Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ABVP Formation Day - About ABVP in Telugu - అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశం కోసం పనిచేసే విద్యార్థి సంస్థ

దేశం కోసం జాతీయ విద్యార్థి ఉద్యమం: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేడు భారతదేశంలో కల క్రియాశీలమైన, ప్రభావశీలమైన ఓ విద్యార్ధి ఉద్య...

దేశం కోసం జాతీయ విద్యార్థి ఉద్యమం:
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేడు భారతదేశంలో కల క్రియాశీలమైన, ప్రభావశీలమైన ఓ విద్యార్ధి ఉద్యమం. ఈ విద్యార్థి ఉద్యమానికి 9 జూలై 2020 నాటికి 71 ఏళ్లు నింపుకోవడం గర్వించదగిన విషయం. విద్యార్థి పరిషత్ ఆలోచనా ధార, సంఘటనాత్మకమైన కార్యపద్ధతి కి పునాది వేసిన స్వర్గీయ యశ్వంతరావు కేల్కర్ జీ ని ఈరోజు స్మరించుకోవాల్సిన దినం. వారి ఆలోచనలను, వారి ఆశయాలను, వారి ఆచరణను ముందుకు తీసుకుపోవడానికి కంకణ బద్దులై నడుం బిగించాల్సిన రోజు. తన సంపూర్ణ జీవితాన్ని పరిషత్ కోసం సమర్పించిన స్వర్గీయ జనమంచి గౌరీశంకర్ గారు ఈరోజు మన స్మృతిలో మెదిలే రోజు. పరిషత్ సిద్ధాంతంకోసం ప్రాణత్యాగం చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల కార్యకర్తలు ఈరోజు మన అందరికి గుర్తుకు వచ్చే రోజు. వీరందరి త్యాగాలు, అవిరళ కృషితోనే జ్ఞానం- శీలం- ఏకత అనే తపస్సు అఖండంగా కొనసాగుతూ వస్తుంది. వీరందరి పాదాలకు నమస్కరించాల్సిన రోజు. అదే జూలై 9 ని మనం జాతీయ విద్యార్థి దినోత్సవంగా జరుపుకుంటున్నాము. స్వాతంత్ర్యం పొందాక మన భారతదేశం యొక్క వేలాది సంవత్సరాల గౌరవశాలి మరియు వైభవ సంపన్న పరంపరను దృష్టిలో పెట్టుకుని వాటిని మరల ఆధునిక, వికసిత మరియు పరిస్థితుల కారణంగా ఏర్పడిన దోషాల నుండి ముక్తి చేయాలనే స్వప్నాన్ని దేశం మొత్తం చూస్తున్నది. ఇలాంటి పరిస్థితులలో కొంతమంది యువకులు ఈ కలను సాకారం చేసుకోవడానికి గాను దేశంలోని విద్యాలయాలు మరియు విశ్వవిద్యాలయాల పరిసరాలను తమ కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా బహిరంగ వేదికపై 9 జూలై 1949 న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) పేరుతో ప్రారంభించారు.
వ్యక్తి నిర్మాణం ద్వారా మాత్రమే జాతీయ పునర్నిర్మాణం సాధ్యం.అయితే జాతీయ పునర్మిర్మాణం అనే విశాల పరిధిలో గల విద్యారంగ పునర్నిర్మాణం విద్యార్థి పరిషత్ లక్ష్యం. విద్యార్ధి శక్తిని ఒక్కటిగా చేసి, జాతీయ పునర్నిర్మాణ కార్యంలో ప్రధాన పాత్ర నిర్వహించేలా చేయటమే పరిషత్ ప్రధాన కార్యం. 

జాతీయ పునర్నిర్మాణం అంటే?
మనదేశంలో ప్రతి వ్యక్తికి భోజనం, దుస్తులు, ఇల్లు, విద్య మరియు వైద్యం లాంటి ప్రాథమిక వసతులు అందుబాటులో ఉండాలి. సమాజంలోని అందరికీ గౌరవం మరియు అభివృద్ధి చెందడంలో సమాన అవకాశాలు లభించాలి. అన్ని రంగాలలో సమన్యాయం జరగాలి. 

