా విరాజ్ మాన్" (శ్రీ బాల రాముడి ) వద్దకు వచ్చి 'సాష్టాంగ నమస్కారం చేశారు' చేతులు ముందుకు చాచి మొత్తం శరీరం నేలపై తాకిస్తూ సంపూర్ణ సమర్పణ అంటూ భావం కలిగిన స్థితిలో ప్రణామాలు అర్పిస్తూ ఉన్నారు, అనంతరం లేచి నిలుచుని చేతులు జోడించి  భావగర్భితంగా శ్రీరామచంద్రమూర్తి ముందు నిలుచున్న భారత ప్రధాని శ్రీవిభుణ్ణి ఏమి కోరుకుంటున్నట్లు అని నా మనసులో అనిపించింది వారు ఖచ్చితంగా 'భారతదేశ పరమ వైభవ స్థితిని' కోరుకుని ఉంటారనిపించింది.

'విజేత్రీచ నసంహతాకార్య శక్తిర్' - విశ్వమంతా ఒక్కటై వచ్చినా గెలవలేని శక్తివంతమైన దేశంగా మన దేశం నిలవాలని రాజ్యాంగంలో కోరుకున్నట్లు దేశంలో రామరాజ్యం వంటి పాలన కోరుకొని ఉంటాడనిపించింది. వారి సంకల్పానికి భగవంతుడి ఆశీర్వాదం కూడా లభించే ఉంటుంది, "అయోధ్య రాముడి దర్శనం కోసం వచ్చిన మొట్టమొదటి భారత ప్రధాని మరి". బాల రాముని దర్శనం అనంతరం అందరూ నిర్మాణ స్థలం వైపు వచ్చి కూర్చున్నారు అయోధ్య ఉద్యమ రథసారథి అశోక్ సింగల్ గారి అన్న గారి కుమారుడు మొదటి నుండి ఉద్యమ భాగస్వామి శ్రీసలీల్ సింగల్ ధర్మపత్ని సమేతంగా వచ్చి కార్యక్రమ యజమానులుగా కూర్చున్నారు. శాస్త్రబద్ధంగా గోవింద గిరి మహారాజ్ కనుసన్నలలో పూజాదికాలు పూర్తయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మందిర నిర్మాణార్థం భూమి పూజ చేసి మొదటి ఇటుకను సమర్పించారు.

స్వర్గంలో 76 యుద్ధాల్లో పాల్గొన్న దర్మ వీరులు బలిదానమైన నాలుగు లక్షలకు పైగా అమరవీరులు, మరియు చివరి దశ ఉద్యమానికి నాయకత్వం వహించిన మహాత్ములు పూజ్యులు అశోక్ సింగల్ గారు మహంత్ వైద్యనాథ్ గారు పూజ్య వాందేవ్ జి మహారాజ్, పూజ్య దేవరహ్ బాబా, శ్రీ రామచంద్ర దాస్ పరమహంస శ్రీ మోరోపంత్ పింగలే, పరమ పూజనీయ  బాలా సాహెబ్ జి  మాననీయ శేషాద్రి జి మరియు మన పుల్లారెడ్డి గారు, మాననీయ చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శ్రీమాన్ ముదిగంటి మల్లారెడ్డి గారు, వంటి మహామహుల ఆత్మలు తరించిపోయి ఉంటాయి. ఈ సందర్భంలో ఆ మహనీయులందరూ గుర్తుకు వస్తున్నారు.
         
అవని పులకరించింది ఆకసం పూలు కురిసింది, అయోధ్యలో రామునిగుడి భూమిపూజకై విశ్వమంతా హర్షం  వెలిబుచ్చింది: తన జన్మ స్థలమైన అయోధ్యలో తను పరిపాలించిన అయోధ్యలో తను ఉండడానికి కట్టిన మహా మందిరాన్ని విధ్వంసం చేసి ముష్కరులు నా రాముడికి నిలువ నీడ లేకుండా చేశారని మనసంతా విలవిలలాడి పోయింది 1992 నుండి రామయ్యకు వర్షం ఎండ చలినీ టెంట్ క్రిందనే ఉండి ఎలా భరించాడో అనిపించింది. ప్రధానమంత్రి వేసిన పునాది రాయి నా ఆలోచనలకు  స్వస్తి పలికినట్లయింది. భరోసా ఇచ్చినట్లయింది. ప్రధానమంత్రి  మరియు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సరసంఘచాలకులు శ్రీ మోహన్ భాగవత్ గారు వేదిక వైపు కదిలారు మధ్యలో సాదు మహాత్ములకు  వినమ్రతా పూర్వకంగా ప్రణామాలు సమర్పిస్తూ వేదికపైకి వచ్చి అప్పటికే వచ్చి కూర్చున్న శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర అధ్యక్షులు పూజ్యులు మహంత్ నృత్య గోపాల్ దాస్ గారికి నమస్కరించి ఆశీస్సులు తీసుకుని వేదికపై ఆశీనులయ్యారు.

తీర్థ క్షేత్ర కార్యదర్శి  శ్రీ చంపత్ రాయ్ గారు ఆహ్వానించగా మొదటగా మాట్లాడిన శ్రీ మోహన్ భాగవత్ గారు అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం పరమ పూజనీయ బాలా సాహెబ్ దేవదాస్ గారు సుదీర్ఘకాలం పోరాటం చేయాలని చెప్పారని గుర్తు చేశారు. శ్రీరాముడికి భవ్యమందిరం కాబోతున్నది అటువంటి భావనతో మరో మందిరాన్ని మన మనస్సుల్లో నిర్మాణం చేసుకుందాం, భారతదేశంలో రామరాజ్యాన్ని స్థాపించే పని సమాజం యొక్క అకుంఠిత దీక్ష మరియు వ్యక్తిగత  సామూహిక సాధన వలననే సాధ్యం, అటువంటి సాధనను మనందరం కొనసాగిద్దాం అంటూ పిలుపునిచ్చారు.
         
అనంతరం భారతప్రధాని నరేంద్ర మోడీ గారు మందిర నిర్మాణంకోరకు ప్రయత్నించిన వారందరికీ  130 కోట్ల మంది దేశప్రజల  తరుపున  వందనాలు  అర్పించారు. నేడు రామజన్మభూమి విముక్తం అయ్యిందని ప్రకటించారు. రామజన్మభూమి తీర్పు వచ్చిన సమయంలో మరియు ఈ భూమిపూజ సమయంలో దేశప్రజలందరూ  సంయమనంతో వ్యవహరించారని ప్రశంసించారు. రాముని జీవితాన్ని అనుసరించే  అత్యధిక ముస్లిములు ఉన్న ఇండోనేషియా దేశాన్ని గుర్తు చేశారు. దేశ ప్రజలందరికి మంచి ఆరోగ్యాలను ప్రసాదించాలని సీతారామ చంద్రులను కోరారు. మందిర నిర్మాణం కోసం అందరినీ గుర్తుకుతెచ్చుకున్న ప్రధాని "జయ్ సియారామ్" అంటూ సీతమ్మ వారిని మహిళా లోకాన్ని గుర్తు చేస్తూ  నినదించారు.

కార్యక్రమం పూర్తయింది కళ్ళు మూసుకున్న నాకు ఆకాశాన్ని అంటుతున్న దేవాలయం యొక్క శిఖరం కనిపిస్తున్నది ఆలయంలో విరాజమానుడైన  బాలరాముడు ఆలయపు మొదటి అంతస్తులో రామ దర్బార్ వారి చరణాలను స్పృశిస్తూ ప్రపంచ ప్రజలు కనిపిస్తున్నారు. మధ్యాహ్నం సుమారు మూడు గంటలు కావస్తున్నది. బయటికి వచ్చిన పెద్దలు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు కొందరు పెద్దలు  మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు . మా వాహనం వచ్చింది కూర్చున్నాం మాకు ఆనందంతో మాటలు మాట్లాడడం కుదరటంలేదు ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు కనీసం గంట తర్వాతనే మాట్లాడుకోవడం ప్రారంభమైంది అంతటి ఉద్విగ్నతకు లోనయ్యాము.
ఝార్కాండ్ రాష్ట్రం నుండి పవిత్ర జలాలను తీసుకెళ్ళిన ఆకారపు కేశవరాజు గారు వ్యాసకర్త
ఎవరేమన్నారు: ఈ పండుగ లాంటి కార్యక్రమంలో లక్షలాది మంది పాల్గొనవలసింది కానీ ఈ నాడు నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా కొద్ది మందితోనే నిర్వహించుకుంటున్నాం  గౌరవ అద్వాని గారు 90 సంవత్సరాల కు పైగా వయసు కలిగినవారు మరియు 85 సంవత్సరాల కళ్యాణ్ సింగ్ గారు మరెందరో పెద్దలు రావాలి అని ఉన్నప్పటికీ జనసందోహం లోకి వయస్సు రీత్యా రాకూడని పరిస్థితి కనుక వారందరూ  ఆన్లైన్లో ఉండి పూజలో పాల్గొంటున్నారని శ్రీ చంపత్ రాయ్ గారు చెప్పారు.
         
శ్రీ విద్యా భాస్కర వాసుదేవాచార్యజీ: అయోధ్యకు చెందిన మహా పండితులు అయిన వీరు నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న సమయంలో 'నాకు విక్రమాదిత్య మహారాజు మాట్లాడుతున్నట్టుగా గోచరించింది' అంటూ చెప్పారు.
         
పంచఖండ పీఠాధిపతి ఆచార్య ధర్మేంద్ర జి మహారాజ్: ఏ చిన్న పొరపాటు జరిగినా నేను సహించలేను, నన్ను విమర్శకుడంటారు కానీ ఈ రోజు వేదికపై మాట్లాడుతున్న భారత ప్రధానిని చూశాను ఆయన నాకు  'వ్యాసపీఠం పై కూర్చుని కథాగానం చేస్తున్న సాధువు వలే కనిపిస్తున్నారు' అంటూ చెప్పారు.

అయోధ్య ప్రజలు: భారత చక్రవర్తి అయోధ్యలో పూజలు చేశారని చరిత్రలో రాయ బడుతుందని, మన జీవిత కాలంలోనే భవ్య రామమందిరం చూడబోతున్నామని చెప్పారు. దేశంలోని ఏపార్టీ కూడా ఈనాటి రామమందిర నిర్మాణం  భూమి పూజ కార్యక్రమాన్ని వ్యతిరేకించ లేదు, విమర్శించలేదు. సర్వ ఆమోదిత  ఆలయమనే విషయాన్ని కూడా కొందరు గుర్తు చేశారు.
~ ఆకారపు కేశవరాజు. పాట్న క్షేత్ర సంఘటన మంత్రి. వి.హిం.ప పాట్న, బీహార్.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments