Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఆంగ్లపాలనపై తిరగబడ్డ తొలియోధుడు మంగళ్ పాండే About Mangal pandey in Telugu - MegaMinds

వేలాది విదేశీయుల్ని గడ గడ లాడించిన సైనికధీరుడతడు! కోట్లాది స్వదేశీయుల్ని సమరం వైపు నిలిపిన సాహసవీరుడతడు! స్వతంత్ర్యదేవి సాక్షాత్...

వేలాది విదేశీయుల్ని
గడ గడ లాడించిన
సైనికధీరుడతడు!
కోట్లాది స్వదేశీయుల్ని
సమరం వైపు నిలిపిన
సాహసవీరుడతడు!
స్వతంత్ర్యదేవి సాక్షాత్కారముకై
ప్రాణాలని అర్పించిన
త్యాగమూర్తి అతడు!
ఆంగ్లఅంధకారం పారద్రోలి
దేశమంతా వెలుగులు నింపిన
క్రాంతికారుడతడు!
ఆ ఒక్కడే!
తొంబయ్యేళ్ళ సంగ్రామానికి 
తొలిబలిదానకేతనం ఎగురేశాడు....
ఆ ఒక్కడే!
మూడులక్షల వీరుల గుండెల్లో 
స్వతంత్య్రజ్వాల రగిల్చి
దేశంకోసం సమిధలయిన మహాయోధులకి స్ఫూర్తిగా నిల్చాడు..
ఆ ఒక్కడే..ఆ యోధుడే మంగళ పాండే.

1857 లో జరిగిన భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీషు పాలకులపై తిరుగుబాటు చేసిన రియల్ హీరో మంగళ్ పాండే జయంతిని పురస్కరించుకుని ఆయన జీవిత విశేషాలను తెలుసుకుందాం. మంగళ్ పాండే 1827 జూలై 19 న నేటి ఉత్తర ప్రదేశ్ నందు పైజాబాద్ జిల్లాలోని సుర్హ పుర అను గ్రామంలో  ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. మంచి ఎత్తు, తెల్లని శరీరం కల మంగళ్ పాండే ప్రతిరోజు వ్యాయామశాలకి వెళ్ళేవాడు. కానీ వస్తాదు అయ్యేందుకు కావాల్సిన ఆహరం తీసుకునే స్థోమత లేని పేద కుటుంబం. పొలం పనులకి కూలీగా వెళ్లటం తప్ప, ఆ కుటుంబానికి మరో ఉపాధి మార్గం లేదు. అలా ఉండగా 22 సంవత్సరాల వయసులో మంగళ్ పాండే కి తెలిసిన వ్యక్తి బ్రిటిషు దళంలో చేరాడని, అతని ద్వారా తాను సిపాయిగా చేరాడు. శిక్షణ అనంతరం పాండే ని 34 బెంగాల్ రెజిమెంట్ లోని 6వ కంపెనీకి సిపాయిగా పంపించారు.

రగులుకున్న నిప్పురవ్వ: సెలవుల మీద ఇంటికి వెళ్లి వచ్చిన సైనికుల ద్వారా బ్రిటీషువారి అన్యాయమైన దోపిడీలని గురించి, దేశమంతటా చెలరేగుతున్న స్వాతంత్ర్య ఉద్యమం గురించి వార్తలు చేరుతుండేవి. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న స్థానిక పాలకులు సంఘటితంగా బ్రిటిషు వారిపై 1857 మే 31 న తిరుగుబాటు  జరపాలని నిర్ణయించుకున్నారు. ఈ తిరుగుబాటుకి నాయకత్వం వహించిన వారిలో ప్రముఖులు ఝాన్షి రాణి లక్ష్మిభాయ్, తాంతియా తోపె, బహుదూర్ షా తదితరులు. అప్పటికే బ్రిటీషువారు అందించే తుపాకీ తూటాల తయారీలో గోవు, పంది కొవ్వు వాడుతున్న విషయం సైనికులకి తెలిసి లోలోపల రగిలిపోయారు. గోమాంసం వాడకం గురించి తెలుసుకున్న మంగళ్ పాండే ఉడికిపోయి, తోటి సైనికులతో తిరుగుబాటుకి పథకం వేశాడు. ఈ విషయం బ్రిటిషు అధికారులు మార్చి 29 న నే గుర్తించారు.

లంఘించిన సాహస సింహం: తమ తమ తుపాకిలని సిద్ధంగా ఉంచుకొని, కన్పించిన బ్రిటిషు అధికారిని కాల్చి పారేయాలని  తోటి సైనికులందర్నీ ఉత్తేజపర్చాడు. ఈ లోగా అధికారి వాగ్ రావటం మంగళ పాండే అతనిమీద తూటా పేల్చటం జరిగింది, కానీ అది గురితప్పి అతని గుర్రానికి తగిలింది. చేతి పిస్టల్ తో కాల్పులు జరిపాడు వాగ్. తప్పించుకున్న మంగళ్ పాండే తిరగబడి, తన తుపాకీ తో కొట్టబోయాడు. అప్పటికే చేరుకున్న శార్జంట్ హ్యూసన్ వచ్చి పాండే చేతిలోని తుపాకీని నెట్టి పారేశాడు. పాండే ని అరెస్ట్ చేయమని అధికారులు ఆదేశించినా ఎవ్వరు ముందుకు రాలేదు. ఇక తన తిరుగుబాటు అయిపోయిందని మంగళ్ పాండే గ్రహించాడు. తెల్లవారి చేతికి చిక్కటం ఇష్టం లేక, తన తుపాకీతో కాల్చుకున్నాడు.కానీ ఆ బుల్లెట్ గాయం చేసింది కానీ ప్రాణం తీయలేదు. తర్వాత భయంతో అతన్ని బ్రిటిషు అధికారులు సమీపించి ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల్లో కోలుకున్న మంగళ్ పాండే మీద రాజద్రోహం, తిరుగుబాటు నేరాలు మోపి కోర్టులో హాజరుపరిచారు. వీలైనంత త్వరగా విచారణ ముగించటం,ఉరిశిక్ష విధించటం ఆంగ్లేయ పాలకుల దుర్నీతికి పరాకాష్ఠ. అదే జరిగింది. విచారణలో మంగళ్ పాండే ధైర్యంగా ఇలా ప్రకటించాడు. నేను చేసిన తిరుగుబాటు నా దేశం కోసం, నా ధర్మం కోసం చేశాను. ఇది నా స్వప్రేరణతో నా మాతృభూమి కోసం చేశాను, అంతే కానీ దీనికి మరెవ్వరినీ బాధ్యులని చేయొద్దు.  విచారణ పూర్తిచేసి, ఏప్రిల్ 18న ఉరితీయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటికే తిరుగుబాటు వార్త వ్యాపించి, అనేక రెజిమెంట్ లలో చైతన్యం మొదలయ్యింది. మరోవైపు అనేక రాజసంస్థానాలు, సంస్థానాల్లోని ప్రజలు తిరుగుబాటుకి ఏకమయ్యారు. కమలా పువ్వు, రొట్టెలు సందేశంగా భారత దేశమంతా ప్రథమ స్వతంత్ర్య సంగ్రామానికి తెర లేచింది. మంగళ్ పాండే ఉరి ప్రభావంతో సైనికుల్ని అణచి వేయటానికి ఏప్రిల్ 8 నే ఉరిశిక్షను అమలు చేశారు. మంగల్ పాండే ప్రభావమున్న సైనిక కంపెనీని పూర్తిగా రద్దు చేశారు ఆంగ్ల పాలకులు. 
    
అనుకున్న మే 31 న దేశమంతా ఒక్కసారి తిరుగుబాటు జరిగితే చరిత్ర ఎలా ఉండేదో? ఏమో? కానీ మంగళ్ పాండే ఆవేశం, మంగళ్ పాండే బలిదానం మన దేశంలో స్వతంత్ర్యతా జ్వాలల్ని ఎగదోసింది. తన త్యాగం దేశంలోని యువతని నిద్ర లేపింది. భారతీయుల్ని స్వేచ్ఛ ఉద్యమం వైపు నడిపించింది. బ్రిటిషు అరాచక పాలనని అంతం చేసే పోరాటాలకి ఊపిరినందించింది. 1947 స్వాతంత్ర్యం సిద్ధించే వరకు బలిదానం అయిన లక్షలాది వీరుల త్యాగాలకి చిరునామా మంగళ్ పాండే అయ్యాడనటంలో సందేహం లేదు. ప్రాణాల్ని లెక్కచేయక బ్రిటీషువారిపై తుపాకీ ఎక్కుపెట్టిన ధైర్యశాలి, తొలి స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే జీవితం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. దేశాభివృద్ధికి అడ్డుగోడగా నిలిచే అవినీతి, అన్యాయాలపై, కుల మతతత్వ పోకడలపై యువత ఉద్యమించాలంటే మంగళ్ పాండే చూపిన ధైర్య, సాహస గుణాల్ని అలవర్చుకోవాలి. -సామల కిరణ్
(నేడు-జూలై 19 న ప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు మంగళ్ పాండే జయంతి)

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

4 comments

  1. A great freedom fighter,warrior

    ReplyDelete
  2. భారత దేశపు వీర పురుషులు, నారిమనుల గురించి మాకు ఇలా తెలియజేయడం చాలా గొప్ప విషయం. మీకు మా కృతగ్నాభి వందనాలు. ఇంకా ఇలాంటివి నాకు పంపండి.
    ప్రవీణ్ తాదురి, వి హెచ్ పి, జిల్లా కార్యదర్శి, ఇందుర్.

    ReplyDelete
  3. Pls share in your groups and Facebook

    ReplyDelete