ఈ దేశం శక్తివంతమైనదిగా మారడంతో పాటు రక్షణ రంగంలో సుసంపన్నం కావాలి. సమాజంలో సామాజిక, వ్యక్తిగత జీవన మూల్యాలు మరియు సాంస్కృతిక వ్యక్తీకరణ రక్షించబడాలి. ఈ విధమైన పరస్పర స్నేహపూర్వకమైన భావాన్ని నింపే సమాజం విశ్వ బంధుత్వ భావనను అనుసరిస్తుంది. ఈ విధమైన మార్పుని జాతీయ పునర్మిర్మాణంగా అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ అభిలషిస్తుంది. ఇది పూర్తి చేయటానికి కావాల్సిన సిద్ధాంతాన్ని,కార్యపద్ధతిని కూడా విద్యారంగంలో పరిషత్ నిర్మాణం చేసింది. జాతీయ పునర్మిర్మాణం అనే లక్ష్యం చేరుటకు విద్యార్థులు మాతృభూమి కోసం జీవించడం, సమయమిచ్చి పనిచేయడం, స్వప్రేరణతో పనిచేయటం అవసరం అనేది పరిషత్ మౌలిక నిర్మాణాత్మక పనికి ఆధారం. 

విద్యారంగం ఒక కుటుంబంలా భావిస్తూ అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు అని తేడా లేకుండా అందరు దేశం కోసం పనిచేసే వాతావరణాన్ని నిర్మాణం చేయటం పరిషత్ మరో మౌలిక విషయం. ఈ దేశం అత్యంత ప్రాచీనమైనదే, కానీ పూర్వీకుల అమూల్య జ్ఞాన సంపదను రక్షిస్తూ మనం ఆధునికంగా సంపన్నమవ్వాలి అని పరిషత్ నమ్ముతుంది. సామాజిక దురాచారాలను సంస్కరించి సమాజాన్ని చెడు నుండి విముక్తి చేయాల్సిన అవసరం పరిషత్ గుర్తించింది. కేవలం రాజకీయాల ద్వారానే సమాజంలో ప్రగతి సాధ్యం అనే భ్రమకి దూరంగా, రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని జాతీయభావ ప్రవాహంలో తీసుకెళ్లే పనిని పరిషత్ చేస్తుంది. ఈ నిర్మాణాత్మక కార్యంలో పరిషత్ సాధించిన విజయాలు ఎన్నో ఎన్నెన్నో.....

పరిషత్ ప్రస్థానంలో మచ్చుకు కొన్ని విజయాలు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమాలు చేస్తోన్న ఏబీవీపీ 71 సంవత్సరాల గమనంలో ఎన్నో విజయాలను సాధించింది.

జాతీయస్థాయిలో..
భారత రాజ్యాంగ నిర్మాణ సమయంలో "వందేమాతరం'' మన జాతీయ గేయంగా పొందుపర్చటంలో పరిషత్ చేసిన భావ జాగరణ, నిర్మాణాత్మక ఆందోళన చెప్పదగినది. రాజ్యాంగంలో "India that is Bharath" అని నిలిపేందుకు పరిషత్ రాజ్యాంగ సభలోని పెద్దలు, మేధావులు, విద్యావేత్తలని చైతన్యవంతుల్ని చేసి జాతీయతకి ఊపిరిలూదింది. మన ప్రాంతీయ భాషల్ని పరిరక్షిస్తూనే దేశవ్యాప్తంగా సాంస్కృతిక ఏకత్వానికి జాతీయ భాష హిందీ ఆవశ్యకతను తెలియజేసి, హిందీని జాతీయభాషగా ఏర్పాటు చేయటంలో విద్యార్థి పరిషత్ కృషి చేసింది. నేడు తొలగించబడ్డ ఆర్టికల్ 370 రద్దు కోసం, కాశ్మిర్ పరిరక్షణ కోసం, అక్రమ విదేశీ చొరబాట్లని అరికట్టటం కోసం, రాజ్యాంగ విలువల్ని, దేశసార్వభౌమత్వాన్ని నిలబెట్టేందుకు విద్యార్ధి పరిషత్ చేసిన ఉద్యమం భారత జాతీయ పునర్మిర్మాణ ఉద్యమంలో చిరస్థాయిలో నిలిచి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని విద్యార్థుల్ని "Students’ Experience In Interstate Living” అనే ప్రాజెక్ట్ ద్వారా జాతీయతకి దగ్గరగా నిలబెట్టి, విదేశీ విచ్చిన్నశక్తుల కుట్రల్ని వమ్ముచేసిన ఘనత పరిషత్ కే దక్కుతుంది.ఇలాంటి అనేక నిర్మాణాత్మక కార్యక్రమాల ద్వారా పరిషత్ జాతీయత భావ ఉద్యమంగా నిలిచింది.

తెలంగాణ లో.......
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ప్రత్యేక పాత్ర పోషించింది. ఏ రాజకీయ పార్టీ కోరుకోని విధంగా,1998లో నెల్లూరు రాష్ట్ర మహాసభలలో తెలంగాణ అభివృద్ధి సాధించాలంటే ప్రత్యేక రాష్ట్రంతోనే సాధ్యమని భావించి, మూడు ప్రాంతాల నాయకులను ఒప్పించి ప్రత్యేక రాష్ట్ర తీర్మానాన్ని చేసిన ఘనత ఏబీవీపీది. 2001లో ‘తెలంగాణ సస్యశ్యామల యాత్ర’ పేరుతో బాసర నుండి శ్రీశైలం వరకు బస్సు యాత్ర చేసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది. 2009లో ప్రారంభమైన మలిదశ ఉద్యమంలో ‘నారక్తం నా -తెలంగాణ’ అనే కార్యక్రమంలో ఇరవై వేల మంది విద్యార్థులు ఒకే రోజు రక్త దానం చేసి లిమ్కా బుక్ రికార్డును సాధించారు. ఉద్యమంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా విద్యార్ధి పోరు యాత్రల్ని అభావిప నిర్వహించి, డిసెంబర్ 9, 2009 న వేలాది మంది విద్యార్థులతో అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుంటుంది అనే కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన ఇదే రోజు వెలువడటం అత్యంత గమనార్హం. తెలంగాణ వ్యాప్తంగా ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న యువత,విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా పరిషత్ "ఆత్మహత్యల తెలంగాణ వద్దు- ఆకుపచ్చని తెలంగాణ ముద్దు" అనే నినాదంతో జూలై 9, 2012 న పదివేల మొక్కల్ని నాటి,సంరక్షించింది. అదేవిధంగా రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ విద్యార్థి లోకాన్ని క్షేత్రస్థాయిలో అన్ని ఉద్యమాలలో పాల్గొనే విధంగా తయారు చేసింది. 

71 సంవత్సరాల కాలఖండంలో ఏబీవీపీ అనేక ఆటుపోట్లను, సవాళ్లను, సంఘర్షణను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. ఈ సంఘర్షణలో జాతీయ భావ పరిరక్షణకు వందల సంఖ్యలో కార్యకర్తలు బలిదానం అయ్యారు. అయిన పరిషత్ ప్రయాణం ఎక్కడ ఆగలేదు. కార్యకర్తల బలిదానాలే స్ఫూర్తిగా మరింత పుంజుకొని విద్యారంగంలో తనదైన జాతీయభావ ప్రేరిత లోకాన్ని నిర్మాణం చేసిందనటంలో అతిశయోక్తి లేదు. రాబోవు రోజుల్లో విద్యారంగ పరిరక్షణ కోసం, విద్యారంగసమస్యల పరిష్కారం కోసం, జాతీయ భావ విలువల సంరక్షణ కోసం, జాతీయభావ విద్యారంగ నిర్మాణం కోసం విద్యార్ధి పరిషత్ ముందు నిలుస్తుందని చెప్పటానికి ఎలాంటి సంకోచం అక్కర్లేదు.
(జూలై 9, జాతీయ విద్యార్ధి దినోత్సవం) -సామల కిరణ్,9949394688.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments