Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

బోనం అంటే ఏమిటి? తెలంగాణ బోనాల ప్రత్యేకతలు - About Telangana Bonam

సష్టించేందుకు జ్ఞానం కావాలి. బ్రహ్మ సరస్వతిని స్వీకరించాడు. పోషించేందుకు ఐశ్వర్యం కావాలి. విష్ణువు లక్ష్మీ దేవిని గ్రహించాడు. లయ...


సష్టించేందుకు జ్ఞానం కావాలి. బ్రహ్మ సరస్వతిని స్వీకరించాడు. పోషించేందుకు ఐశ్వర్యం కావాలి. విష్ణువు లక్ష్మీ దేవిని గ్రహించాడు. లయం చేసేందుకు శక్తి కావాలి. శివుడు పార్వతిని గ్రహించాడు. అలా అమ్మవారు అనేక రూపాల్లో వ్యక్తమైంది. అలాగే సాధారణ ప్రజలు ఎల్లల్ని కాపాడమని అడిగారు. ఆ తల్లి ఎల్లమ్మగా మారింది. పొలిమేరలను రక్షించే పోలేరమ్మగా, బాలాత్రిపురసుందరి బాలమ్మగా, ఈత చెట్లల్లో ఈదమ్మగా, మహిషాసురమర్దిని మైసమ్మగా అనేక రూపాల్లో భక్తుల ఈతి బాధలు తీర్చేతల్లిగా అభివ్యక్తమైంది.

ఈ అమ్మలగన్న అమ్మ పూజలు గ్రామ దేవతారాధనగా జరుపుతారు. దానినే ‘బోనాల పండుగ’గా పిలుస్తారు. ఆషాడ, శ్రావణ మాసాల్లో తెలంగాణలో జరిగే అతిపెద్ద పండుగగా ప్రజలు జరుపుతారు. క్రీ.శ 1143 జూలై 7న మొదటిసారి.. రెండవ ప్రతాపరుద్రుడు గోల్కొండ జగదాంబాలయంలో బోనం సమర్పించినట్లు ప్రతీతి. అలాగే ఓరుగంటి ఎల్లమ్మ మూలంగా ఏర్పడిన వరంగల్లులోని ఎల్లమ్మ బజారు సుప్రసిద్ధం,  ప్రాచీనం అని చరిత్రకారులు నిర్ణయించారు. ఓరుగల్లు, అలంపూర్‌లలో మాత్రమే నగ్న రూపంలో ఎల్లమ్మ విగ్రహం కన్పిస్తుంది. అలాగే భవిష్యోత్తరపురాణంలో భూత మాతృ ఉత్సవం, కూడా బోనాల పండుగలాగే ఉంటుంది. గోల్కొండ రాజుల కాలంలో అక్కన్న మాదన్నలు ఈ ఉత్సవం జరిపినట్లు తెలుస్తున్నది. అలాగే గోల్కొండలో గొల్లలు తరచూ అక్కడున్న ఎల్లమ్మ, నల్ల పోచమ్మ, ముత్యాలమ్మలకు బోనం సమర్పించేవారట. ఆ సంప్రదాయం అలాగే కొనసాగి గోల్కొండ ఎల్లమ్మ బోనాలతో మొదలై ‘లష్కర్‌ బోనాలు’గా పిలిచే సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాల మీదుగా పాతబస్తీ లాల్‌ దర్వాజ బోనాలతో ముగుస్తుంది. ఇందులో కొంత మతం, చరిత్ర, రాజనీతి, సామాజిక దృక్పథం కన్పిస్తాయి.

ఆషాఢ మాసం మొదటి ఆదివారం గోల్కొండలో జగదాంబ బోనాలు, రెండవ ఆదివారం ఉజ్జయిని మహంకాళి బోనాలు, మూడవ ఆదివారం లాల్‌ దర్వాజ బోనాలు జరుగుతాయి. అలాగే ఆషాఢ శ్రావణ మాసాల్లో ఆది, మంగళ, శుక్ర వారాల్లో తెలంగాణ పల్లెల్లో గ్రామ కట్టుబాటు ప్రకారం నిర్వహించుకొంటారు. బోనాల్లో ప్రధానంగా ఘటస్థాపన, పోతురాజు, బోనం, శివసత్తులు, రంగం, ఘటం, విందు సంబరాలు, జాతర చెప్పుకోదగిన విశేషాలు. ఆయా దేవతలకు భోజనం సమర్పించడమే బోనం. ఇది చేసేందుకు స్థలశుద్ధి, పాత్ర శుద్ధి, ఆత్మశుద్ధి అవసరం. పుట్టుక నుండి చావు వరకూ మట్టికుండకు మన సంస్కృతిలో ప్రాధాన్యమెక్కువ. ఈ శరీరమే ఓ మట్టికుండ.

బోనం చేసే రోజు స్త్రీలు ఇంటి మధ్య భాగంలో బోనం స్థాపన చేస్తారు. కొత్త కుండకు సగం వరకు సున్నం రుద్ది, మిగతా భాగం పసుపు కుంకుమబొట్లతో అలంకరిస్తారు. ఆ బోనంలో కొందరు బియ్యం, పెసరపప్పు, మరికొందరు బియ్యం, బెల్లం, ఇంకొందరు పెరుగన్నం, పాయసం వండి పెడతారు దానిపై ఓ పిడత (గురిగి) పెట్టి వేపమండలతో అలంకరించి పైన దీపం అలంకరిస్తారు. అది ఆత్మజ్యోతికి ప్రతీక. ఇదంతా అమ్మవారికి సమర్పణే. ఇలా సిద్ధమైన బోనాన్ని బాజాభజంత్రీలతో పోతురాజుల విన్యాసాలు చేస్తుంటే శివసత్తుల పూనకాలతో వెళ్లి అమ్మవారి ఆలయంలో సమర్పిస్తారు. కుండలోని ద్రవ్యం అమ్మవారికి సమర్పించి ఈ కాలంలో వచ్చే రోగాల నుండి రక్షించమని కోరుతారు.డా శ్రీ శ్రీ పి భాస్కర యోగి. ఆంధ్ర జ్యోతి పత్రిక నుండి సేకరణ.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments